కలల రాకుమారుడు

18 Oct, 2015 18:23 IST|Sakshi
ప్రాణం పోసిన బంధం: రాబర్‌‌ట, మెలిస్సా

గ్రేట్ లవ్ స్టోరీస్
* మొదట అతడు అపరిచితుడు.
* తర్వాత స్నేహితుడు.
* ఇప్పుడు ప్రాణనాథుడు.

‘నిన్ను కలిసే వరకు తెలియదు...
నాలో నవ్వుందని...
ఆ నవ్వులో ఒక మెరుపు ఉందని...
ఆ మెరుపులో ఒక హృదయం ఉందని...
ఆ హృదయం  నీదేనని!’

   
‘నా మీద నీకు ప్రేమ పోయింది. నన్ను మోసం చేసి ఎవరినో ప్రేమిస్తు న్నావు’... అదే పనిగా తిడుతున్నాడు రాబర్‌‌ట. అతడి మాటల్లో అహంకారం, అనుమానం, అర్థం లేని ఆవేశం!
 ‘మెలిస్సా... నువ్వు పుట్టి ఉండకపోతే నా జీవితం వృథా అయ్యి ఉండేది’ అంటూ అతను ఎప్పుడూ అనే మాట గుర్తొచ్చింది మెలిస్సాకి. అతడేనా ఇలా మాట్లాడుతోంది! ఈ మగాళ్లు ఇంతేనా... ప్రేమించే వరకు ప్రేమ ప్రేమ అంటారు. ప్రేమించడం మొదలు పెట్టిన తరువాత... అధికారాన్ని, అహంకారాన్ని  ప్రదర్శించడం ప్రారంభిస్తారు.
 
విసుగొచ్చిందామెకి. రోజురోజుకీ రాబర్‌‌టలో చెప్పలేని మార్పు వస్తోంది. పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. చివరికి ఈ రోజు నడిరోడ్డు మీద నిలబడి తనను అవమానిస్తున్నాడు. ఇక తట్టుకోలేక పోయింది.
 ‘‘నిన్ను ప్రేమించినందుకు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను రాబర్‌‌ట. ఇక ఎప్పుడూ నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు’’ అనేసి అక్కడ్నుంచి కదిలింది.
 నాలుగడుగులు వేసిందో లేదో... ఏదో పదునైన వస్తువు సూటిగా వెన్నులో దిగింది. తేరుకునేలోపే నడుము దగ్గర... ఆ తర్వాత భుజాలపై... ఆపైన కడుపులో... చేతుల మీద... కాళ్ల మీద... ముఖమ్మీద... విచక్షణారహితంగా ఒళ్లంతా కత్తులతో పొడుస్తున్నాడు రాబర్‌‌ట. మెలిస్సా అరుస్తోంది. బాధతో విలవిల్లాడుతోంది.     
 చుట్టూ చాలామంది ఉన్నారు. అందరూ అవాక్కయి చూస్తున్నారే తప్ప రక్షించే ప్రయత్నమేదీ చేయడం లేదు.
 
కానీ ఎక్కడ్నుంచి దూసుకొచ్చాడో... వాయువేగంతో వచ్చాడు క్యామెరాన్ హిల్. అప్పటికే మెలిస్సా ఒంట్లో ముప్ఫై రెండుసార్లు దిగింది కత్తి. మరోసారి దిగబోతోంటే అడ్డుకున్నాడు క్యామెరాన్. రాబర్ట్ ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. తట్టుకోలేక పారిపోయాడు రాబర్‌‌ట.  
 
క్యామెరాన్ వేగంగా కదిలాడు. మెలిస్సాకు ఫస్ట్ ఎయిడ్ చేశాడు. రెండు చేతుల్లో ఎత్తుకుని కారువైపు పరుగెత్తాడు. ఆమెను తీసుకుని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆమెను డాక్టర్ల చేతుల్లో పెట్టి, దేవుడికి ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. మెలిస్సా చేసుకున్న పుణ్యమో, డాక్టర్ల నైపుణ్యమో, లేక క్యామెరాన్ ప్రార్థనల ఫలితమో... గండం గడిచింది. మెలిస్సా మృత్యులోయ నుంచి తిరిగి వచ్చింది.
 
బతకడమంటే బతికింది కానీ మెలిస్సా మళ్లీ మాట్లాడగలదా, నవ్వ గలదా, నడవగలదా అని సందేహపడ్డారు డాక్టర్లు. కానీ ఆమె అవన్నీ చేయగలిగింది. అందుకు కారణం... క్యామెరాన్. అతడు తన పని అయిపోయిందని వెళ్లిపోలేదు. రోజూ వచ్చి మెలిస్సాని కలిసేవాడు. ఆమెకి ఏం కావాలో అడిగి తెలుసుకునే వాడు. అధైర్యపడితే ధైర్యం నూరి పోసేవాడు. అణువణువునా కొత్త ఆశల్ని నింపేవాడు. అందుకే ఆమె మళ్లీ మామూలు మనిషి అయ్యింది.
 
రోజులు గడిచాయి. వాళ్ల స్నేహమూ పెరిగి పెద్దదయ్యింది. ఓ రోజు పీటర్స్‌బర్గ్ (ఫ్లోరిడా)లోని ట్రోపికన్ ఫీల్డ్‌లో బేస్‌బాల్ ఆడుతోంది మెలిస్సా. ఓ బేస్‌బాల్ మీద ‘నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా?’ అని రాసి విసిరాడు క్యామెరాన్. నమ్మబుద్ధి కాలేదామెకి. ఎందుకంటే, తనలో ఇంతకుముందు ఉన్న అందం లేదు. కత్తిపోట్లతో కళ తప్పింది. అయినా అతను తనను ఇష్టపడు తున్నాడా అనుకుంది. కానీ అది నిజమే. అతను ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె అంగీకారంతో ప్రాణదాత కాస్తా ప్రాణనాథుడయ్యాడు. ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించ డానికి రాకుమారుడు ప్రదర్శించే సాహసాన్ని జానపద కథల్లో చదివిన మెలిస్సాకి... తన కలల రాకుమారుడిలా కన్పించాడు క్యామెరాన్!                            
- యాకూబ్ పాషా

మరిన్ని వార్తలు