దీపాంజలి

29 Oct, 2016 23:07 IST|Sakshi
దీపాంజలి

చీకటిని తరిమేసే వెలుగుల పండుగ దీపావళి.
 ఇది అమావాస్య రోజున వచ్చే వెన్నెల పండుగ.
 చెడును దునుమాడటంలో పడతి సాహసానికి
 ప్రతీకగా నిలిచే పండుగ.
 పిల్లలూ పెద్దలూ సంబరంగా జరుపుకొనే పండుగ.
 ఇంటిల్లిపాదీ సందడి సందడిగా జరుపుకొనే పండుగ ఇది.
 మన దేశం నలుమూలల్లోనే కాదు,
 ఖండ ఖండాంతరాల్లోనూ దేదీప్యమానంగా జరుపుకొనే
 విశిష్టమైన పండుగ ఇది.
 ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మాత్రమే కాదు,
 జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా వేడుకగా జరుపుకొనే పండుగ ఇది.

 
 ప్రపంచంలో అత్యధికులు జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. రంజాన్, క్రిస్మస్‌ల తర్వాత ఎక్కువ మంది జరుపుకొనే పండుగ దీపావళి మాత్రమే. దీపావళిని ప్రధానంగా హిందువుల పండుగగా భావిస్తారు గాని, ఈ పండుగను జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా తమ తమ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 102.2 కోట్ల మందికి పైగా ప్రజలు దీపావళిని వివిధ రీతుల్లో జరుపుకొంటారు. దీపావళి నేపథ్యానికి సంబంధించి నరకాసుర వధ గాథ అందరికీ తెలిసినదే. నరకాసురుడితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు అలసి సొలసి సొమ్మసిల్లిపోతే సత్యభామ సాహసోపేతంగా నడుం బిగించి, విల్లు సంధించింది. శ్రీకృష్ణుడు తెప్పరిల్లే వరకు నరకుడిని నిలువరించింది.
 
చివరకు శ్రీకృష్ణుడు చక్రాయుధం సంధించి నరకుడిని వధించాడు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి రోజున నరకాసురుడి పీడ విరగడ కావడంతో ఆ మరునాడు అమావాస్య నాడు ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఏటా నరక చతుర్దశి మర్నాడు జనం ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి ప్రాశస్త్యానికి సంబంధించి మరికొన్ని పౌరాణిక విశేషాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీరాముడి పద్నాలుగేళ్ల వనవాసం దీపావళి రోజునే ముగిసిందట. లంకలో రావణ సంహారం తర్వాత సీతారామ లక్ష్మణులు దీపావళి నాడే తిరిగి అయోధ్యకు చేరుకున్నారని ప్రతీతి. పాండవుల పన్నెండేళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం కూడా దీపావళి రోజునే ముగిసినట్లు పురాణాలు చెబుతున్నాయి.
 
 ఐదురోజుల వేడుక
 దీపావళి వేడుకలు ఐదు రోజులు సాగుతాయి. అమావాస్యకు రెండు రోజుల ముందు అశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. ఈ త్రయోదశి నాడే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, ధన్వంతరి జన్మించారని, అందుకే ఇది ధనత్రయోదశిగా పేరు పొందిందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని పూజించే ఆచారం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. లక్ష్మీదేవి జన్మించిన ధనత్రయోదశి రోజున కొత్త వస్తువులు, ఆభరణాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేయడం శుభదాయకమని చాలామంది నమ్ముతారు. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి నాడు వేకువ జామునే నిద్రలేచి మంగళ హారతులిచ్చి, పూజలు చేస్తారు. దీపావళి వేడుకలకు సన్నాహంగా ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని, సరస్వతిని, కుబేరుడిని కూడా పూజిస్తారు. సాయంత్రం ఇంటి ముందు వరుసగా దీపాలు పెట్టి, బాణసంచా కాలుస్తారు.
 
 మార్వాడీలకు, గుజరాతీలకు, నేపాలీలకు దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ ప్రాంతాల్లోని వ్యాపార వర్గాల వారు దీపావళి రోజు నుంచే తమ తమ వ్యాపారాలకు చెందిన జమా ఖర్చుల లెక్కలకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. దీపావళి మర్నాడు... కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అంటారు. బలి చక్రవర్తిని వామనావతారంలో వచ్చిన విష్ణువు పాతాళానికి అణగదొక్కినది ఈరోజేనని ప్రతీతి. ఇదే రోజు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి తాకిడి నుంచి గోపాలకులను, గోవులను కాపాడాడని కూడా పురాణాలు చెబుతాయి. కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్త భోజనంగా పాటిస్తారు. రక్షాబంధనాన్ని తలపించే పండుగ ఇది. ఈ రోజున సోదరులు తమ తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనాన్ని ఆరగించి, వారికి కానుకలను బహూకరిస్తారు.
 
 తూర్పున కాళీపూజలు
 దీపావళి రోజున దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో లక్ష్మీదేవి పూజలు చేయడం ఆనవాయితీగా ఉంటే, తూర్పు ప్రాంతాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అసోం రాష్ట్రాల్లో కాళీపూజలు చేస్తారు. కాళీపూజను ఒడిశా, బెంగాల్, అసోంలలో శ్యామాపూజగా కూడా వ్యవహరిస్తారు. బిహార్‌లోని మైథిలీ ప్రజలు దీనిని మహానిశా పూజగా వ్యవహరిస్తారు. పద్దెనిమిదో శతాబ్దిలో బెంగాల్‌లోని నవద్వీప ప్రాంతాన్ని పాలించిన రాజా కృష్ణచంద్ర హయాంలో కాళీపూజలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీధుల్లో కాళీమాత మంటపాలను ఏర్పాటు చేసి పూజలు చేసే పద్ధతి అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇదేరోజు రామకృష్ణ పరమహంస శారదాదేవిని షోడశిగా ఆరాధించినట్లు ప్రతీతి. అందుకే బెంగాల్‌లోని కాళీ మంటపాల్లో రామకృష్ణ పరమహంస, శారదాదేవి దంపతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
 
 ఇతర మతాలకూ పవిత్ర దినం
 దీపావళిని హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా పవిత్ర దినంగా భావిస్తారు. వర్ధమాన మహావీరుడు దీపావళి నాడే నిర్యాణం చెందాడు. ఆయన ప్రధాన శిష్యుడైన గౌతమ గాంధార స్వామి అదే రోజున ‘కేవల జ్ఞానం’ పొందాడు. అందుకే  జైనులు దీనిని సంస్మరణ దినంగా జరుపుకొంటారు. జైన దేవాలయాల్లో దీపావళి ఉదయాన్నే వర్ధమాన మహావీరుడికి ‘నిర్వాణ లడ్డూ’ను నివేదిస్తారు. నేపాల్, మయాన్మార్ దేశాల్లో వజ్రయాన శాఖకు చెందిన బౌద్ధులు దీపావళిని వేడుకగా జరుపుకొంటారు. నేపాల్‌లోని నేవార్ తెగవారు దీపావళి రోజున ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని, విష్ణువును ఆరాధిస్తారు. మయాన్మార్‌లోనైతే పగోడాలను సైతం దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ చెర నుంచి సిక్కు గురువు గురు హరగోవింద్ విముక్తి పొందినది దీపావళి రోజునే కావడంతో సిక్కులు దీనిని పవిత్ర దినంగా భావిస్తారు. దీనిని వారు ‘బందీ ఛూడ్ దివస్’గా పాటిస్తారు. సిక్కులు తమ దేవాలయాలను దీపాలతో అలంకరించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటారు.
 
 దేశదేశాల్లో దీపావళి
 దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాకుండా హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్, భూటాన్, శ్రీలంక, మయాన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిజీ, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెన్యా, సురినామ్, గుయానా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, బ్రిటన్, కెనడా, అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో తదితర దేశాల్లోనూ ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లో కూడా భారత్ మాదిరిగానే ఐదు రోజుల వేడుకలు జరుగుతాయి. దీపావళిని నేపాలీలు ‘తీహార్’ అని, ‘స్వాంతి’ అని వ్యవహరిస్తారు. దీపావళి సందర్భంగా నేపాలీలు లక్ష్మీపూజలతో పాటు పశుసంపదను కూడా పూజిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్, మెల్‌బోర్న్ తదితర నగరాల్లో అక్కడ స్థిరపడ్డ భారతీయులతో పాటు స్థానిక ఆస్ట్రేలియన్లు కూడా ఉత్సాహంగా బాణసంచా కాల్చే వేడుకల్లో పాల్గొంటారు. ఇండోనేషియాలో దీపావళిని ‘గులుంగాన్’గా వ్యవహరిస్తారు. ‘గులుంగాన్’ రోజున పూర్వీకుల ఆత్మలు భూమ్మీదకు వస్తాయని ఇండోనేషియన్లు విశ్వసిస్తారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో దీపావళి వేడుకల కోసం ప్రత్యేకంగా ‘దివాలీ నగర్’ అనే ప్రదేశమే ఉంది. దీపావళి రోజున ‘దివాలీ నగర్’ దీపాలంకరణతో, బాణసంచా కాల్పులతో దేదీప్యమానంగా మెరుపులీనుతూ కనువిందు చేస్తుంది. నేపాల్, శ్రీలంక, ఫిజీ, మారిషస్, సింగపూర్ తదితర దేశాల్లో దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తారు. పాకిస్థాన్ ప్రభుత్వం సైతం ఈ ఏడాది దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం విశేషం. పాకిస్థాన్‌లోని స్వల్పసంఖ్యాకులైన హిందువులతో పాటు అక్కడి ముస్లింలు, క్రైస్తవుల్లో కూడా కొందరు దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.  
 
 అగ్రరాజ్యాల్లో అధికారిక వేడుకలు
 అగ్రరాజ్యాలైన బ్రిటన్, అమెరికాల్లో స్థిరపడిన హిందువులు దశాబ్దాలుగా దీపావళి వేడుకలను జరుపుకొంటూ వస్తున్నారు. అయితే దాదాపు దశాబ్ద కాలంగా లండన్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం వద్ద సైతం దీపావళి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తూ ఉండటం విశేషం. గార్డన్ బ్రౌన్ బ్రిటన్ ప్రధానిగా ఉండగా మొదలైన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. అమెరికాలో ఉండే దాదాపు ముప్పయి లక్షల మంది హిందువులు కూడా దశాబ్దాలుగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించడం 2003 నుంచి మొదలైంది. ఆ తర్వాత 2007లో అమెరికన్ కాంగ్రెస్ దీపావళికి అధికారిక హోదా కల్పించింది. వైట్‌హౌస్‌లో జరిగే దీపావళి వేడుకల్లో స్వయంగా పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే. ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారిగా 2009లో జరిగిన వేడుకల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, దీపావళి సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 5న ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం విశేషం.
 
 బాణసంచా చరిత్ర
 బాణసంచా కాల్చనిదే దీపావళి సంబరాలకు నిండుదనం ఉండదు. దీపావళి అంటే దీపాల వరుస అనే అర్థం ఉంది. అలాగని కేవలం ఇళ్ల ముందు వరుసగా దీపాలను పేర్చి అంతటితో సరిపెట్టుకోరు. బాణసంచా అందుబాటులోకి రాకముందు కేవలం దీపాలు వెలిగించి, పూజపునస్కారాలతో సరిపెట్టుకునే వారేమో గాని, బాణసంచా అందుబాటులోకి వచ్చాక బాణసంచా కాల్చనిదే దీపావళి వేడుకలు పూర్తయిన సందర్భాలు చరిత్రలో చాలా అరుదు. ఎప్పుడో ఔరంగజేబు కాలంలో కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే బాణసంచా వాడుకపై నిషేధం అమలులో ఉండేది. ఆ తర్వాత మరెన్నడూ బాణసంచా వెలుగులు లేకుండా దీపావళి జరగనే జరగలేదు. బాణసంచాకు దాదాపు 2200 ఏళ్ల చరిత్ర ఉంది. చైనా దేశస్థులు మొదట్లో జంతువులను భయపెట్టడానికి వెదురు బొంగులను కాల్చి పేలుడు శబ్దాన్ని సృష్టించేవారు. కాలక్రమంలో వారు పొటాషియం నైట్రేట్‌ను (సురేకారం) కనుగొన్నారు. సురేకారం, గంధకం, బొగ్గు రకరకాల పాళ్లలో మేళవించడం ద్వారా పేలుడు పదార్థాలను, వాటిలో మరికొన్ని రసాయనాలను మేళవించడం ద్వారా రకరకాల బాణసంచా సామగ్రిని తయారు చేయడం తెలుసుకున్నారు. బాణసంచా వెలుగులు, పేలుళ్లతోనే దీపావళికి కళాకాంతులు వస్తాయని చాలామంది భావిస్తారు. ఇదిలా ఉండగా బాణసంచా వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందనే ప్రచారం ఊపందుకోవడంతో ఇటీవలి కాలంలో కొందరు బాణసంచా లేకుండానే దీపావళి జరుపుకొంటున్నారు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ.
 
 దీపావళి జాగ్రత్తలు
బాణసంచా కారణంగా అగ్నిప్రమాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. టపాసులు చేతిలోనే పేలిపోవడం, చిచ్చుబుడ్లు, మతాబుల నుంచి శరవేగంగా ఎగజిమ్మే నిప్పురవ్వలు ఒంటి మీదపడి గాయపడటం వంటి ప్రమాదాలు అక్కడక్కడా చోటు చేసుకుంటూ ఉండటం మామూలే. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు లేకుండా ఆనందంగా దీపావళి జరుపుకోవచ్చు. ప్రమాదాలు లేని దీపావళి కోసం ఈ జాగ్రత్తలు పాటిద్దాం...
 
బాణసంచా కాల్చేటప్పుడు వీలైనంత వరకు కాస్త వదులైన మందపాటి కాటన్ దుస్తులను ధరించడం, తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించడం మంచిది.
 
 కాకరపువ్వొత్తులు, మతాబులు వంటివి కాల్చేటప్పుడు చేతిని పూర్తిగా చాచి ఒంటికి దూరంగా ఉండేలా వాటిని కాల్చడం మంచిది. చిన్నపిల్లలు వీటిని కాల్చేటప్పుడు పెద్దలెవరైనా వారికి సహాయంగా ఉండటం మంచిది.
 
టపాసులు, బాంబులు వంటి పేలుడు పదార్థాలను ఇళ్లకు దూరంగా ఆరుబయట ప్రదేశంలో కాల్చడం మంచిది. పిల్లలు ఇలాంటి పేలుడు పదార్థాలను ఇళ్ల దగ్గర కాల్చకుండా పెద్దలు వారిపై ఓ కన్నేసి ఉంచడం క్షేమం.
 
కొన్ని రకాల టపాసులను కాల్చేసిన తర్వాత కూడా కొంతసేపటి వరకు వాటికి నిప్పు అంటుకునే ఉంటుంది. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు నీటి బకెట్‌లో పడేయడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చు.
 

బాణసంచా కాల్చేటప్పుడు ఇంట్లో ఉన్న అందరూ ఒకేసారి కాల్చకుండా, ఒకరి తర్వాత ఒకరు కాల్చడం ద్వారా కూడా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు.
 
రాకెట్లు, తారజువ్వలు వంటివి కాల్చేటప్పుడు అవి ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా వాటి దిశ సరిగా ఉండేలా చూసుకోవాలి.

 

మరిన్ని వార్తలు