ఉత్సాహం ఉంటే చాలు!

19 Oct, 2014 01:12 IST|Sakshi
ఉత్సాహం ఉంటే చాలు!

వాయనం: ధరలు పెరిగినంత వేగంగా సంపాదన పెరగదు. అందుకే ప్రస్తుత రోజుల్లో ఒక్కరి సంపాదనతో సంసారాన్ని నెట్టుకురావడం చాలా కష్టమవుతోంది. భర్తతో పాటు భార్య కూడా సంపాదించాల్సి వస్తోంది. చదువుకున్నవాళ్లయితే ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఉద్యోగం చేయడానికి తగిన క్వాలిఫికేషన్ లేనివాళ్లు, బయటకు వెళ్లే వీలు లేనివాళ్ల పరిస్థితి ఏమిటి?! చింతించాల్సిన పని లేదు. సంపాదించాలని అనుకోవాలేగానీ అందుకు బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు!
 
     ఇంట్లో వంట చేస్తారుగా... దాన్నే మీ ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదు! మీరున్న ప్రాంతంలో ఆఫీసులు, కాలేజీలు వంటి వాటికి వెళ్లి, మధ్యాహ్న భోజనం బయట చేసే అలవాటు ఉన్నవారికి మంచి ఫుడ్ సప్లయ్ చేస్తానని చెప్పండి. మీలాంటి మరి కొందర్ని సమకూర్చుకున్నారంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకు ఫుడ్ సప్లయ్ చేయవచ్చు. పచ్చళ్లు, పొడులు, చిరుతిళ్లు చేసి షాపులకు కూడా సరఫరా చేయవచ్చు.
     కొద్దిపాటి పెట్టుబడితో ఇంట్లోనే దుస్తుల వ్యాపారం చేయవచ్చు. కాకపోతే మీ దగ్గర అలవాటు పడేవరకూ ధరలు వారి వారి స్తోమతకు తగినట్టు ఉండాలి. మొదటే ఎక్కువ చెబితే, షాపుకే వెళ్లొచ్చుగా అనుకుంటారు.
     దుస్తులు డిజైన్ చేయడం, కుట్టడం వస్తే కనుక ఓ చిన్న బొతిక్ పెట్టేయండి. ఒక్కసారి భేష్ అనిపించుకున్నారంటే కస్టమర్లు మిమ్మల్ని వదలరు.
     వంటలో నిపుణులైతే కుకింగ్ క్లాసులు, కుట్టు పని తెలిస్తే డిజైనింగ్ క్లాసులు తీసుకోండి. ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అలంకరణ సామగ్రి- బొమ్మల తయారీ... మీకు తెలిసిన ప్రతి విద్యతోనూ డబ్బు సంపాదించవచ్చు.
     ఇంట్లోనే సంపాదించడానికి ట్యూషన్లు చెప్పడం కూడా మంచి మార్గం. మీకు రాయడం, తర్జుమా చేయడం కనుక వస్తే... ఇంట్లోనే కూర్చుని కంటెంట్ రైటర్‌గా పని చేయవచ్చు.
     ఇల్లు కదలకుండా సంపాదించడానికి బేబీ కేర్ సెంటర్ పెట్టడం కూడా మంచి ఆప్షన్. కాకపోతే చంటి పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి. మీకంత ఓపిక ఉంటే కనుక ట్రై చేయవచ్చు. అయితే ఇది పట్టణాలు, నగరాల్లో మాత్రమే లాభదాయకం.  డబ్బు సంపాదించేందుకు మాత్రమే ఏదో ఒకటి చేయమని కాదు. మీ ప్రతి భను, సమయాన్ని వృథా కానివ్వకుండా సద్వినియోగం చేసుకోవడానికి కూడా మీరు ఏదో ఒకటి చేయడం మంచిది. ఏమో... రేపు మీరో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగే అవకాశం ఉందేమో... ఒక రాయి ఎందుకు వేసి చూడకూడదు?

మరిన్ని వార్తలు