ఐదోవేదం మహాభారతం...

16 May, 2015 23:35 IST|Sakshi
ఐదోవేదం మహాభారతం...

కొత్త శీర్షిక ప్రారంభం : మహాభారతం పాత్రలు
వేరువేరుగా ఉన్న చెట్లన్నీ కలసి ‘వనం’ అనే సమష్టి రూపం తీసుకున్నట్టు వేరువేరుగా ఉన్న ప్రజలందరి మనసు సమష్టి రూపం తీసుకుని ‘దేశ మనస్సు’ అవుతుంది. ‘మహాభారతం’ భారతదేశపు మనసు.దీనికి అక్షరరూపం ఇచ్చి చిరాయువును పోసినవాడు వ్యాసుడు. భారతదేశం తన వికసించిన నాగరికతను వాఙ్మయంలో పొందుపరిచి భద్రం చేసింది. ‘వేదం’ భారతదేశపు అతి పురాతన వాఙ్మయం.


అది ఒక్కటే అయినా రాబోయే రోజులలో ధారణకు సులువుగా ఉండాలని వ్యాసుడు దానిని నాలుగుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం అంటూ విభజించినా వేదంలోని పరమార్థం అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ‘ఐదో వేదం’గా ప్రసిద్ధికెక్కిన మహాభారతాన్ని రాశాడు.
 
మహాభారతాన్ని ‘ఇతిహాసం’అని అంటారు. ‘ఇతి’ అంటే ‘ఇలాగ’, ‘హ’ అంటే ‘ప్రసిద్ధంగా’, ‘ఆస’ అంటే ‘ఉంది’ అని అర్థం. అంటే ఈ మాటకు ‘ఇలా జరిగిందట’ అని అర్థం. భారతీయులు తమ చరిత్రను రాసుకోలేదన్న అపప్రథ ఒకటి ఉంది. అది నిజం కాదు. అసలు చరిత్ర అంటే మునపటివాళ్ల నడతతో కాపుదలనీ సంరక్షణనీ పొందడమని అర్థం. అదే ఇంగ్లిష్‌లో హిస్టరీ- హిజ్ స్టోరీ, అతగాడి కథ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే, గ్రీకు భాషలో హిస్టోరియా అంటే అడగడం, ప్రశ్నించడం, విచారణ చేయడం అని అర్థాలు చెబుతారు. ఏ చరిత్రనైనా, చదివేవాడికి పనికొచ్చే విధంగా రాయాలి.

అందుకే తమ చరిత్రను భారతీయులు పురాణాలుగా, ఇతిహాసాలుగా రాసుకున్నారు. మహాభారతం అలాంటి చారిత్రకమైన కథ. అయితే దాన్ని ఐదో వేదమని ఎందుకంటారు? వేదమంటే ‘జ్ఞానం’ అని అర్థం. ‘మహాభారతం’ మన సత్తా గురించిన జ్ఞానం. మనం ఉన్నా లేకపోయినా మన సత్తా, మన ఉనికీ ఎప్పటికీ ఉంటాయి. తరాలు ఎన్ని గడిచినా ఎప్పటికీ చెక్కుచెదరని మన అస్తిత్వం గురించిన జ్ఞానం మనకు ఆనందం కలిగిస్తుంది.

మహాభారత చరిత్ర మన ఉనికి గురించి, అస్తిత్వం గురించి ఎరుక కలిగించి మనకు హాయినిస్తుంది. ‘ఉనికీ’ ‘ఎరుకా’ ‘హాయీ ’అనేవే వరసగా ‘సత్’, ‘చిత్’, ‘ఆనందాలు’. వేదార్థమంటే సచ్చిదానందాల కూడికే గనుక మహాభారత చరిత్ర కూడా ఆ సచ్చిదానందాన్నిచ్చేదై ఉండాలి. కథ కథగా సచ్చిదానందాన్ని ఎలాగ ఇస్తుంది? అంచేత ఆ కథలో ఏదో విలక్షణత ఉండి ఉండాలి. అప్పుడుగానీ మహాభారతం వేదంగా చెలామణీ కాలేదు. పాండవులకు బలమూ నేర్పూ ఎక్కువ. ఎక్కువ మందే ఐనా ధృతరాష్ట్రులకు శక్తీ నేర్పూ తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు.

ధృతరాష్ట్రుడనే రాజుకి వందమంది కొడుకులు. అతని తమ్ముడు పాండురాజుకి ఐదుగురు కొడుకులు. ఈ అన్నదమ్ముల కొడుకులందరూ జ్ఞాతులు. జ్ఞాతులంటే శత్రువులే. ఒకచోట ఇంతమందీ ఉండటం పడలేదు. తక్కువమందే అయినా పాండవులకు బలమూ నేర్పూ ఎక్కువ. ఎక్కువ మందే ఐనా ధృతరాష్ట్రులకు శక్తీ నేర్పూ తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు.

లక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దామని చూశారు. అదీ అడ్డం తిరిగింది. ఇన్నీ విఫలం కావడంతో మోసపు జూదానికి దిగారు. జూదంలో శకుని మాయతో ఓడించి పన్నెండేళ్లు అరణ్యవాసానికి, ఆ పైన ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసానికీ పంపించారు. పందెం ప్రకారం పదమూడేళ్లు కాగానే సజావుగా తిరిగి వచ్చినప్పటికీ రాజ్యాన్ని అప్పగించటానికి వాళ్లకు మనసొప్పలేదు. దానితో ఇక యుద్ధమే శరణ్యమైంది. అటూ ఇటూ చాలామందే చచ్చిపోయారు.

ఈ కథను ఇలాగ ‘కట్టె, కొట్టె, తెచ్చె’ అనే తీరుగా చెబితే మనకేం లాభం వస్తుంది? అందుకనే వ్యాసమహర్షి కథను అలాగ పేలవంగా చెప్పలేదు. మధ్యలో మరెన్ని విషయాల్నో చెబుతూ ‘దీని ఉద్దేశాన్ని పట్టుకోండి, ఆకళించుకోండి’ అని పదేపదే చెప్పకుండానే చెప్పాడు. ఉద్దేశాన్ని ఆకళించుకోవాలంటే రచనలో వాడుతున్న ప్రతిమాటా ప్రతిపేరూ మనకు అర్థం కావాలి. ఇది దృష్టిలో పెట్టుకొనే వ్యాసుడు మహాభారతంలోని ప్రతిమాటనీ ప్రతిపేరునీ విడబరిచి నిర్వచిస్తూ ఉంటాడు.

ఆ వరసలో ‘మహాభారతం’ అనే మాటను కూడా నిర్వచించకుండా వదిలిపెట్టలేదు. మహత్త్వమూ మహాభారమూ ఉన్నది గనక ఇది మహాభారతమైంది అని చెబుతాడాయన. భారం- అంటే సవాలక్ష శ్లోకాల వల్ల వచ్చిన గ్రంథభారం కాదు. ఆ సమయంలో మనుషుల భావాల్లో ఉండే క్రూరత్వమూ వాళ్ల చెడుప్రవర్తనా కూడా భారాలై, యుద్ధాల కిందా రోగాల కిందా దారిద్య్రం కిందా పూర్తిగా వినాశనం చేసే భూకంపాల కిందా అటువంటి ఘోరవిపత్తుల కిందా ఫలిస్తాయి. చరిత్రపరంగా మరోలాగ చెబుతారు.

భరత పుత్రుల మహాజన్మమే మహాభారతం అని. ఇంతే అయితే వేదార్థం ఎక్కణ్నించి ఊడిపడుతుంది? వ్యాసుడు చెప్పిన నిర్వచన పద్ధతిని కొనసాగిస్తూ మనమూ దాన్ని నిర్వచించుకోడానికి ప్రయత్నం చేయాలి. ‘భా’ అంటే ప్రకాశమూ దీప్తీ కాంతీ అని అర్థం. ఆ మహాప్రకాశంలో రమింపజేసేదే ఈ మహాభారతం. కథను కథలాగే చదివినా విన్నా ప్రకాశంలో మునిగి  దాని అసలు ఉద్దేశమేమిటో అర్థం కాదు. కథను రాసే పద్ధతిని పరిశీలిస్తూ ఉంటే ఎంతో కొంత వెలుగు అవుపిస్తుంది.
 
ఈ మహాభారతాన్ని రాయడానికి వేదవ్యాసుడికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టిందని చెబుతారు. చరిత్రే అయితే అది వట్టి కథే అయితే మూడేళ్లు పట్టవలసిన పనిలేదు. అదీగాక భారతాన్ని వ్యాసుడు గణపతి చేత రాయించాడని ప్రతీతి ఒకటి ఉంది. ఒప్పందం ప్రకారం వ్యాసుడు గణపతి చేతిగంటం ఆగకుండా ఉండేలాగ గడగడా చెబుతూ ఉండాలి. గణపతి కూడా రాసేదాన్ని అర్థం చేసుకోకుండా రాయకూడదు.

అందుకోసం గణపతి అంతటి మహానుభావుడిక్కూడా ఠకీమని అర్థంకాని భోగట్టాలు ‘వ్యాసఘట్టాల’నే పేరన కొన్ని మహాభారతంలో ఉన్నాయి. ఈ కారణంగానే మహాభారత రచనకు మూడేళ్లు పట్టిందని చెప్పడం సబబే. ఆ మూడేళ్లూ వ్యాసుడు సర్వదా దాని గురించే ఆలోచిస్తూ ఆ కథలోనే మునిగి ఉంటూ ‘సతతోత్థితుడై’, అంటే ఎప్పుడూ ఆ కథా ఆలోచనలోనే మెలకువగా ఉంటూ దాన్ని పూర్తిచేశాడు.
 
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ!
 యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్!!
 (మహాభారతం, ఆదిపర్వం 62-53)
ధర్మమూ అర్థమూ కామమూ మోక్షమూ అనేవి నాలుగు పురుషార్థాలు. ధర్మమంటే సృష్టిని మొత్తమూ ధరించి ఉంచేది. ఆ ధర్మం కోసమే మనం సంపాదించే డబ్బంతా పనికి రావాలి. ఆ ధర్మం కోసమే మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఆ ధర్మాన్ని అందుకొందామనే ఇక్కడున్న మాయ నుంచీ మోసం నుంచీ బయటపడాలని ఉబలాటపడుతూ ఉండాలి.

ఆ విధంగా నాలుగు సూత్రాలుగా ఉన్నా ఇవన్నీ ఒకే- ధర్మం మాత్రమే. పరమాత్మకు రూపమంటూ ఒకటి ఉంటే అది ధర్మరూపమే. ఈ పురుషార్థాల విషయంలో మహాభారతంలో లేనిది మరెక్కడా అవుపించదు. అంటే, ఇక్కడ ధర్మం విశ్వరూపంలో అవుపిస్తుందన్నమాట. ఇంతదాకా మనకు చెప్పిన కథలూ మనకు చూపించిన సినిమాలూ మహాభారతాన్ని ఒక కథలాగే ఒక చరిత్రలాగే చెబుతూ ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవడంలో ఏదో ఒక వెలితి ఉందన్నమాట. ఆదిపర్వం మొదటి అధ్యాయంలోనే దుర్యోధనుణ్నీ ధర్మరాజునీ వేరువేరు వృక్షాలుగా వర్ణించారు (ఆదిపర్వం 1-110, 111):
 
దుర్యోధనుడు క్రోధమయమైన పెద్ద చెట్టయితే దాని కాండమే కర్ణుడు; దాని కొమ్మలే శకుని; దాన్నిండా ఉన్న పువ్వులూ పండ్లూ దుశ్శాసనుడు; బుద్ధిలేని గుడ్డి ధృతరాష్ట్రుడే దాని మూలం. ధర్మరాజేమో ధర్మమయమైన పెద్దచెట్టు; దాని కాండమే అర్జునుడు; దాని కొమ్మలే భీముడు; దాన్నిండా ఉన్న పువ్వులూ పండ్లూ నకుల సహదేవులు; కృష్ణుడూ వేదమూ బ్రహ్మాన్నెరిగిన బ్రాహ్మణులూ దాని మూలం.
 
కథలోని పాత్రల్ని చెట్టులోని విడివిడి భాగాలుగా చూస్తూ పోతే కథ పూర్తి అర్థాన్ని పట్టుకోలేము. మరైతే,ఈ ఇతిహాసాన్ని ఎలాగ చదవాలి? ఎలాగ చదివి అర్థం చేసుకొంటే ఇది వేదార్థాన్ని మనముందు గుమ్మరిస్తుంది? వ్యాసుడి పద్ధతిలోనే మనం కథలోని పాత్రల్నీ కథలోని వేరువేరు ఘట్టాల్నీ విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం. దీనికోసం మహాభారతంలోని ప్రముఖమైన పాత్రల్ని విడబరుచుకొని అర్థం చేసుకొందాం.

మరిన్ని వార్తలు