విముక్తి పథంలో...

2 Sep, 2017 23:46 IST|Sakshi
విముక్తి పథంలో...

చదువు అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. కానీ రాజస్తాన్‌లోని యాభై శాతం మంది ఆడపిల్లలకు చదువు ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇక మురికివాడల్లో నివసించే ఆడపిల్లలకు చదువు అనేది గగనకుసుమం. ఇంటిపని చేయడమే తమ బాధ్యత అనుకునే పరిస్థితి ఉంది. జైపూర్‌లోని లావలీన సోగాని ఇంటికి సెక్యూరిటీ గార్డ్‌ కూతురు సంగీత  వచ్చి, లావలీన పిల్లలతో ఆడుకునేది. ఒకరోజు పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇచ్చారు లావలీన. వారితో పాటు సంగీతకు కూడా ఇవ్వబోయారు. కానీ ఆ అమ్మాయి తీసుకోలేదు. ‘‘ఎందుకు?’’ అని సంగీతను అడిగారు లావలీన.‘‘బడికి వెళ్లేవాళ్లు మాత్రమే మా ఇంట్లో పాలు తాగాలి’’ అంది సంగీత. ‘‘మరి మీ ఇంట్లో ఎవరెవరు స్కూలుకు వెళతారు?’’ అని అడిగితే...

‘‘మా అన్నయ్య ఒక్కడే వెళతాడు’’ అని చెప్పింది.  ఈ సంఘటన లావలీనను ఆలోచనలోకి నెట్టింది. సంగీత కుటుంబంలోనే కాదు... మురికివాడల్లో చాలామంది కుటుంబపేదరికం వల్ల ఇంటికి ఒకరినే స్కూలుకు పంపుతున్నారు. ఇక ఆడపిల్లలను స్కూలుకు పంపడం అనేది కలలో మాట! ఈ పరిస్థితి గురించి లోతుగా ఆలోచించిన లావలీన ‘విముక్తి’ పేరుతో బాలికల పాఠశాలను ప్రారంభించారు.
‘విముక్తి గర్ల్స్‌ స్కూల్‌’లో పేదింటి ఆడపిల్లలకు ఉచిత విద్య అందిస్తారు. దీంతో పాటు పుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫాం... మొదలైనవి కూడా ఉచితంగా ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన వసతి ఉంది. పేరెంట్స్‌ మీటింగ్‌కు తల్లిదండ్రులు కచ్చితంగా హాజరయ్యేలా చూడడం ద్వారా... వారికి తమ పిల్లల చదువులపై అవగాహన, ఆసక్తి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. పేరెంట్స్‌ మీటింగ్‌కు తల్లిదండ్రుల హాజరు శాతం 80 నుంచి 90 శాతానికి పెరిగింది.

‘విముక్తి గర్ల్స్‌ స్కూల్‌’లో బుక్‌క్లబ్, కంప్యూటర్‌ ల్యాబ్, సైన్స్‌ల్యాబ్‌... ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఒకప్పుడు 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 600లు దాటింది. విశేషం ఏమిటంటే, ‘పోస్ట్‌ స్కూల్‌ సపోర్ట్‌’ పేరుతో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు... ఉన్నత చదువులు చదవడానికి ప్రవేశపరీక్షలు, పోటీ పరీక్షలకు ఉచిత  శిక్షణ ఇప్పిస్తుంది. వృత్తివిద్యా కోర్సులు నేర్పిస్తుంది విముక్తి. ఒక మంచిపనికి శ్రీకారం చుడితే... మనసున్న మనుషులు అండగా ఉంటారని, చేయూత అందిస్తారని ‘విముక్తి బాలికల పాఠశాల’ చెప్పకనే చెప్పింది.
 

మరిన్ని వార్తలు