పంచామృతం: అన్నీ ఉన్నా... కష్టపడి పైకొచ్చారు

22 Jun, 2014 04:18 IST|Sakshi

ఎంత కష్టమైనా పడి సక్సెస్‌ను సాధించాలని తపన ఉండటం మానవ సహజనైజం. అయితే సేఫ్‌జోన్‌లో ఉన్నప్పుడు కష్టపడానికి మనసు ఒప్పుకోకపోవచ్చు, శరీరం సహకరించకపోవచ్చు. సక్సెస్ సాధిస్తే పేరొస్తుంది, తద్వారా డబ్బు వస్తుంది. మరి అలాంటి డబ్బు చేతిలో ఉండగా కూడా కష్టపడే తత్వం కొంతమందికే ఉంటుంది. దుర్భరమైన పరిస్థితుల్లో కష్టపడి డబ్బు సంపాదించి ఎదగడం ఒక విధమైన సక్సెస్ అయితే.. అన్నీ అమరినా కూడా వ్యక్తిగతంగా కష్టపడి ఎదగడం మరో విధమైన విజయగాధ అవుతుంది. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీలు వీళ్లు.
 
కరణ్ జోహార్: ఈ బాలీవుడ్ దర్శకుడి నేపథ్యం గురించి చెప్పేటప్పుడు ‘బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్’ అనే ఇంగ్లిష్ ఇడియంను కచ్చితంగా ఉపయోగింవచ్చు. ఈ డెరైక్టర్ సినిమాల్లో కథాంశాలు ఎంత రిచ్‌గా ఉంటాయో... కనిపించే పాత్రల్లో ఎంత కార్పొరేట్ లుక్ ఉంటుందో.. ఇతడి  నేపథ్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. తండ్రి యశ్ జోహర్ బాలీవుడ్‌లో ఒక ప్రఖ్యాత నిర్మాత. ఆయన అడుగు జాడల్లోనే నడకమొదలు పెట్టి తన సృజనాత్మక శైలితో దర్శకుడిగా అటుపై నిర్మాతగా సక్సెస్‌ను సాధించాడు కరణ్ జోహార్.
 
 మణిరత్నం: ఈ సృజనాత్మక సినీ మేధావి కూడా ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. మణిరత్నం తండ్రి రత్నం అయ్యర్ ఒక సినీ నిర్మాత. మద్రాస్‌లో థియేటర్లు కూడా ఉన్నాయి వీళ్ల కుటుంబానికి. అయితే అలాంటి సినీ నేపథ్యాన్ని  తన కెరీర్‌కు బేస్ చేసుకోవాలని మణి అనుకోలేదు. మొదట జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంబీఏపూర్తి చేశాడు. ఆ తర్వాత కుటుంబ నేపథ్యానికి దూరంగా వెళ్లి కన్నడలో సినిమాలు తీయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు.
 
 ఏక్తాకపూర్: ఒకవేళ ఏక్తా కపూర్ గనుక బాలీవుడ్‌పై తన మార్కును చూపలేకపోయుంటే ఈ పాటికి అక్కడ జితేంద్ర ఉనికి కూడా ఒక గతంగానే మారిపోయేదేమో! అలనాటి ఆ లెజెండరీ హీరోకి ఏక్తాతో పుత్రికోత్సాహం లభిస్తోంది. సినీ నేపథ్యం నుంచినే వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొంది ఏక్తా. బాలాజీ టెలిఫిలిమ్స్‌తో సీరియల్ ప్రొడ్యూసర్‌గా మారి వైవిధ్యమైన రీతిలో పేరు, డబ్బును సంపాదించింది. అటు నుంచి ‘డర్టీపిక్చర్’లాంటి సినిమాల ద్వారా నిర్మాతగా జాతీయ స్థాయిలో స్టార్ అయ్యింది.
 
 విశాల్: తెలుగు వాడే అయిన ఈ తమిళ హీరో విశాల్ తండ్రి కూడా సినీ నిర్మాత, వ్యాపారవేత్త. అయితే కుటుంబ నేపథ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టి హీరో అర్జున్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా చేరిపోయాడు. అదే సమయంలో విశాల్ నేపథ్యాన్ని చూసిగాక అతడి రూపాన్ని చూసి ’ప్రేమ చదరంగం’ సినిమాలో నటించే అవకాశం లభించింది. అప్పటికీ కొంత ఆత్మనూన్యతాభావంతోనే ఆ సినిమాలో నటించాడట. అయితే ఆ సినిమా తమిళంలో హిట్ కావడంతో విశాల్ దశ తిరిగింది. నిర్మాత అయిన తండ్రి పేరుతో అవసరం లేకుండా విశాల్ పేరే ఒక బ్రాండ్ అయ్యింది.
 
 అజయ్ జడేజా
 ఈ తరం దాదాపుగా మరిచిపోయిన క్రికెటర్ జడేజా. ఇండియన్ నేషనల్ క్రికె ట్ టీమ్‌కు కొన్ని మ్యాచ్‌లలో కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన జడేజా కెరీర్ అనేక వివాదాల పాలై అంతమైంది. నవానగర్ రాజవంశానికి చెందిన జడేజా క్రికెట్  నైపుణ్యంతో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకొని తన ఆట తీరుతో అందరినీ తన అభిమానులుగా మార్చుకొన్నాడు. వైస్‌కెప్టెన్, కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. తన తరంలో ప్రపంచంలోని ప్రముఖ పేరున్న క్రికెటర్‌గా నిలిచాడు.

>
మరిన్ని వార్తలు