వీడని ముడి

26 Jul, 2015 01:26 IST|Sakshi
వీడని ముడి

 జనవరి, 2015... లాస్ ఏంజిల్స్ (అమెరికా)లోని ఓ బార్. ‘‘ఏమైనా ఈ మందులో ఉండే కిక్కే వేరు డేవిడ్. ఇది ఏ మనిషినీ తనలా ఉండనివ్వదు’’... మరో పెగ్గు లాగించేం దుకు సిద్ధమవుతూ అన్నాడు డెన్నిస్ డావెర్న్. అప్పటికే మత్తు బాగా ఎక్కేసింది. మాటలు ముద్దగా వస్తున్నాయ్.‘‘ఇక చాల్లే డెన్నిస్. ఇప్పటికే ఎక్కు వైంది. పద పోదాం’’ అన్నాడు డేవిడ్. ‘‘నిజం చెప్తున్నాను డేవిడ్. ఫ్రెండంటే నువ్వే. అన్ని సమయాల్లోనూ నాకు తోడున్నావ్. నా మంచికోసం తపన పడు తుంటావ్. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా అనిపిస్తుంది. నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. నీతో ఎలాంటి రహస్యాన్నైనా పంచుకోవాలనిపిస్తుంది.’’
 
 డేవిడ్ నవ్వాడు. ‘‘నీకూ నాకూ మధ్య ఇంకా రహస్యాలున్నాయంటావా?’’
 నిట్టూర్చాడు డెన్నిస్. ‘‘నువ్వలా అంటే నాకు గిల్టీగా ఉంది. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. నీ దగ్గర ఓ పెద్ద రహస్యాన్ని దాచాను’’... భోరుమన్నాడు డెన్నిస్. తాగిన మైకంలో ఏం మాట్లాడు తున్నాడో తెలియడం లేదు అనుకున్నాడు డేవిడ్. ‘‘సరే పోనియ్. పద వెళ్దాం’’ అంటూ లేచాడు. డెన్నిస్ అతని చేయి పట్టుకున్నాడు. కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. కూర్చున్నాడు డేవిడ్.
 
 ‘‘నేను చెప్పేది నిజమేరా డేవిడ్. నేను నీ దగ్గర ఓ నిజం దాచాను. మన స్నేహానికి ద్రోహం చేశాను. ఇప్పటికైనా నీకు ఆ విషయం చెప్పి నా పాపాన్ని కడిగేసుకుంటాను. నీకు నటాలీ ఉడ్ గుర్తుంది కదా?’’
 డేవిడ్ భృకుటి ముడిపడింది. ఉందన్నట్టు తలూపాడు. ‘‘యాక్సిడెంట్‌లో చనిపోయింది కదా?’’ అన్నాడు.
 ‘‘లేదురా. తనది యాక్సిడెంట్ కాదు. మర్డర్. ఆ విషయం నాకు తెలుసు. కావాలనే దాచిపెట్టాను.’’
 
 ఉలిక్కిపడ్డాడు డేవిడ్. ఏం మాట్లాడు తున్నాడు డెన్నిస్? నటాలీది హత్యా?
 డేవిడ్ హావభావాల్ని గమనించే స్థితిలో లేడు డెన్నిస్. ఆ రోజు ఏం జరి గింది, ఎలా జరిగింది అన్నీ తన మానాన తను చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. పది నిమిషాల తర్వాత ‘‘డెన్నిస్’’ అన్న ఓ గంభీరమైన పిలుపు అతడి మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. ‘‘ఎవరూ’’ అంటూ తల పెకైత్తాడు. ఎదురుగా ఉన్న పోలీసుల్ని చూసి బిత్తరపోయాడు. కంగారుగా స్నేహితుడి వైపు చూశాడు. ‘‘సారీ డెన్నిస్. నువ్వు ద్రోహం చేసింది నాకు కాదు. న్యాయానికి. అందుకే పోలీసుల్ని పిలిచాను’’ అనేసి వడివడిగా వెళ్లిపోయాడు డేవిడ్. పోలీసులు డెన్నిస్‌ని తీసుకుని స్టేషన్‌కి బయలుదేరారు.    ‘‘నేను మీకు నిజం ఎప్పుడో చెప్పాను కద సర్. మళ్లీ కొత్తగా అడుగుతారేంటి? నటాలీది యాక్సిడెంట్.. అంతే.’’
 
 ఇన్‌స్పెక్టర్ నవ్వాడు. ‘‘తాగినోడు నిజమే చెప్తాడన్న విషయాన్ని నేను కూడా నమ్ముతాను మిస్టర్ డెన్నిస్. కాబట్టి మత్తు దిగాక ఇప్పుడు నువ్వు చెప్తున్నదానికంటే, ఇందాక మత్తులో నువ్వు మాట్లాడినదాన్నే నేను పట్టించుకుంటాను. నిజం చెప్పు.’’పరిస్థితి అర్థమైంది డెన్నిస్‌కి. బార్‌లో తాను మాట్లాడినదంతా పోలీసులు విన్నారన్న విషయం స్పష్టమైంది. ఇక నిజాన్ని దాచడంలో అర్థం లేదు. అందుకే నోరు విప్పాడు. నిజం చెప్పాడు. అతను చెప్పింది విని అవాక్కయ్యారు పోలీసులు. ముప్ఫై మూడేళ్లుగా అల్మరాలో పడివున్న హాలీవుడ్ నటి నటాలీ ఉడ్ కేస్ ఫైలును మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్నారు. తలుపు తెరవగానే గుమ్మంలో కనబడిన పోలీసుల్ని చూసి ఖంగు తిన్నాడు రాబర్ట్ వాగ్నర్. ‘‘ఏం జరిగింది?’’... నింపాదిగా అందామన్నా అతడి గొంతు వణికింది.
 
 ‘‘నటాలీ కేసును మళ్లీ ఓపెన్ చేస్తున్నాం. మీ సహకారం కావాలి.’’
 ఇన్‌స్పెక్టర్ మాట వింటూనే ముఖం తిప్పుకున్నాడు రాబర్ట్. ‘‘సారీ. అదంతా జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ గాయాన్ని రేపకండి. దయచేసి వెళ్లిపోండి’’ అనేసి దబ్బున తలుపు మూసేసిన రాబర్ట్ మీద ఒక్క క్షణంలో వంద రకాల సందేహాలు తలెత్తాయి ఇన్‌స్పెక్టర్‌కి. నిజానికి ఆ సందేహాలు ముప్ఫై మూడేళ్ల క్రితమే పోలీసుల్లో తలెత్తి ఉంటే నటాలీకి న్యాయం ఎప్పుడో జరిగివుండేది. నటాలీ ఉడ్... హాలీవుడ్ చరిత్రలో ఆమెదొక అందమైన పేజీ. మహా అందగత్తె నటాలీ. బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించింది. టీనేజ్‌లో అడుగుపెట్టాక టీవీ సీరియళ్లలో రాణించింది. హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు సంపాదించింది.
 
 చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి హీరోయిన్‌గా ఎదిగింది. విజయాల బాటలో సాగిపోయింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సైతం అందుకుంది. చిన్న వయసులోనే స్టార్‌గా వెలిగింది. అందం... పేరు... డబ్బు... పలుకు బడి... అన్నీ ఉన్న అమ్మాయికి ఓ అబ్బాయి మనసులో చోటు దొరకడం ఎంతసేపు! అందుకే ఆమె రాబర్ట్ వాగ్నర్ మనసులో తేలిగ్గానే స్థానం సంపాదించింది. అతడు హీరో. ఆమె నటి కాక ముందు నుంచీ అతడి ఫ్యాన్. తన పద్దెనిమిదో పుట్టినరోజున అతణ్ని వెతుక్కుంటూ షూటింగ్ స్పాట్‌కి వెళ్లింది నటాలీ. తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన రాబర్ట్‌తో తన మనసులోని మాట చెప్పింది. అతడి ఇష్టాన్ని గెల్చుకుంది. సంవత్సరం తిరిగేసరికల్లా అతడి భార్య స్థానంలోకి వెళ్లింది. కానీ నాలుగేళ్లలోనే వారి బంధం బీటలు వారింది. విడాకులకు దారి తీసింది.
 
 అయితే ఆ యెడబాటు వారిద్దరినీ మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. నటాలీ జీవితంలోకి గ్రెగ్‌సన్ అనే వ్యక్తి రెండో భర్తగా వచ్చినా, మొదటి భర్త జ్ఞాపకాలు ఆమెను వెంటాడాయి. దాంతో రెండో పెళ్లి కొన్ని నెలల్లోనే విఫలమయ్యింది. అటు రాబర్ట్ కూడా నటాలీ కోసం పరితపిం చాడు. దాంతో ఇద్దరూ మళ్లీ పెళ్లాడారు. పాత కాపురాన్ని కొత్తగా మొదలుపెట్టారు. ఓ ఆడపిల్లకి తల్లిదండ్రులయ్యారు. ఉత్తమ జంటగా అందరి ప్రశంసలనూ పొందారు. కానీ ఆ ఆనందమంతా మరో తొమ్మిదేళ్లలో ఆవిరవనుందనీ, నటాలీ జీవితంలో ఓ పెద్ద తుఫాను రేగబోతోందనీ ఎవ్వరూ ఊహించలేదు.
     
 నవంబర్ 28, 1981. సమయం రాత్రి రెండు కావస్తోంది. లాస్ ఏంజిల్స్ పోలీసులకు ఓ షాకింగ్ వార్త అందింది... శాంటా క్యాటలీనా ఐల్యాండ్‌కి పిక్నిక్‌కి వెళ్లిన నటాలీ ఉడ్... బోటు షికారు చేస్తూ నీళ్లలో పడిపోయిందని, తన జాడ తెలియడం లేదని. పోలీసులు అప్రమత్త మయ్యారు. రెస్క్యూ టీములతో ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు. కానీ ఆ రాత్రంతా ఆమె జాడ తెలియలేదు. ఉదయం ఎనిమిది కావస్తుండగా నటాలీ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆమె మరణవార్త అభిమానులందరినీ కన్నీటి సంద్రంలో ముంచేసింది.
 
 అసలు నటాలీ ఎలా మరణించింది అన్న సందేహం ఎందరి మెదళ్లనో తొలిచేసింది. పోలీసులు కూడా రకరకాలుగా విచారించారు. భర్త రాబర్ట్ వాగ్నర్, తన తాజా చిత్రం ‘బ్రెయిన్ స్టార్మ్’లో సహ నటుడు అయిన క్రిస్టఫర్ వాకెన్‌తో కలిసి వీకెండ్ పిక్నిక్‌కి వెళ్లింది నటాలీ. వాళ్ల ముగ్గురితో పాటు బోటులో కెప్టెన్ డెన్నిస్ డావెర్న్ మాత్రమే ఉన్నాడు. ఆ ముగ్గురూ ఒకటే మాట చెప్పారు... అర్ధరాత్రి వరకూ నటాలీ అందరితో సంతోషంగానే గడిపిందని, పడుకోడానికి గదిలోకి వెళ్లిన ఆమె ఎప్పుడు బయటకు వచ్చిందో, ఎప్పుడు నీళ్లలోకి జారిపడిందో తెలియదని. అది నిజం కాదనడానికి పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలూ లభించలేదు. దాంతో నటాలీది యాక్సి డెంటల్ డెత్ అని నిర్ధారించి కేసు క్లోజ్ చేశారు. కానీ ముప్ఫై మూడేళ్ల తర్వాత డెన్నిస్ నోరు విప్పి కొత్త కథనాన్ని విని పించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
 
  ఇంతకీ డెన్నిస్ చెప్పిన నిజం ఏమిటి?
 ఆ రోజు రాత్రి పదకొండు గంటల వరకు భర్త, స్నేహితుడితో కలిసి మందు తాగుతూ ఎంజాయ్ చేసింది నటాలీ. తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకుంది. కాసేపటి తర్వాత మెలకువ వచ్చిందామెకి. భర్త అప్పటికీ వచ్చి పడుకోకపోవడంతో అతణ్ని వెతుక్కుంటూ బోటంతా కలియ దిరిగింది. చివరికి క్రిస్టఫర్ గదిలో, ఒక ఊహించని స్థితిలో భర్తని చూసి షాకైంది. క్రిస్టఫర్‌తో రాబర్ట్ ఉండకూడని భంగిమలో ఉన్నాడు. చేయకూడని పనులు చేస్తున్నాడు. వాళ్లిద్దర్నీ అలా చూసి తట్టుకోలేకపోయింది నటాలీ. భర్తని బయటకు లాక్కొచ్చింది. ఇద్దరూ కాసేపు గొడవ పడ్డారు. పావుగంట తర్వాత ఆ గొడవ ఆగిపోయింది.
 
 
 ‘‘ఇద్దరూ వెళ్లి పడుకుని ఉంటారని అనుకున్నాను సర్. కానీ కాసేపటి తర్వాత రాబర్ట్ నా దగ్గరికొచ్చాడు. నటాలీ నీటిలో పడిపోయిందన్నాడు. నేను కంగారు పడ్డాను. కానీ ఆయన మాత్రం నిమ్మళంగా ఉన్నాడు. ఆమెను వెతికే ప్రయత్నం చేయలేదు. చాలాసేపటి వరకూ పోలీసులకూ కబురు పెట్టలేదు. దాదాపు నలభై నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు. పెద్దవాళ్ల గొడవల్లో ఇరుక్కోకూడదని నేనారోజు నిజం చెప్పలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు డెన్నిస్.
 
 దాన్నిబట్టి నటాలీని ఆమె భర్తే నీటిలోకి తోసి ఉంటాడంటున్నారు పోలీ సులు. ఆ విషయాన్ని  నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వయసు మీదపడిన రాబర్ట్ విచారణకు సహకరించ ట్లేదు. అయినా అతడిని నేరస్తుడిగా నిరూ పించే ఆధారాల కోసం వేట సాగుతూనే ఉంది. ఆ వేట ఎప్పుటికైనా ముగు స్తుందా? నిజం గెలుస్తుందా? ముప్ఫై మూడేళ్ల తర్వాతైనా నటాలీకి న్యాయం జరుగుతుందా? ఏమో... దేవుడికెరుక!
 
 నటాలీకి నీళ్లంటే చాలా భయం. సినిమాల్లో స్విమ్మింగ్ సన్నివేశాలుంటే కంగారుపడేది. ధైర్యం చెప్పి ఆమెతో ఆ సన్నివేశాలు చేయించు కునేవారు దర్శకులు. ఆ బలహీనతనే రాబర్ట్ వాడుకున్నాడని కొందరు అంటుంటారు. అసలామెని వదిలించుకోవడానికే అలాంటి పిక్నిక్ ప్లాన్ చేశాడని మరికొందరంటారు.
 - సమీర నేలపూడి
 

మరిన్ని వార్తలు