విదుర నీతి

10 Nov, 2019 04:08 IST|Sakshi

పాండవులతో యుద్ధం తప్పదని తెలిసిన ధృతరాష్ట్రుడు, జరగబోయే పరిణామాల గురించి ఆలోచించి కలవరపడుతూ విదురుని పిలిచి ‘‘విదురా! నాకు మనసు అస్థిమితంగా ఉంది. నాకు మంచిమాటలు చెప్పి, ఉపశాంతి కలిగించు’’ అని అడిగాడు. అప్పుడు విదురుడు అతనితో ఇలా అన్నాడు. ‘పక్వానికి రాక మునుపే పండును కోస్తే తినడానికి రుచిగా ఉండక పోవడమే కాక, దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. దండలు కట్టేవాడు చెట్టునుంచి పువ్వులు కోసే విధంగా, తేనెటీగలు పూవు నుంచి తేనెను గ్రహించే విధంగా ఎదుటివాడు బాధ పడకుండా పనిచేసి ఫలితాన్ని పొందాలి. అంతేకాని బొగ్గుల కోసం చెట్టు మొదలంటా నరకకూడదు. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి, తేజస్సుకు, ఈర‡్ష్య చెందే వాడు ఏ రోగం లేకుండానే బాధ పడతాడు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోతే మాట్లాడకుండా ఊరకే ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మం, పాపం, కీర్తి, అపకీర్తి కలుగుతాయి.

గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది. కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. శరీరంలో విరిగిన బాణాలను ఉపాయంతో తొలగించవచ్చు కానీ మనసులో నాటుకున్న మాటలనే గాయాలను ఎన్ని ఉపాయాలతోనైనా మాన్పలేము. ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు. కాని నీ కొడుకులు ఒకరిని మించి ఒకరు నీచవాక్యాలు అనేకం పేలుతూ ఉంటే నీవు దానిని జంకూగొంకూ లేకుండా వింటూ ఊరుకుంటున్నావు. నీకు ఇది తగునా? చేటు కాలం దాపురించినప్పుడు  చెడ్డ మాటలు, చెడు చేతలూ కూడా   మనసుకు ధర్మ బద్ధంగానే కనిపిస్తాయి. పాండురాజు నీ సోదరుడు. అతని కుమారులు కూడా నీకు తేజస్సు, లాభం సంపాదించి పెట్టారు. వారిని ఆదరించు. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది. మిక్కిలిగా దుఃఖిస్తే  శత్రువుకు అది సంతోషాన్ని చేకూరుస్తుంది కనుక దుఃఖించడం మాను. జ్ఞాతి వైరం వదిలి పెట్టు. అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఎవరూ కన్నెత్తి చూడలేరు.

వేరుగా ఉంటే శత్రువుకు లోకువైపోతారు. కాబట్టి కౌరవులు, పాండవులు ఒకరికొకరు అండగా ఉంటే శత్రువుకు జయించరానివారు అవుతారు. పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను రక్షించుకో. సహాయం సంపదను బట్టి, సంపద సహాయాన్ని బట్టి ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కూడి ఉంటే గాని సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకు, వారి సహాయం నీకు ప్రీతి కలిగిస్తుంది. పరస్పరం కలిసి ఉండడం మేలు. ధర్మరాజును వదిలిపెట్టకు. మనసు గట్టిచేసుకొని నీ కొడుకులకు, మంత్రులకు సంధి చేసుకోమని చెప్పు’’ అన్నాడు. ధృతరాష్ట్రుడు ‘‘విదురా! నీ మాటలు నా మనసును తేటపరిచాయి. ఆలోచిస్తే ఇదే తగిన పని అనిపిస్తోంది. అలాగే చేస్తాను’’ అన్నాడు. పైకి అలా అన్నాడు కానీ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహం, రాజ్యకాంక్ష, దాయాది వైరం వదులుకోలేక నశించిపోయాడు. ఇందులో మనం గ్రహించవలసిన నీతులు అనేకం ఉన్నాయి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు