విహారం: భీమ్‌తాల్- ఇతిహాసకాలంలో విహారం

31 Aug, 2013 23:44 IST|Sakshi
విహారం: భీమ్‌తాల్- ఇతిహాసకాలంలో విహారం

కుమావ్ పర్వతశ్రేణుల మధ్య విశాలమైన సరస్సు. ఆ సరస్సు మధ్యలో చిన్న దీవి. సరస్సు ఒడ్డున ఉన్న పురాతనమైన శివాలయం. పేరు భీమేశ్వర మహదేవ్ ఆలయం. ఇది స్వయానా పాండవ మధ్యముడు కట్టిన ఆలయం. అందుకే ఈ ఆలయానికి భీమేశ్వర ఆలయం అని, ఈ సరస్సుకు భీమ్‌తాల్ అని భీముడి పేరుతో వాడుకలోకి వచ్చాయి. తాల్ అంటే సరస్సు అని అర్థం. భీమేశ్వర ఆలయ నిర్మాణశైలిని చూస్తే... క్రీస్తుపూర్వం వేలాది ఏళ్ల కిందట కూడా ఇలా నిర్మించేవారా అనే సందేహం కలగడం సహజమే. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో ఈ ప్రదేశాన్ని పాలించిన చాంద్ వంశీయుడు బాజ్ బహదూర్ పునర్నిర్మించాడు. కుమావ్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న ఈ అటవీ ప్రదేశం పాండవులు వనవాసం చేసినప్పుడు సంచరించిన నేల. క్రీ.పూ. వేల ఏళ్ల నాటి మానవ సంచారాన్ని, జీవనశైలిని అధ్యయనం చేయడానికి ఆర్కియాలజీ నిపుణులు తరచూ ఇక్కడ పర్యటిస్తుంటారు. ఇప్పుడు ఈ దారులన్నీ ట్రెకింగ్ చేయాలనుకునే వాళ్లకి మార్గదర్శనాలు.
 
 ఇక్కడ ట్రెకింగ్ క్యాంపులు కూడా ఎక్కువే. మౌంటెయిన్ రూట్‌లో ట్రెకింగ్ సాహసోపేతమే అయినా ఉద్వేగంతో ఒళ్లు పులకించిపోతుంది. భీమ్‌తాల్ పట్టణంలో నేషనల్ కోల్డ్‌వాటర్ ఫిషరీస్ ఇన్‌స్టిట్యూట్‌ను చూసినప్పుడు తప్ప... ఇంత చల్లటి వాతావరణంలో కూడా సరస్సుల్లో చేపలుంటాయనే ఆలోచన రానేరాదు. ఫోక్ కల్చరల్ మ్యూజియంలోకి వెళ్తే జానపద సినిమా సెట్టింగులో అడుగుపెట్టినట్లు ఉంటుంది. షోదశ మహా జనపదాల నాటి జీవనశైలిని ప్రతిబింబిస్తుంటాయి ఇక్కడి హస్త కళాకృతులు. పట్టణానికి కనుచూపు మేరలో ఉన్న సాత్విక్ సదన్ వైపు అడుగులు వేస్తే భారతీయులతోపాటు యోగవిద్యను, వేద తత్వాన్ని అభ్యసిస్తున్న పాశ్చాత్యులు కనిపిస్తారు. భీమేశ్వర ఆలయానికి దగ్గరలోనే ఉన్న చిన్న కొండ పేరు గర్గ్ పర్వత్. గర్గి నది పుట్టింది ఈ కొండమీదనే. ఇక్కడ దాహం తీర్చే గంగామాత ఈ నదే. భీమ్‌తాల్ సరస్సుకు ఒక చివరగా డ్యామ్ ఉంది. సరస్సు మధ్యలో చిన్న దీవి ఉంది. సరస్సులో బోట్ షికారు అంటే ఈ దీవి చుట్టూ తిప్పుతారు.
 
 భీమ్‌తాల్ నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే దమయంతి తాల్ వస్తుంది. ఇక్కడ నలమహారాజు మందిరం ఉండేదని, ప్రకృతి వైపరీత్యాలకు ఆ మందిరం కాస్తా మునిగిపోయిందని చెబుతారు. మరో మూడు కిలోమీటర్లు వెళ్తే సాత్ తాల్‌కి చేరుతాం. ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే ప్రదేశం ఇది. సముద్రమట్టానికి దాదాపుగా పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో పచ్చటి దట్టమైన అడవుల మధ్య స్వచ్ఛమైన నీటి సరస్సుల నిలయం ఇది. సాత్‌తాల్ అంటే ఏడు సరస్సుల సమూహం. రెండు సరస్సులు ఇంకిపోగా ఇప్పుడు ఐదు సరస్సులు మాత్రమే ఉన్నాయి. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రదేశంలో పక్షుల కువకువలు తప్ప ఏ ఇతర శబ్దాలూ వినిపించవు. పర్యాటకులు పడవ విహారంలో, చేపలు పట్టడంలో నిమగ్నమై ఉంటారు.
 
  సాత్‌తాల్ పక్కనే ఉన్న కొండ హిడింబ పర్వత్. భీముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు హిడింబాసురుణ్ని సంహరించి, అతడి చెల్లెలు హిడింబిని వివాహమాడినట్లు చదివిన పౌరాణిక కథలకు ఆనవాలుగా ఉంటుంది. ఇప్పుడీ కొండ మీద ఆశ్రమంలో వన్‌క్షాంది మహరాజ్ అనే సాధువు నివసిస్తున్నాడు. ఇది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడ. ఇక్కడికి దగ్గరలోని కర్కోటక పర్వత్ మీద ఉన్న ఆలయంలోని నాగదేవుడిని కర్కోటక మహారాజ్‌గా కొలుస్తారు. భీమ్‌తాల్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో నౌకుచియాతాల్ ఉంది. తొమ్మిది భుజాల సరస్సు ఇది. పర్యాటకులు ఉన్నప్పటికీ హడావిడి తక్కువ. బోటింగ్ ఎంజాయ్ చేసేవాళ్లు ఇక్కడికి వస్తారు.
 భీమ్‌తాల్ నుంచి 22 కి.మీ.లు వెళ్తే నైనితాల్ వస్తుంది.
 
 ఎనభైల నాటి సినిమాల ద్వారా ఈ ప్రదేశం మనకు పరిచయమే. పెళ్లయి కుటుంబం ఉన్న హీరో ఆఫీసు పని మీద నైనితాల్‌కు క్యాంపుకెళ్లడం, అక్కడ ఆపదలో ఉన్న యువతికి సాయం చేయడం... వంటి సన్నివేశాలు ఉండేవి. ఆ సినిమాల్లో... కొండలు, లోయల మయంగా ఉన్న ప్రదేశంలో ఇళ్లు అక్కడక్కడా విసిరేసినట్లు ఉండేవి. మగవాళ్లు తలకు మంకీక్యాప్, మెడకు స్టోల్ చుట్టుకుని, స్వెట్టర్ ధరించి, మహిళలు భుజాల చుట్టూ షాల్ చుట్టుకుని కనిపించేవారు. ఈ సీన్లు చల్లటి వాతావరణాన్ని ప్రతిబింబించేవి. ఈ ప్రదేశానికి నైనితాల్ అనే పేరు ఎలా వచ్చిందీ అంటే... దక్షయజ్ఞం సమయంలో దక్షప్రజాపతి చేసిన అవమానానికి దహించుకుపోయిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని పిచ్చివాడిలా సంచరిస్తుంటాడు పరమశివుడు. అప్పుడు సతీదేవి కన్ను పడిన ప్రదేశమే నైనితాల్. అప్పటి వరకు ఈ సరస్సును అత్రి, పులస్త్య, పులహ రుషుల పేరుతో త్రిరుషి తాల్ అనేవారు.
 
 భీమ్‌తాల్, సాత్‌తాల్, నైనితాల్, నౌకుచియాతాల్, దమయంతి తాల్... ఇవన్నీ ఉన్న కుమావ్ పర్వతశ్రేణులు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. పచ్చదనాన్ని, సహజత్వాన్ని ఆస్వాదిస్తూ పర్వతాల మీదకు నడిచి వెళ్లి, రాత్రికి అక్కడే బస చేసి నిర్మలాకాశంలో కనిపించే చుక్కలను చూస్తూ గడపడం అనిర్వచనీయమైన అనుభూతి. ఈ కొండల్లో యువకులు రాక్‌క్లైంబింగ్ సాహసం కూడా చేయవచ్చు. పెద్దవాళ్లు దేవాలయాలు పూజలు చేసుకోవచ్చు. ఔషధాలకు పుట్టిల్లయిన భారతదేశంలో ప్రతిచెట్టూ మనిషికి స్వస్థత కలిగిస్తూ తన బాధ్యతను మౌనంగా నిర్వర్తిస్తుంది. పెట్రోల్ పొగతో ఆకాశం కనిపించని నగరాల నుంచి ఓ వారం రోజులు బయటకు వచ్చి... మంచు కప్పుకున్న కొండలకు, మబ్బుల మాటున కనిపించే ఆకాశానికి మధ్య విహరించడం ఆహ్లాదకరం మాత్రమే కాదు ఆరోగ్యకరం కూడ.
 
 ఎక్కడ ఉంది?
 భీమ్‌తాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైనితాల్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి 22 కి.మీ.లదూరాన సముద్రమట్టానికి 1,370 మీటర్ల ఎత్తులో ఉంది.
 
 ఎప్పుడు వెళ్లవచ్చు?
 వర్షాకాలం మినహాయించి ఎప్పుడైనా వెళ్లవచ్చు. శీతాకాలంలో ఇక్కడ చలితీవ్రత ఎక్కువ, టూరిస్టులకు అన్ సీజన్. ఈ సమయంలో హోటళ్లలో గది అద్దె తక్కువ, గదులు సులభంగా దొరుకుతాయి కూడ.
 
 ఎలా వెళ్లాలి?
 సమీప విమానాశ్రయం... పంత్‌నగర్, ఇక్కడి నుంచి భీమ్‌తాల్‌కి 60 కి.మీ.లు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి భీమ్‌తాల్‌కి 300 కి.మీ.లు. ఇక్కడి నుంచి రైలు లేదా రోడ్డుమార్గాన వెళ్లవచ్చు.
 సమీప రైల్వే స్టేషన్... కత్‌గోదామ్ స్టేషన్, ఇక్కడి నుంచి భీమ్‌తాల్‌కి ఇరవై కిలోమీటర్లు.
 
 ఎక్కడ ఉండాలి?
 శిఖా ఇన్ రిసార్టు, మౌంటెయిన్ క్లబ్ రిసార్టు, కంట్రీ ఇన్, నైని రిట్రీట్ వంటి విలాసవంతమైన హోటళ్లలో ఒక రోజుకు గది అద్దె దాదాపుగా ఐదు వేలు. వీటిలో బ్రేక్‌ఫాస్ట్ ఉచితం. ‘హోటల్ న్యూ భారత్‌లో ఒక రోజు అద్దె తొమ్మిది వందలు, ‘హోటల్ లేక్ ఇన్’లో 1,400 రూపాయలు.
 
 భోజనం ఎలా?
 సదరన్ డిలైట్‌లో దక్షిణాది వంటకాలు ఉంటాయి. ‘గ్రావిటీ బై ద లేక్’రెస్టారెంటు నుంచి సరస్సు వ్యూ అందంగా ఉంటుంది. అందుకోసమే పర్యాటకులు ఇక్కడ ఒక్క భోజనమైనా చేయాలని ఉత్సాహపడుతుంటారు. ఇటలీరుచుల కోసం ‘ఇటాలియానో’ రెస్టారెంట్‌కెళ్లాలి.
 
 వాతావరణం?
 భీమ్‌తాల్‌లో ఉష్ణోగ్రతలు వేసవిలో 15-28 డిగ్రీల మధ్య, శీతాకాలంలో 4-8 డిగ్రీల మధ్య ఉంటాయి.
 
 ఏమేం తీసుకెళ్లాలి?
 ఎగుడుదిగుడు నేల మీద కూడా సౌకర్యంగా నడవడానికి వీలుగా ఉండే షూస్ తీసుకెళ్లాలి. వాతావరణం మారినప్పుడు ఎదురయ్యే జలుబు, అజీర్తి, విరేచనాలు, జ్వరం వంటి సాధారణ అరోగ్య సమస్యలకు మందులు తీసుకెళ్లాలి. వేసవిలో ఒక స్వెటర్, శీతాకాలం అయితే హెవీ ఉలెన్ జాకెట్, మఫ్లర్, క్యాప్ కూడా ఉండాలి.
 
 ఏమేమి కొనుక్కోవచ్చు!
 భీమ్‌తాల్ పట్టణం నడిబొడ్డున మాల్ రోడ్డు ఉంది. ఇది హస్తకళలకు ప్రసిద్ధి. ఇక్కడ చేతితో తయారు చేసిన కొవ్వొత్తులు, పూసల ఆభరణాలు దొరుకుతాయి. తివాచీలు, దారుకళాకృతులు, చేతిలో ఇమిడిపోయే చిన్న విగ్రహాలు, గర్వాలీ స్టైల్ చిత్రలేఖనాలు ఉంటాయి.

మరిన్ని వార్తలు