తొలియత్నం: ప్రతి క్షణం... సంతోషమే!

3 Aug, 2013 21:29 IST|Sakshi
తొలియత్నం: ప్రతి క్షణం... సంతోషమే!

ఇరవై ఒకటో శతాబ్దపు ముఖచిత్రం మీద ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ నెమ్మదిగా మసకబారుతున్న సమయంలో... ఉమ్మడి కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమలు, అనుబంధాల సమ్మేళనంగా వచ్చింది... సంతోషం. ఇది ఒక ఫీల్ గుడ్ ఫిలిం.మొదటి సినిమా తనకు మిగిల్చిన సంతోషం గురించి దర్శకుడు దశరథ్ పంచుకుంటున్న అనుభవాలు...  
 
 నాగార్జున గారికి కథ వినిపించాను. సెకండాఫ్ కొంచెం బల్‌గా వుంది బట్ ఓవరాల్‌గా చాలా బాగుందన్నారు. తరువాత నారాయణగారు ఫోన్ చేసి నాగార్జునగారు నిన్నే డెరైక్ట్ చేయమన్నారు, ఆగస్టు నుంచి షూటింగ్ అని చెప్పేశారు. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు.
 
 దర్శకుడు తేజ దగ్గర రైటర్ కమ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు ఎస్.గోపాల్‌రెడ్డి, కె.ఎల్.నారాయణగార్లతో పరిచయం ఏర్పడింది.  వాళ్లు ఓసారి ‘మా దగ్గర నాగార్జున డేట్స్ ఉన్నాయి, నీ దగ్గర ఏదైనా కథ ఉందా’ అన్నారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఇన్‌స్పిరేషన్‌తో అల్లుకున్న ఒక లైన్ వినిపించాను. వాళ్లకు నచ్చింది. నిజానికి మొదట ఈ కథ ఎవరికైనా అమ్మేద్దామనుకున్నాను. కానీ వాళ్లిద్దరూ నాగార్జునకు వినిపిద్దాం అనేసరికి ఆగిపోయాను. నా దగ్గర ఇరవై నిమిషాల కథే ఉంది. అందుకే వారం రోజుల టైమ్ తీసుకుని మిగతా కథ డెవెలప్ చేసేశాను. అంతలో నారాయణగారు సడెన్‌గా ఫోన్‌చేసి నాగార్జునకు కథ వినిపించాలి రమ్మన్నారు.
 
 ఓవైపు ‘నువ్వు-నేను’ సినిమాలో ‘గాజువాక పిల్లా’ పాట షూట్ జరుగుతోంది. వెళ్లలేని పరిస్థితి. అయినా ఎలాగోలా వెళ్లి నాగార్జున గారికి కథ వినిపించాను. సెకెండాఫ్ కొంచెం డల్‌గా వుంది, కానీ మొత్తంగా కథ బాగుందన్నారు. తరువాత నారాయణగారు ఫోన్ చేసి నాగార్జున నిన్నే డెరైక్ట్ చేయమన్నారు, ఆగస్టు నుంచి షూటింగ్ అన్నారు. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. ఆగస్టు అంటే ఇక రెండే రెండు నెలలుంది. ఇంత తక్కువ టైమా అనుకున్నాను. నా వల్ల కాదని చెప్పాను. ‘మరి ఎవరిని చేయమందాం’ అన్నారు. విజయభాస్కర్, ఫాజిల్... ఇద్దరిలో ఎవరైనా అయితే ఈ కథను బాగా హ్యాండిల్ చేయగలరన్నాను. కానీ విజయభాస్కర్ అప్పటికే అన్నపూర్ణ సంస్థకు ఒక సినిమా కమిట్ అవడంతో ఫాజిల్‌ని ఓకే అనుకున్నాం. నారాయణగారు నాగార్జునకు ఫోన్‌చేసి మరుసటిరోజు కథ వినడానికి ఫాజిల్ వస్తున్నారని చెప్పారు. ‘దశరథ్ ప్రాబ్లమ్ ఏంటి’ అనడిగారాయన. ఇంత తక్కువ వ్యవధిలో సినిమా చేయడమే తన సమస్య అని చెప్పారు. నాగార్జున వెంటనే, ‘ఏం ఫర్వాలేదు... తను అన్నట్టుగానే ఆరు నెలల తరువాత సినిమా చేద్దాం, ఈ మధ్యలో ఏ సినిమా చేయను’ అని చెప్పారు.
 
 స్క్రిప్ట్ దశలోనే ప్రతి సీన్ బెస్ట్‌గా రూపుదిద్దుకోవాలనేది నా తాపత్రయం. ఆ దశలో నా మిత్రులు అందించిన రచనా సహకారం చాలా విలువైంది. త్రివిక్రమ్, ఆర్.పి.పట్నాయక్, చంద్రసిద్ధార్ధ, గోపీమోహన్, సునీల్... మేమంతా రోజూ కలిసే బ్యాచ్. నేను, గోపీమోహన్ కలిసి ఆరు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. తను ఈ సినిమాతోనే స్క్రీన్‌ప్లే రైటర్‌గా పరిచయమయ్యాడు.‘‘ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి’’ అనే డైలాగ్, క్లయిమాక్స్‌లో డైలాగ్స్ త్రివిక్రమ్ రాశాడు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ట్రాక్ కూడా తనే రాశాడు. నా రూమ్‌మేట్ వీరు.కె స్క్రిప్ట్‌లో కూడా చాలా సహకరించాడు.
 
 ఆర్.పి.పట్నాయక్‌కు ఇది మొదటి పెద్ద సినిమా. దాంతో ప్రతి పాటా ప్రాణం పెట్టి చేశాడు. ‘డిరి డిరి డిరి డిరిడీ వారెవా’ పాటలో మొదటి మూడు నాలుగు సీన్స్ చంద్రసిద్ధార్ధ రాశాడు. గ్రేసీసింగ్ నాగార్జునతో ‘నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు’ అని చెప్పి వెళ్లిపోయేటప్పుడు వచ్చే ‘సో మచ్ టూ సే  దట్ ఐ లవ్ యు’ పాట కూడా చంద్ర సిద్ధార్థే రాశాడు.
 
 ఇక మరో ప్రధాన అంశం... పాత్రల ఎంపిక. హీరో ఎలాగూ రెడీ కాబట్టి పద్మావతి, భాను పాత్రలకు సరిపడా హీరోయిన్ల కోసం అన్వేషణ మొదలుపెట్టాం. ఒకరోజు టీవీలో ‘లగాన్’ చిత్రంలోని ‘రాధా కైసే నా జలే’ పాట  వస్తోంది (అప్పటికింకా ‘లగాన్’ రిలీజ్ కాలేదు). గ్రేసీ సింగ్ మైండ్‌లో ఫిక్సయ్యింది. పద్దూ క్యారెక్టర్‌కి తనే కరెక్టని ఫీలయ్యాను. ‘లగాన్’ విడుదలై హిట్ అయిన తరువాత, వెళ్లి తనను కలిసి కథ చెప్పాను. నచ్చి ఓకే అంది. కేవలం 45 నిమిషాల క్యారెక్టర్ అయినా తను గుర్తుండిపోయేలా చేసింది.
 
 ఇక భాను క్యారెక్టర్ కోసం వెతుకులాట మొదలుపెట్టాను. ఒకసారి క్రిష్ణా డిజిటల్స్‌కు  వెళ్లినపుడు శ్రీయ ఫొటోలు చూసాను. కథ ప్రకారం భాను పాత్ర  చాలా టెండర్‌గా ఉండాలి, చీర కట్టినప్పుడు  మెచ్యూర్డ్‌గా ఉండాలి . తన ఫొటోలు చూడగానే నారాయణగారికి ఫోన్ చేశాను. ఫిలింసిటీలో జరుగుతోన్న ‘ఇష్టం’ సాంగ్ షూట్‌కు వెళ్లి శ్రీయను కలవమని చెప్పాను. ఆయన వెళ్లి చూసి, ఓకే అన్నారు. నాగార్జున, అక్షయ్ (నాగ్ కొడుకుగా నటించిన బాబు), శ్రీయ ముగ్గురితో ఫొటో షూట్ చేశాం. నాగార్జున, శ్రీయ పెయిర్ పర్‌ఫెక్ట్. పెద్దాయన క్యారెక్టర్ విశ్వనాథ్‌గారేనరని ముందునుంచీ అనుకున్నాం.
 
 షూటింగ్ దగ్గరికి వచ్చింది. నా మొదటిరోజు షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోవాలనేది నా కల.
 2001 నవంబర్ 15. ఊటీలో మొదటిరోజు షూటింగ్. నాగార్జున, గ్రేసీసింగ్ కలిసే సీన్. దానికి పొగమంచు కావాలని చెప్పి పొద్దున్నే అన్నీ సెట్ చేసుకున్నాం. కానీ ఎక్స్‌పోజర్ సరిపోవడం లేదని గోపాల్‌రెడ్డి లొకేషన్ షిఫ్ట్ చేశారు. దాంతో ఆ రోజంతా హడావుడిగా షూటింగ్ జరిగింది. సాయంత్రం ప్యాకప్ చెప్పి వెహికల్‌లో రూమ్‌కు వెళుతున్నప్పుడు డెరైక్టర్‌గా మొదటిరోజు సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశావ్ అంటూ నాకు కంగ్రాట్స్ చెప్పాడు మా కో-డెరైక్టర్ సాయికృష్ణ. డెరైక్టర్‌గా నా మొదటిరోజు పూర్తయిందన్న విషయం అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
 
 ఊటీలో షూటింగ్ అనుభవం మరుపురానిది. కెట్టీ అనే రైల్వేస్టేషన్‌లో షూట్ చేస్తున్నప్పుడు బాలచందర్, మణిరత్నం లాంటి పెద్దపెద్ద డెరైక్టర్స్ చేసిన లొకేషన్స్‌లో నేను కూడా షూట్ చేయడం చాలా గర్వంగా ఫీలయ్యాను. సినిమా మొదటినుంచీ ఒక అందమైన లవ్‌స్టోరీలా ఉండాలని అనుకున్నాను. సన్‌సెట్‌లో నాగార్జున గిటార్ వాయిస్తుండటం ఇలా ఎన్నో ఇమేజెస్ నా మనసులో ఊహించుకున్నాను. ఊటీ షెడ్యూల్‌లో నేననుకున్న ఈ సీన్స్ అన్నీ అందంగా వచ్చాయి. తరువాత షూటింగ్ హైదరాబాద్, న్యూజిలాండ్, రాజమండ్రిలో చేసాం. న్యూజిలాండ్‌లో రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభుదేవా, పృథ్వీ, అందరం కలిసి బస్సులో మూడు గంటల పాటు డ్యాన్స్ చేశాం. అంత చలిలో కూడా మాకు చెమట పట్టేసింది. నేను ఎంతో ఇష్టపడే ప్రభుదేవాకు అంత దగ్గరగా ఉండటం ఒక మరిచిపోలేని అనుభవం!
 
 ఇందులో పాటలు కూడా సందర్భానుసారంగా, కథను ముందుకు తీసుకుపోవడానికి మాత్రమే వాడాం. నాగ్, గ్రేసీసింగ్‌ల పెళ్లి నుంచి, అబ్బాయి పుట్టేదాకా ‘నువ్వంటే నాకిష్టమని’ పాటలో కనిపిస్తుంది. చాలామందికి నచ్చిన ‘దేవుడే దిగివచ్చినా’ పాట విషయంలో ఓ గమ్మత్తు జరిగింది. ‘మంచులో సిరిమల్లెలా, మబ్బులో జాబిల్లిలా, నవ్వించే అమ్మాయి’ అని కులశేఖర్ మొదట రాశారు. కానీ షూటింగుకు వెళ్లాక డ్యాన్స్‌మాస్టర్ రాజుసుందరం ఇంకేమైనా ఆలోచిస్తే బాగుంటుందన్నాడు. దాంతో నేను, పట్నాయక్ కూర్చుని ‘దేవుడే దిగివచ్చినా, స్వర్గమే నాకిచ్చినా, షాజహాన్ తిరిగొచ్చినా, తాజ్‌మహల్ రాసిచ్చినా’ అనే వాక్యాలు రాశాం. పట్నాయక్ వెంటనే చెన్నై వెళ్లి పాట రికార్డ్ చేశాడు.
 సినిమాకు సంబంధించి ప్రతి షాట్‌కూ స్టోరీబోర్డ్ రాసుకున్నాను.
 
  కానీ ఆ పేపర్స్ అందరిముందూ తీస్తే నాకు డెరైక్షన్ రాదనుకుంటారేమోనని భయపడేవాణ్ని. ‘డిరిడిరి’ పాట తీస్తున్నప్పుడు డ్యాన్స్ డెరైక్టర్ ఫరాఖాన్ దగ్గర పాటకు సంబంధించిన స్టోరీబోర్డ్ చూశాను. ఆశ్చర్యపోయి, ఆవిడకు నా సమస్య చెప్పాను. అప్పుడావిడ చెప్పిన విషయం విని మరింత విస్తుపోయాను. తను ‘సఖి’ టైమ్‌లో ఇదే సమస్య ఎదుర్కొన్నారట. కానీ మణిరత్నం దగ్గర స్టోరీ బోర్డ్ చూశాక ధైర్యం తెచ్చుకున్నారట. సినిమా అంతా ట్రెండ్‌కు భిన్నంగా, స్టోరీకి తగ్గట్టుగా వెళ్లామే తప్ప ఏదీ కావాలని పెట్టలేదు. కథాగుణంగా వచ్చిన చిన్న ఫైట్‌ను పీటర్‌హెయిన్స్  చాలా ఆసక్తికరంగా కంపోజ్ చేశాడు. ఇందులో బాగా వర్కపుట్ అయిన బల్బ్ డ్యాన్స్ సీన్ సునీల్ ఐడియా ఐతే, ట్యాప్ డ్యాన్స్ ఐడియా ప్రభుదేవాది. క్లయిమాక్స్‌లో అందరూ కలిసి డ్యాన్స్ చేయడం కూడా బాగా వర్కవుట్ అయ్యింది.
 
 నా మొదటి సినిమాలో నాకు కొన్ని అసంతృప్తులు కూడా వున్నాయి.  పోస్ట్ ప్రొడక్షన్‌కు వెళ్లాక లెంగ్త్ సమస్యతో కొన్ని సీన్స్ ఎడిట్ చేసాం. సినిమాలో గ్రేసీసింగ్ ఎక్కడా నాగార్జునకు ‘ఐ లవ్ యు’ అని చెప్పదు. యాక్సిడెంట్ తరువాత హాస్పిటల్ బెడ్ మీద ఐ లవ్ యు చెప్పి కళ్లు మూయగానే కెమెరా టాప్ యాంగిల్‌లోకి వెళుతుంది. నాకు చాలా ఇష్టమైన ఈ సీన్‌ను కొన్ని కారణాల వల్ల ఫైనల్ కాపీలోంచి తొలగించాం.  కొన్ని కొన్ని రీజన్స్ వల్ల న్యూజిలాండ్‌లో గ్రేసీసింగ్ డెత్‌సీన్‌ను కూడా సరిగ్గా తీయలేకపోయాను. ఇలాంటి చిన్న చిన్న అంశాల్ని మినహాయిస్తే టీమ్‌వర్క్‌తో షూటింగ్ చాలా కూల్‌గా జరిగింది. నా తొలి ప్రయత్నంలో నా వెనకుండి నడిపించిన మా నిర్మాతలు కె.ఎల్.నారాయణ, గోపాల్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు చెప్పి తీరాలి!

మరిన్ని వార్తలు