వీడే!

2 Sep, 2017 23:29 IST|Sakshi
వీడే!

నాగభూషణం కోటీశ్వరుడు. ఈ  కోటీశ్వరుడు పిల్లికి కూడా  బిచ్చం పెట్టని పరమ పిసినారి. నాగభూషణానికి ముగ్గురు కొడుకులు.1. రమాకాంత్‌ 2.శశికాంత్‌. 3. శ్రీకాంత్‌. ఈ ముగ్గురి గురించి చెప్పుకోవాలంటే... శ్రీకాంత్‌కి ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. శశికాంత్‌కు ఆవేశంతో పాటు తెలివి కూడా ఉంది. రమాకాంత్‌ నెమ్మదస్తుడు. తన ముగ్గురు కొడుకులతో నాగభూషణానికి క్షణం పడేది కాదు. దీనికి కారణం డబ్బు.

‘‘ఎంత  కాలమని ఇలా ఖాళీగా కూర్చోమంటారు. ఎంతో కొంత డబ్బు మా ముఖాన పడేస్తే హాయిగా వ్యాపారం చేసుకుంటాం కదా’’ అని తండ్రితో వాదించేవాళ్లు. ఆయన మాత్రం ససేమిరా అనేవాడు.ఒకరోజు అర్ధరాత్రి నాగభూషణం హత్యకు గురయ్యాడు.‘‘హత్య చేసింది మా అన్నయ్య రమాకాంతే’’ అని చెప్పాడు శ్రీకాంత్‌. ‘‘కన్నతండ్రిని హత్య చేసేంత కసాయివాడిని కాదు. శ్రీకాంత్, శశికాంత్‌లే నాన్నను చంపారు’’ అన్నాడు రమాకాంత్‌.‘‘మా అన్నయ్య కాల్చడం నేను స్వయంగా చూశాను సార్‌.

ఆ రోజు నాన్నా, నేను రాత్రి పదిగంటలకు ఒక రెస్టారెంట్‌కు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి అర్ధరాత్రి అయింది. నాన్న  టీవి చూస్తున్నాడు. నేను మరోవైపు కూర్చొని ఉన్నాను. హఠాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. మా అన్నయ్య రమాకాంత్‌ చేతిలో పిస్టల్‌ ఉంది. ప్రమాదాన్ని శంకించి...‘నాన్నగారూ’ అని గట్టిగా అరిచాను. ఆయన వెనక్కి తిరిగేలోపే కాల్పులు జరిపి నాన్నను చంపేశాడు’’ అని భోరుమన్నాడు శ్రీకాంత్‌. ‘‘అబద్ధాలు ఆపరా’’ అని శ్రీకాంత్‌ కాలర్‌ పట్టుకొని నిజం కక్కించాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ.శ్రీకాంత్‌ అబద్ధం  చెప్పాడని ఇన్‌స్పెక్టర్‌ అంత త్వరగా ఎలా కనిపెట్టాడు?

జవాబు:  నుదుటి మీద కాల్పులు జరపడం వల్ల నాగభూషణం చనిపోయాడు. ‘నాన్న వెనక్కి తిరిగేలోపే అన్నయ్య కాల్పులు జరిపాడు’ అన్నాడు శ్రీకాంత్‌. ఇదే నిజమైతే, కాల్పులు తల వెనుక నుంచి జరిగి ఉండేవి కదా! కాబట్టి శ్రీకాంత్‌ చెప్పింది అబద్ధం అని వెంటనే గ్రహించాడు ఇన్‌స్పెక్టర్‌.

మరిన్ని వార్తలు