ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా..?

19 Nov, 2017 02:11 IST|Sakshi

సందేహం

పొత్తి కడుపు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరంగా తెలియజేయగలరు.
– కె.స్వాతి, వరంగల్‌

పొత్తికడుపులో గర్భాశయం, ట్యూబ్‌లు, అండాశయాలు, మూత్రాశయం, పేగులు వంటి ఎన్నో అవయవాలు ఉంటాయి. వీటిలో దేనికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా దానిని పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్‌ కిందే పరిగణించవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్‌ వల్ల, పొత్తికడుపులో నొప్పి, మూత్రం మంట, జ్వరం, విరోచనాలు, నడుంనొప్పి, వాసనతో కూడిన తెల్లబట్ట వంటి అనేక లక్షణాలు, ఇన్‌ఫెక్షన్‌ సోకిన అవయవాన్ని బట్టి ఉంటాయి. సాధారణంగా శారీరక పరిశుభ్రత, మంచినీళ్లు రోజుకి కనీసం 2–3 లీటర్లు తాగడం, జననేంద్రియాల శుభ్రత, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకి శుభ్రపరుచుకోవడం, పౌష్టికాహారం, బయట అపరిశుభ్ర ఆహారం తీసుకోవటం, రక్తహీనత లేకుండా చూసుకోవడం, ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవడం వంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల చాలావరకు పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్‌లను నివారించవచ్చు. కొద్దిగా ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కనిపించినా, వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవటం వల్ల, ఇన్‌ఫెక్షన్‌ మరింత సోకే ప్రమాదం రాకుండా అరికట్టవచ్చు.

∙ ప్రెగ్నెన్సీ సమయంలో ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల లావు పెరిగే అవకాశం ఉందా?
– జీఆర్, అమలాపురం

ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌లో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిలో చేప శరీరం నుంచి తీసే సప్లిమెంట్స్‌లో ఉండే డీహెచ్‌ఏ మరియు ఈపీఏ అనే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ శిశువు యొక్క మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే బిడ్డ కళ్లకు కూడా మంచిది.వీటివల్ల తల్లికి కూడా చర్మానికి, గుండెకి మంచిది. అలాగే బీపీ పెరిగే అవకాశాలు, నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, మన శరీరంలో తయారు కావు. వీటిని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్స్‌లాగా మాత్రమే మన శరీరంలోకి చేరుతాయి. ఇవి చేపలు తినడం వల్ల లభ్యమవుతాయి. వెజిటబుల్‌ ఆయిల్స్, ఫ్లాక్స్‌ సీడ్స్, వాల్‌నట్స్, డార్క్‌ లీఫీ వెజిటబుల్స్‌ (పాలకూర), సోయా బీన్స్, బ్రొకోలీ వంటి వాటిలో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, చేపలలో దొరికేంత కాకపోయినా, కొద్దిగా లభ్యమవుతాయి. సప్లిమెంట్స్‌ బదులు చేపలు వారానికి ఒకటి రెండుసార్లు తీసుకోవటం వల్ల ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ప్రొటీన్స్, విటమిన్‌ డి, అయోడిన్, సెలీనియమ్‌ వంటి పోషక పదార్థాలు కూడా లభ్యమవుతాయి. ఈ సప్లిమెంట్స్‌ వల్ల లావు పెరగరు. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటూ, కాన్పు తర్వాత కూడా మూడు నెలలపాటు తీసుకోవటం వల్ల, తల్లిపాల ద్వారా బిడ్డకు ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ అందుతాయి.

 ectopic pregnancyఅనేది ప్రమాదకరమని విన్నాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. దీనికి సంబంధించిన సంకేతాలను ముందుగా ఎలా తెలుసుకోవచ్చు?
– పీఎన్, శ్రీకాకుళం

సాధారణంగా అండాశయం నుంచి అండం విడుదలయ్యి ఫెలోపియన్‌ ట్యూబ్‌లోకి ప్రవేశించి, యోని భాగం నుంచి వీర్య కణాలు గర్భాశయం ద్వారా, ట్యూబ్‌లోకి ప్రవేశించిన తర్వాత, వీర్య కణం అండంలోకి దూరుతుంది. తద్వారా అండం ఫలదీకరణ చెంది, అది వృద్ధి చెందుతూ పిండంగా మారి, పిండం గర్భాశయంలోకి ప్రవేశించి, గర్భాశయ పొరలోకి అతుక్కుని, గర్భం పెరగడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పిండం, గర్భాశయంలోకి ప్రవేశించకుండా, ట్యూబ్‌లోనే ఉండిపోయి అక్కడ పెరగడం మొదలవుతుంది. కొందరిలో అండాశయంలో, పొత్తి కడుపులో, సర్విక్స్‌లో కూడా పిండం పెరగవచ్చు. గర్భాశయంలో కాకుండా పిండం ఇతర భాగాలలో పెరగడాన్ని ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది 95% ట్యూబ్స్‌లో ఏర్పడుతుంది. పెరిగే పిండానికి అనుగుణంగా గర్భాశయం సాగినట్లు, ట్యూబ్స్‌ సాగలేవు కాబట్టి, కొంత సమయానికి ట్యూబ్స్‌ పొత్తికడుపులో పగిలిపోయి విపరీతమైన కడుపునొప్పి, కడుపులో బ్లీడింగ్‌ అయిపోవటం, తల్లి షాక్‌లోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తిస్తే, ప్రాణాపాయ స్థితిని తప్పించుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ట్యూబ్స్‌లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల, లేదా ఎన్నో తెలియని కారణాల వల్ల, ట్యూబ్స్‌ పాక్షికంగా మూసుకోవటం, లేదా వాటి పనితీరు సరిగా లేకపోవటం వల్ల పిండం గర్భాశయంలోకి ప్రవేశించలేక ట్యూబ్‌లోనే ఉండిపోయి ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. ఇందులో లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. కొందరిలో పీరియడ్‌ రావలసిన సమయానికి కొద్దికొద్దిగా బ్లీడింగ్‌ లేదా స్పాటింగ్‌ కనిపించడం, కొందరిలో పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి ఉండటం. కొందరిలో పీరియడ్‌ మిస్‌ అయ్యి, ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన తర్వాత, కొద్దిగా స్పాటింగ్‌ అవ్వటం, కడుపులో విపరీతమైన కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి ఎమర్జెన్సీ పరిస్థితులలో హాస్పిటల్‌కు రావటం జరుగుతుంది. ఈ పరిస్థితిని వెజైనల్‌ స్కానింగ్‌ చేయించుకోవటం ద్వారా తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించవచ్చు. కొందరిలో గుర్తించేటప్పటికే ట్యూబ్‌ పగిలిపోయి, కడుపులో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆపరేషన్‌ చేసి ట్యూబ్‌ తీసివేయవలసి ఉంటుంది. చాలా ముందుగా ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీని గుర్తిస్తే, చాలావరకు కొందరిలో ఆపరేషన్‌ లేకుండా మందులు, ఇంజెక్షన్‌ల ద్వారా కరిగించే ప్రయత్నం చేయవచ్చు.

- డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్‌ కూకట్‌పల్లి
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు