తిరుమలలో భక్తులు ఆచరించాల్సినవి

28 Sep, 2014 01:23 IST|Sakshi
తిరుమలలో భక్తులు ఆచరించాల్సినవి

 తిరుమలకు బయలు దేరేముందు ఇష్టదేవతలను పూజించుకోవాలి. శ్రీ వారిని దర్శించేముందు పుష్కరిణిలో స్నానంచేసి, ముందుగా వరాహస్వామిని పూజించాలి. ఆ తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించాలి.
     ఆలయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ ‘ఓం శ్రీవేంకటేశాయ నమః’ అని స్మరిస్తూ ఉండాలి.
     స్వామిపైనే ధ్యాసను ఉంచాలి.
     తిరుమల సమీపంలో ఉన్న ఆకాశగంగ, పాపవినాశనం తీర్ధాలలో స్నానం చేస్తే, సకల పాపాలు హరిస్తాయి.
     తిరుమలలో ఉన్నప్పుడు సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించాలి.
     తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలి
     కానుకలు, ముడుపులను ఆలయంలోని స్వామి హుండీలోనే సమర్పించాలి.
 
 తిరుమలలో భక్తులు చేయకూడనివి
     ఆలయం చుట్టూ నాలుగు మాడవీధుల్లో పాదరక్షలు ధరించరాదు. ఈ వీధుల్లోనే ఉత్సవమూర్తులు నిత్యం ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తుంటారు.
     విలువైన ఆభరణాలు, ఎక్కువ నగదు మీ వద్ద ఉంచుకోకూడదు.
     శ్రీవారి దర్శనం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకూడదు.
     స్వామి దర్శనం కోసం త్వరపడకుండా మీవంతు వచ్చేవరకు ఆగాలి.
     ఆలయార్హత లేని సందర్భాల్లో ఆలయంలోకి రాకూడదు.
     స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో పువ్వులు అలంకరించు కోరాదు. తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే.
     కాటేజీల్లో నీరు, విద్యుత్ వృథా చేయకూడదు.
     అపరిచితులను వసతి గృహాల్లోకి అనుమతించరాదు. వారిని నమ్మి, గది తాళాలను ఇవ్వకూడదు.
     పర్యావరణానికి హానిచేసే ఇతర ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు.
     తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మొదలైనవి పూర్తిగా నిషేధం. పేకాట, జూదం వగైరాలు పూర్తిగా నిషేధం.
     శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించరాదు. వారిని ప్రోత్సహించరాదు.
     దళారులనుంచి నకిలీ ప్రసాదాలను కొనుగోలు చేయరాదు.
     ఆలయప్రాంగణంలో ఉమ్మివేయరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.
     తిరుమలలో అన్యమతప్రచారం నిషేధం.
     వివిధ రాజకీయసభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్‌లు మొదలైనవి నిషేధం.
     ఆలయంలోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు వంటి పరికరాలు తీసుకువెళ్లరాదు.
     ఆయుధాలు తీసుకురాకూడదు.
     జంతు వధ నిషేధం.
     భిక్షుకులను ప్రోత్సహించరాదు.
 శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలన్న నిబంధనను టి.టి.డి. కచ్చితంగా అమలు చేస్తోంది.
     పురుషులు ధోవతి-ఉత్తరీయం, కుర్త-పైజామా... మహిళలు చీర-రవిక, లంగా-ఓణి, చున్నీతో పాటు పంజాబీ డ్రస్, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది.
     స్వచ్ఛంద సేవ ‘శ్రీవారి సేవ’లో పాల్గొనదలచిన వాలంటీర్లు కూడా డ్రెస్‌కోడ్‌ను విధిగా పాటించాలి. తొక్కిస లాటలకు, తోపులాటలు తావులేకుండా ఆలయ అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు సహకరిస్తే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తుంది. తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దర్శనానుగ్రహాలు పరిపూర్ణంగా లభించాలని కోరుకుందాం.
 
 తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక కథనాలు, అరుదైన పాత ఫొటోల సేకరణ
 సహదేవ కేతారి సాక్షి, తిరుమల
 ఫొటోలు: కె.మోహన్‌కృష్ణ, సాక్షి, తిరుమల
  కొన్ని ఫొటోలు, సమాచార సౌజన్యం:
  టీటీడీ ప్రజా సంబంధాల విభాగం

మరిన్ని వార్తలు