విహంగాలపై వింత నమ్మకాలు

12 Jan, 2014 01:21 IST|Sakshi
విహంగాలపై వింత నమ్మకాలు

 నమ్మకం
 
 పక్షిని స్వేచ్ఛకు చిహ్నమంటారు. ఉదయాన్నే లేచి ఆహారం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించే వాటిని... క్రమశిక్షణకు మారుపేరుగా కూడా చెబుతారు. అయితే పక్షి అదృష్టానికి సంకేతం, దురదృష్టానికి ప్రతీక అని ఎవరైనా అంటారా? అనేవాళ్లు ఉన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పక్షుల విషయంలో కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. అవి అంధ విశ్వాసాలా అంటే అవునని అనలేం. అయితే వాస్తవమేనా అంటే... కాదనీ చెప్పలేం. ఎవరి నమ్మకాలు వారివి అని ఊరుకోవాలి అంతే!
 
 
 కొంగ: ఇది స్వచ్ఛతకు, ప్రశాంతతకు చిహ్నమట. అందుకే ఉదయం లేచిన తరువాత కొంగను చూస్తే... ఆ రోజంతా ప్రశాంతంగా గడుస్తుందని, అదే సంవత్సరం తొలి రోజున చూస్తే మరుసటి యేడు వచ్చేవరకూ అంతా సంతోషంగా గడిచిపోతుందని పలు దేశాల్లో నమ్ముతారు. అంతేకాదు... ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటారు.
 
 కాకి: ఇది వచ్చి వాలితే మంచి జరుగుతుందని కొందరు, చెడు జరుగుతుందని కొందరు నమ్ముతారు. కాకి సందేశాల్ని మోసుకొస్తుందని, అది అరిస్తే బంధువులు కానీ శుభవార్త కానీ వస్తుందని చాలామంది అంటారు. కొందరేమో... కాకి నల్లగా ఉంటుంది కాబట్టి, నలుపు పాపానికి, విషాదానికి ప్రతీక కాబట్టి చెడు జరుగుతుందని అంటారు.
 
 పావురం: ప్రతి చోటా ఒకే రకంగా నమ్మేది పావురం ఒక్కదాన్నే. దాదాపు ప్రపంచమంతటా దాన్ని శాంతి చిహ్నంగానే భావిస్తున్నారు. పరిశుద్ధతకు ప్రతీక అంటున్నారు.
 
 గద్ద: రాజసానికి, ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకి, శక్తికి గద్దను ప్రతీకగా భావిస్తున్నారు కొన్ని ఐరోపా దేశాల్లో. ఉదయాన్నే గద్దను చూస్తే... ఆ రోజంతా విజయమే లభిస్తుందని నమ్మేవాళ్లకు కొదవ లేదు. ఇలాంటిదే అయిన రాబందును మాత్రం మృత్యువుకి, దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. రాబందు కనిపిస్తే ఎవరికో మూడిందని ఫిక్సైపోతారు.
 
 బాతు: ఇది బలహీనతకు చిహ్నమని కొందరు అంటే... కొన్నిచోట్ల దీన్ని సింప్లిసిటీకి చిహ్నంగా భావిస్తున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. బాతు చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల పొద్దున్నే లేచి దాని ముఖం చూస్తే శక్తి అంతా ఆవిరైపోతుందని అంటూంటారు కొన్ని ఆఫ్రికన్ ప్రాంతాల్లో. అయితే బాతు జీవనం చాలా సింపుల్‌గా ఉంటుందని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని, అందుకే దాన్ని చూస్తే శుభమని ఆస్ట్రియా, ప్యారిస్, ఇండోనేసియా తదితర ప్రాంతాల్లో నమ్ముతారు.
 
 గుడ్లగూబ: దీన్ని దుష్టపక్షిగా భావించేవారు చాలామంది ఉన్నారు. రాత్రిళ్లు సంచరించే పక్షి కావడంతో దుష్టశక్తులను వెంటబెట్టుకొస్తుందని, దురదృష్టాన్ని మోసుకొస్తుందని చాలామంది నిందిస్తూ ఉంటారు దీన్ని. అయితే ఆఫ్రికా, ఐరోపా దేశాల్లోని కొన్ని ప్రాంతాల వారు దీన్ని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. చీకట్లో సైతం సంచరిస్తుంది కాబట్టి ధైర్యానికి చిహ్నమని కూడా అంటారు.
 
 పిచ్చుక: దీన్ని ఉత్సాహానికి, తెలివితేటలకు చిహ్నంగా భావిస్తారు. చిన్నదే అయినా చాలా డిసిప్లిన్డ్‌గా ఉంటుందని, పెద్ద పెద్ద గాలివానలను కూడా తట్టుకుంటుందని అంటారు. అందుకే దీన్ని సంవత్సరం తొలి రోజున కనుక చూస్తే... ఇక ఆ సంవత్సరమంతా ఉత్సాహంగా ఉంటారని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడతారని రొమేనియా, ఇటలీ వంటి దేశాల వారు చెబుతుంటారు.
 
 జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ ఆయా పక్షులకున్న ప్రత్యేక లక్షణాలను బట్టి ఏర్పడిన నమ్మకాలని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే స్ఫూర్తిని పొందడానికి, ఉత్సాహంగా ముందుకు వెళ్లడానికి పక్షులనే కాదు... వేటిని అనుసరించినా నష్టం లేదు. అయితే... వాటిలో ఏవో కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని మనకు అన్వయించుకుని చెడు జరుగుతుందని, దురదృష్టం చుట్టుకుంటుందని భయపడటమే అంత మంచిది కాదు. కానీ ఒక్కసారి నమ్మకం ఏర్పడితే దాన్ని మనసులోంచి తీయడం చాలా కష్టం. కాకపోతే ఆ నమ్మకం భయాన్ని సృష్టించేది అయితే... దాన్ని ఎలాగైనా వదులుకోవడమే మంచిది!

మరిన్ని వార్తలు