నిజం బయటపడింది, కటకటాల్లోకి వెళ్లింది..

1 Sep, 2019 10:59 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

రాజమోహనరావు హడావుడిగా పోలీస్‌ స్టేషన్‌లోకి వచ్చాడు. ఇన్‌స్పెక్టర్‌ని కలవాలని అంటే, సెంట్రీ అతని కార్డు అడిగి తీసుకుని సీఐకి ఇచ్చి వచ్చాడు. స్టేషన్‌ ముందున్న రావిచెట్టు చప్టా మీద కూర్చున్నాడు రాజమోహనరావు. కాసేటికి అతనికి సీఐ నుంచి పిలుపు వచ్చింది.
‘‘సార్‌! నా పేరు రాజమోహనరావు..’’ అని చెప్పబోతుండగా–
‘‘కార్డులో చూశాను. ప్లీజ్‌ కూర్చోండి’’.. అన్నాడు సీఐ.
రాజమోహనరావు సీఐ ఎదురుగా చైర్‌లో కూర్చున్నాడు. అతని ముఖంలో ఆందోళన కనిపిస్తోంది.
‘‘చెప్పండి. ఏం జరిగింది?’ అడిగాడు సీఐ.
‘‘నా కొడుకు సిద్ధార్థ కనిపించడం లేదు సార్‌! రాత్రి ఇంటికి రాలేదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది. ప్రతిరోజూ మాదాపూర్‌లోని గ్లోబల్‌ టెన్నిస్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేసి రాత్రి తొమ్మిదింటికల్లా ఇంటికి వచ్చేవాడు’’ అంటూ సిద్ధార్థ ఫొటో సీఐకి ఇచ్చాడు రాజమోహనరావు.
సిద్ధార్థ రాజమోహనావుకి ఒక్కడే కొడుకు. బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశాడు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి లేదు. తండ్రి ఆటో స్పేర్‌పార్ట్స్‌ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీని విస్తరించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. వాళ్ల ఇండస్ట్రీ బాలానగర్‌లో ఉంది. నివాసం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం:38లో ఉంది. సిద్ధార్థ ఉపయోగించే స్కోడా కారు నంబరు నోట్‌ చేసుకుని మిస్సింగ్‌ కంప్లయింట్‌ తీసుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్‌.

సిద్ధార్థ ఫొటో, అతడు ఉపయోగించే కారు నంబర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లన్నింటికీ పంపబడింది. రెండు రోజుల తర్వాత తుర్కుయాంజాల్‌ దగ్గర బ్రాహ్మణపల్లి వెళ్లే రోడ్డులో ఒక పక్కగా దొరికింది స్కోడా కారు.
పోలీస్‌ స్టేషన్‌ నుంచి కాల్‌ రావడంతో వెళ్లాడు రాజమోహనరావు.
అతన్ని చూస్తూనే ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్‌.
‘‘మీవాడు డైలీ ఈవెనింగ్‌ బాలానగర్‌ నుంచి మాదాపూర్‌లో టెన్నిస్‌ అకాడమీకి వెళ్లి ఇంటికి వస్తాడని చెప్పారు కదా? మరి సాగర్‌రోడ్డులోకి ఎందుకు వెళ్లి ఉంటాడు?’’
‘‘నాకు ఐడియా లేదు సార్‌! ఆ ఏరియాలో ఏదైనా పార్టీకి వెళ్లి ఉంటాడేమో?’’
‘‘మీకేం చెప్పలేదన్నమాట. పార్టీకి వెళ్తుంటే రాత్రి డిన్నర్‌కి రానని మీకుగాని, మీ మిసెస్‌కిగాని చెప్పాలి కదా?’’
‘‘నాకు మిసెస్‌ లేదు సార్‌! పదేళ్ల కిందటే చనిపోయింది. ఇంట్లో కుక్‌ ఉంటుంది. మావాడు నైట్‌ పార్టీకి వెళితే లేటుగా వస్తాడుగాని ఆ సంగతి నాకూ చెప్పడు, కుక్‌కీ చెప్పడు. వాడికి అలాంటి అలవాటు లేదు.’’ చెప్పాడు రాజమోహనరావు.

‘‘ఆ రాత్రి ఏదైనా పార్టీ జరిగిందేమో మీ వాడి ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేశారా?’’
‘‘ఆ.. మావాడి క్లోజ్‌ ఫ్రెండ్‌ నిఖిల్‌ని అడిగాను. పార్టీ ఏమీ జరగలేదని చెప్పాడు.’’
‘‘నిఖిల్‌ ఏం చేస్తాడు?’’
‘‘మాదాపూర్‌లోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’’
ఇన్‌స్పెక్టర్‌ నిఖిల్‌ సెల్‌ నంబరు అడిగి తీసుకున్నాడు.
‘‘ఏం జరిగి ఉంటుంది? మీ వాడిని ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని అనుమానిస్తున్నారా?’’
‘‘మావాడిని కిడ్నాప్‌ ఎవరు చేస్తారండీ? మాకు శత్రువులు ఎవరూ లేరు. ఒకవేళ డబ్బు కోసం ఎవరైనా కిడ్నాప్‌ చేసినా, ఈపాటికి డిమాండ్‌ చేస్తూ నాకు కాల్‌ రావాలి కదా?’’
‘‘మీరు చెప్పింది నిజమే! కిడ్నాప్‌ డబ్బు కోసం జరగలేదు. మీవాడికి లవ్‌ ఎఫైర్స్‌ ఏమైనా ఉన్నాయా?’’
‘‘నాకు తెలిసి అటువంటివేమీ లేవు. వాడు వర్క్‌ మైండెడ్‌. మా ఇండస్ట్రీలోనే ఎక్కువ టైమ్‌ ఉంటాడు.’’
‘‘సార్‌! ఈకాలంలో పిల్లల సంగతులు మనదాకా రావు. ఊళ్లో అందరికీ తెలిసిన సంగతులు మనకు చివరకు తెలుస్తాయి. అది కూడా ఏదైనా బ్యాడ్‌ ఇన్సిడెంట్‌ జరిగినప్పుడు. అందువల్ల మీవాడికి ఎఫైర్స్‌ లేవని గ్యారంటీ లేదు. మీకు తెలియదు అంతే!’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్‌ అజయ్‌కుమార్‌.
‘‘మే బీ యూ ఆర్‌ కరెక్ట్‌’’ అని పేలవంగా నవ్వాడు రాజమోహనరావు.

రాజమోహనరావు కొడుకు సిద్ధార్థ కనిపించడం లేదని ఆయన సన్నిహితులకు, బంధువులకు తెలిసింది. ఆయన తన ఇండస్ట్రీకి కూడా వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాడు. చాలామంది ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. అంతా మిస్టరీగా ఉంది. సిద్ధార్థకి ఇరవయ్యారేళ్లు. చిన్నపిల్లాడేం కాదు కిడ్నాప్‌ చేయడానికి. వ్యక్తిగత కక్షలతో ఏదైనా అఘాయిత్యం చేసినా అది బయటపడక తప్పదు. ఒక్కోసారి పార్టీల్లో తాగుడు ఎక్కువై మత్తులో యువకులు దాడులు చేసుకుంటారు. అటువంటిది జరిగి సిద్ధార్థను ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. ఎక్కడా క్లూ దొరకలేదు.
సిద్ధార్థ క్లోజ్‌ఫ్రెండ్‌ నిఖిల్‌ని పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించారు.
‘‘నిఖిల్‌ చెప్పు? నువ్వు సిద్ధార్థకి క్లోజ్‌ఫ్రెండ్‌వి. నీకు తెలియని వ్యక్తిగత విషయాలు ఉండవు. సిద్ధార్థ మిస్‌ కావడం నీకు ఎలా అనిపిస్తోంది?’’ అడిగాడు సీఐ.

‘‘సార్‌! నాకూ అదే వండర్‌గా ఉంది. ఏదైనా పార్టీకిగాని, ఫంక్షన్‌కిగాని వెళ్లాల్సి వచ్చినప్పుడు నన్ను తప్పకుండా తీసుకెళ్తాడు. ఆ రోజు ఏ పార్టీ జరగలేదు. అసలు ఆరోజు నాకు వాడి నుంచి కాల్‌ కూడా రాలేదు.’’
‘‘పార్టీలు సరే! సిద్ధార్థకి ఏదైనా లవ్‌ ఎఫైర్‌ ఉందా? ఏ అమ్మాయినైనా ప్రేమించడం, తర్వాత బ్రేకప్‌ కావడం వంటివి... ఈ రోజుల్లో కామన్‌ కదా?’’
‘‘వాడికి లవ్‌ ఎఫైర్‌ ఏమీ లేదు సార్‌! వాడి దృష్టి అంతా వాళ్ల ఇండస్ట్రీని డెవలప్‌ చేయడం మీదే... బాలానగర్‌ యూనిట్‌ డెవలప్‌ చేయడానికి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారు చేశాడు. ఆ తర్వాత కాకినాడ ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో కొత్త యూనిట్‌ స్టార్ట్‌ చేయాలి అనేవాడు. వాడికి టెన్నిస్‌ ఇష్టం. గ్లోబల్‌ టెన్నిస్‌ అకాడమీ మెంబర్‌..’’
‘‘సిద్ధార్థని ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు.. ఓకే! పోనీ తనంటత తానే అండర్‌గ్రౌండ్‌కి వెళ్లి ఉంటాడా? ఫాదర్‌తో ఏవైనా గొడవలు ఉండి ఉంటాయా?’’
నిఖిల్‌ ఆలోచనలో పడిపోయాడు. కాసేపు కళ్లు మూసుకున్నాడు. తర్వాత కళ్లు తెరిచాడు.

‘‘సార్‌! ఫాదర్‌తో విభేదాలు అంటే గుర్తొచ్చింది... రాజమోహనరావుకి మంజులాదేవితో ఎఫైర్‌ ఉంది. అసలు ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడనీ, ఇంటర్‌ చదువుతున్న కొడుకుని ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు పెళ్లేంటని ఫ్రెండ్స్, రిలేటివ్స్‌ మందలిస్తే ఆ ప్రపోజల్‌ నుంచి డ్రాప్‌ అయ్యాడని చెప్పుకున్నారు. మంజులాదేవితో ఇప్పటికీ ఎఫైర్‌ కొనసాగిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతారు. లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌ అనుకోండి. అయితే ఒకే ఇంట్లో కలసి ఉండరు. రాజమోహనరావు జూబ్లీహిల్స్‌లో ఉంటే, మంజులాదేవి సాగర్‌రోడ్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉంటుంది. అది రాజమోహనావు కొనిపెట్టినదే. ఆమెకు శ్రావ్య అనే మేనకోడలు ఉంది. మంజులాదేవిలాగానే ఆమె కూడా క్లాసిక్‌ డ్యాన్సర్‌..’’ చెప్పడం ఆపాడు నిఖిల్‌.

‘‘ఊ.. తర్వాత?’’
‘‘సిద్ధార్థకి శ్రావ్యనిచ్చి పెళ్లి చేయాలని రాజమోహనరావును కోరింది మంజులాదేవి. శ్రావ్య మంచి అమ్మాయి. అందగత్తె. సీఏ చదివింది. ఇండస్ట్రీకి సంబంధించిన అకౌంట్‌ లావాదేవీలు చూసుకుంటుందని రాజమోహనరావు కూడా పెళ్లికి ఓకే చెప్పాడు. సిద్ధార్థ కూడా మొదట ఒప్పుకున్నాడు. తర్వాత ఆమెను చేసుకోనని అడ్డం తిరిగాడు’’ చెప్పాడు నిఖిల్‌.
‘‘ఏం? ఎందుకని?’’ ప్రశ్నించాడు సీఐ అజయ్‌కుమార్‌.
‘‘అనైతికం అని..’’
‘‘అంటే?..’’
‘‘శ్రావ్య మంజులాదేవి మేనకోడలు కాదు, ఆమె కన్నకూతురేనన్న నిజం సిద్ధార్థకు తెలిసింది. పెళ్లి కాకపోయినా మంజులాదేవి తల్లి స్థానంలో ఉంది. తండ్రికి సహచరి అనేది జగమెరిగిన సత్యం. ఆమె కూతురిని తాను భార్యగా చేసుకోవడం అనైతికం అని సిద్ధార్థ పెళ్లికి తిరస్కరించాడు..’’ చెప్పాడు నిఖిల్‌.
అజయ్‌కుమార్‌కి ఏదో క్లూ దొరుకుతున్నట్లుగా అనిపించింది. మంజులాదేవి, రాజమోహనరావుకి శ్రావ్య పుట్టకపోవచ్చు. ఆమె భర్తకే కలిగి ఉండొచ్చు. తన వయసు బయటపడకూడదనో, గ్లామర్‌ దెబ్బతింటుందనో కన్నకూతురిని చెల్లెలనీ, మేనకోడలనీ చెప్పుకునే వారిని తాను చూశాడు. మంజులాదేవి ఆ కోవకు చెందిందే. తన కన్నతూరుని ప్రియుడి కొడుక్కిచ్చి పెళ్లి చేయడం, కోట్ల ఆస్తులకు యజమానురాలిని చేయడం మంజులాదేవికి తప్పుగా అనిపించకపోవచ్చు. ఆమెకు అది చిన్న విషయమే కావచ్చు. నైతిక విలువల దృష్ట్యా అది అనైతికం. సిద్ధార్థ దానికే కట్టుబడ్డాడు. 
‘‘వెల్‌ మిస్టర్‌ నిఖిల్‌.. మంచి సమాచారమే చెప్పావు..’’ అన్నాడు సీఐ అజయ్‌కుమార్‌.
తర్వాత పోలీసులు మంజులాదేవి ఫామ్‌హౌస్‌ మీద రెయిడ్‌ చేశారు. ఒక గదిలో నిర్బంధించబడ్డాడు సిద్ధార్థ. శ్రావ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని అక్కడ బంధించి చిత్రహింసలు పెడుతోంది మంజులాదేవి.
సిద్ధార్థ మిస్సింగ్‌ కేసు విడిపోయింది. మంజులాదేవి కటకటాలు లెక్కపెడుతోంది పోలీస్‌స్టేషన్‌లో..
-వాణిశ్రీ

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా