మంధర పర్వతమంత పాత్ర 

21 Jan, 2018 00:12 IST|Sakshi

పురానీతి

మనకెవరైనా దుర్బోధలు చేయాలని చూస్తే, వారిని మంధరతో పోలుస్తాం. ఎందుకంటే దుర్బోధ చేయడానికి రామాయణంలో మంధర పాత్ర పెట్టింది పేరు. అయితే, ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి, రామాయణంలో మంధర పాత్రను ప్రవేశపెట్టాడు. వాల్మీకి శ్రీ రామావతార లక్ష్యమే రావణ వధ. రావణ వధ జరగాలంటే సీతను రావణుడు అపహరించాలి. సీతను రావణుడు అపహరించాలంటే, రాముడు అడవులకు వెళ్లాలి. రాముడు అడవులకు వెళ్లాలంటే, ఒక వంక దొరకాలి. ఆ వంకే కైకేయికి దశరథుడిచ్చిన వరం. ఆ వరాలను కైకేయి సరిగ్గా ఉపయోగించుకోవాలంటే అందుకు మంధర బోధ చేయాలి. అదే చేసింది మంధర.  తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించి, తన పాత్రకు తగిన న్యాయం చేసింది. ఇక్కడ ఆమె కర్తవ్యం ఏమిటి? కైకేయి మనస్సును వికలం చేసి, దశరథుని ఒప్పించి భరతునికి పట్టాభిషేకం చేయించడం, శ్రీరామునికి పద్నాలుగేళ్లు అరణ్యవాసం విధించడం. 

నిజానికి ఇందులో మంధర స్వార్థం ఏమయినా ఉందా? దుర్బోధ చేసింది కానీ, దానివల్ల తనకేదో లబ్ధి పొందాలన్న తాపత్రయం కనపడిందా అసలు? స్వభావసిద్ధంగా మిక్కిలి చాకచక్యంగా మాట్లాడగల శక్తి ఆమెది. భరతుని పట్టాభిషేకం కోరి కైకతో అయోధ్యకు రాలేదు. కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ, ఆమెకు అవసరం వచ్చినప్పుడు సలహాలనిస్తూ, తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. రామునికి పద్నాలుగేళ్లపాటు అవరణ్యవాసానికి పంపడం మంధర మనోవాంఛితం ఏమీ కాదు. తలచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవుల్లో ఉండేలా చేయగలదు. కానీ, అరణ్యవాసం పద్నాలుగేళ్ల పాటే ఉండేలా చూడమని కైకకు ఎందుకని సలహా ఇచ్చిందంటే, త్రేతాయుగంలో ఆస్తికి హక్కుకాలం పద్నాలుగు సంవత్సరాలు, ద్వాపరయుగంలో పదమూడు సంవత్సరాలు, కలియుగంలో పది సంవత్సరాలూ అని చెబుతారు. అంటే నియమిత కాలం పాటు అస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే, ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారన్నమాట. బహుశ ఈ కారణం చేతనే మంధర కైక చేత అలా చెప్పించి ఉండవచ్చు. ఇలా మంధర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి, రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదోడైంది. అందువల్ల అమె పాత్ర చిత్రణమంతా దైవఘటన. ఆమె మాట దైవ ప్రేరణ. 

ఏది ఏమైనా, మంధర దుర్బోధ కైకేయిని అపమార్గం పట్టించిన మాట వాస్తవం. దానివల్ల లోకకల్యాణం జరిగినప్పటికీ కైక మీద నింద పడింది. విపరీత పరిణామాలెన్నో సంభవించాయి. అందువల్ల స్నేహితులను ఎన్నుకునేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే, దుష్టసాంగత్యం వల్ల దుర్మార్గమైన పరిణామాలు సంభవించి, జీవితం అపఖ్యాతి పాలవుతుంది. ఆ తర్వాత అస్తవ్యస్తం అవుతుంది. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

మరిన్ని వార్తలు