ద్రుపదుడి గర్వభంగం

21 Jul, 2019 07:47 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

యంయస్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో గుమ్మడి ద్రోణాచార్యుడు, శరత్‌బాబు అర్జునుడిగా నటించారు. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

‘‘ఏమిటి ఆ ఏకవచన ప్రయోగం? అనుమతి లేకుండా అంతఃపురంలోకి ప్రవేశించినది చాలక సార్వభౌములైన మమ్ము సంస్కారహీనంగా సంభోదిస్తావా?’’ అంటూ ద్రోణుడిపై అహంకరించాడు ద్రుపద మహారాజు.
‘‘తప్పు నీది కాదు. అహం, ఐశ్వర్యం ఉచ్ఛ్వాస నిశ్వాసాల వంటివని తెలిసి కూడా నా బాల్యమిత్రుడివి కదా అభిమానించకపోతావా అని వచ్చాను’’ అన్నాడు ద్రోణుడు.
‘‘ఏమన్నావు, నీవు మాకు మిత్రుడవా?’’ అహంకారంతో మళ్లీ బుస కొట్టాడు ద్రుపదుడు.
‘‘కాదా?!’’ ఆశ్చర్యబోతూ అడిగాడు ద్రోణుడు.
‘‘ఆగర్భ సౌర్వభౌములమైన మేమెక్కడ? పుట్టు దరిద్రుడవైన నీవెక్కడ?’’  విషం చిమ్మాడు ద్రుపదుడు.
‘‘గురుకులంలో పన్నెండేళ్లు ఒకరిలో ఒకరిగా గడిపాం. పవిత్రమైన ఆ స్నేహబంధాన్ని నీవు ఇంత త్వరగా మరచిపోతావనుకోలేదు’’ గాయపడిన మనసుతో, కళ్లనీళ్లతో అన్నాడు ద్రోణుడు.

‘‘ఆపు నీ అధిక ప్రసంగం’’ ఒళ్లు తెలియని అహంకారంతో అరిచాడు ద్రుపదుడు. ఇలా కొత్త సిద్ధాంతం ఒకటి చెప్పాడు...
‘‘ఇద్దరు బాటసారులు సత్రంలో నాలుగు రోజులు కలిసి గడిపినంత మాత్రాన అది స్నేహం అవుతుందా!’’
‘‘పూర్వాపరాలు ఏకరువు పెట్టక వచ్చిన పనిచెప్పు’’ అని ద్రోణుడిని సూటిగా అడిగాడు.
‘‘నీ సిరిసంపదలు, భోగభాగ్యాలు ఆశించి రాలేదు. స్నేహితుడవన్న భ్రమతో బిడ్డ పాల కోసం ఒక ఆవును అడగడానికి వచ్చాను’’ తాను వచ్చిన పని గురించి చెప్పాడు ద్రోణుడు.
‘‘యాచకుడిగా అర్థిస్తే వెయ్యి ఆవులైనా ఇస్తాను. అలాకాకుండా అర్థంపర్థం లేని మిత్రత్వం కలిపి రెచ్చగొట్టావంటే మెడపట్టి గెంటేయిస్తాను’’... ద్రుపదుడి నోట ఈ అహంకారపు మాటలు విని ద్రోణుడికి కోపం కట్టలు తెచ్చుకుంది.
‘‘కృతఘ్నుడా, నా బిడ్డ ఆకలి బాధకు ఆహుతి అయినా సహిస్తాను కాని ఆత్మభిమానాన్ని చంపుకొని నిన్ను అర్థించను’’ అన్నాడు.
‘‘ఎంత అహంకారం. ఎవరక్కడ? వీడ్ని మెడపట్టి గెంటండి’’ అని అరిచాడు ద్రుపద మహారాజు.
ద్రోణుడి గుండెకు కోలుకోలేని గాయం చేశాడు.
ఆ గాయాల జ్వాలల్లో నుంచే శపథం చేశాడు ద్రోణుడు.

‘‘అర్థమైంది ఆచార్యా! ఆ ద్రుపదుడు ఎంత దురహంకారో ఇప్పుడు అర్థమైంది. మీరు అనుమతిస్తే వాడి కాళ్లు చేతులు కట్టి ఈడ్చుకొచ్చి మీ కాళ్ల దగ్గర పడేసి గురుదక్షిణ సమర్పించుకుంటాను’’ ఆవేశంతో ఊగిపోయాడు అర్జునుడు.
‘‘అర్జునా ఆవేశపడకు! పగ పడగెత్తిన పాములా బుసకొడుతున్నా... మనం కొంత కాలం వేచి ఉండక తప్పదు. ఆ ద్రుపదుడు సామాన్యుడు కాదు. అస్త్రవిద్యలో నువ్వు నా అంతటి వాడవైతే తప్ప వాడిని జయించడం సాధ్యం కాదు. అచిరకాలంలోనే నిన్ను నాతో సమానంగా తీర్చిదిద్దుతాను. ధనుర్విద్యలో నిన్ను మించినవాడు లోకంలో లేడని నిరూపిస్తాను. అప్పుడు చెల్లింతువుగాని గురుదక్షిణ’’ అంటూ అర్జునుడి ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు ద్రోణుడు.

యుద్ధరంగంలో ఎదురుబొదురుగా ఉన్నారు ద్రుపదమహారాజు, అర్జునుడు.
‘‘పాండునందనా! అర్భకుడవు. పులి నోట్లో తల దూర్చడం మంచిది కాదు’’ అని అర్జునుడిని హేళన చేశాడు ద్రుపదుడు.
అప్పుడు ఘాటుగా స్పందించాడు అర్జునుడు...
‘‘నేను వచ్చినది నీ హితబోధ వినడానికి కాదు. నా గురుదేవుల ప్రతిన చెల్లించడానికి. మాటలు కట్టిపెట్టి మగటిమి చూపించు’’ అని సవాలు విసిరాడు.
‘‘నువ్వు ఎంత కవ్వించినా సుందర సుకుమారమైన నీ ముఖారవిందం మా కదనకుతూహలాన్ని కరుణగా మార్చి వేసింది. నీ మీద శరసంధానం చేయడానికి మనసొప్పడం లేదు’’ అని వెనకడుగు వేసే ప్రయత్నం చేశాడు ద్రుపదుడు.
‘‘రోషముంటే నా బాణధాటికి తట్టుకో’’ అని బాణాన్ని సంధించాడు అర్జునుడు.
ద్రుపదుడి కిరీటం నేలరాలింది.
అతడిని తాళ్లతో బంధించి గురువు ద్రోణుడి కాళ్ల దగ్గర పడేశాడు అర్జునుడు.
‘‘ఆచార్య! ప్రబలిన గర్వం పాదాక్రాంతం అయింది’’ శపథం నెరవేర్చుకున్న ఉత్సాహంలో అన్నాడు అర్జునుడు.
‘‘అర్జునా! ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది’’ అంతులేని సంతోషంతో అన్నాడు ద్రోణుడు.

ఆ తరువాత...
‘‘ఆగర్భసార్వభౌముడైన పాంచాల భూపతికి ఎంత దుర్గతి!’’ అని వెక్కిరించాడు.
‘‘మిత్రమా’’ అన్నాడు పశ్చాత్తాపం నిండిన గొంతుతో ద్రుపదుడు.
‘‘మిత్రమా! ఇదెక్కడి కొత్త మాట! అదీ నీ నోట!! గురుకులంలో ఒకరిలో ఒకరు పన్నెండేళ్లు గడిపిన రోజులు గుర్తుకు వచ్చి అలా అంటున్నారేమో... చూడండి... ఇద్దరు బాటసారులు నాలుగు రోజులు సత్రంలో గడిపినంత మాత్రాన వారు మిత్రులవుతారా? అది స్నేహం అవుతుందా?’’ ద్రోణుడి నోటి నుంచి వ్యంగ్యబాణాలు వస్తూనే ఉన్నాయి.
‘‘ఏమండీ... దోషిని దండించవలసిందే కాని మాటలతో మనసు నొప్పించడం...’’ అంటూ సున్నితంగా అడ్డు తగిలింది ద్రోణుడి భార్య.
‘‘ద్రుపదా! రాజు చేజిక్కిన తరువాత రాజ్యం ఎవరికి చెందుతుందో తెలుసుగా. నేను పాతికేళ్లు నిరీక్షించి నిన్ను కట్టి తెప్పించుకున్నది నీ సింహాసనం మీద ఆపేక్షతో కాదు. పరాభవాగ్ని జ్వాలల తీవ్రత ఎంత దుర్భరమైనదో స్వయంగా అనుభవించి తెలుసుకునే అవకాశం నీకు కల్పిస్తున్నాను. మానవత్వానికి అర్థం తెలుసుకొని ఇకనైనా మనిషిగా బతుకు. వెళ్లు’’ అని ద్రుపదుడికి  హితబోధ చేశాడు ద్రోణుడు.

‘‘నా మనసు ఇప్పుడు ప్రశాంతం’’ అన్నాడు ద్రోణుడు.
‘‘నా మనసు అలా లేదు ఆచార్యా! పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది’’ బాధగా అన్నాడు అర్జునుడు.
‘‘అదేమిటి!’’ ఆశ్చర్యపోయాడు ద్రోణుడు.
అప్పుడు అర్జునుడు ఇలా బదులిచ్చాడు:
‘‘అకారణంగా ఒక ఆటవికుని చేతిలో నాకు జరిగిన పరాభవం అలాంటిది. అది భరించలేక అప్పటికప్పుడు అస్త్రసన్యాసం చేద్దామనుకున్నాను. కాని ద్రుపదుడిని పట్టి తెచ్చి మీకు అప్పగించాల్సిన బాధ్యత ఉండడంతో అంత సాహసం చేయలేకపోయాను. ఇప్పుడు ఆ బాధ్యత తీరిపోయింది. ఇక నేను విల్లు పట్టడంలో అర్థం లేదు’’
‘‘అర్జునా! ఏమిటి ఈ పిరికితనం? ప్రతి చిన్న విషయానికీ మనసు పాడు చేసుకోవడం ధీరోదాత్త లక్షణం కాదు’’ అని శిష్యుడికి బోధ చేశాడు గురువు.
అయినప్పటికీ...
‘‘మన్నించండి ఆచార్యా! నిప్పు కణిక చిన్నదైనా పెద్దదైనా దాని పని అది చేసి తీరుతుంది. పరాభవం కూడా అంతే’’ అన్నాడు అర్జునుడు.
సమాధానం: ఏకలవ్య 

మరిన్ని వార్తలు