ఎర్త్ టు మార్స్ 2014!

29 Dec, 2013 03:21 IST|Sakshi
ఎర్త్ టు మార్స్ 2014!

 ప్రత్యేకం
 
 2013లో...
 రష్యాలో గ్రహశకలం కలకలం పుట్టించింది.
 భూమిలాంటి గ్రహాలు మరిన్ని దొరికాయి.
 ఓ ఆస్టరాయిడ్ భూమి సమీపం నుంచే దూసుకుపోయింది.
 వొయెజర్-1 సౌరకుటుంబం అంచులు దాటేసింది.
 భారత ఉపగ్రహం అంగారక యాత్రకు బయలుదేరింది.
 చైనా తొలి రోవర్ చంద్రుడిపై వాలిపోయింది.
 మరి 2014లో?
 శాస్త్రసాంకేతిక రంగంలో ఎలాంటి మార్పులు రానున్నాయి?
 అంతరిక్ష అన్వేషణ ఏ మలుపులు తిరగనుంది?  
 
 ప్రపంచ విజ్ఞాన రంగం ఏటికేడాదీ వడివడిగా అడుగులు వేస్తోంది. భారత్‌తో సహా అనేక వర్ధమాన దేశాలు అగ్రదేశాలకు దీటుగా అంతరిక్ష శోధనకు, క్షిపణి పరిజ్ఞాన సముపార్జనకూ నడుం బిగించాయి. దేశాలు, ప్రైవేటు కంపెనీల మధ్య పోటీ నేపథ్యంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. క్రితం ఏడాదితో పోలిస్తే 2014లో భూగోళం నుంచి ఖగోళం దాకా మరిన్ని పరిశోధనలు ఊపందుకోనున్నాయి. అమెరికా, భారత్‌లు పంపిన మావెన్, మామ్ ఉపగ్రహాలు అరుణగ్రహాన్ని చేరుకుని ఏడాది చివరికల్లా శోధన మొదలు పెట్టనున్నాయి. పదిహేను ఏళ్లుగా సాగుతున్న అగ్రదేశాల అంతరిక్ష ప్రయోగశాల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నిర్మాణం ఎట్టకేలకు పూర్తికానుంది. గ్రహశకలాల మైనింగ్ కోసం ప్రయత్నాలూ ప్రారంభం కానున్నాయి. మూలకణ చికిత్సలు, జీన్‌థెరపీలు, త్రీడీ ప్రింటింగ్ వంటి సాంకేతికతల్లోనూ విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
 
 రోసెట్టా నిద్రలేస్తుంది..!
 అదో వ్యోమనౌక. పేరు రోసెట్టా. 2004లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది.  ఇప్పటిదాకా పలుసార్లు భూమి, అంగారక గ్రహాల సమీపం గుండా సూర్యుడిని చుట్టేసి వచ్చిన రోసెట్టా 2011 జూలైలో నిద్రాణస్థితిలోకి వెళ్లింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జనవరి 20, 2014న గాఢనిద్ర నుంచి మేలుకోనుంది. ఎందుకంటే.. ఓ తోకచుక్కపై దిగిపోవడం కోసం! అవును రోసెట్టాను పంపిందే ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కపై దిగడం కోసం. ఇన్నేళ్లూ.. దిగకుండా ఇది ఎందుకు చక్కర్లు కొట్టిందని అనుకుంటున్నారు కదూ. సూర్యుడి చుట్టూ గంటకు లక్ష కి.మీ. వేగంతో తిరుగుతూ ఆ తోకచుక్క స్పీడును సరిగ్గా అందుకోవడానికే ఇన్నేళ్లు పట్టింది మరి! గ్రహాలు ఏర్పడకముందు సౌరకుటుంబంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఈ అధ్యయనంతో తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోసెట్టా మిషన్ మొత్తం ఖర్చు సుమారు రూ.9 వేల కోట్లు కానుందని అంచనా. ఈ మిషన్ విజయవంతం అయితే గనక.. ఉల్కల మైనింగ్ చేపట్టి ఖనిజాలు తోడుకునేందుకూ మార్గం సుగమం కానుంది.  
 
  జీఎస్‌ఎల్‌వీ... సత్తా చాటేనా?
 అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగంతో క్షిపణి సాంకేతికతలో అగ్రదేశాలకు దీటుగా సత్తా చాటిన భారత్ జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రయోగంలో మాత్రం ఇంకా విజయం సాధించాల్సి ఉంది. 2013 ఆగస్టు 19న నెల్లూరులోని శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ డీ-5 రాకెట్ ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉండగా.. ఆఖరి గంటలో ఇంధన లీకేజీ వల్ల వాయిదా పడింది. రాకెట్‌ను పూర్తిగా విడదీసేసి, మళ్లీ అనుసంధానం చేస్తున్న ఇస్రో 2014 జనవరిలో ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే 1992లోనే క్రయోజెనిక్ టెక్నాలజీని భారత్‌కు అమ్మేందుకు రష్యా సిద్ధపడినప్పటికీ.. అమెరికా ఆంక్షల వల్ల వెనకడుగేసింది. ఈ నేపథ్యంలో స్వదేశీయ జీఎస్‌ఎల్‌వీ ప్రయోగంతో సత్తా చాటితే గనక.. అమెరికా కన్నుకుట్టే విజయాన్ని భారత్ సాధించినట్టే. అది 2014లోనైనా సాధ్యమవ్వాలని కోరుకుందాం.  
 
 అరుణగ్రహాన్ని చేరనున్న మామ్!
 అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో నవంబరు 5, 2013న ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్-మంగళ్‌యాన్) ఉపగ్రహం రోదసిలో రోజుకు 10 లక్షల కి.మీ. వేగంతో విజయవంతంగా దూసుకుపోతోంది. సుమారు 10 నెలలపాటు 68 కోట్ల కి.మీ. ప్రయాణించి అది 2014 సెప్టెంబరు 24న అంగారకుడి కక్ష్యను చేరుకోనుంది. అంగారకుడిపైకి ఇదివరకే రోవర్లు, ల్యాండర్లను పంపిన అమెరికా నవంబరు 18న మావెన్ అనే మరో ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించింది. అది కూడా 2014 సెప్టెంబరు 22న మార్స్ కక్ష్యను చేరనుందని అంచనా. ఈ రెండు ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని ఇస్రో, నాసాలు పరస్పరం అందించుకుంటూ పరిశోధనలు చేపట్టనున్నాయి. అయితే మావెన్ మిషన్ ఖర్చు (485 మిలియన్ డాలర్లు)తో పోలిస్తే మామ్ మిషన్ ఖర్చు చాలా తక్కువ (రూ.450 కోట్లు-69 మిలియన్ డాలర్లు) మాత్రమే కావడం విశేషం.
 
 మార్స్ మీదుగా దూసుకుపోనున్న తోకచుక్క!
 సైడింగ్ స్ప్రింగ్ (సీ/2013 ఏ1) అనే ఓ తోకచుక్క 2014 అక్టోబరు 19న అంగారకుడికి అత్యంత సమీపం నుంచే దూసుకుపోనుండటంతో శాస్త్రవేత్తల్లో ఒక పక్క ఉత్సాహం, మరో పక్క గుబులూ కలుగుతోంది. ఆ తోకచుక్క మార్స్‌ను ఢీకొట్టకున్నా.. దాని శకలాలు అంగారకుడి చుట్టూ తిరుగుతున్న వ్యోమనౌకకు ముప్పును తెస్తాయేమోనన్న ఆందోళనా వ్యక్తం అవుతోంది.
 
 గూగుల్ అంతరిక్ష పోటీ .. నిలిచేదెవరో?
 మరో రెండేళ్లలో అంతరిక్ష రేసులకూ తెర లేవనుంది. ఎక్స్ ప్రై జ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ రోదసీ పోటీలకు ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. పోటీ ఏమిటంటే.. చంద్రుడిపైకి రోబోటిక్ వ్యోమనౌకను పంపాలి. అది చంద్రుడిపై అపోలో మిషన్ సైట్‌లో దిగి కనీసం అరకిలోమీటరు దూరం తిరగాలి. భూమికి ఫొటోలు, ఇతర సమాచారం కూడా పంపాలి. అలా చే స్తే పోటీలో విజేతలైనట్లే. ప్రై వేటు నిధులతో ఏర్పాట్లు చేసుకున్న బృంద సభ్యులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులు. మొదటి విజేతకు 30 మిలియన్ డాలర్లు (రూ.185 కోట్లు), రెండో విజేతకు 10 మిలియన్ డాలర్లు (రూ.61 కోట్లు) ప్రైజ్‌మనీ. పోటీకి తుదిగడువు 2015, డిసెంబరు 31. తొలుత 34 టీంలు బరిలో నిలవగా.. కొందరు తప్పుకోవడం, మరికొందరు విలీనం కావడంతో 20 టీంలు మాత్రమే మిగిలాయి. వీరిలో  భారత్‌కు చెందిన ఏకైక బృందం ‘టీం ఇండస్’ కూడా ఉండటం విశేషం.  ఢిల్లీకి చెందిన రాహుల్ నారాయణ్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు.
 
 రోదసీ టెక్నాలజీతో కృత్రిమ గుండె!
 గుండెజబ్బుల వల్ల అభివృద్ది చెందుతున్న దేశాల్లోనే ఏటా 10 కోట్ల మంది మృత్యువాత పడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు దాత లు దొరకకపోవడమూ సమస్యను పెంచుతోంది. అందువల్ల అచ్చం మనిషి గుండె మాదిరిగానే అత్యంత కచ్చితత్వంతో పనిచేసే కృత్రిమ గుండె తయారీ చేయడమే దీనికి చక్కని పరిష్కారం. ఫ్రాన్స్‌కు చెందిన కార్డియాక్ సర్జన్ ప్రొఫెసర్ అలియన్ కార్పెంటీర్ సరిగ్గా అలాంటి గుండెనే ఆవిష్కరించారు. ఏరోస్పేస్ కంపెనీ ఆస్ట్రియమ్‌తో కలిసి కొన్నేళ్లపాటు పరిశోధనలు చేపట్టిన కార్పెంటీర్ ఎట్టకేలకు ఉపగ్రహాలు, రాకెట్ల టెక్నాలజీని వైద్యరంగానికి అన్వయిస్తూ.. అత్యంత  సమర్థమైన గుండెను రూపొందించారు. దీనిని ఫ్రాన్స్‌లో ఓ రోగికి అమర్చి పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2014 చివరి నాటికే ఈ గుండె అందుబాటులోకి రానుంది.
  హన్మిరెడ్డి యెద్దుల
 
 2014... కుటుంబ సేద్య సంవత్సరం
 అంతర్జాతీయ ప్రయోజనాల కోసం ఏటా ఓ సమస్య లేదా అంశానికి ప్రాధాన్యమిస్తూ దాని పేరుతో అంతర్జాతీయ సంవత్సరాలను ప్రకటించిన ఐక్యరాజ్యసమితి.. 2014ను ‘అంతర్జాతీయ ఫ్యామిలీ ఫార్మింగ్(కుటుంబ వ్యవసాయం) అండ్ క్రిస్టలోగ్రఫీ’ సంవత్సరంగా పాటించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా రైతు కుటుంబాలను, వారి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతు సంఘాలను పటిష్టం చేయడం, క్షేత్రస్థాయిలో వివిధ దేశాల ప్రభుత్వాలు, సంస్థల సహకారంతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. అలాగే  క్రిస్టలోగ్రఫీ (స్ఫటిక విజ్ఞానశాస్త్రం) పురోగతికి కూడా ఈ ఏడాది పాటుపడాలని ఐరాస పిలుపునిచ్చింది.
 
 
 

మరిన్ని వార్తలు