గజిని

14 Jun, 2015 00:54 IST|Sakshi
గజిని

  ఆ సీన్ - ఈ సీన్
 కాపీ కొట్టడం అంటే సొంతంగా ఆలోచించలేని వాళ్లు, చేతగాని వ్యక్తులు చేసే పని అనుకొంటుంటాం. అయితే కాపీ కొట్టడంలో కూడా కొందరు తామెంత సమర్థులమో రుజువు చేసుకొంటూ ఉంటారు. ఒకటికాదు... అనేక సినిమాలను కాపీలు కొట్టి వీరు స్టిచ్ చేసే కొత్త సినిమాను చూసిన ఎవ్వరైనా అబ్బురపడాల్సిందే. అయితే ‘ఏం తీశాడురా...’ అనకూడదు. ‘ఏం కాపీ కొట్టాడురా...’ అని ప్రశంసించాలి. ఇలాంటి ప్రశంసకు అర్హులైన వారిలో తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ ఒకరు.
 
 
 సూర్య హీరోగా, అసిన్, నయనతారలు హీరోయిన్లుగా వచ్చిన తమిళ సినిమా ‘గజిని’ డబ్బింగ్ వెర్షన్‌ను చూసి తెలుగువారు ముగ్ధులయ్యారు. ‘అప్పటికప్పుడు అన్ని విషయాలను మరచిపోయే లక్షణాలున్న  ‘ఆంటెరోగ్రేడ్ అమ్నేసియా’ అనే అరుదైన జబ్బుతో బాధపడే హీరో తన ప్రియురాలిని కిరాతకంగా చంపేసిన వారిపై ప్రతీకారం తీర్చుకొనే వైనమే ఈ సినిమా. వ్యాధి కారణంగా ఎవరు ఏమిటో... ఎవరెలాంటివారో గుర్తుంచుకొనే శక్తి లేని ఆ హీరో జరిగిన సంఘటనలను తన ఒంటిపై పచ్చబొట్టుగా పొడిపించుకుంటూ ఉంటాడు.’ నిజంగా చాలా వైవిధ్యమైన కథ. భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ రానటువంటి వైవిధ్యమైన సినిమా - అని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకొన్న సినిమా గజిని.
 
 నిజమే ఇలాంటి సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. కానీ అచ్చం ఇలాంటి సినిమా విదేశీ తెరలపై ఆడి ంది. దాని పేరు ‘మెమెంటో’. భారతీయ భాషల్లో ‘గజిని’ పేరుతో తమిళంలో రూపొంది, తెలుగులోకి డబ్ అయి, హిందీలోకి రీమేక్ అయి సూపర్‌హిట్ అయింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘మెమెంటో’ సినిమా 2000 లో విడుదలయింది. మరో ఐదేళ్ల తర్వాత దాని స్ఫూర్తితో మురగదాస్ గజిని తీశాడు.

 ‘లియొనార్డో షెల్బీ ప్రముఖ వ్యాపారవేత్త. కొంతమంది దుండగులు అతడి భార్యను అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఆ సమయంలో వారితో తలపడ్డ హీరోని తీవ్రంగా కొడతారు. ఇతడి మెదడుకు గాయమై ‘ఆంటెరోగ్రేడ్ అమ్నేసియా’ బారిన పడతాడు. దీని వల్ల జ్ఞాపకశక్తి సమస్య ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల మధ్య కూడా జరిగిన ఘాతుకాన్ని ఆయన మరచిపోలేడు. ‘షీ వాజ్ రేప్డ్ అండ్ మర్డర్డ్’ అంటూ ఛాతీమీద పచ్చబొట్టు పొడిపించుకొని ఆ ఘాతుకానికి ఒడిగట్టిన వారిపై ప్రతీకారంతో రగిలిపోతాడు’. చివరకు వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు- అదీ ‘మెమెంటో’ కథ.
 
 భార్య స్థానంలో ప్రియురాలు!
 నోలన్ రూపొందించిన ‘మెమెంటో’ సినిమాకు మురగదాస్ తీసిన ‘గజిని’కి తేడా ఏమిటంటే... హాలీవుడ్ సినిమాలో హీరో భార్యను చంపుతారు, మన వెర్షన్‌లో హీరోయిన్ అసిన్ హీరో సూర్యకు ప్రియురాలు మాత్రమే! హీరో మెమొరీకి సంబంధించి ఎదుర్కొనే జబ్బు కామన్. మనుషులను గుర్తుంచుకోవడానికి వారి ఫొటోలు తీసుకొని వాటి వెనుక వారి గురించి రాసుకోవడమూ కామన్, ఒంటిపై పచ్చబొట్టులు కూడా కామనే!
 
 ప్రేమకు మూలం మరో సినిమా!
 మూలకథను ‘మెమెంటో’ నుంచి తెచ్చుకొన్న దర్శకుడు సూర్య, అసిన్‌ల మధ్య నడిచే ప్రేమకు మూలం మరో సినిమా. ఓ అనామక అమ్మాయి పేరున్న వ్యాపారవేత్తను తన ప్రియుడని ప్రకటించుకోవడం, అతడిని ఒక్కసారి కూడా చూడకనే తామిద్దరం లవ్‌లో ఉన్నామని చెప్పుకొంటూ తన చుట్టూ ఉన్న వాళ్లని ఫూల్స్‌గా చేయడం, ఆ వ్యవహారం సదరు వ్యాపారవేత్తవరకూ వెళ్లడం... దీనిపై ఎంతో కోపంతో ఆమెను వెదుక్కొంటూ వచ్చిన ఆ బిజినెస్‌మ్యాన్ ఆ ఫస్ట్‌మీట్‌లోనే ఆమె ప్రేమలో పడిపోవడం. ఈ కథ బ్రిటిష్ సినిమా ‘హ్యాపీ గో లవ్లీ’ సినిమాది. ఒక పాత తెలుగు సినిమాలో కూడా ఇదే కథను యథాతథంగా వాడుకొన్నారు. మురుగ మరోసారి వాడారు... అంతే! ఇలా ఒక సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాను, ఒక రొమాంటిక్ కామెడీని సగం సగంగా కత్తిరించుకొని కొత్త కథగా స్టిచ్ చేసుకొని మూడు భాషల ఇండస్ట్రీలో సూపర్‌హిట్‌ను నమోదు చేసిన ఘనత దర్శకుడు మురగదాస్‌ది.
 
 అసలు కథ ‘మెమెంటో’ది అయితే, ఉపకథ ‘హ్యపీ గో లవ్లీ’ ది. అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్లను కూడా వివిధ సినిమాల నుంచి కాపీ కొట్టారు. అందులో ప్రముఖంగా చెప్పుకోదగినది ఒక అంధ వ్యక్తిని అసిన్ రోడ్డుపై తీసుకెళ్లే సీన్. గజిని సినిమా అభిమానులను బాగా ఇంప్రెస్ చేసిన సీన్ ఇది. ‘ఎమిలీ’ అనే ఒక ఫ్రెంచ్ సినిమాలోని  సీన్‌ను గజినిలో దించేశారు!
 
 - బి.జీవన్‌రెడ్డి

>
మరిన్ని వార్తలు