అబద్ధం

13 Aug, 2017 00:13 IST|Sakshi
అబద్ధం

భుజంగం అనే వ్యాపారిని హత్య చేసి పారిపోయిన గంగులు కోసం పోలీసులు తీవ్రంగా వెదుకుతున్నారు. ఎట్టకేలకు... గంగులు జాడ గురించి వారికి ఉప్పు అందింది.గంగులు వృత్తి నేరస్థుడు.దొంగతనాలు, దోపిడీలు చేయడం పోలీసులకు చిక్కడం, వారి కనుగప్పి పారిపోవడం అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. చాలాసార్లు అరెస్ట్‌ కావడంతో...అతని అభిరుచులు, పుట్టుపూర్వోత్తరాలు పోలీసులకు కొట్టిన పిండి.అతనికి కొన్ని బలమైన అలవాట్లు ఉన్నాయి.విదేశి సిగరెట్లు తాగే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ...అదేమిటో తెలియదుగానీ బీడీలు విపరీతంగా కాలుస్తాడు.స్థానికంగా తయారుచేసే ‘సూపర్‌ టేస్ట్‌’ అనే ఐస్‌క్రీమ్‌ అంటే తెగ  ఇష్టం.కొన్నిసార్లు బారెడు గడ్డం పెంచుతాడు.

కొన్నిసార్లు క్లీన్‌షేవ్‌!
ఒకసారి కనిపించిన ప్రాంతంలో మరోసారి కనిపించడు.గంగులు తన దూరపు బంధువు రమణయ్య ఇంట్లో దాక్కున్నాడనే విషయం ఒక ఇన్‌ఫార్మర్‌ ద్వారా పోలీసులకు తెలిసింది.వెంటనే ఆ ఇంటిపై దాడి చేశారు.‘‘ఇల్లంతా వెదకండి... గంగులు కనబడితే అతనితో పాటు నన్నూ కాల్చి చంపండి. మీరు నన్ను ఎందుకు అనుమానిస్తున్నారో అర్థం కావడం లేదు’’ ఆవేశ పడిపోయాడు రమణయ్య.అయినా... పోలీసులు ఇల్లంతా వెదికారు. ‘రాంగ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌’ అంటూ గొణుక్కున్నాడు ఇన్‌స్పెక్టర్‌.‘సారీ రమణయ్య’ అంటూ ఇన్‌స్పెక్టర్‌ తన బృందంతో వెనక్కి తిరిగాడు. గేటు దాటే లోపు కానిస్టేబుల్‌ శ్రీను ఇన్‌స్పెక్టర్‌ చెవిలో ఏదో చెప్పాడు. విన్న వెంటనే వేగంగా వెనక్కి దూసుకొచ్చాడు ఇన్‌స్పెక్టర్‌.

‘‘నువ్వు నాటకాలు ఆడుతున్నావు. నిజం చెప్పకపోతే చాలా ప్రమాదంలో పడతావు. ఆ గంగులు నీ ఇంట్లోనే దాక్కున్నాడు’’ కఠినంగా అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. రమణయ్య నిజం ఒప్పుకోకతప్పలేదు. అటక మీద రకరకాల వస్తువుల మధ్య కనిపించకుండా దాక్కున్న గంగులు ఆచూకి చెప్పకతప్పలేదు. గంగులు ఆ ఇంట్లోనే దాక్కున్నాడని శ్రీను ఎలా కనిపెట్టాడు?

మరిన్ని వార్తలు