అన్నా చెల్లెలు

26 Aug, 2018 02:04 IST|Sakshi

తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్‌ ఫ్యామిలీ డ్రామాగా పేరున్న ఒక సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. అన్నా చెల్లెల బంధం గురించి చెప్పినప్పుడల్లా ముందు ఈ సినిమాయే గుర్తొస్తుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...

ఆ అన్నా చెల్లెలిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ ఇద్దరిది మాత్రమే ఒక ప్రపంచం. చెల్లెలికి అమ్మా నాన్న అన్నీ తానై చూసుకుంటాడు అన్న. కష్టపడి ఒక చిన్న మిల్లులో పనిచేయడం దగ్గర్నుంచి మొదలైన అన్న ప్రయాణం, అదే మిల్లుకు ఓనర్‌గా ఎదిగే వరకూ ఏ ఆటూపోటూ లేకుండా సాగింది. అన్న పేరు రాజు. పేరుకు తగ్గట్టే రాజులా ఉంటాడు. చెల్లి రాధకు కొత్తగా వచ్చిన ఈ ఐశ్వర్యమంతా కొత్తగా ఉంది. రాజు ఇప్పుడు ఓనర్‌గా ఉన్న మిల్లులో వర్కర్‌గా పనిచేస్తున్నప్పట్నుంచీ ఉన్న ఒకే ఒక్క మంచి మిత్రుడు ఆనంద్‌. ఆనంద్‌కు రాధ అంటే ఇష్టం. ఆమెను ప్రేమిస్తున్నాడు కూడా. రాధకూ అతనంటే అంతే ఇష్టం. వీళ్లిద్దరి విషయం మాత్రం రాజుకు తెలియదు.

‘‘ఏం రాజూ! పెళ్లెప్పుడు చేసుకుంటున్నావు?’’ అని ఎవరైనా రాజును అడిగితే, నవ్వి, ‘‘ముందు చెల్లి పెళ్లి చేయాలి కదా’’ అంటుంటాడు. రాధకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే, రాధ పుట్టినరోజును ఘనంగా జరుపుతున్న రోజు, చెల్లి ప్రేమకథ రాజు కంట్లో పడింది. ఆనంద్‌ మీద చెయ్యి చేసుకొని, అతణ్ని కొట్టి ఇంట్లోంచి తరిమేశాడు రాజు. కోపాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా ఓ ధనవంతుడితో రాధ పెళ్లిని ఖరారు చేశాడు రాజు. ఈ విషయం రాధకు చెప్పాలని అస్సలు ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. ఆ సమయానికి రాధ ఆనంద్‌తో మాట్లాడుతోంది. తోటలో వాళ్లిద్దర్ని కలిపి చూసిన రాజుకు కోపం మరింత పెరిగిపోయింది. తన గదిలోకి పరిగెత్తుకెళ్లి తుపాకీ తీసుకొనివచ్చాడు.  ‘‘నాతో వచ్చెయ్‌ రాధా! మనం ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం.’’ అన్నాడు ఆనంద్, చాలాసేపు రాధ తన మాటలను కేవలం వింటూ ఉండటం చూసి.

‘‘అన్నయ్యకు చెప్పకుండా మనం పారిపోవడమా? అన్నయ్య లేకుండా మన పెళ్లా? క్షమించండి. నేను రాలేను. నా వల్ల కాదు.’’ అంది రాధ భయపడిపోతూ, బాధగా. ఆనంద్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ రాధకు అన్నయ్యను వదిలిపోయేంత ధైర్యం లేదు. నిజానికి ఆ ధైర్యం ఏ చెల్లెలికీ రావొద్దని కోరుకునేంత ఇష్టం ఆమెకు అన్నయ్యంటే. ‘‘మా అన్నయ్యే మన పెళ్లి చేస్తారు. ఆ రోజు వస్తుంది చూడండి. అప్పుడు మీరే బావా బావా అని పిలుచుకుంటారు’’ అంది రాధ. ఆనంద్‌కు కోపమొచ్చింది. ‘‘వాడా నా బావ? నా చేతికి బేడీలు వేస్తానన్నవాడు.. వాడు నా బావా? వాడొచ్చి నా కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగితే తప్ప దగ్గరకు రానివ్వను’’ అంటూ ఊగిపోయాడు. ఆనంద్‌ను చంపాలని తుపాకీతో వచ్చిన రాజు, రాధకు తన మీద ఉన్న గౌరవాన్ని చూసి ఆగిపోయాడు. రాజుకు తన మీద తనకే అసహ్యం కలిగింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద్‌కు రాజు మీద కోపం తగ్గట్లేదు.

దౌర్భాగ్యుడు, మిత్రద్రోహి, నీచుడు అని నోటికి వచ్చినట్లు రాజును తిడుతున్నాడు. రాధ గట్టిగా అరిచింది – ‘‘ఆపండి! మా అన్నయ్యను మీరలా తిట్టడం నేను సహించలేను. ఎవరనుకుంటున్నారు మా అన్న? నాకు తల్లి, తండ్రి, గురువు, నా పాలిట దైవం.. అన్నీ ఆయనే!’’. ‘‘అయితే ఇంక నేనెందుకు నన్ను మర్చిపో రాధా!’’ అన్నాడు ఆనంద్‌. అతనింకా అదే కోపంలో ఉన్నాడు. ‘‘ఎంత తేలిగ్గా అనేశారు ఆ మాట! నన్నింకా హింస పెట్టకండి. మా అన్నయ్య మీద పగ సాధించడమే మన పెళ్లికి లక్ష్యమైతే నాకు ఈ పెళ్లి వద్దు, ఆ ప్రేమా వద్దు. సెలవు’’ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ అక్కణ్నుంచి ఇంట్లోకి పరిగెత్తింది రాధ. ఆనంద్‌ బాధగా అక్కణ్నుంచి బయటికి కదిలాడు. చెల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయిన రాజు అదే తోటలో, ఒక చెట్టు పక్కన నిల్చొని ఏడుస్తున్నాడు. రాజు ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. ఏం చేసైనా రాధకు తను ప్రేమించిన ఆనంద్‌నే ఇచ్చి పెళ్లి చేయాలని. ఆ తరువాతి రోజే వాళ్లిద్దరి పెళ్లి చేసేశాడు. రాజు, ఆనంద్‌ ఇప్పుడు స్నేహితులే కాదు, బంధువులు కూడా! ఆనంద్‌ తనను పెంచి పెద్ద చేసిన అత్తతో పాటు రాజు ఇంటికే తన నివాసాన్ని మార్చేసుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. రాజు కూడా తను ప్రేమించిన అమ్మాయి మాలతిని పెళ్లి చేసుకున్నాడు. రాజు – మాలతి, ఆనంద్‌ – రాధ జంటలతో ఆ ఇల్లు కళకళలాడిపోతోంది. వీళ్లంతా సంతోషంగా ఉండటం ఆనంద్‌ అత్తకు మాత్రం నచ్చడం లేదు. ఆ పెద్ద ఇంటి పెత్తనమంతా తన చేతుల్లోకి తీసుకుందామని చూస్తోన్న ఆమెకు, వీళ్లంతా కలిసి ఉంటే చూడటం కష్టమైన పనే. ముందు మాలతికి, రాధకు గొడవలు తీసుకొచ్చి పెట్టింది. ఆ గొడవల్ని రాజు, ఆనంద్‌లకూ చేరేలా చేసింది. సంతోషంగా ఉన్న ఆ ఇల్లు మెల్లిగా ఒక రకమైన అశాంతికి, పూర్తి విచ్ఛిన్నానికి దారులు వెతుక్కుంది. కాలం పరుగుల్లో మాలతి జబ్బుతో చనిపోయింది. ఆనంద్, రాధ బాగుండాలని కోరుకున్న రాజు, ఆస్తినంతా వాళ్లకు రాసేసి ఊరు వదిలేసి వెళ్లిపోయాడు. చాలాకాలం లెక్కలేనన్ని ఊర్లు తిరిగాడు రాజు. అతనికెప్పుడూ చెల్లి గుర్తొస్తూనే ఉన్నా, ఇంటికైతే తిరిగి రావాలనుకోలేదు. తిరిగొచ్చిన తర్వాత మాత్రం రాజు ఎక్కువ రోజులు బతకలేదు.

మరిన్ని వార్తలు