వాన

6 Aug, 2017 01:17 IST|Sakshi
వాన

‘‘అసలేం జరిగింది?’’ రవి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ.‘‘మామయ్య బలరామయ్య   ఊరు నుంచి వచ్చి అప్పుడప్పుడూ  నా దగ్గర ఉండి పోతుంటాడు. నిన్న రాత్రి కూడా అలాగే వచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం పూట ఇద్దరం కలిసి రుచి రెస్టారెంట్‌లో భోజనం చేద్దామనుకున్నాం. అయితే అర్జంట్‌గా ఒక ఫోన్‌ కాల్‌ రావడంతో ...కొద్దిసేపట్లో తిరిగివస్తాను అని బయటకు వెళ్లాను. నువ్వు వచ్చేలోపు నీ కుక్కపిల్ల టైగర్‌తో అలా సరదాగా బయటికి వెళ్లొస్తాను అన్నాడు. వర్షం వచ్చేలా ఉంది అంటే...ఫరవాలేదు అన్నాడు. కొద్దిసేపటి తరువాత నేను  ఇంటికి వచ్చేసరికి  టైగర్‌ మాత్రమే ఉంది. మామయ్య కనిపించలేదు. నేను ఆందోళనగా వెదకడం మొదలు పెట్టాను. ఎక్కడా కనిపించలేదు. దీంతో భయపడి మీకు ఫోన్‌ చేశాను’’ అన్నాడు రవి.

టైగర్‌ వైపు ఒకసారి చూశాడు ఇన్‌స్పెక్టర్‌.
‘‘ఆయన  ఏ సమయంలో బయటికి వెళ్లారు?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌. ‘‘ఇద్దరం ఒకే టైమ్‌లో వెళ్లాము. అప్పుడు టైమ్‌  రెండు అవుతుంది’’ చెప్పాడు రవి. గంట తరువాత... ఒక నిర్జన ప్రదేశంలో నిర్జీవంగా పడి ఉన్న  బలరామయ్యను గుర్తించారు పోలీసులు. బలరామయ్య హత్యకు గురయ్యాడు! ‘‘హత్య గురించి ఈ టైగర్‌ మాత్రమే చెప్పగలదు’’ అని  టైగర్‌ తలనిమురుతున్న క్షణంలో ఇన్‌స్పెక్టర్‌ నరసింహలో ఠక్కున ఒక ఆలోచన మెరిసింది. ఆ సమయంలోనే...

‘‘హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది’’ అని గట్టిగా అన్నాడు. ‘‘ఎవరు సార్‌?’’ ఆసక్తిగా అడిగాడు రవి.‘‘నువ్వే’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. మొదట బుకాయించాలని చూశాడుగానీ, ఆ తరువాత తాను చేసిన నేరం ఒప్పుకోక తప్పలేదు. రవి హంతకుడు అనే విషయం ఇన్‌స్పెక్టర్‌ ఎలా కనిపెట్టాడు?

అద్దంలో ఆన్సర్‌
జవాబు: మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వర్షం పడింది. టైగర్‌ను మామయ్య బయటికి తీసుకెళ్లాడు అని చెప్పాడు రవి. అయితే టైగర్‌ వానలో తడిసిన ఆనవాలేమీ లేవు. ఇది ఇన్‌స్పెక్టర్‌లో అనుమానం రేకెత్తించింది. బలరామయ్యను ఇంట్లోనే హత్య చేసి నిర్జన ప్రదేశంలో పడేశాడు రవి. తన మీద అనుమానం రాకుండా ఉండడానికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు