సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

27 May, 2018 01:03 IST|Sakshi

సందేహం

నా వయసు 24. నాకు ఫాస్ట్‌ఫుడ్‌ అంటే బాగా ఇష్టం. రోజూ తింటుంటాను. ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడిన వాళ్లు గర్భం దాల్చడానికి ఆలస్యం అవుతుందని మా బంధువులలో ఒకరంటే,  ‘భయపెట్టడానికి అలా అంటుంది’ అనుకున్నాను. కానీ మొన్న ఒక వార్త చదివిన తరువాత ఆమె చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. మాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. ఇంకా ప్రెగ్నెంట్‌ని కాలేదు. నా ఫాస్ట్‌ఫుడ్‌ అలవాటే దానికి కారణమా? అలాగే ప్రెగ్నెంట్‌ అయ్యాక ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకోవడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌లాంటివి ఏమైనా ఉంటాయా? – రంజని, గుంటూరు
ఫాస్ట్‌ఫుడ్‌లో కార్బోహైడ్రేట్‌లు, నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరగటం జరుగుతుంది. బరువు పెరగటం వల్ల ఆడవారిలో హార్మన్లలో మార్పులు ఏర్పడటం, దానివల్ల పీరియడ్స్‌ క్రమం తప్పటం, అండం సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే అధిక బరువు వల్ల థైరాయిడ్, ప్రొలాక్టిన్‌ హార్మోన్లలో మార్పులు, కొందరిలో శరీర తత్వాన్నిబట్టి అండాశయాల్లో నీటి బుడగలు ఏర్పడటం వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణీలలో అజీర్తి, ఎసిడిటీ, బరువు ఎక్కువగా పెరగటం వల్ల షుగర్‌ శాతం పెరిగి జెస్టేషనల్‌ డయాబెటిస్, బీపీ పెరగటం, ఆయాసం.. కొందరిలో బిడ్డ ఎక్కువ బరువు పెరగవచ్చు, మరికొందరిలో బిడ్డ తక్కువ బరువు పెరగే అవకాశాలు ఉంటాయి. కాన్పు సమయంలో ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. నాకు ఆస్తమా ఉంది. దాంతో చాలామంది ప్రీటర్మ్‌ డెలివరీ, లో బర్త్‌ వెయిట్‌.. మొదలైన సమస్యలు వస్తాయంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఇది ఎంత వరకు నిజం? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? ప్రస్తుతం నేను ఆస్తమా గురించి వాడుతున్న మందుల వల్ల బిడ్డకేమైనా ప్రమాదం ఉంటుందా? దయచేసి తెలియజేయగలరు. – జి.అంజలి, శ్రీకాకుళం
ఆస్తమా ఉండి గర్భం దాల్చినప్పుడు 30 శాతం మందిలో ఆస్తమా తగ్గుతుంది. అలాగే 35 శాతం మందిలో ఆస్తమా తీవ్రత పెరుగుతుంది. మరో 35 శాతం మందిలో ఆస్తమా తీవ్రత అంతే ఉంటుంది. ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోన్ల మార్పులు, శరీరంలో మార్పుల వల్ల ఆస్తమా తీవ్రత ఉంటుంది. ఆస్తమాలో ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, శ్వాస నాళాలు వాయడం వల్ల కొద్దిగా మూసుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మిగతా అవయవాలకు అలాగే కడుపులోని శిశువుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గడం జరుగుతుంది. గర్భిణీ సమయంలో ఎక్కువసార్లు ఆస్తమా రావడం వల్ల కడుపులోని బిడ్డ ఎక్కువ బరువు పెరగలేకపోవడం, నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తమాకి వాడే కొన్ని రకాల మందులు, వాటి మోతాదునిబట్టి కూడా శిశువుపై దుష్ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆస్తమా ఉన్నవాళ్లు గర్భం దాల్చకముందే డాక్టర్‌ని సంప్రదించి జాగ్రత్తలు పాటించాలి. గర్భం దాల్చిన తర్వాత, ఆస్తమాని ప్రేరేపించే వస్తువులకు, తిండి పదార్థాలకు, చల్లని ప్రదేశాలకు, దుమ్ముధూళి వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆస్తమాకు ఇన్‌హెలర్స్‌ వాడొచ్చు. వాటిలో వాడే మందులు డాక్టర్‌ పర్యవేక్షణలో వీలైనంత తక్కువ మోతాదులో శిశువుకు ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి.

నా వయసు 26. సంవత్సరం క్రితం నాకు పెళ్లయింది. తర్వాత ఐదు నెలలకు నా కడుపులో గడ్డ ఉందని తెలిసింది. ఆపరేషన్‌ చేసి దాన్ని తీసేశారు. అయితే ఆపరేషన్‌కి ముందు ఒకసారి నా జననాంగం వద్ద చిన్న చిన్న పింపుల్స్‌లాగా వచ్చాయి. తర్వాత వాటంతటవే తగ్గిపోయాయి. కానీ గత రెండు నెలలుగా పీరియడ్‌కి ముందు అలాంటి పింపుల్సే వస్తున్నాయి. పీరియడ్‌ అయిపోయాక తగ్గిపోతున్నాయి. ఎందుకిలా అవుతోంది? వివరంగా తెలియజేయగలరు.  – ప్రగతి, కూకట్‌పల్లి
కొంతమంది ఆడవారిలో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల జననాంగం వద్ద  చిన్న చిన్న గుల్లల్లాగా రావచ్చు, లేదా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల చిన్న నీటి గుల్లల్లాగానూ రావచ్చు. ఇవి రక్తహీనత, వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్నా మాటిమాటికీ రావచ్చు. పీరియడ్స్‌ ముందు శరీరంలోని హార్మోన్స్‌లో మార్పుల వల్ల కొందరిలో ఆ సమయంలో జననాంగం వద్ద ఇన్‌ఫెక్షన్స్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొందరిలో కలయిక వల్ల భర్తలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే, అది భార్యకు సోకే అవకాశం ఉంది. జననాంగాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అక్కడ ఉన్న వెంట్రుకలు రెగ్యులర్‌గా తొలగించుకోకపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది.
- డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు