దానికి నిర్ణీత వయసు ఉంటుందా?

17 Sep, 2018 23:21 IST|Sakshi

మా అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఈమధ్య రజస్వల అయింది. చిన్న వయసులోనే రజస్వల కావడం వల్ల భవిష్యత్తులో  ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని బంధువులు ఒకరు చెప్పారు. భవిష్యత్‌లో  ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రజస్వల కావడానికి నిర్ణీత వయసు అంటూ ఉంటుందా? – జీఎన్, ఖమ్మం
సాధారణంగా రజస్వల 12 సంవత్సరాల నుంచి 15–16 సంవత్సరాల లోపల అవుతారు. ఈమధ్య కాలంలో తినే ఆహారంలో మార్పులు, జంక్‌ఫుడ్, అధికబరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక మార్పులు...ఇలా ఎన్నో కారణాల వల్ల కొందరు 10 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. మీ అమ్మాయి 13 సంవత్సరాలకు అయింది. తను కరెక్ట్‌ వయసుకే అయింది. దీనివల్ల ఇబ్బంది ఏమిలేదు. అంతకంటే ముందే అంటే 10–11 సంవత్సరాలకే అయిన వాళ్ళలో కొందరిలో ముందునుంచే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ విడుదల అవ్వడం వల్ల, ఎముకల పెరుగుదల తొందరగా ఆగిపోయి, ఎప్పుడు ఎత్తు పెరగకుండా ఆగిపోతారు.

వీరిలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఎక్కువ కాలం ఎక్స్‌పోజ్‌ అవ్వడం వల్ల, కొందరిలో తర్వాత కాలంలో పిల్లలు పుట్టకపోవడం, అధికబరువు వంటి ఇతర కారణాలు జత కలసినప్పుడు వారికి రక్తపోటు, బ్రెస్ట్‌ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి వీరు క్రమంగా వ్యాయామాలు చేస్తూ బరువు పెరగకుండా ఉండటం, అప్పుడప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం, బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ చేసుకోవడం, రక్తపరీక్షలు, స్కానింగ్‌ చెయ్యించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు లేదా ముందుగా తెలుసుకుని చికిత్స తీసుకోవచ్చు.

నేను ప్రెగ్నెంట్‌. నాకు నిద్ర సరిగా పట్టడం లేదు. ‘పొజిషనల్‌ థెరపీ’ వల్ల గర్భిణులకు చక్కగా నిద్ర పడుతుందని చదివాను. దీని గురించి వివరంగా తెలియజేగలరు.
– పి.నీరజ, పొద్దుటూరు
గర్భిణి సమయంలో బిడ్డ పెరిగేకొద్ది బరువు నడుము మీద పడడం, పడుకున్నప్పుడు అటూ ఇటూ తిరగడానికి  ఇబ్బంది, అసౌకర్యంతో నిద్ర సరిగా పట్టదు. (పెరిగే బిడ్డ బరువు, సాగే గర్భాశయం ఒత్తిడి వెన్నుపూస మీద ఉంటుంది. గర్భవతి వెల్లకిలా పడుకున్నప్పుడు దానివల్ల వెన్నుపూసకు లోపలివైపు గర్భశయానికి మధ్యలో ఉండే ఇన్ఫీరియర్‌ వీనకేవా (ఐవీసీ) ఆర్టెరీ అనే రక్తనాళం పై పడి తల్లికి, బిడ్డకి రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల, అలాగే వెల్లకిలా పడుకున్నప్పుడు, తల్లికి ముక్కు నుంచి శ్వాస సరిగా అందకపోవడం వల్ల, తల్లికి సరిగా నిద్రపట్టకపోవటం అలాగే బిడ్డకు సరిగ్గా ఆక్సిజన్‌ అందక బరువు పెరగక పోవడం, కొందరిలో కడుపులో చనిపోయే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి తల్లి ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల రక్తనాళాలపైన ఒత్తిడి తగ్గి, రక్తసరఫరా ఇద్దరికీ సరిగా ఉంటుంది.

తల్లి నిద్రపోవడం ఎంత మంచిదో అలాగే సరైన పొజిషన్‌లో పడుకోవడం కూడా తల్లికి బిడ్డకి చాలామంచిది. అందుకోసం పొజిషనల్‌ థెరపీని వాడడం మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇందులో నడుంకి ఒక బెల్టులాంటిది కట్టుకొని, దానికి వెనకాల వైపులో తక్కువ బరువు ఉన్న చిన్న బాల్స్‌ని ఉంచడం వల్ల, తల్లి నిద్రలో తెలియకుండ వెల్లకిలా పడుకోడానికి తిరిగినా, బాల్స్‌ వల్ల కలిగే అసౌకర్యం వల్ల, ఒకవైపుకే (ఎడం వైపు) తిరిగి పడుకోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లికి నిద్ర సరిగా పడుతుంది, అలాగే బిడ్డకి కూడా రక్తప్రసరణ సరిగా ఉంటుంది.

మా అమ్మాయి స్వభావరీత్యా చాలా కూల్‌ అయితే ఈ మధ్య కాస్త ఇబ్బందిగా ప్రవర్తిస్తుంది. అకారణంగా కోపం తెచ్చుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే టెన్షన్‌ పడిపోతుంది. ఒక స్నేహితురాలిని సలహా అడిగితే ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌’ అంటూ ఏదో చెప్పింది. దీని నివారణ చర్యలు ఉంటే తెలియజేయగలరు. – డీఎన్, భువనగిరి
కొంతమందిలో హార్మోన్‌లలో మార్పుల వల్ల పీరియడ్స్‌ మొదలయ్యే 15 రోజులు ముందు నుంచి టెన్షన్, కోపం, చిరాకు, డిప్రెషన్, శరీరం ఉబ్బడం, అలసట, రొమ్ములు బరువుగా నొప్పిగా ఉండడంలాంటి లక్షణాలు ఉండవచ్చు. దీనినే ‘ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మెడిటేషన్, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల కొద్దిగా ఉపశమనం దొరకుతుంది. ఈ సమయంలో ఆహారంలో  ఉప్పు తగ్గించి తీసుకోవటం, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవటం మంచిది. అలాగే విటమిన్‌ బి6, ఇ, కాల్షియం, మెగ్నీషియంతో కూడిన విటమిన్‌ టాబ్లెట్స్‌ వాడవచ్చు. ప్రిమ్‌రోజ్‌ ఆయిల్‌ క్యాపుల్స్‌ వాడి చూడవచ్చు. మరీ టెన్షన్, చిరాకు లక్షాణాలు తీవ్రంగా ఉంటే డాక్టర్‌ పర్యవేక్షణలో యాంటీడిప్రెషన్‌ మందులు వాడొచ్చు.

హార్ట్‌ డిసీజ్‌ ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? చాలా రిస్క్‌ అని మా బంధువులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి వివరంగా తెలియజేయగలరు.
– కె.ప్రీతి పిడుగురాళ్ల
గుండెజబ్బులు ఉన్నవాళ్లలో, గుండె పనితీరులో తేడా ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత రక్తం పల్చబడుతుంది. గుండె ఎక్కువ రక్తం సరఫరా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు కొట్టుకోవలసి ఉంటుంది. గుండె మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, బలహీనంగా ఉన్న గుండె పైన ఒత్తిడి పెరగడం వల్ల, ఆయాసం పెరగడం, ఊపిరి ఆడకపోవడం, హర్ట్‌ ఫెయిల్‌ అవ్వడం, రక్తం గూడుకట్టడం వంటి ప్రాణాపాయస్థితి కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే అబార్షన్లు. శిశువు బరువు పెరగకపోవడం, కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఒక్కొక్కరి గుండె జుబ్బును బట్టి, దాని తీవ్రతను బట్టి గర్భం దాల్చిన తర్వాత సమస్యల తీవ్రత ఉంటుంది. గుండెజబ్బు ఉన్న వాళ్లు గర్భం దాల్చకముందే, డాక్టర్‌ను సంప్రదించి వారి గుండె పనితీరు ఎలా ఉంది, గర్భం దాల్చవచ్చా లేదా గర్భం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ తెలుసుకొని ప్రయత్నం చేయడం మంచిది. ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు గర్భం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది.

- డా‘‘ వేనాటి శోభ ,బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో ,హైదర్‌నగర్‌ హైదరాబాద్‌

మరిన్ని వార్తలు