మనోగళం: నాకు చావంటే భయం లేదు!

24 Aug, 2013 21:17 IST|Sakshi
మనోగళం: నాకు చావంటే భయం లేదు!

ఇలా చేయాలి అలా చేయాలి అంటూ పని గట్టుకుని ఏదీ ప్లాన్ చేసుకునే అలవాటు లేదు నాకు. ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసెయ్యడమే. - నందినీరెడ్డి, దర్శకురాలు
     ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది?
 నచ్చేది నిజాయితీ. నచ్చనిది అబద్ధాలు చెప్పడం.
     మీలో మీకు నచ్చేది?
 నేనెప్పుడూ చాలా హ్యాపీగా ఉంటాను. ఎలాంటి టెన్షన్ పెట్టుకోను. అంతా మన మంచికే అనుకుంటాను.
     మీలో మీకు నచ్చనిది?
 బద్దకం. కాస్త ఎక్కువే ఉంది.
     మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు?
 మా అమ్మ. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యం కోల్పోలేదు. ఎంత పెద్ద సమస్య అయినా, అందులోంచి పాజిటివ్ ఫలితాన్ని ఎలా రాబట్టాలా అని చూసేది. షి ఈజ్ మై ఇన్‌స్పిరేషన్!
     ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా?
 ఎందుకుండవ్! అందరం తప్పులు చేస్తూనే ఉంటాం కదా! నేను కూడా చేశాను. కానీ వాటిని తలచుకుని బాధపడే తత్వం కాదు నాది. తప్పు చేస్తే దాన్నుంచి పాఠం నేర్చుకోవాలి తప్ప ఫీలవుతూ కూర్చోవడం నాకు నచ్చదు.
     అత్యంత సంతోషపడిన సందర్భం?
 చాలామంది అనుకుంటారు... ‘అలా మొదలైంది’ రిలీజైన రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైనదని చెబుతానేమో అని. కానీ చెప్పను. ఎందుకంటే, అది నా జీవితంలో ఓ ముఖ్యమైన సందర్భం తప్ప, అన్నిటికంటే సంతోషకరమైనదేమీ కాదు. స్కూల్, కాలేజీ రోజుల్లో అంతకన్నా ఆనందాన్ని పంచిన సందర్భాలు చాలా ఉన్నాయి.
     మీ హృదయం గాయపడిన సందర్భం?
 నన్ను అంత త్వరగా ఎవరూ హర్ట్ చేయలేరు. ఎందుకంటే, చిన్న వాటికే ఫీలైపోయే తత్వం కాదు నాది. కాకపోతే బాగా దగ్గరనుకున్నవాళ్లు నెగిటివ్‌గా మాట్లాడినప్పుడు మనసు చివుక్కుమంటుంది. చెప్పను కానీ అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకరకంగా అది మంచిదే. ఎందుకంటే, అప్పుడే మనవాళ్లెవరో బయటివాళ్లెవరో తెలుస్తుంది.
     ఆకలి విలువ తెలిసిన క్షణం?
 ఆ పరిస్థితి నాకెప్పుడూ లేదు. అదేంటో కానీ... ఎక్కడ ఎవరింట్లో ఉన్నా నాకు భోజనం క్షణాల్లో వచ్చేస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కడికైనా వెళ్తే చుట్టుపక్కల వాళ్లు ఎవరో ఒకరు భోజనం తెచ్చి పెట్టేసేవారు.
     ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
 ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద కోపమొచ్చినా దాన్ని ఇంటికొచ్చాక అమ్మ మీదనే చూపిస్తాను. పాపం  మౌనంగా భరిస్తుంది. అందుకే తనకు క్షమాపణ చెప్పి తీరాలి.
     మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం?
 నాకు ఎవరైనా వంట చేస్తుంటే చూడటం ఇష్టం. కానీ చేయడం మాత్రం ఇష్టం ఉండదు. తీరిక దొరికితే కుకరీ షోలు తెగ చూస్తుంటాను!
     మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం...?
 చిన్నప్పుడు దెయ్యాలంటే భయపడేదాన్ని. తర్వాత అది పోయింది. ఇప్పుడు పెద్దవాళ్లెవరికైనా ఒంట్లో బాగోకపోతే భయపడుతుంటాను... వాళ్లెక్కడ దూరమవుతారోనని!
     అబద్ధాలు చెబుతారా?
 భేషుగ్గా! ఇబ్బంది పెట్టే అబద్ధాలు కాదు, తప్పించుకునే అబద్ధాలు. ఫలానా టైముకి వస్తానని చెప్తాను. మావాళ్లు చూసి చూసి ఫోన్ చేస్తారు. వచ్చేశాను, మీ వీధి చివరే ఉన్నాను అంటాను. నిజానికి ఎక్కడో ఉంటాను. ఇలాంటివి బోలెడన్ని చెబుతాను. కానీ వాళ్లు కనిపెట్టేస్తారు. నా ఫ్రెండ్స్ అంటారు... అబద్ధం చెబితే నా ముక్కు ఎరుపెక్కుతుందని!
     మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి?
 నువ్వేంటో తెలుసుకో. నీ తప్పులు, ఒప్పులు ముందు బేరీజు వేసుకో. వాటిని సరిచేసుకుంటూ నిజాయితీగా ముందుకు సాగిపో. నిన్నెవరూ ఆపలేరు.
     ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
 ఒక ఓల్డేజ్ హోమ్ కట్టించాలని చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాను. అది ఎలాగైనా చేయాలి.
     దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు?
 ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూస్తాను.
     మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు?
 నాకు ఏ రోజైనా ఒకటే. ఇప్పుడెలా నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నానో ఆ రోజూ అలాగే గడుపుతాను.
     మరణానికి భయపడతారా?
 రెండుసార్లు చావు ముఖంలో ముఖంపెట్టి చూసొచ్చాను. చావంటే భయం లేదు నాకు!
     అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు?
 నందిని కొన్ని చిరునవ్వులు పంచి వెళ్లిపోయిందని నా గురించి అందరూ చెప్పుకోవాలి.
     మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు?
 డాల్ఫిన్‌గా పుడతాను. నాకు నీళ్లంటే ఇష్టం. నీటిలో ఉండే డాల్ఫిన్లంటే మరీ ఇష్టం. అవి చాలా సరదా జంతువులు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాయి. అందుకే నేనూ అలా పుడతా!
 - సమీర నేలపూడి
 

మరిన్ని వార్తలు