అప్పట్నుంచీ పెళ్లంటే భయం... ఎలా మరి?

27 Dec, 2015 02:43 IST|Sakshi
అప్పట్నుంచీ పెళ్లంటే భయం... ఎలా మరి?

సందేహం
నా వయసు 28. మరో రెండు నెలల్లో నాకు పెళ్లి. కానీ నాకు చాలా భయంగా ఉంది. ఓసారి నెట్‌లో డెలివరీ వీడియో ఒకటి చూశాను. అప్పట్నుంచీ పిల్లలు కనడమంటే భయం. పెళ్లి వద్దని ఎంత చెప్పినా మావాళ్లు వినిపించుకోకుండా ఫిక్స్ చేసేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదైనా సలహా ఇవ్వండి.
- యు.సింధుజ, మెయిల్

 
డెలివరీ అంటే భయం అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ఎలా? పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటివి స్త్రీ జీవితంలో భాగం. కాబట్టి ముందు ఆ భయాన్ని వదిలేయండి. లేదంటే పెళ్లి అవ్వగానే మీ భయం గురించి మీ భర్తకు చెప్పండి. కొంతకాలం గర్భం దాల్చకుండా జాగ్రత్త తీసుకుని, సంసార జీవితాన్ని ఆస్వాదించండి. దాంతో కొంత కాలానికి మెల్లగా పిల్లలు కావాలని అనిపిస్తుంది. అప్పుడు బిడ్డ కోసం ఆరాటం పెరిగి, భయం దానంతటదే తొలగిపోతుంది.

ధైర్యం వస్తుంది. సాధారణ కాన్పుకి సిద్ధపడినప్పుడు కాస్త నొప్పులు ఓర్చుకోవాల్సి వస్తుంది. అది సహజమే. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. పుట్టిన బిడ్డను చూడగానే ఆ నొప్పి సంగతే మర్చిపోతారు మీరు. కాబట్టి ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఒకవేళ డెలివరీ సమయానికి కూడా మీ భయం పోకపోతే, సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయవచ్చు. కాబట్టి ఇప్పట్నుంచే అవన్నీ ఆలోచించి కంగారు పడకుండా ఆనందంగా పెళ్లి చేసుకోండి.

నా వయసు 20. ఎత్తు ఐదడుగుల నాలుగంగుళాలు. బరువు 48 కిలోలు. చూడటానికి పుష్టిగానే కనిపిస్తాను. కానీ వక్షోజాలు మాత్రం చిన్నపిల్లలకు ఉన్నట్లే ఉన్నాయి. అస్సలు పెరగలేదు. ఏం చేసినా పెరగడం లేదు. ఇరవయ్యేళ్లు దాటాక ఇక ఛాతి పెరగదని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే ఇక నా పరిస్థితి ఇంతేనా? రేపు పెళ్లయ్యాక నా భర్త నన్ను అవమానిస్తే నా పరిస్థితి ఏంటి? చాలా సిగ్గుగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి.
 - గ్లోరీ, హైదరాబాద్

 
మీ ఎత్తుకి 49 నుంచి 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. ఛాతి పెరగడానికి వయస్సుతో సంబంధం లేదు. రొమ్ముల్లో పాలగ్రంథులు, కొవ్వు, ఎలాస్టిక్ టిష్యూ ఉంటాయి. శరీర తత్వం, బరువు, కొవ్వు శాతం, హార్మోన్లను బట్టి వక్షోజాల పరిమాణం ఉంటుంది. మీరు పౌష్టికాహారం... అంటే పాలు, పెరుగు, పప్పులు, పండ్లు, మాంసాహారం, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకుంటూ కాస్త బరువు పెరగడానికి ప్రయత్నించండి.

అప్పుడు ఒంట్లోను, వక్షోజాల్లోను కొవ్వు పెరిగి... వాటి పరిమాణం కాస్త పెరుగుతుంది. అలాగే వక్షోజాలను ఒక క్రమపద్ధతిలో రోజూ మసాజ్ చేసుకోండి. రక్తప్రసరణ పెరిగి దానివల్ల కూడా వక్షోజాల పరిమాణం కొద్దిగా పెరుగుతుంది. అలాగే మీరు సిగ్గుపడకుండా ఓసారి డాక్టర్‌ని సంప్రదించి, వారి సలహా మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
 
నా వయసు 29. పెళ్లై పదేళ్లు దాటింది. ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డకు సిజేరియన్ పడింది. అప్పుడే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పట్నుంచీ యోనిలో మంటగా, దురదగా అనిపిస్తోంది. మూత్ర విసర్జన సమయంలోను, కలయిక సమయంలోను చాలా ఇబ్బందిగా ఉంటోంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందేమోనని మందులు వాడినా ఫలితం లేకపోయింది. రెండేళ్లుగా ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. పరిష్కారం చెప్పండి.
 - జయశ్రీ, కోదాడ

 
పిల్లలు పుట్టకుండా చేయించుకున్న ఆపరేషన్‌కి, మూత్రంలో మంటకి సంబంధమేమీ లేదు. యోనిలో కూడా మంట అంటున్నారు కాబట్టి ఓసారి గైనకాలజిస్టును సంప్రదించండి. పరీక్ష చేసి సమస్య ఏమిటో కనిపెడతారు. యోనిలో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే యాంటీ ఫంగల్ మాత్రలు ఇస్తారు. రెండేళ్లుగా యూరిన్ ఇన్ఫెక్షన్‌కి మందులు వాడుతున్నా ఫలితం లేదంటున్నారు కాబట్టి యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి. మీరు, మీవారు కూడా ఓసారి మూత్రపరీక్ష, షుగర్ పరీక్షలు చేయించుకోండి.

కొన్నిసార్లు భర్తకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే భార్యకు కూడా రావొచ్చు. అలాంటప్పుడు మీరొక్కరే మందులు వాడినా ఉపయోగం ఉండదు. కలిసినప్పుడల్లా ఆయన నుంచి మీకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇద్దరూ కలిసి మందులు వాడండి. అయితే అవి వాడేటప్పుడు శారీరకంగా కలవకండి. కోర్సు మొత్తం పూర్తయ్యాక కలవండి.

నా వయసు 42. సంవత్సరం క్రితం పెద్దాపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. అప్పట్నుంచీ నేను శారీరకంగా బలహీన పడిపోయాను. అంతకుముందు ఎంత పనయినా హుషారుగా చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడలా చేయలేకపోతున్నాను. కాస్త పని చేసినా కాళ్లు గుంజుతున్నాయి. నడుం నొప్పి, ఆయాసం వచ్చేస్తున్నాయి. ఇదంతా ఆపరేషన్ వల్లనేనా? నేను ఎప్పటిలాగా అవ్వాలంటే ఏం చేయాలి?
 - ఎల్.పద్మావతి, కాకినాడ

 
సాధారణంగా ఆడవారిలో నలభయ్యేళ్ల తర్వాతి నుంచి హార్మోన్ల అసమతుల్యత కొద్దికొద్దిగా మొదలవు తుంది. థైరాయిడ్ సమస్య కూడా ఏర్పడ వచ్చు. అలాగే శరీరంలో కాల్షియం కూడా తగ్గడం మొదలయ్యి... ఎముకలు, కండరాలు బలహీనపడటం మొదలవు తుంది. గర్భాశయం, అండాశయాలు తీసేసిన తర్వాత అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల పూర్తిగా తగ్గిపోయి... నీరసం, అలసట, ఒళ్లు నొప్పులు, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కొందరిలో ఏర్పడవచ్చు.

ఓసారి మీరు గైనకాలజిస్టును సంప్రదించి థైరాయిడ్, హెమోగ్లోబిన్, షుగర్ పరీక్షలు చేయించుకోండి. సమస్యను బట్టి చికిత్స తీసుకోవచ్చు. రక్తం తక్కువ ఉంటే ఐరన్ మాత్రలు, థైరాయిడ్ సమస్య ఉంటే ఆ మాత్రలతో పాటు విటమిన్, కాల్షియం మాత్రలు వాడాల్సి ఉంటుంది. అవసరం అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ మాత్రలు కూడా వాడాల్సి ఉంటుంది. పాలు, పెరుగు, మాంసం, పండ్లు, పప్పులు, తృణధాన్యాలతో కూడిన పౌష్టికాహారం మాత్రం తప్పక తీసుకోండి.
 
నా వయసు 22. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాను. నా కొలీగ్, నేను ప్రేమించుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. అయితే ఆయనకు పదిహేనేళ్ల క్రితం టీబీ వచ్చి తగ్గిందట. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది. నా భయం ఏమిటంటే... ఆయనకు భవిష్యత్తులో మళ్లీ టీబీ వచ్చే అవకాశం ఉందా? ఆయన్ని చేసుకుంటే నాకు, పుట్టబోయే పిల్లలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా?
 - ప్రేమలత, విజయవాడ


 టీబీ వచ్చింది పదిహేనేళ్ల క్రితం కదా! దానికి చికిత్స కూడా తీసుకున్నారు. పైగా ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి బాగా ఉన్నంత వరకు టీబీ మళ్లీ తిరగబెట్టదు. అతి తక్కువ మందిలో మాత్రమే రక్తహీనత, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల టీబీ తిరగబెడుతుంది. పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని ఆయనకు చెప్పండి.

ఏ సమస్యా రాదు. అయినా ఇంతకు ముందులాగా ఇప్పుడు టీబీ అనగానే భయపడాల్సిన పని లేదు. దాన్ని తగ్గించే మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఆయనకు టీబీ వచ్చి తగ్గినంత మాత్రాన పుట్టే పిల్లలకు సమస్యలు వస్తాయని భయపడటం కూడా అనవసరం. అలా ఏమీ రావు. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా ధైర్యంగా పెళ్లి చేసుకోండి.
 
నా వయసు 28. ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డకు సిజేరియన్ అయ్యింది. అయితే అయ్యి సంవత్సరం కావస్తోన్నా నా కుట్లు ఇప్పటికీ నొప్పి వస్తున్నాయి. ఎప్పుడూ నొప్పి ఉండదు కానీ ఉన్నట్టుండి సడెన్‌గా చురుక్కు చురుక్కుమంటున్నట్టు అనిపిస్తుంది. కుట్లు ఉన్నచోట బాగా దురదగా కూడా ఉంటోంది. ఎందుకిలా అవుతోంది? కుట్లు వేయడంలో ఏదైనా తేడా జరిగిందంటారా?
 - గీతిక, వనస్థలిపురం

 
ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత లోపలి పేగులు, మిగతా అవయవాలు... అంటే గర్భాశయం, మూత్రాశయం ఒకదానికొకటి అంటుకొని కొయ్య కండలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాం టప్పుడు ఆపరేషన్ అయిన సంవత్సరం లేదా ఎక్కువ కాలం అయినా కూడా ఆ కొయ్య కండలు లాగినట్టు అనిపించి నొప్పి కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి నొప్పి వస్తే చేసేదేమీ ఉండదు.

నొప్పి ఉపశమన మాత్రలు మింగడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తే సరిపోతుంది. అలా కాకుండా నొప్పి మరీ ఎక్కువగా ఉండి, తరచుగా వస్తుంటే మాత్రం ఓసారి స్కానింగ్ చేసి, వేరే ఏవైనా సమస్యలు కూడా ఉన్నాయేమోనని చూసుకోవాలి. ఆపైన అవసరమైతే ల్యాపరోస్కోపీ ద్వారా పొట్టమీద చిన్న చిన్న రంధ్రాలు చేసి, లోపల ఉండే కొయ్య కండల్ని తొలగించవచ్చు. అలాగే కుట్ల దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్, అలర్జీ వంటివి ఉన్నా కూడా దురద ఉండవచ్చు. కాబట్టి ఓసారి డాక్టర్‌ని సంప్రదిస్తే కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత అవసరమైన చికిత్స తీసుకోండి.

సాధారణ కాన్పు కావాలంటే బిడ్డ బరువు మరీ ఎక్కువ లేకుండా ఉండాలి. అలాగే బిడ్డ బయటకు వచ్చే దారి కూడా బరువుకు తగ్గట్టే ఉండాలి. అలా లేనప్పుడు బిడ్డ మధ్యలో ఇరుక్కుపోయి, కాన్పు కష్టం అవుతుంది.
 
నా వయసు 21. నాకిప్పుడు ఎనిమిదో నెల. ఎప్పటికప్పుడు అన్ని పరీక్షలూ చేయించుకుంటున్నాను. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. కానీ కాస్త పెద్దగా ఉండటం వల్ల సిజేరియన్ పడొచ్చు అంటున్నారు డాక్టర్. నాకు సిజేరియన్ ఇష్టం లేదు. నార్మల్ డెలివరీ అయితేనే బాగుణ్ననిపిస్తోంది. సిజేరియన్ పడకుండా ఉండేందుకు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
 - రాణి, పెంబర్తి

 
ఎనిమిదో నెలకే బిడ్డ బరువు ఎక్కువ  ఉందంటున్నారు. ఇంకా కాన్పుకి నెలపైనే సమయం ఉంది. ఈ లోపల బిడ్డ ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. సాధారణ కాన్పు కావాలంటే బిడ్డ బరువు మరీ ఎక్కువ లేకుండా ఉండాలి. అలాగే బిడ్డ బయటకు వచ్చే దారి బరువుకు తగ్గట్టే ఉండాలి. అలా లేనప్పుడు బిడ్డ మధ్యలో ఇరుక్కుపోయి, కాన్పు కష్టం అవుతుంది. బిడ్డ బరువు ఇప్పటికే ఎక్కువ ఉంది కాబట్టి ఓసారి మీలో షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయేమో పరీక్ష చేయించుకోండి.

ఇప్పటి నుంచి పొద్దున్న, సాయంత్రం అరగంట పాటు వ్యాయామం చేయండి. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తీసుకుంటూ... స్వీట్లు, షుగర్, తీపి పదార్థాలన్నింటికీ దూరంగా ఉండండి. దీనివల్ల బిడ్డ బరువును కాస్తయినా అదుపు చేయవచ్చు. తొమ్మిదో నెల చివరిలో బిడ్డ బరువును బట్టి, మీ పెల్విస్ వెడల్పును బట్టి సాధారణ కాన్పుకి ఎంత అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.
 - డా॥వేనాటి శోభ
 లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు