కృష్ణవేణమ్మ ప్రేమ ఒడిలో...

7 Aug, 2016 10:47 IST|Sakshi
కృష్ణవేణమ్మ ప్రేమ ఒడిలో...

తుంగభద్ర ఒక నది కాదు. తుంగ, భద్ర విడివిడిగా కొంత దూరం ప్రవహించి ఒకటైపోయాయి. తుంగడు యాదవ బాలుడు. గోవులనూ, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. వయసు ఇరవై వుండవచ్చు. యౌవనం అతనిలో తొణికిసలాడింది. తుంగడు మురళి వాయించేవాడు. గోవులూ, గొర్రెలు, చెట్లు, చేమలూ తలలూపుతూ తన్మయత్వంతో వినేవి.

ఈ ప్రాంతాన్ని ఒక కన్నడరాజు పాలిస్తున్నాడు. అతని కూతురు పేరు భద్ర. అందాల రాశి. భద్ర- తుంగడు మ్రోగించే మురళి విన్నది. గోపాలకృష్ణ వద్దకు రాధ వెళ్లినట్లు, భద్ర... తుంగడి వద్దకు వెళ్లిపోయింది. ఇది కొన్నాళ్లు సాగింది. రాజుకు తెలిసింది. ఇద్దరినీ అడివిలో కదంబవృక్షం క్రింద పట్టుకున్నారు.
 ‘‘మమ్మల్ని యెవ్వరూ విడదీయలేరు’’ అంది భద్ర. తుంగణ్ణి చితక్కొట్టించాడు రాజు. అతని రక్తాన్ని తిలకంగా ధరించింది భద్ర. ఇద్దర్నీ విడదీశారు రాజభటులు.
 భద్ర కరిగినీరై, నదియై ప్రవహించింది.
 తుంగడు కరిగి నీరై, నదియై ప్రవహించాడు.
 అలా విడివిడిగా ప్రవహిస్తూ వెళ్లిపోయారు. రాజు గుండె పగిలి చచ్చాడు.
 మైళ్లు, బీళ్ళు, రాళ్ళు, బోళ్ళు, గుళ్ళు దాటి వెళ్ళి ఒకచోట తుంగ, భద్ర కలుసుకొని తుంగభద్ర అయింది. వారు ప్రేయసీప్రియులు, భార్యాభర్తలు. కనుక ఇక సముద్ర సంగమం సాధ్యపడే విషయం కాదు. అందుకే తల్లిలాంటి కృష్ణవేణమ్మ ఒడిలో చేరిపోయారు.
 - డా. దాశరథి కృష్ణమాచార్య
  ‘యాత్రాస్మృతి’ నుంచి...

మరిన్ని వార్తలు