అమ్మని కావాలనుంది... అవకాశం లేదా?!

29 Nov, 2015 00:20 IST|Sakshi
అమ్మని కావాలనుంది... అవకాశం లేదా?!

నా వయసు 22. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 80 కిలోలు. ఇంతకు ముందు ఇంత లావు ఉండేదాన్ని కాదు. ఈ మధ్యనే ఎందుకో బాగా పెరిగాను. అలా అని వ్యాయామం లేదని కాదు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. పిల్లల వెనుక పరుగులు తీస్తూనే ఉంటాను. వెజిటేరియన్స్‌మి కాబట్టి నాన్‌వెజ్ కూడా తినను. అయినా ఎందుకిలా బరువు పెరుగుతున్నాను?
 - ఎల్.సుజాత, తాడిపత్రి

 
మీ ఎత్తుకి 60-65 కిలోలు బరువు ఉంటే సరిపోతుంది. అంటే మీరు పదిహేను కిలోలు ఎక్కువ ఉన్నారు. అధిక బరువు తగ్గాలంటే తప్పకుండా శారీరక శ్రమ అవసరం. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఎన్ని పనులు చేసినా, దాని వల్ల పెద్దగా బరువు తగ్గరు. పొద్దున్న, సాయంకాలం నలభై అయిదు నిమిషాల నుంచి గంట పాటు వాకింగ్, యోగా వంటివి చేయండి. లేదంటే జిమ్‌కి వెళ్లండి.

చెమట పట్టేంతగా శ్రమ చేసినప్పుడే ఒంట్లో కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు. అలాగే ఆహార నియమాలు పాటించండి. అన్నం తక్కువగా కూరలు ఎక్కువగా తీసుకోండి. స్వీట్లు, కొవ్వుతో కూడిన పదార్థాలు, వేపుళ్లు, నూనె వస్తువులు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

ఇవన్నీ చేస్తూ డాక్టర్ సలహాతో కొవ్వు తగ్గడానికి మందులు కూడా వాడవచ్చు. ఉన్నట్టుండి బరువు పెరిగానంటున్నారు కాబట్టి థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవడం మంచిది. థైరాయిడ్, సీబీపీ, ఆర్‌బీఎస్, లిపిడ్ ప్రొఫైల్ లాంటి రక్త పరీక్షలు చెయ్యించుకుని, ఫలితాలను బట్టి మందులు వాడాలి.
 
నా వయసు 39. ఇద్దరు పిల్లలు. ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా అయిపోయింది. ఈ మధ్య ఎందుకో నెలసరి క్రమం తప్పుతోంది. పైగా బ్లీడింగ్ కూడా సరిగ్గా అవ్వడం లేదు. ఒకటిన్నర రోజో, రెండు రోజులో అయ్యి ఆగిపోతోంది. ఆ సమయంలో కాళ్లు కూడా బాగా గుంజుతున్నాయి. మొదట్నుంచీ ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదుర్కోలేదు. ఇప్పుడెందుకిలా?
 - విజయలక్ష్మి, అనంతపూర్

 
వయసు పెరిగేకొద్దీ హార్మోన్లలో మార్పుల వల్ల, గర్భాశయంలో మార్పులు రావడం వల్ల, అండాశయాల్లో నీటి తిత్తులు, సిస్టులు ఏర్పడటం వల్ల... ఇలా కొన్ని కారణాల చేత పీరియడ్స్ క్రమం తప్పడం, బ్లీడింగ్ కొద్దిగానే అవ్వడం జరగవచ్చు. కొందరిలో మానసిక ఒత్తిడి, ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా అలా జరగవచ్చు.

కొంతమందికి పీరియడ్స్ సమయంలో కాళ్లనొప్పులు, నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి వంటివి కూడా ఉంటాయి. కాబట్టి మీరోసారి గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి అవసరమైన హార్మోన్ టెస్టులన్నీ చేయించుకోండి. రక్తహీనత ఉందేమో తెలుసుకోడానికి సీబీపీ వంటి పరీక్షలు కూడా చేయించుకుంటే సమస్య ఎక్కడుందో తెలుస్తుంది. అప్పుడు తగిన చికిత్స చేయించుకోవచ్చు.
 
నా వయసు 34. నాకు ఇరవయ్యేళ్లు ఉన్నప్పుడు పెళ్లయ్యింది. కానీ పొరపొచ్చాలు వచ్చి భర్తతో విడిపోయాను. పిల్లలు లేరు. అప్పటి నుంచీ ఒంటరిగానే ఉన్నాను. అయితే కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి పరిచయమయ్యారు. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన వయసు 38. ఇద్దరం సంతోషంగానే ఉన్నాం. అయితే నాకు పిల్లల్ని కనాలని ఉంది. కానీ ఇప్పటికే ముప్ఫై అయిదుకు చేరువలో ఉన్నాను కాబట్టి పుడతారో లేదోనని భయమేస్తోంది. ఈ వయసులో నేను పిల్లల కోసం ప్రయత్నించవచ్చా? దాని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఒక్క బిడ్డ కలిగినా చాలు. సలహా ఇవ్వండి.
 - కె.శ్రీవిద్య, సంగారెడ్డి

 
సాధారణంగా ఆడవాళ్లలో ముప్ఫయ్యేళ్లు దాటిన తర్వాత అండాశయాల నుంచి విడుదలయ్యే అండాల నాణ్యత తగ్గడం మొదలవుతుంది. 35 యేళ్లు దాటాక ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. దానివల్ల గర్భం దాల్చడానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. గర్భం దాల్చిన తర్వాత పిండం సరిగ్గా ఎదగక, అబార్షన్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఏర్పడి, అవయవ లోపాలు ఏర్పడవచ్చు.

సాధారణ జనాభాలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలు 2 శాతం ఉంటే, 30-35 సంవత్సరాల లోపల 4 శాతం, ఆ వయసు దాటాక 6 శాతం ఉంటాయి. మీకు 34 సం॥కాబట్టి తప్పకుండా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. కాకపోతే సాధారణ గర్భం కోసం ఎక్కువ నెలలు ఎదురు చూడకుండా, ఆరు నెలలు ప్రయత్నించండి. ఆ సమయం దాటివుంటే ఓసారి గైనకాలజిస్టును కలిసి, అవసరమైన హార్మోన్ పరీక్షలు, స్కానింగ్ వంటివన్నీ చేయించుకోండి. ఆపైన త్వరగా గర్భం రావడానికి మందులు వాడితే మంచిది.

ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతూ, గర్భం వచ్చిన తర్వాత బిడ్డలో ఏమైనా సమస్యలు ఉంటే ముందే తెలుసుకోవడానికి మూడో నెలలో ఎన్.టి.స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్, ఐదో నెలలో టిఫా స్కాన్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్, ఆరో నెలల 2 డి ఫీటల్ ఎకో వంటి పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఏమాత్రం అధైర్య పడకుండా ప్రయత్నించండి. తప్పకుండా మీ ఆశ నెరవేరుతుంది.
 
నా వయసు 23. పెళ్లై నాలుగు నెలలు అవుతోంది. అప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నాం. అందుకే మాత్రలు వాడుతున్నాను. అయితే రోజూ గుర్తు పెట్టుకుని వేసుకోవడం కష్టంగా అనిపిస్తోంది. లూప్ వేసుకుంటే బెటరని నా ఫ్రెండ్ అంది. అది ఎవరైనా వేయించుకోవచ్చా? వేసేటప్పుడు నొప్పి ఏమైనా వస్తుందా? తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఈ సందేహాలతో డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నాను. ఏం చేయమంటారు?
 -  కీర్తన, తాడేపల్లిగూడెం

 
లూప్ లేదా కాపర్-టి, ఐయూసీడీ అనేది గర్భం రాకుండా గర్భాశయంలో వేసే చిన్న ప్లాస్టిక్ పరికరం. దీన్ని సాధారణంగా ఒక కాన్పు తర్వాత వెయ్యించుకుంటే మంచిదని సలహా ఇస్తుంటాం. ఎందుకంటే దీనివల్ల కొందరిలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని గుర్తించక అశ్రద్ధ చేస్తే, ట్యూబ్స్ మూసుకుపోయి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి కనీసం ఒక్క బిడ్డయినా పుట్టిన తర్వాతే దీన్ని వేయించుకోవడం మంచిది. ముందే వేయించుకుంటే ఒక కాన్పు కూడా కాలేదు కాబట్టి, గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉండి, కొద్దిగా నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.
 
నా వయసు 28. మావారి వయసు 31. మాకు పెళ్లై ఎనిమిదేళ్లు అయ్యింది. ఇద్దరు బాబులు ఉన్నారు. రెండో బాబు వయసు ఏడాదిన్నర. వాడు పుట్టినప్పుడే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాను. కానీ ఈ మధ్య మావారు ఒక పాప ఉంటే బాగుంటుంది అంటున్నారు. నాకూ ఆయన కోరిక తీర్చాలనే ఉంది. కానీ ఆపరేషన్ అయిపోయాక అదెలా సాధ్యమవుతుంది? ఏదైనా అవకాశం ఉంటుందా?
 - వై.అన్నపూర్ణ, రామగుండం

 
ఈ కాలంలో ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఇద్దరు ఉంటే చాలు. అబ్బాయిలున్నారు అమ్మాయి లేదని, లేకపోతే అమ్మాయిలున్నారు అబ్బాయి లేడని కనుకుంటూ పోతే... తర్వాతి కాలంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉన్న ఇద్దరినీ బాగా చదివించి, మంచి బుద్ధులు నేర్పించి, వాళ్లని మంచి పౌరులుగా తీర్చిదిద్దితే అంతకన్నా ఆనందం ఏముంటుంది! మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది. అయినా అమ్మాయి కోసం ప్రయత్నం చెయ్యాలని అనుకుంటుంటే...

రీక్యానలైజేషన్ ఆపరేషన్ ద్వారా కట్ చేసిన ట్యూబ్‌ను మళ్లీ అతికించే ప్రయత్నం చేయవచ్చు. ఈ ఆపరేషన్ చేస్తే గర్భం వచ్చే అవకాశాలు 40 శాతం మాత్రమే ఉంటాయి. ఒకవేళ గర్భం దాల్చినా అమ్మాయే పుడుతుందన్న గ్యారంటీ లేదు కదా! పైగా ఒక్కోసారి గర్భం ట్యూబ్‌లో కూడా రావొచ్చు. అది ప్రమాదకరం. పిల్లలు లేకపోతేనో, ఒక్క బిడ్డే ఉండి ఇంకొకరు కావాలంటేనో రిస్క్ తీసుకుని ఈ ఆపరేషన్‌కు వెళ్లవచ్చు కానీ, మీరు ఇలా చేయడం అంత మంచిది కాదేమో. ఒక్కసారి ఆలోచించండి. మరీ అంతగా కావాలనుకుంటే టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించండి.
 
నా వయసు 24. పెళ్లై ఏడు నెలలు అయ్యింది. ఈ మధ్య నెలసరి రాకపోవడంతో చెకప్ చేయించుకుంటే గర్భవతినని తేలింది. అయితే నేను చాలా పొట్టిగా ఉంటాను. నా గర్భసంచి కూడా చాలా చిన్నగా ఉందట. అందులో బిడ్డ సరిగ్గా ఎదగలేదు, బిడ్డను మోసే శక్తి కూడా నీ గర్భసంచికి లేదు, అబార్షన్ చేయించుకుంటే మంచిది అన్నారు డాక్టర్. నేను నా బిడ్డను చంపుకోలేను. దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి.
 - సునంద, అనకాపల్లి

 
గర్భాశయం చిన్నగా ఉన్నప్పుడు... కొందరి శరీర తత్వాన్ని బట్టి, గర్భం వచ్చాక వారిలో విడుదలయ్యే హార్మోన్లను బట్టి కొద్దిగా పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే లోపల పెరిగే బిడ్డ... గర్భాశయం విచ్చుకునేదాన్ని బట్టి బరువు పెరుగుతుంది. కొందరిలో అబార్షన్లు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఏడెనిమిది నెలల్లో కాన్పు అయిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

ఇప్పుడు గర్భం వచ్చేసింది కాబట్టి ప్రొజెస్టరాన్ హార్మోన్ ట్యాబ్లెట్లు, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, నెలనెలా అవసరాన్ని బట్టి స్కానింగ్ చేయించుకోండి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండి, 4, 5 నెలల్లో గర్భాశయానికి కుట్లు వేయించుకుని చూడండి. ఇంక వేరే అవకాశం లేదు కాబట్టి ముందే గర్భం తీయించుకునే బదులు, పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోండి.

కనీసం బిడ్డ ఏడో నెల దాకా ఎదిగి, ఒక కిలోకి పైన బరువు పెరిగినా మంచిదే. ఇప్పుడున్న ఆధునిక చికిత్సల్లో ఎన్.ఐ.సి.యు.లో పెట్టి బిడ్డను బతికించుకునే అవకాశాలు ఉన్నాయి. అలా చేసినా ఫలితం లేనప్పుడు... కాన్పు మీద కాన్పుకి గర్భాశయం కొద్దిగా విచ్చుకుని... ఆ తర్వాత కాన్పుకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.
- డా॥వేనాటి శోభ
 లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు