వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు!

26 Jul, 2015 01:48 IST|Sakshi
వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు!

రాశిచక్రంలో ధనుస్సు తొమ్మిదో రాశి. ఇది బేసి రాశి. అగ్నితత్వం, ఉష్ణస్వభావం, క్షత్రియ జాతి, క్రూర రాశి, రంగు పసుపు. శరీరంలో ఇది పిరుదులు, సయాటిక్ నరాన్ని, కాలేయాన్ని సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, పురుష రాశి, దీని దిశ తూర్పు. ఇందులో మూల, పూర్వాషాఢ నక్షత్రాలు పూర్తిగా, ఉత్తరాషాఢ మొదటి పాదం ఉంటాయి. ఈ రాశి అధిపతి గురువు. బంగారం, శనగలు, పుష్యరాగాలు, పసుపు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి జపాన్, ఇండోనేసియా, మలేసియా తదితర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.
 
 ధనుర్రాశిలో పుట్టినవారు నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంధించి విడిచిన బాణంలా దూసుకుపోతుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం, దూకుడు, ప్రథమ కోపం ఉన్నప్పటికీ, వీరు చక్కని హాస్యప్రియులు, ఉదారులు. నలుగురూ పోగైనప్పుడు ఎక్కువగా మాట్లాడతారు. వాగుడుకాయల్లా కనిపించినా, ఎదుటివారి మాటలనూ శ్రద్ధగా ఆలకిస్తారు. సత్యానికి కట్టుబడతారు. అబద్ధాలకోరులను తీవ్రంగా ద్వేషిస్తారు. స్నేహపాత్రులైన వీరికి సహజంగానే ఎక్కువమంది స్నేహితులు ఉంటారు. వీరికి జిజ్ఞాస మెండు. సజ్జన సాంగత్యంలో జ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రయాణాలను అమితంగా ఇష్టపడతారు. స్వేచ్ఛాప్రియులు. తమ స్వేచ్ఛకు భంగం కలిగే పరిస్థితులలో ఏమాత్రం ఇమడలేరు. ఎంతటి వారైనా తమ స్వేచ్ఛను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే, సహనాన్ని కోల్పోతారు. వీరికి ఎంతటి విషయ పరిజ్ఞానం ఉన్నా,
 
 లౌకిక నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి. వ్యూహ చాతుర్యాన్ని అనుసరించాల్సిన సందర్భాల్లో సైతం అమాయకత్వంతో ముక్కుసూటిగా వ్యహరించి ఎదురుదెబ్బలు తింటారు. సృజనాత్మకతకు ఆస్కారం ఉండే సంగీత, సాహిత్య, కళా రంగాలలో వీరు చక్కగా రాణిస్తారు. వైద్య, న్యాయవాద, ఇంజినీరింగ్, అధ్యాపక వృత్తులు వీరికి అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ, పరిపాలనా, సైనిక, పోలీసు, రవాణా, ఆతిథ్య సంబంధిత ఉద్యోగాల్లో వీరు తమదైన ముద్ర వేయగలరు. సొంత వ్యాపారాలనూ విజయవంతంగా నిర్వహించగలరు. రాజనీతిజ్ఞులుగా ప్రజాజీవితంలో రాణించగలరు. గ్రహగతులు ప్రతికూలిస్తే... లివర్ జబ్బులు, కీళ్లనొప్పులతో బాధపడతారు. మితిమీరిన ఆశావాదం వల్ల చిక్కుల్లో పడతారు. ఇతరుల చేతిలో తేలికగా మోసాలకు గురవుతారు.
 

మరిన్ని వార్తలు