ఆ సాళ్ళంటే సృజనాత్మక గీతాలు..

15 Dec, 2019 09:15 IST|Sakshi

ఈవారం కథ

నాగేటి సాళ్ళంటే కేవలం నాగలి కర్రు గీసే గీతలు కావు. ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పండించే సృజనాత్మక గీతాలు.  
నాగేటిసాలంటే సీత.
సీతంటే రామునిలోని నైతిక బలం.
రాముడంటే ఒకానొక భవ్యమైన నాగరికతను రమింపజేసేవాడు.
పొలం దున్నుతూ ఆలోచిస్తున్నాడు పోతన.
 మన సంస్కృతిలో పేర్లంటే కేవలం పేర్లు మాత్రమే కావు. ప్రతి పేరు వెనుకా ఎన్నోఅర్థాలు–పరమార్థాలూ, కథలు– ఇతిహాసాలూ ఉంటాయి. వాటి వెనుక మనసులకి క్రమశిక్షణను అలవరచే నైతిక చలన సూత్రాలు ఉంటాయి. అవే మనుషుల్ని మనుషులతో ముడివేస్తూంటాయి. ఆ ముడులు వెయ్యడంలో ఒకోసారి చిక్కుముడులూ  పీటముడులూ పడిపోతూంటాయి. అన్ని ముడులనీ కేవలం వేళ్ళతో మాత్రమే విడదీయలేము. కొన్నింటిని వివేకంతోనూ మరికొన్నింటిని విజ్ఞానంతోనూ విడదీయాల్సి వస్తుంది.

జ్ఞానమనే క్షేత్రానికి ఆలోచనలే నాగలి కర్రులు. మెదడుతో ఆలోచిస్తే శాస్త్రం–మనసుతో ఆలోచిస్తే సృజన.
తనముందున్న చిక్కుముడిని విడదీయడానికి కల్పన మాత్రమే సరిపోదు. దానికి తగిన విశ్వనీయతని కల్పించాలి. శాస్త్రీయతని జోడించాలి. అప్పుడే అది కాలానికి నిలబడగలదు. లేకపోతే కేవలం అభూత కల్పనలా మిగిలిపోతుందిగానీ సృజనాత్మకత అనిపించుకోదు. ఎలా?
దున్నుతూనే చుట్టూ కలియజూశాడు. దూరంగా చెట్లు. తను ముందుకు వెళ్తుంటే అవి వెనక్కి నడుస్తున్నాయి. తను ముందుకు నడవడం నిజం. అవి వెనక్కి వెళ్ళడం అబద్ధం.
అలాగని ఆ చెట్లు వెనక్కి నడుస్తున్నట్లు కనిపించడం కేవలం కనికట్టు కాదు. దానివెనక ఏదో శాస్త్రీయమైన భౌతిక సత్యం ఉంది. ఏమిటది?

∙∙ 
గుర్రం బండి వేగంగా పరిగెడుతోంది.
అందులో వస్తున్న బొమ్మనాయకుడికి, ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా నడుస్తున్న పోతన కనిపించాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితుడు. స్నేహాన్ని స్వంతానికి ఉపయోగించుకోని సజ్జనుడు. బండిమీద రమ్మని బలవంత పెట్టినా చిరునవ్వుతో నిరాకరిస్తాడే తప్ప, కనీసం స్నేహధర్మంగా అయినా బండెక్కడు. ఆయన పాండిత్యం ఆయనకి నేర్పిన సంస్కారం అలాంటిది. అలాంటి స్నేహితుడు ఉండటం తనకి గర్వకారణం.
పోతన దగ్గరకి రాగానే బొమ్మనాయకుడు బండి ఆపించి,‘‘రా మిత్రమా బండెక్కు’’ అన్నాడు.
ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్నవాడిలా బండెక్కి కూర్చున్నాడు పోతన.
ఆయన్ని పిలవకపోతే బాగుండదనే ఉద్దేశంతో మాత్రమే ఆహ్వానించాడు. కానీ, ఆయన నిజంగానే తన బండెక్కడం అంటే, తన జన్మ తరింపజెయ్యడమే. అందుకే అబ్బురంగా పోతనవైపు చూస్తూ తన ఆనందాన్ని ప్రకటించబోయాడు. కానీ ఆయన దృష్టి తనమీదలేదు. తదేక చిత్తంతో బయటెక్కడో ఏదో వెతుక్కుంటున్నవాడిలా కనిపిస్తున్నారు.

బహుశా ఏ పద్యం గురించో ఆలోచిస్తున్నట్లున్నారు. ఇలాంటప్పుడు ఆయన ఏకాగ్రతకి భంగం కలిగిస్తే సరస్వతీ మాత క్షమించదు.
అందుకే బొమ్మనాయకుడు కూడా మౌనాన్నే ఆశ్రయించాడు.
తదేకంగా బయటికి చూస్తున్నాడు పోతన. బండి వేగంగా పరుగులు తీస్తోంది. దగ్గరగా ఉన్న చెట్టుచేమలు కూడా ఆంతే వేగంగా వెనక్కి పరుగెడుతున్నాయి. కానీ, దూరంగా ఉన్న కొండగుట్టలు మాత్రం వెనక్కి కాకుండా ముందుకి నడుస్తున్నాయి. ఇవి వెనక్కీ అవి ముందుకీ ఎందుకు వెళుతున్నాయి? ఎక్కడికెళుతున్నాయి? వేగం ఇంకాస్త పెరిగితే మరింత వివరం తెలుస్తుందేమో చూడాలి.

బండి వేగాన్ని పెంచమన్నాడు పోతన. దాని వేగం పెరుగుతున్నకొద్దీ ఇవతలివైపు చెట్లూ, అవతలివైపు కొండలూ మరింత వేగంగా పరిగెడుతున్నాయి.
ఈసారి దృష్టిని  ఒక తాడిచెట్టుమీద నిలిపి చూడటం మొదలుపెట్టాడు. అవి ముందుకీ ఇవి వెనక్కీ మాత్రమే పరుగులు తీయడం లేదు. ఇటువైపు చెట్టుచేమలూ–అటువైపు కొండకోనలూ కలిసి ఒక దీర్ఘవృత్తాన్ని ఏర్పరుస్తూ ఆ తాడిచెట్టు చుట్టూ పరుగులు తీస్తున్నట్లనిపిస్తోంది. చిన్నప్పుడు ఆడిన మట్టి బొంగరం గుర్తొచ్చింది. దానికి ముల్లుగా గుచ్చిన కొబ్బరి ఈను పుల్లలా కనిపిస్తోందా తాటి చెట్టు.

వెంటనే బొమ్మనాయకుడిని అడిగి ఒక నాణెం తీసుకున్నాడు.  ఏటవాలుగా చూస్తుంటే అది కూడా ఒక దీర్ఘవృత్తంలాగే కనిపించింది. కానీ దాన్ని చేతిలో పెట్టుకుని పైనుండి చూసినప్పుడు మాత్రం గుండ్రని వృత్తంలా కనిపిస్తోంది. అది వృత్తాకారమైతే దానికి కేంద్రం ఉండక తప్పదు. ఆ కేంద్రమే బిందువు.
బిందువంటే పరబ్రహ్మం. ఆది మిథునం. అర్థనారీశ్వరం. రమారమణీయం. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే ఇదేనేమో..ఈ లోకమే అతిపెద్ద శ్రీయంత్రమేమో..ఈ ఊహ రాగానే ఆ శ్రీచక్ర ప్రకృతే ప్రాణం పోసుకు వచ్చి తనని వాత్సల్యంతో గుండెల్లో పొదువుకున్నట్లుగా తోచింది.

అమ్మ స్ఫురణకు వచ్చిన తరువాత చేతిలోని నాణెం కూడా శ్రీయంత్రంలా కనిపించింది. అంటే దాని కేంద్రకమైన బిందువు నుండీ కూడా అంతర్లోక జ్ఞాన వలయాలు విస్తరిస్తూ వెలుగులీనుతాయన్నమాట. కానీ, ఆ వెలుగుల్ని కేవలం నాణెం పరిధి వరకే పరిమితం చేస్తున్నారీ మనుషులు. అందుకే సంపదని దాటి ముందుకు ఆలోచించ లేకపోతున్నారు.
ఈ ఊహ రాగానే నాణెం హఠాత్తుగా మొయ్యలేనంత బరువెక్కిపోయింది. తక్షణమే దాన్ని బొమ్మనాయకుడిచేతిలో పెట్టేసి బండి దిగి వెళ్ళిపోయాడు పోతన.

∙∙ 
పోతనని ఆవరించివున్న శ్రీచక్ర ప్రకృతిలోంచీ ఏదో దివ్యవాణి వినిపిస్తోంది.
చూడాలి. ఇంకా లోతుగా చూడాలి. దాని ఆంతర్యాన్ని కనిపెట్టాలి.
ఇంట్లోకి రాగానే తనకి ‘మహత్వ కవిత్వ పటుత్వ’ సంపదలిచ్చిన దుర్గమ్మతల్లి మెడలోని గాజులహారం కనిపించింది. ఆ గాజుల్ని చూస్తున్నకొద్దీ అమ్మవారు తనకేదో రహస్యాన్ని చెబుతున్నట్లనిపించింది. వెంటనే ఓ గాజుని తీసుకున్నాడు. దాన్ని నిలువునా వేళ్ళమధ్య పట్టుకుని నేలమీద గిరగిరా తిప్పాడు. అది గుండ్రంగా తిరుగుతూ ముందుకీ వెనక్కీ కదులుతోంది. ఆ కదలికల్లో ఒక లయబద్ధత. ఒక నాట్యం. ఒక శాస్త్రీయత. అవన్నీ ఎక్కడనించీ వచ్చాయా గాజుకి? మళ్ళీ తిప్పాడు. మళ్ళీ కొత్త కదలికలు. కొత్త లయలు. కొత్త హొయలు.అంతేనా, వాటిలో ఇంకేమైనా ఉందా?

అప్పటికి అసుర సంధ్య దాటింది. చెరువునుండి నీళ్ళు తీసుకు వస్తోంది నరసమాంబ. చిన్నపిల్లాడిలా అమ్మవారి గాజులతో ఆడుకుంటున్న భర్తని చూసి మురిపెంగా నవ్వుకుంటూ లోపలకి వెళ్ళి పోయింది.
ఆ నీటికడవని లోపల దింపింది. దీపం వెలిగించి గూట్లో పెట్టింది. ఆ వెలుగు కిరణాలు నీటి కడవని కేవలం తనవైపునుండి మాత్రమే చూపిస్తున్నాయి. రెండవ వైపున గుడ్డి వెలుగులో మసక మసగ్గా కనిపిస్తోంది కడవ. చూస్తూండగానే పోతన మనసులో కడవ భూమండలమైంది. దీపం సూర్యుడైంది. ఆ కడవనే చూస్తున్న తన కన్ను చంద్రుడైంది.
ఆలోచన పదమైంది. పదం పాదమైంది. పాదం పద్యమైంది.

∙∙ 
‘‘నీ ప్రశ్నకి సమాధానం దొరికింది. అది నువ్వన్నట్టు కల్పనా కాదు. నేనన్నట్టు భావనా కాదు. ఆ రెండింటినీ మించిన ‘అనుభవం‘ కూడా కాదు. అందులో ఉన్నది శాస్త్ర పరిజ్ఞానం’’ అన్నాడు మల్లన.
‘‘ఈ మాట చెప్పడానికేనా, హాయిగా నిద్రపోవడం మానేసి నా మొహంలోకి చూస్తూ కూర్చున్నది?’’ అంటూ భర్త ముఖాన్ని ముద్దులతో నింపేసింది శారద.
ముదమారా ముద్దుల జడివానలో తడిసి ముద్దయ్యాడు మల్లన. తరువాత మెల్లగా భార్యని లేపి నిలబెట్టాడు. మంచానికి ఈ పక్క వేసిన ముక్కాలి పీటమీద కూర్చోబెట్టాడు.
బుద్ధిమంతురాల్లా చేతులు కట్టుకుని భర్త ముఖంలోకి కొంటెగా చూస్తూ అడిగింది శారద, ‘‘చెప్పండి శ్రీశైలవాసా’’
మల్లన చిరునవ్వుతో, ‘‘శాస్త్రవిజ్ఞానమంటే చెప్పేది కాదనీ, సాక్ష్యాధారాలతో నిరూపించి చూపేదనీ తెలుసుకోండి భ్రమరాంబాదేవీ’’ అంటూ మంచం పట్టిమీద కూర్చుని అన్నాడు, ‘‘ముందా పద్యాన్ని గుర్తు చేసుకోండి’’
పద్యాన్ని భర్తకి అప్పగించింది శారదరవిబింబం బుపమింపఛి బాత్రమగు ఛత్రంబై, శిరో రత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పద పీఠమై వటుఛిడు దా బ్రహ్మాండమున్‌ నిండుచోన్‌...

అయినా ఈ అర్థరాత్రిపూట ఆకాశంలో రవిబింబాన్నెలా తీసుకొస్తారుగానీ నా మాట విని పడుకోండి సిరికొండ సామీ’’
‘‘తొందరపడకు దేవీ, నీకు రవి బింబం కావాలి. అంతేగా? క్షణంలో రప్పిస్తానుగానీ ప్రస్తుతం నువ్వే మీ మామగారనుకో. అదిగో ఆ పున్నమి చంద్రుడే రవిబింబమనుకో’’
‘‘మరి వామనుడెవరు?’’
‘‘ఇంకెవరు? నేనే! ఇప్పుడు చెప్పండి. చందమామ ఎక్కడున్నాడు?’’
‘‘తమరి తలకి నాలుగు మూరల పైనున్నాడు’’
కొంచెం పైకి లేస్తూ అడిగాడు,‘‘ఇప్పుడెక్కడున్నాడు? ఎలా ఉన్నాడు?’’
‘‘అడుగు ఎత్తులో కర్రలేని గొడుగులా ఉన్నాడు.’’
మరికొంచెం పైకి లేస్తూ అడిగాడు ‘‘ఇప్పుడెక్కడున్నాడు?’’
‘‘తలమీద కిరీటంలా ఉన్నాడు’’

తరువాత అతను కొద్ది కొద్దిగా పైకి లేస్తూంటే, అతను అడగక ముందే చంద్రుడు ఎక్కడున్నాడో ఎలా కనిపిస్తున్నాడో తన వ్యాఖ్యానంతో సహా చెప్పడం మొదలుపెట్టింది.
‘‘ఇప్పుడు చెవి దుద్దులా ఉన్నాడు. అబ్బో ఎంత పెద్ద దుద్దో. ఏమిటలా చూస్తున్నారు? నాక్కూడా అలాంటి దుద్దులు చేయిద్దామనా? వద్దులెండి. అంతంత దుద్దులు పెట్టుకుంటే చెవి తమ్మెలు చీలిపోతాయి.
అదిగో మెడకి నిండైన కంఠాభరణం.
అహా ఎంతందమైన భుజకీర్తో.  

అంత పెద్ద దండ కడియం పెట్టుకుంటే జబ్బలు పడిపోవా? అయినా నాలాంటి బక్కపీచులకి అంతలేసి కడియాలెందుకులెండి.
అదిగో మొలతాడుకి కట్టిన బంగారు మువ్వ.
కాళ్ళా గజ్జే కంకాళమ్మా..,పండువెన్నెల్లో  వెండిగజ్జెల వైభవం మురిపిస్తోంది.
మరి పాద పీఠం ఏదీ? అదిగో ఒంటి పాద పీఠం! ఏమండోయ్‌ వామన మూర్తిగారూ, పొరపాటున ఆ రెండో కాలు కూడా ఎత్తారనుకోండి. కింద పడతారు.
మావయ్యగారు దర్శించిన దృశ్యం త్రివిక్రముడిని కళ్ళకు కట్టింది పండిత పుత్రా...అంటూ శారద నవ్వుతూంటే మల్లన కూడా శృతి కలిపాడు.  
ఇద్దరూ కాసేపు నవ్వుల్లో మునిగి తేలాక తనే ముందు తేరుకుంటూ అడిగింది శారద, ‘‘ఇప్పుడు మీరు చూపించింది నా కళ్ళకు కనిపించిన అనుభవం. బహుశా మామయ్యగారి అనుభం కూడా అదే అయ్యుంటుంది. ఇందులో శాస్త్రం విజ్ఞానం ఎక్కడున్నాయి?’’

‘‘అది కూడా చూద్దుగాని’’ అంటూ మళ్ళీ మంచం పట్టెమీద నిలబడ్డాడు. శారద ఇంకా ముక్కాలి పీటమీదే కూర్చుని ఉంది. ఆమె దృష్టిని  తనమీదే కేంద్రీకరించి పైకి లేవమన్నాడు. ఆమె మెల్లగా పైకి లేచింది. పూర్తిగా లేచి నిలుచున్న భార్యని,‘‘నువ్వు లేస్తున్నప్పుడు మీ మామకాని మామ ఏం చేశాడు?’’ అని అడిగాడు మల్లన.
‘‘ఏముంది తమరి భుజంమీంచీ మెల్లగా కిందికి జారాడు’’
ఈసారి ఎంత మెల్లగా లేచావో అంతే మెల్లగా కూర్చోమన్నాడు.
శారద మళ్ళీ ముక్కాలిపీటమీద కూర్చున్నాక అడిగాడు ‘‘ఈసారేం చేశాడు మీ మామ?’’

‘‘మళ్ళీ మీ చెయ్యి పట్టుకుని భుజం మీదకి పాకాడు. నేను ఇంకాస్త కిందకి దిగితే మీ నెత్తెక్కి కూర్చునేలా ఉన్నాడు’’ అంటూ నవ్వింది శారద.
మళ్ళీ లేవమన్నాడు. మళ్ళీ కూర్చోమన్నాడు. తను పైకి లేస్తున్నప్పుడు చందమామ కిందికి దిగుతున్నాడు. తను కిందికి దిగుతున్నప్పుడు ఆయన పైకి లేస్తున్నాడు. అలా నాలుగైదుసార్లు లేచి కూర్చున్నాక ‘‘ఇంక ఈ గుంజీలు తియ్యడం నావల్ల కాదు బాబూ’’ అంటూ మంచం పట్టిమీద కూలబడింది.
తను కూడా ఆమె పక్కనే కూర్చుంటూ చెప్పాడు మల్లన, ‘‘నువ్వు కిందికి దిగడం క్రియ అనుకో అప్పుడు చందమామ పైకి లేవడం ప్రతిక్రియ. ఒకవేళ చందమామే క్రియ అనుకో అప్పుడు నువ్వు కిందికి దిగడం ప్రతిక్రియ. అంటే ప్రతి ‘క్రియ’కీ ఓ ‘ప్రతిక్రియ’ ఉంటుంది. ఈ ‘క్రియ’, ‘ప్రతిక్రియ’ల సమ్యక్‌ సంయోజనమే సృష్టిలోని చలనశీలతకు మూలం. ఇది భౌతిక శాస్త్రం. ఇంక రసాయన శాస్త్రంలో నువ్వు చర్య అయితే నేను ప్రతిచర్య. మనిద్దరం కలవడమే ఒక రసాయనిక సంయోగం. ఆ యోగ ఫలంగా ప్రకృతికి ప్రతిరూపమైన నీలో చలనం కలుగుతుంది. దానివల్ల జరిగేదే ప్రతిసృష్టి.’’  అన్నాడు.

∙∙ 
మల్లన గుండెలమీద తల పెట్టుకుని ఆదమరచి నిద్రపోతోంది శారద. కానీ, ఆమె ఎప్పట్లా తన గుండెల్లోకి ఇంకడంలేదు. అందుక్కారణం ఆలోచనలు. వాటినుండి బయట పడాలంటే నాన్నగారినుండి ఒక ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి.
రెండు వరస పద్యాలు. రెండూ వామనుడు త్రివిక్రముడయ్యే క్రమాన్ని వర్ణించేవే. మొదటి పద్యంలో ఇంతింతై వటుడింతయై అంటూ రాత్రివేళ కనపడే ఆకాశం, మేఘమండలం, పాలపుంత, చంద్రమండలం,ధ్రువ మండలం దాటి మహర్లోకాన్నీ సత్యలోకాన్నీ మించి బ్రహ్మాండాంతం వరకూ వృద్ధి చెందాడా వామనమూర్తి. తరువాతి పద్యంలో పగలు తప్ప రాత్రి కనపడని రవి బింబాన్ని ఉపమించారు. ఒకే సమయంలో పగలూ రాత్రీ కూడా ఎలా వస్తాయి?
నాన్నగారిలాంటి సహజకవి రాసిన పద్యాలలోకి ఈ అసామంజస్యం ఎలా వచ్చింది?
చూస్తే నాన్నగారింకా లేవలేదు. నిరంతరం భాగవత దర్శనంతోనే గడిపే ఆయనకి ఏ తెల్లవారుజామునో నిద్ర పడితే పట్టినట్టు. లేకపోతే లేనట్టు. కాబట్టి, ఆయన లేచేంతవరకూ ఎదురు చూడాలే తప్ప నిద్రాభంగం కలిగించకూడదు.    
అందుకే కాల్యాలు తీర్చుకుని వచ్చి స్నానాదికాలు పూర్తి చేసి గుడిముందు కూర్చున్న భక్తుడిలా గాయత్రిని జపిస్తూ కూర్చున్నాడు.
∙∙ 
తలుపు తెరిచిన పోతనకి ఎదురుగా జపం చేసుకుంటున్న మల్లన కనిపించాడు. అతని జపాన్ని భంగపరచడం ఇష్టంలేక తనుకూడా వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. మల్లన జపం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే లోపలికి వెళ్ళబోయాడు పోతన. కానీ మల్లన చేతులు ఆయన పాదాల్ని కదలనిస్తేగా?
‘‘నాన్నా. నిన్న రాత్రినించీ నన్నో అనుమానం తొలిచేస్తోంది. మొదటి పద్యంలో ఇంతింతై వటుడింతయై అంటూ రాత్రిని వర్ణించిన వెంటనే ఎటువంటి కాలావధీ లేకుండానే రవిబింబాన్నుపమించారు. మీ పద్యాల్లో ఇంతటి అనౌచిత్యాన్ని ఊహించలేకపోతున్నాను’’

కొడుకుని మెల్లగా లేవనెత్తాడు పోతన. లోపలకి తీసుకువెళ్ళాడు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. అందుకే లోపల మసగ్గా ఉంది. నిన్న రాత్రి నరసమాంబ పెట్టిన నీటి కడవ ఇంకా అక్కడే ఉంది. గూట్లో దీపం కూడా వెలుగుతూనే ఉంది. దాన్ని చూపిస్తూ,‘‘ఆ దీపం సూర్యుడనుకో. మధ్యలో ఉన్న ఈ కుండే భూమండలం అనుకో. ఇప్పుడా కుండమీద సూర్యుడి వెలుగు పడినవైపంతా పగలు. ఆ కుండకి ఇవతలి వైపు నీడే గానీ వెలుగు పడదు. కాబట్టీ ఈవైపు రాత్రి. భూమండలాన్ని మించి ఎదిగిన త్రివిక్రముడికి ఇప్పుడు నీకు కనిపిస్తున్నట్టుగానే పగలూ రాత్రీ ఒకేసారి కనిపించడంలో ఆశ్చర్యంగానీ దాన్ని వర్ణించడంలో అనౌచిత్యంగానీ ఏముంది నాన్నా?’’ అన్నాడు.మల్లనకి నోట మాట పెగల్లేదు. అందుకే తండ్రివైపు అబ్బురంగా చూస్తూండిపోయాడు.

పక్కనే ఉన్న నరసమాంబకి కూడా ఓ తుంటరి అనుమానం వచ్చింది,‘‘మనక్కాబట్టీ భూమి ఇక్కడ కుండలో ఉంది. సూర్యుడేమో ఈపక్కన గూట్లో ఉన్నాడు. ఆ చంద్రుడు చూస్తే కుండకి వెనకవైపున్నాడు. మరి మీ వామనుడూ, బలిచక్రవర్తీ నిలబడ్డానికి స్థలం ఎక్కడుంది స్వామీ?’’
అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఆ వేకువ కువకువల్లో పోతన పెదాలపై విరిసిందో చిరు దరహాసం.
‘‘మా వామనుడు ఆది మధ్యాంతరహితుడు. ఆ బలి చక్రవర్తేమో రాబోయే సావర్ణి మన్వంతరానికి కాబోయే దేవేంద్రుడు. వారి స్థల కాలాదుల్ని నిర్ధారించడం మనవంటి మానవమాత్రులవల్ల అయ్యేపనేనంటావా?‘

మల్లన తండ్రివైపు సంభ్రమంగా చూస్తూ మెచ్చుకోలుగా అన్నాడు,‘‘నాన్నగారూ, రాసేప్పుడు మీరెంత గొప్పకవో ఆలోచించేప్పుడు అంతకంటే ఎన్నో రెట్లు గొప్ప శాస్త్రవిజ్ఞాని. మీరు తలుచుకుంటే లోకానికి ఎంతో విజ్ఞానాన్ని పంచగలరు’’
మల్లన మాటలక్కూడా చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు పోతన.
‘‘ఈ చిద్విలాసానికి భావమేమి పతిదేవా?’’ అంటూ సాగదీసింది నరసమాంబ.
దానికీ చిరునవ్వే సమాధానం.

అంతలోనే అటుగా వచ్చిన శారద చెప్పింది,‘‘మామయ్యగారెంతటి ప్రాచీనులో అంతకు మించిన నవీనులు. తండ్రుల పద్యాలే తనయుల ప్రయోగాలకి ప్రేరణలు. అంటే ఈనాటి సృజనాత్మక కల్పనలే రేపటి వైజ్ఞానిక ప్రగతికి మూలాలు. అంతేనా మామయ్యగారూ’’
పోతన చిరునవ్వు ఇంకా పద్యమై పరిమళిస్తూనే ఉంది.
(అంకితం: పోతన దర్శించిన చలన సూత్రాల్ని రెండుశతాబ్దాల తరువాత నిరూపించి చూపిన భౌతిక శాస్త్రవేత్త సర్‌ ఐజక్‌ న్యూటన్‌కి సభక్తికంగా)
-జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి 

>
మరిన్ని వార్తలు