గెల్చుకున్న డబ్బు దాచుకోవడమూ కష్టమే

4 Aug, 2019 12:11 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

ఆ రోజు కేవలం వినోదం కోసం, నేనొక గాంబ్లింగ్‌ హౌస్‌లోకి వెళ్ళాను. ఒక గేమింగ్‌ టేబుల్‌ దగ్గరకెళ్ళి, అక్కడ ఆట ఆడడం మొదలుపెట్టాను. నా అదృష్టమో లేక దురదృష్టమో!  అనూహ్యంగా, అద్భుతంగా, నమ్మశక్యంగాని విధంగా డబ్బూ, బంగారం గెలుచుకున్నాను.                       
ఎరుపు నలుపు రంగుల గుర్తులపైన పందెమొడ్డి, టేబుల్‌పై ఆడే పేకాట అది. లోపలా బైటా- లాంటి ఆట అది. 

గెలిచేకొద్దీ ఇంకా ఆడాలనే పట్టుదల  క్షణక్షణానికీ అధికమవసాగింది. పిచ్చిపట్టినట్లుగా ఆడసాగాను. నన్ను అదృష్టదేవత కరుణించడంతో ఎక్కువసార్లు నేనే గెలిచాను. ఫలితంగా  పెద్ద బంగారు నాణేలరాశి నా సొంతమైంది. అయినా ఇంకా  ఆడాలనే ఆశ నాలో చావలేదు. అంతలో, ఒక బొంగురు గొంతు నా వెనక నుంచి వినిపించింది. 
‘‘అద్భుతం సార్‌! అద్భుతం!  నా జీవితంలో మీలాంటి అదృష్టయోగుల్ని నేనింతవరకూ చూడలేదు సార్‌! ఆడండి, ఆడండి! ధైర్యంగా ఆడండి. ఇక్కడున్న నిధిని మొత్తం కొల్లగొట్టండి!’’
అలా ఉత్సాహపరచిందెవరా? అని నేను వెనక్కి తిరిగి చూశాను. నా వైపు చిరునవ్వుతో చూస్తున్న అతని మొహంలో నాగరికత ఉట్టిపడుతూ వుంది. ధరించిన దుస్తుల్ని బట్టి అతడొక మాజీ సైనికుడని చెప్పవచ్చు.

అతనికళ్ళు వెడెల్పుగా, జేగురు రంగులోవున్నాయి. మీసాలు మురికి పట్టి అసహ్యంగా వున్నాయి. ముక్కు వెనక్కి వంగింది. నయవంచన నిండిన కంఠస్వరమతనిది. అంత గలీజైన చేతులు ఫ్రాన్స్‌ దేశంలోనే ఎవ్వరికీ వుండవని ఘంటాపథంగా చెప్పగలను. నేను జూదక్రీడా వ్యసనమత్త చిత్తుడనై ఉన్న కారణంగా, అతన్ని అనుమానాస్పదుడుగా భావించ లేదు. ఈ స్వల్ప విషయాలు నా మీద ప్రతికూల ప్రభావం చూపలేదు. నరాలుతెగే ఉత్కంఠభరిత క్షణాలలో, కళ్ళునెత్తికొచ్చిన విజయోత్సాహ మైకంలో, ఆ క్రీడలో నన్నెవరైతే వెన్నుతట్టి ప్రోత్సహిస్తారో, అటువంటి వాళ్ళతో స్నేహం చేయడానికి నేను సిధ్ధపడ్డాను. అందుకే ఆ మాజీ సైనికుడిచ్చిన నశ్యాన్ని పీల్చాను. అతణ్ణి ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా అంగీకరించాను.

‘‘మిత్రమా విజృంభించు! ప్రతిసారీ నువ్వే గెలవాలి. జయం నీదే. ఈ రోజు అదృష్టదేవత నిన్నే వరిస్తుంది... ఇక్కడున్న ధనాన్ని మొత్తం కొల్లగొట్టు. గెలుపు నీదే. దూసుకెళ్ళు! ..’’ నేను పందేలు కడుతూనే వున్నాను. గెలుస్తూనే ఉన్నాను. ఇంకో పావుగంటలో, ‘‘మహాశయులారా! ఇక మా వద్ద ధనం లేదు. ఇవాల్టితో  ఆట ముగిస్తున్నాను’’ అని ఆ గ్యాంబ్లింగ్‌ హౌస్‌ నిర్వాహకుడు ప్రకటించాడు.
గ్యాంబ్లింగ్‌ హౌస్‌లో పెట్టిన పెట్టుబడి మొత్తం- కరెన్సీ  నోట్ల రూపంలోనూ, బంగారు రూపంలోనూ, నా ముందర కుప్పబోసి ఉన్నాయి. 
‘‘మీ చేతిరుమాల్లో పెట్టి మూట కట్టండి సార్‌’’- అని ముసలి మాజీ ఆర్మీ స్నేహితుడు సలహా ఇచ్చాడు. అంతటితో ఆగక మళ్ళీ ఇలా అన్నాడు.

‘‘సార్‌! మీరు సాధించిన విజయం సామాన్యమైంది కాదు సార్‌! కనీ వినీ ఎరుగనిది. మీరు చాలా డబ్బు సంపాదించారీరోజు. ఉండండి సార్‌! ఒక బంగారు నాణెం కిందపడింది. నేను తీసిస్తాను. ఈ మూటకు రెండు బలమైన ముడులు  వేయాలి సార్‌!... అప్పుడే డబ్బు భద్రంగా ఉంటుంది... ఆహా! ఏమదృష్టం సార్‌! ఏమదృష్టం! ఈ శుభసందర్భంగా  మీరు నాతో కలసి షాంపేన్‌ తాగవలసినదిగా కోరుతున్నాను.’’ అభ్యర్థించాడు ముసలి మాజీ ఆర్మీగాడు. ఒప్పుకున్నాను. ఒక బాటిల్‌ ఖాళీ చేశాము. అతను మరొక బాటిల్‌ తెప్పిస్తానన్నాడు. నేనతన్ని వారించి, ‘‘ఇప్పుడు నా ఖర్చుతో మరొక బాటిల్‌ ఇప్పిస్తాను’’ అన్నాను. 
రెండో బాటిల్‌ పూర్తిచేశాము. నా గొంతులోనుంచి సలసలా మరుగుతున్న నిప్పులద్రావణం దిగినట్లుంది. నా మెదడు అగ్నిలో పడి మండుతున్నట్లైంది. ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ తాగినా, ఇలాంటి అనుభూతి కలుగలేదెప్పుడూ.

నేను అధిక మానసిక ఒత్తిడికి గురైన కారణంచేత నా శరీర వ్యవస్థలో మార్పులు కలిగాయా? నా కడుపులో ఏదైనా జబ్బు మొదలైందా? లేక షాంపెయిన్‌ అంత ఘాటైనదా? అంతుబట్టలేదు నాకు.
అంతలో నేను ‘‘ఫ్రెండ్‌! అగ్నిగుండంలో పడినట్లుంది నాకు. నీకెలా వుంది.ఈ అగ్ని చల్లబడాలంటే మనం మూడవ బాటిల్‌ తప్పక తాగాల్సిందే’’ అని ఉద్వేగంగా, ఉఛ్చస్వరంతో అరిచాను.          
ఆ ముసలి మాజీ తల ఆడించాడు. ‘కాఫీ’ అని గట్టిగా అరుస్తూ లోపలి గదిలోకి పరుగెత్తాడు.
ఆ పదం ఉఛ్చరించిన విధానం అసాధారణంగా వుంది.  అది అక్కడున్న వారందరిపై మంత్రంలా పనిచేసింది. విపరీతమైన మైకం తలకెక్కిన నా పరిస్థితిని ఆసరాగా చేసుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారని నాకనుమానం కలిగింది. అక్కడికీ ముసలి మాజీ ఆర్మీ మిత్రుడు, నన్ను అతిగా తాగనీయకుండా నిజాయతీగా ప్రయత్నించాడు. వారి ఉద్దేశం ఏమైనా గానీ, అందరూ అక్కడ్నుంచి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా నిష్క్రమించారు. ముసలి మిత్రుడు మళ్ళీ వెనక్కొచ్చాడు. నా ఎదురుగా టేబుల్‌ ముందు కూర్చున్నాడు. మేమిద్దరమే ఉన్నామా గదిలో. గాంబ్లింగ్‌ హౌస్‌ నిర్వాహకుడు పక్క గదిలో ఒక్కడే కూర్చొని భోజనం చేస్తున్నాడు. భరించరాని భయంకర నిశ్శబ్దం ఆక్రమించుకొంది ఆ ప్రదేశాన్ని.    

ఉన్నట్టుండి ఆ మాజీ సోల్జర్‌ వైఖరిలో మార్పు కనబడింది. అతని చూపుల్లో ఏదో అవ్యక్త వంచనభావం దాగి ఉన్నట్టనిపించింది. అతని మాటల్లో అతిశయోక్తులు, అతిమర్యాద ధోరణి ఇప్పుడు లేదు. ఏదో రహస్యం చెబుతున్నట్టు తగ్గుస్వరంతో అతనిలా చెప్పాడు.
‘‘ఈ ముసలి సోల్జర్‌ చెప్పే చిన్న మాట వినండి సార్‌! ఈ ఇంటి యజమానురాలు వంట బహుదివ్యంగా, రుచికరంగా చేస్తుంది. మనకోసమే రుచికరమైన, స్ట్రాంగ్‌ స్పెషల్‌ కాఫీ తయారుచేయమని అభ్యర్థించి వచ్చానిప్పుడే. ఆ కాఫీ మీరు తప్పక తాగాలి.ఇంటికి వెళ్ళే ముందు ఇది సేవిస్తే  మీ మనసులో పేరుకొని ఉన్న గ్లాని అంతా మటుమాయమైపోతుంది. మనసు తేలికవుతుంది. మీరు తప్పక దీన్ని స్వీకరించాలి మిత్రమా! ఇప్పుడు నువ్వు గెలుచుకొన్న సొమ్మంతా ఈ రాత్రికే మీ ఇంటికి తరలించుకెళ్ళడమనేది నీవు నిర్వర్తించాల్సివున్న పవిత్ర విద్యుక్త ధర్మం. కానీ నువ్వు ఇంత భారీ డబ్బును గెలుచుకొన్నావని ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. ఇక్కడున్న వాళ్ళంతా పెద్దమనుషులే. ఉత్తమగుణాలు కలిగిన వారే. కానీ వాళ్ళు కూడా మానవమాత్రులే కదా. ఎంత మంచివాళ్ళకైనా  కొన్ని బలహీనతలుంటాయి.

ఇంతకంటే నేను వివరంగా చెప్పాలా మిత్రమా?.. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. నీవు మళ్ళీ ఈ మత్తు నుంచి తేరుకున్న తరువాత, అవసరమైతే పైకప్పు తెరవడానికి వీలయ్యేటటువంటి కారుకోసం పిలవనంపు. కారు ఎక్కగానే కిటికీ తలుపులన్నీ మూసేయాలి. విశాలంగా వుండి, మంచి వెలుతురున్న రహదారుల మీదనే నడపాలని డ్రైవరుకు కచ్చితమైన సూచనలివ్వాలి. ఈ విధంగా చేస్తే నీ డబ్బుతో భద్రంగా ఇల్లు చేరుకుంటావు. నిజాయితీగా ఇట్లాంటి సలహా ఇచ్చిన ఈ ముసలి మాజీ సోల్జరుకు మాత్రం కృతజ్ఞతలు తెలపడం మాత్రం మరువకు’’ దాదాపు కన్నీళ్ళు పెట్టుకొన్నట్లుగా చెప్పాడతడు.

అంతలో రెండు కప్పుల్లో కాఫీ వచ్చింది. ఒక కప్పు నాకందించాడు నమ్రతగా తలవంచి. అప్పటికే నా నాలుక దాహంతో పిడుచకట్టుకుపోయి వుంది. ఒక్క గుక్కలో తాగేశాను. ఆ వెంటనే నా తల గిర్రున తిరిగసాగింది. ఇంతకుముందెన్నడూ లేని మత్తు ఆవరించింది నన్ను. ఆ గదంతా గుండ్రంగా పరిభ్రమించసాగింది. ముసలి సోల్జరు- స్టీం రైలింజను పిస్టన్‌ కిందికీ, పైకీ కదిలే విధంగా ఎగురుతున్నట్టు కనిపించసాగాడు. నా చెవులు సగం వినిపించకుండా పోయాయి. భయ విహ్వలత, నిస్సహాయత, తెలివితక్కువతనం- నా గుండెల్ని ఊపేస్తున్నాయి. టేబుల్ను పట్టుకొని బ్యాలెన్స్‌ చేసుకుంటూ పైకి లేచాను. ఆ పరిస్థితిలో నేనెలా ఇంటికి పోవాలో తెలియక నాలో నేనే ఏదేదో గొణుక్కుంటున్నాను.

‘‘మిత్రమా!...’’ అని ముసలి సోల్జర్‌ తిరిగి చెప్పనారంభించాడు. ‘‘నీవున్న ఈ స్థితిలో ఇంటికి పోవడం పిచ్చితనమనిపించుకొంటుంది. కచ్చితంగా డబ్బు పోగొట్టుకుంటావు. దొంగలు దోచుకొని నిన్ను హత్య కూడా చేస్తారు. నేనీరాత్రి ఇక్కడే పడుకొంటాను. నువ్వుకూడా ఇక్కడే నిద్రపో. ఇక్కడ మంచి మంచాలు దొరుకుతాయి. హాయిగా నిద్రపో. మద్యం మత్తు వదిలించుకొని ఉదయమే- పట్టపగలు, సూర్యుని వెలుగులో నిశ్చింతగా ఇల్లు చేరుకుంటావు. నా మాట విను.’’  
నేను రెండు పనులు తప్పకచేయాల్సిన అవసరముంది. ఒకటి- నా డబ్బంతటినీ వుంచి కట్టివున్న చేతిరుమాలు మూటను చేజారనివ్వకుండా చూసుకోవడం. రెండు- ఏదో ఒక చోటు చూసుకొని తక్షణం మేనువాల్చి, హాయిగా నిద్రపోవడం. కాబట్టి మంచం ప్రతిపాదనకొప్పుకున్నాను. నా వైపు చాపిన మాజీ సోల్జరు చేతిని ఒకచేత్తో పట్టుకున్నాను. ఇంకో చేత్తో నిధిని బంధించిన మూటను గట్టిగా పట్టుకున్నాను. జూదగృహనిర్వాహకుడు ముందు నడవగా, కొన్ని మలుపులు తిరిగి, కొన్ని మెట్లెక్కిన తరువాత నేను నిద్రించబోయే గదికి చేరుకున్నాను. మాజీ సోల్జరు నాకు కరచాలనం చేస్తూ, మరుసటి ఉదయం అతనితో కలసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేయాలని కోరాడు. తరువాత నాతో శెలవు తీసుకొని,  జూదగృహ నిర్వాహకునితో పాటు నిష్క్రమించాడు.

వెంటనే నేను వాష్‌ బేసిన్‌ వద్దకు పరుగెత్తాను. జగ్గులో వున్న నీటిని తాగి, మిగతావి వాష్‌ బేసిన్లోకి కుమ్మరించాను. చల్లనినీళ్ళల్లోకి నా తలను ముంచివుంచాను కాస్సేపు. తరువాత కుర్చీలో కూలబడి నన్ను నేను సుధారించుకొనడానికి ప్రయత్నించాను. కొన్ని క్షణాల అనంతరం కొంచెం ఉపశమనం కలిగినట్లైంది. గాంబ్లింగ్‌ హౌస్‌లో తిష్ట వేసిన దుర్గంధభూయిష్టమైన వాయువులను పీల్చి ఖరాబైన నా ఊపిరితిత్తుల్లోనికి- ఆ గదిలోకి వీస్తున్న సహజ తాజాశీతల సమీరాలు ప్రసరించి , ఎనలేని హాయిని చేకూర్చాయి. చల్లని నీటిస్పర్శ మనశ్శాంతిని కలిగించింది. తలతిరుగుడు తగ్గింది. మళ్ళీ మామూలు మనిషినయ్యాను.

నా మనసులో మెదిలిన మొట్టమొదటి పథకమేమంటే... ఆ రాత్రికెలాగో ఒకలాగు గాంబ్లింగ్‌ హౌస్‌లోనే కాలక్షేపం చేయడం. తరువాత అక్కడి నుంచి బయటపడి చల్లగా బైటకు జారుకోవడం. అందుకే లోపల గడియ బిగించుకొని, తలుపుకేవైనా బరువైన వస్తువుల్ని అడ్డంగా పెట్టి, మరుసటి ఉదయం వరకూ అవకాశం కోసం ఎదురు చూడాలనుకొన్నాను. అదొక రిస్కుతో కూడుకున్న పని.                              
అనుకున్న ప్రకారంగా, ఎవరూ గదిలోకి చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. షర్ట్‌ విప్పేసి, పరుపుమీదకు చేరాను. నిధిని కట్టి ఉంచిన చేతిరుమాలమూటను తలగడకింద ఉంచుకున్నాను. 
ఎంత ప్రయత్నించినా నిద్రరాలేదు. నాలోని ఇంద్రియాలన్నీ కొత్త ఉత్తేజాన్ని పుంజుకున్నాయి. పరుపుమీద ఊరికే అటూ ఇటూ  కదులుతున్నాను. ఒకసారి లేచి కూర్చుంటున్నాను. కాస్సేపు మోచేతుల్ని పరుపుపై ఆనించి పడుకున్నాను. రకరకాల విన్యాసాలను ప్రదర్శిస్తున్నాను. అయినా నిద్ర రావడం లేదు. ఏం చేయాలి నేను? చదువుకుందామంటే పుస్తకం లేదు. ఊరికినే ఆ గదిలోని వస్తువులను లెక్కించసాగాను.

భయంగొలిపే ఆలోచనలతో నా బుర్ర బద్దలవుతుందేమోనని సందేహం తలెత్తింది. వాటిని మళ్లించుకుంటే తప్ప ఆ రాత్రి గడపలేననిపించింది. భయంకరమైన చెలరేగుతూనే వున్నాయి. పరుపుమీద లేచి కూర్చొని ఆ గదిని మొత్తం పరిశీలించాను. కిటికీలోంచి వెన్నెల కిరణాలు ప్రసరించి గదిని కాంతిమయం చేస్తున్నాయి. ఆ వెలుగులో అలంకారం కోసం  గదిగోడలకు తగిలించిన బొమ్మలేమైనా కనిపిస్తాయేమోనని చూశాను. వాష్‌ బేసిన్‌లోంచి నీళ్ళుబొట్లు బొట్లుగా కారుతున్నాయి. రెండు చిన్న కుర్చీలు, వాటి చేతులమీద నా కోటు, ట్రౌజర్స్‌. పొడవు చేతుల కుర్చీ మీద మాసిన నా చొక్కా. డ్రెస్సింగ్‌ టేబుల్‌. ఆ తరువాత కిటికీ. చాలాపెద్ద కిటికీ అది. దానితరువాత చాలా పురాతనమైన బొమ్మ. క్యాండిల్‌ వెలువరిస్తున్న మసక వెలుతురులో అది అస్పష్టంగా కనిపిస్తూ ఉంది. 

చిత్రంలోని వ్యక్తి- ఎత్తైన పక్షి ఈకల గుఛ్చంతోనున్న స్పానిష్‌ టోపీని కిరీటంలా ధరించివున్నాడు. నల్లనిముఖంతో, దౌష్ట్యదృక్కుల వాలకంతో దర్శనమిస్తూ, అరచేతిని కళ్ళకడ్డుపెట్టి, దేనివంకో అదేపనిగా పైకి చూస్తున్నాడు. బహుశా అతని చూపులు, అతన్ని ఉరితీయబోయే ఉరికొయ్యమీద  నిలిచివుంటాయి. అతని వైఖరి కూడా అందుకు తగినట్టే వుంది. 
ఆ పిక్చరు నన్ను పైకి చూసేలా చేసింది. అప్పుడు పందిరి మంచానికున్న చప్పరం (మంచం పైభాగం)కేసి దృష్టిసారించాను. చప్పరం మబ్బుమబ్బుగా కనబడుతూవుంది. దాన్ని చూడడానికి ఆసక్తి కలగకపోవడంతో, వెనక్కి తిరిగి పిక్చర్‌ వంక చూశాను. ఆ బొమ్మలోని శాల్తీ ధరించిన కిరీటానికున్న ఈకలు లెక్కపెట్టాను. మూడు తెల్లవి, రెండు ఆకుపచ్చవి. అతని కిరీటాన్ని కూడా పరిశీలించాను. శంఖు ఆకారంలోఎత్తుగా ఉంది. ఆ వ్యక్తి ఏ కారణంచేత పైకి చూస్తున్నాడో అర్థం కాలేదు. నక్షత్రాల వైపా? అంతటి సాహసికుడు జ్యోతిష్యుడో లేక ఖగోళ శాస్త్రజ్ఞుడో కావడానికి వీల్లేదు. తప్పకుండా అతను ఎత్తులో వున్న ఉరికొయ్యకేసే చూస్తుంటాడు. ఇప్పుడు తలారి వచ్చి ఆ వ్యక్తి కిరీటాన్నీ, ఈకలనూ స్వాధీనం చేసుకొంటాడా? మరొకసారి   ఈకలను లెక్కపెట్టాను. మూడు తెల్లవి, రెండు ఆకుపచ్చవి.

నా జ్ఞాపకాలు ఇంగ్లాండ్‌ లో గడిపిన వెన్నెల రాత్రుల వెంట వెనక్కి పరుగెత్తాయి. కొంతసేపటికి నా జ్ఞాపకాల దారం తెగిపోయింది.  మళ్ళీ వెంటనే ఈ లోకానికూడిపడ్డాను. కానీ, నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆ బొమ్మవైపు చూస్తున్నానో అర్థం కాలేదు. నా కళ్ళముందు- నా ఊహకందనిదేదో జరుగుతూ వుంది. ఏమది?... కనీకనిపించనట్టు...ఏదో చిన్న కదలిక.. చాలా చిన్న కదలిక...
అరే! ఏమిటీమాయ! ఇప్పుడు ఆ బొమ్మలోని మనిషి తలమీది టోపీ కనబడలేదు. ఎక్కడికిపోయింది?  శంఖాకార కిరీటమేది? అదీ కనబడలేదే! ఆ రెండూ ఎక్కడికెళ్ళాయి? మూడు తెల్లవి, రెండు ఆకుపచ్చ రంగు ఈకలేమయ్యాయి? అక్కడ లేవే! నేను చూస్తూండగానే ఎలా మాయమయ్యాయి.?...  అతని నుదురును కప్పివేస్తూ  వచ్చిన ఆ వస్తువేమిటీ? 
అంటే.. మంచం కదులుతూ వుందా? భయంతో గుండె వొణికింది.
మంచం తలవైపు వీపు ఆనించుకొని కూర్చున్న నేను వెనక్కి తిరిగి పైకి చూశాను. ఆశ్చర్యపోయాను.     
నాకు పిచ్చిగానీ పట్టలేదు కదా? తాగుడు మైకం ఇంకా తగ్గలేదా నాకు? కలగంటున్నానా? మళ్ళీ తల తిరుగుతోందా? పందిరి మంచానికి నాలుగుమూలలా వున్న చిన్నపాటి కొయ్యనిలువుల  ఆసరాగా  నిలబడిఉన్న చప్పరం (పందిరిమంచం పైభాగం)  కిందకు దిగుతూ వుంది- నెమ్మదిగా... అతి నెమ్మదిగా.  
నేను పరుపు మీద పడుకొని ఉండగానే నిదానంగా, క్రమపధ్ధతిలో, నిశ్శబ్దంగా- కింద పరుపు ఏ కొలతలతో వుందో, సరిగ్గా  అవే కొలతలతోవున్న దీర్ఘచతురస్రాకార చప్పరం - నేరుగా నా మీదకు దిగుతూ వుంది. అలా దిగి అప్పచ్చిలా నన్ను నలిపేయదు కదా? 

నా రక్తం గడ్డకట్టినట్లైంది.  చల్లని మంచుకణికలు- పాములుగా మారి- నా వెన్నెముక మీద పాకినట్లైంది. దిండు మీదున్న తల గుండ్రంగా తిప్పి- నిజంగా చప్పరం కిందకు దిగుతూ వుందా లేదా అని ధ్రువీకరించుకోవడానికి- బొమ్మలోవున్న వ్యక్తివైపు చూశాను. మరోసారి చూడనవసరం లేకపోయింది. అప్పటికే నల్లని, కంపుకొడుతున్న చప్పరం తాలూకు దీర్ఘచతురస్రాకార బయటి అంచులు - బొమ్మలోని వ్యక్తి నడుముకు సమాంతర దూరం పరిధిలోకి రావడానికి ఒక అంగుళం దూరంలో మాత్రం వున్నాయి. నేను ఊపిరి పీల్చడం కూడా మరచిపోయి చూస్తున్నాను.  నెమ్మదిగా, చాలానెమ్మదిగా- ఆ చప్పరం ఫ్రేము అంచులు బొమ్మను దాటి కిందకు రావడం చూశాను. 
నేనాసమయంలో మనోనిశ్చలత కోల్పోలేదు. మంచం పందిరి పైభాగం కిందకు దిగి నన్ను నొక్కెయ్యబోతుందనే భయంకర నిజాన్ని  మనసులో ధ్రువీకరించుకున్నాక, ఇక నేను ఆలస్యం చేయలేదు.

ఈ లోపల పందిరి పైభాగం, మారణాయుధం రూపంలో నేను పడుకొన్న పరుపుకేసి ఇంకా కిందకు వస్తూనే వుంది.  నేను భయంతో బిగుసుకు పోయాను. ఆ చప్పరం ఫ్రేం తాలూకు దుర్గంధం నా నాసికాపుటాల్లోనికి చొరబడి ఇంకా కంపరం పుట్టించింది. నేను ఇక ఆలస్యం చేస్తే ప్రాణాలు పోతాయనే స్పృహ మెరుపువేగంతో నన్ను కదిలేలా చేసింది. నిశ్శబ్దంగా పరుపుమీద నుంచి పక్కకు పొర్లి, నేలమీదకు పడిపోయాను. నేనలా కిందకు పొర్లడమేమిటీ, చప్పరం మొత్తం- అవే దీర్ఘచతురస్రాకార కొలతలున్న మంచం నాలుగుమూలలకు అతుక్కుపోవడమేమిటీ, రెండుచర్యలూ ఏక కాలంలో జరిగిపోయాయి. అంటే వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నానన్నమాట! అక్కడికీ  చివర్లో ఆ పందిరిమంచపు అంచు నా భుజానికి తగలనే తగిలింది.   
ఊపిరి పీల్చడానిక్కూడా వ్యవధి ఇవ్వకుండా, ముఖం మీద ధారగా కారుతున్న చెమటను కూడా తుడుచుకోకుండా, మోకాళ్ల మీద నిలబడి పందిరి పైభాగాన్ని పరికించాను.
నా శరీరంలోని సర్వశక్తుల్నీ కూడదీసుకొని, నా కళ్ళలోనికే  కేంద్రీకరించగలిగాను కాబట్టి,  ఆఖరిక్షణాన, వెంట్రుకవాసిలో అపాయం నుండి తప్పించుకోగలిగాను.  నా ప్రాణాల్ని రక్షించుకోగలిగాను.       
చప్పరం తాలూకు దీర్ఘచతురస్రాకారపు ఫ్రేము, దానిచుట్టు వున్న అంచులతో సహా పరుపుమీద పూర్తిగా దిగి ఆగిపోయింది. ఇప్పుడు  పరుపూ, చప్పరం ఫ్రేము అంచుల మధ్య చిటికెన వేలు దూర్చడానిక్కూడా సందులేదు. మంచం పక్కన నిల్చుని పరిశీలిస్తే ఏం జరిగిందో అర్థమైంది.

నాలుగు స్తంభాలమీద మోయబడుతున్న చప్పరం కింద నుంచి చూస్తే  తేలికగా వుందనిపిస్తుంది. కానీ అది చాలా బరువైనది. దాన్ని ఏ పదార్థంతో చేశారో తెలియకుండా వుండేందుకు, కొన్ని అంగుళాల మేర కిందకు దిగిన చప్పరం అంచులు కనబడకుండా ఆకర్షణీయమైన రంగుల గుడ్డతెరలు అమర్చబడ్డాయి. నేను పైకి చూశాను. మంచం నాలుగు మూలలకు అమర్చిన లోహపుకడ్డీలు- కింద నుంచి పైకి పొడుచుకెళ్ళాయి-భయంకరంగా. నాలుగు స్థంభాలమీద, ఎత్తులో వుండాల్సిన  మంచపు పైభాగం  పూర్తిగా కిందకు దిగి, కిందున్న మంచపు అంచులను హత్తుకొని వుంది. మంచపు పైభాగం మధ్యలో చెక్కతో తయారుచేసిన భారీ స్క్రూ ఒకటి, సీలింగ్‌ కు తొలిచిన రంధ్రం ద్వారా కిందకు దిగేలా ఏర్పాటు చేయబడింది. అది సాధారణ ప్రింటింగ్‌ ప్రెస్సులలో ఉపయోగించే కంప్రెషర్‌ను తయారు చేసే పదార్థంతో తయారుచేయబడింది.

భయంకరమైన సదరు మారణాయుధం అతిస్వల్ప శబ్దంకూడా వెలువరించలేదు. పైనుంచి కిందకు దిగుతున్నప్పుడు కనీసం కిర్రుమనలేదు. పదమూడో శతాబ్దంలో, ఇంక్విజిషన్‌ కాలంలో, ఇటువంటి మారణాయుధాలను ప్రయోగించి, దైవదూషణకు, మతధిక్కారానికి పాల్పడిన  వ్యక్తులను ఊపిరాడకుండా చేసి చంపేవారు. ఇప్పటికీ ఈ పందొమ్మిదో శతాబ్దంలో కూడా నాగరిక ఫ్రాన్స్‌లో  ఇటువంటి ప్రాణాల్ని హరించే యంత్రాన్ని కట్టెదుట నా కళ్ళముందే  చూస్తూవుంటే నా గుండెలు గజగజా వొణికిపోయాయి. కదలలేని, ఊపిరికూడా తీసుకోలేని  స్థితిలో వున్నాను. అయితే, వెంటనే కోల్పోయిన ఆలోచనాశక్తిని తిరిగి కూడగట్టుకున్నాను. నన్ను హత్య చేయడానికి కుట్ర జరిగిందనే భయంకర సత్యాన్ని తెలుసుకున్నాను.

నా డబ్బుకోసం నన్ను ఇంత కిరాతకంగా, గురితప్పని రీతిలో నిద్రలోనే హత్య చేయడానికి కుట్రపన్నిన ఆ ఇద్దరినీ గుడ్డిగా నమ్మి, ఆ గదిలోకి వెళ్ళాను. ఇంతకుముందు ఎంతమందిని- గెలుచుకున్న డబ్బు కోసం- ఈ విధంగా మభ్యపెట్టి చంపారో! నేను తాగిన కాఫీలో మాదక ద్రవ్యం మోతాదు మించలేదు. పైగా నేను నిద్రపోకుండా వుండడం వల్ల నా ప్రాణాన్ని కాపాడుకున్నాను.  
నేను ఊహించినట్లు, ఆ చప్పరం పదినిముషాలపాటు మంచం మీద నిశ్చలంగా వున్న తరువాత, మరలా పైకి కదలడం ప్రారంభించింది. పైన వుండి ఘోర ఘాతుక కార్యం నిర్వహించిన దుర్మార్గులు- వారి కార్యాచరణ విజయవంతమైందని నమ్మివుంటారు. చప్పరం- నాలుగు కడ్డీలను దాటి, పైకప్పును చేరి యథాతథంగా అతుక్కుపోయివుంది. ఇంతకుముందు కనబడిన స్క్రూ లేదు. రంధ్రం లేదు. ఇప్పుడు మంచం-నిద్రకుపయోగపడే- సాధారణ మంచం లాగానే కనిపిస్తూ ఉందే గానీ, ఇంతకుముందటిలా మృత్యుతల్పంలా కనిపించలేదు. 
నేను మోకాళ్ళమీద లేచాను. చిన్న శబ్దమైనా-  కుట్ర విఫలమైందని వాళ్ళకు తెలిసిపోతుంది. తరువాత నన్ను ఏమాత్రం వదలరు. ఏదోవిధంగా నన్ను హత్యచేసి తీరుతారు.

తలుపు దగ్గర అడుగుల చప్పుడు వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి విన్నాను. ఎలాంటి చప్పుడూ లేదు. లోపలి నుంచి గడియ బిగించుకోవడమే కాక, వాకిలికడ్డంగా ఒక పాత చెక్కపెట్టెను ఉంచాను. దాన్ని- చప్పుడు కాకుండా కదిలించడం అసాధ్యమే అనిపించినా, కష్టపడి జాగ్రత్తగా ఆ పని పూర్తిచేయగలిగాను. ఇక అక్కడ్నుంచి తప్పించుకుపోవడమెలా అని ఆలోచించాను. కిటికీ కనబడింది. పిల్లిలా నడిచాను కిటికీ దగ్గరకు. కుట్రదారులు- పై అంతస్తులో కాపువేసి వేయికళ్ళతో చూస్తుంటారు. మెల్లగా కిటికీ తెరిచి కిందకు చూశాను. అబ్బో! అంతెత్తునుంచి దూకితే సున్నంలోకి ఎముక కూడా మిగలదు. ఇంటి పక్కలకు చూశాను. నీళ్ళపైపు కనబడింది- కిటికీకి దగ్గరలోనే. స్కూల్లో చదువుతున్నప్పుడు వ్యాయామం చేసేవాడిని. ఇప్పుడది అక్కరకొస్తూవుంది.

అప్పుడు జ్ఞాపకమొచ్చింది- చేతిరుమాలలో కట్టివుంచిన బంగారమూ, డబ్బు. నేను దాన్ని అక్కడే వదలి పోదామనుకున్నాను. కానీ, ఆ దుర్మార్గులకు, అంతటి కుట్రదారులకు- ఎంతో విలువైన సొమ్ము దక్కనివ్వకూడదని కసితో అనుకున్నాను. నేను మరలా వెనక్కెళ్ళి, చేతిరుమాలు మూటను తెచ్చాను. దాన్ని నా షర్ట్‌ మెడపట్టీకి భద్రంగా కట్టుకొని , కిటికీమీదకు చేరుకొని, పైపుద్వారా- పిసరంత శబ్దం కూడా అవకుండా-  కిందకు జారిపోయాను.            
ఆ పరిసరప్రాంతంలో పోలీస్‌ స్టేషన్‌ ఉన్నట్లు నాకు తెలుసు. బుల్లెట్‌ వేగంతో అక్కడికి చేరుకొన్నాను. గుక్క తిప్పుకోకుండా ఆ పోలీసు ఆఫీసరుకు  జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించాను. నా వాలకం, నా మాటల్లోని నిజాయితీని గుర్తించి ఆ పోలీసు ఆఫీసరు గాంబ్లింగ్‌ హౌస్‌ మీద, బలగంతో ఒక్కుమ్మడిగా దాడిచేశాడు. 
అందరూ లొంగిపోయారు.

తరువాత తెలిసిందేమంటే.. ఆ ముసలి మాజీ సోల్జరు ఆ గాంబ్లింగ్‌ హౌస్‌ నాయకుడని, ఇంతకు ముందు ఆర్మీ నుంచి డిస్మిస్‌ చేయబడ్డాడని, అక్కడున్నవారందరూ ఏదో విధంగా గాంబ్లింగ్‌ హౌస్‌లో జరిగే మోసాలలో, హత్యా దోపిడీలలో సంబంధం కలిగున్న వారేనని తేలింది. నాకిచ్చిన కాఫీలో మాదకపదార్థం కలిపినట్లు పట్టుబడిన స్త్రీ ఒప్పుకొంది. 
నేను పడుకొన్న గది పైకెళ్ళారు పోలీసులు. నన్ను ఊపిరాడనీయకుండాచేసి చంపాలని ప్రయోగించిన యంత్రాన్ని కనుగొన్నారు. గాంబ్లింగ్‌ హౌస్‌లో నిధిని గెలుచుకున్న వారందరినీ ఏదోవిధంగా మభ్యపెట్టి, పందిరిమంచం మీద నిద్రపోయేట్లు చేసి, గట్టిలోహంతో తయారు చేసిన మంచం మీద, కనీ కనబడనట్టి మెత్తని, పల్చటి పరుపు పరచేవారు. డబ్బుగెలిచిన వ్యక్తి అమాయకంగా నిద్రపోయిన తరువాత, తల్పం సైజులోనే చుట్టూ ఏర్పరిచిన లోహపు అంచులుగల చప్పరాన్ని పైకప్పు నుంచి కిందకి దించేవారు. మంచానికీ, పైనుంచి దిగిన చప్పరానికీ మధ్య ఏర్పడిన ఖాళీ స్థలంలో చిక్కుకున్న ఆ వ్యక్తి ఊపిరాడక గిల గిలా కొట్టుకొంటూ, దుర్భరమైన మరణయాతన అనుభవించి మరణించేవాడు. ఒకవేళ  మధ్యలో ఆ వ్యక్తికి మెలకువ వచ్చినా, తప్పించుకోవడం అసాధ్యం. తరువాత ఆ గాంబ్లింగ్‌ హౌస్‌ గ్యాంగు, శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా  నదిలో విసిరేస్తుంది.     
నేను చేసిన ఈ నా సాహసకృత్యం పుణ్యమాని- సరదా కోసంగానీ, వినోదం కోసంగానీ - ఆ ఎరుపు నలుపు కార్డుల ఆట జోలికి ఇంకెప్పుడూ పోలేదు. పందిరిమంచం ఊహ-మదిలో మెదిలితేనే నా గుండెలు దడదడలాడిపోతుంటాయి- ఇప్పటికీ.
- ఇంగ్లిష్‌ మూలం : విలియం విక్కీ కాలిన్స్‌
- అనువాదం: శొంఠి జయప్రకాష్‌

మరిన్ని వార్తలు