ఫైర్ ఉన్న దర్శకురాలు

28 Dec, 2014 01:57 IST|Sakshi
ఫైర్ ఉన్న దర్శకురాలు

సహజంగానే దీపా మెహతా అనగానే గుర్తొచ్చేది ‘ఫైర్’. ప్రధానస్రవంతి దృష్టిలో ఇద్దరు స్త్రీల ‘అనామోదనీయ’ సంబంధాన్ని చూపిన చిత్రమది; లేదా భర్తల మాటున ఇద్దరు మామూలు గృహిణులు తమకుతాము వెతుక్కున్న స్వీయ సాంత్వనని చూపిన చిత్రం కూడా! అయితే, దీపామెహతా ఆ ఇద్దరు మహిళల్ని మాత్రమే బాధితులుగా చూడరు, వాళ్ల భర్తల్ని కూడా పితృస్వామ్య వ్యవస్థలో కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన విలువలకు బందీలుగా పరిగణిస్తారు. విషయం తెలిసినా వాళ్లు భార్యల్ని వదులుకోలేరుగా. అదీ దీపా మెహతా!
 
దీపా పంజాబ్‌లో పుట్టి, కెనడాలో స్థిరపడ్డారు. దీనివల్ల ఆమెను ‘బయటి దర్శకురాలిగా’ విమర్శించేవారున్నారు. కాని భారతదేశ ‘లోపటి’ని ముసుగుల్లేకుండా చూపడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. దేశవిభజన సబ్జెక్టు మీద ఈ లోపటి దర్శకులు ఎందరు, ఎన్ని సినిమాలు తీయడానికి ప్రయత్నించారు? ఆ సున్నితమైన సంక్లిష్టమైన అంశాన్ని దీపా ‘ఎర్త్’లో ఆవిష్కరించారు.
 
‘కనీసం కోటిమంది జనం- ముస్లింలు, హిందువులు, సిక్కులు- వాళ్ల వాళ్ల ఇండ్లనుంచి తరిమివేయబడ్డారు. ఎక్కువ నష్టం జరిగింది పంజాబ్‌లో. వారాల్లో పదుల వేల మంది ఊచకోత జరిగింది. మా నాన్న, వాళ్ల సోదరులు లాహోర్‌లో చాలా కష్టాలుపడ్డారు. వాళ్లు ఇళ్లు వదలాల్సివచ్చింది. మా నాన్న తన ముస్లిం స్నేహితులని మళ్లీ జీవితకాలంలో చూడలేదు. ప్రతి కుటుంబానికి ఇలాంటి పంచుకోదగిన విషాదగాథ ఏదో ఉంది. 1947 అనగానే వాళ్లకు భారత స్వాతంత్య్రం గుర్తురాదు, దేశ విభజన గుర్తొస్తుంది’ అని చిత్రానికి నేపథ్యం చెబుతారామె. ఫిల్మ్ పంపిణీదారు కూతురిగా దీపాకు చిన్నప్పటినుంచీ సినిమారంగం మీద ఆసక్తివుంది. అయితే, అది కేవలం కూడికలు, తీసివేతలకు పరిమితమైందికాదు. ‘శుక్రవారం విడుదల, సోమవారం బాక్సాఫీస్ వసూళ్లు’ ఆమె ఆసక్తి కాదు. వాటి ఫలితమే ఫైర్, వాటర్ లాంటి సినిమాలూ, వాటితో ముడిపడిన వివాదాలూ!
 
అలాగని, ‘ప్రత్యేకంగా వివాదాస్పదమైన చిత్రాన్ని తీయాలని నేనేమీ సంకల్పించను, ‘ఫైర్’, ‘వాటర్’లకు వచ్చిన స్పందన మాత్రం భయానకమైనది. అలాంటిది ఎవరికీ జరగకూడదనుకుంటాను. పైగా అది ఎవరికీ మేలు చేయదు, నాకైనా, నా నటులు, సాంకేతిక నిపుణులు, ఆఖరికి సినిమాను కనీసం చూడకుండానే అభిప్రాయాలు ఏర్పరుచుకునే వారికి కూడా!’ అంటారు దీపా. ‘అయితే, నేను అలాంటి భయాల్ని ఎప్పుడూ వెనకసీట్లో పెట్టేస్తాను. భయంతో ఏ ప్రగతీ సాధించలేము, పాషన్‌తోనే తప్ప’.
 
‘ఏ దర్శకులైనా వాళ్ల వర్కు నిశ్శబ్దంగా చావడాన్ని ఇష్టపడరు. నీ పనిని అభినందించే వ్యక్తి నువ్వు మాత్రమే అయితే ప్రయోజనం ఏమిటి? అది అందరికీ చేరాలి. సినిమాలో ఉన్నదాని గురించి ప్రేక్షకులు ఆలోచించడం ఉత్సాహాన్నిస్తుంది. అలాగని నేనేమీ ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరలేదు. ఒక సందేశం ఇవ్వడం కోసమే నేను సినిమాలు తీయను’ అంటారు. ‘ముద్రలు వేయడం సోమరుల పని. నన్ను నేను ఫెమినిస్టు దర్శకురాలిగాకన్నా హ్యూమనిటేరియన్ డెరైక్టర్‌గా పరిగణిస్తా’. ‘సత్యజిత్ రే, మిజోగుచి, ఓజు, విట్టారియో డె సికా, బెర్గ్‌మన్- అందరూ మాస్టర్స్- వీళ్లందరి ప్రభావమూ’ తన మీద ఉందంటారామె.
 
బుకర్ ఆఫ్ ద బుకర్ గౌరవం పొందిన ‘మిడ్‌నైట్స్ చిల్డ్రన్’ను సినిమాగా మలచడమేకాదు, ఆ నవల రచయిత సల్మాన్ రష్దీతోనే స్క్రీన్‌ప్లే రాయించారు, ‘అపవాదులకు’ వీలివ్వకుండా! ‘పుస్తకాల్లోంచి సినిమాగా మలచడంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, రెంటికీ పోలిక తేవడం అనివార్యం. ‘అడాప్టేషన్ పోలీసులు’ ఎప్పుడూ ఉంటారు. పుస్తకాలు, సినిమాలు రెండూ భిన్న మాధ్యమాలు కాబట్టి, ఎప్పుడో అరుదైన సందర్భంలో తప్ప పుస్తకం కన్నా సినిమా బాగా రావడం సంభవించదు. ఉదాహరణకు ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా పుస్తకం కన్నా బాగావచ్చిందనిపించింది నాకు’ అని చెబుతారు. ‘సినిమా తీస్తున్నప్పుడు ప్రతిదీ చాలెంజే. పెద్ద సీనా, చిన్న సీనా అన్నది కాదు, 1,500 మంది లేదా 3,000 మంది ఎక్స్‌ట్రాలో ఆ దృశ్యంలో ఉండటం కూడా కాదు, ఆ సీన్‌లోని ఉద్వేగ కేంద్రాన్ని పట్టుకోవడంలోనే అసలైన విషయం దాగుంది.

అది మనం లొకేషన్ మీదే కనుక్కోగలం. దానికంటే ముందు సాధ్యం కాదు. నేనిది చేస్తాను, నటీనటులు ఇది చేస్తారు అని ముందే ఒక ఆలోచన ఉంటుంది. కానీ మీకు కచ్చితంగా కెమెరా ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆ మ్యాజిక్, ఆ సినిమాతీయడం అనే మ్యాజిక్ అంతా లొకేషన్‌లోనే జరుగుతుంది’. ‘నటీనటులు వస్తారు, రెండు నెలలు కలిసి పనిచేస్తారు, మళ్లీ ఇంకో ప్రాజెక్ట్ మీదికి మరలిపోతారు. కానీ దర్శకురాలిగా, నేను ఆ సినిమాతో జీవిస్తాను. పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, సౌండ్, మ్యూజిక్ అన్నీ అయిపోయేదాకా దానితో ఉంటాను. అది నా బేబీ’ అంటారు దీపా ఉద్వేగంగా... అందువల్లే ఆమె సినిమాలన్నీ పద్ధతిగా పెంచినట్టుగా ఉంటాయేమో! నటీనటులు వస్తారు, రెండు నెలలు కలిసి పనిచేస్తారు, మళ్లీ ఇంకో ప్రాజెక్ట్ మీదికి మరలిపోతారు. కానీ దర్శకురాలిగా, నేను ఆ సినిమాతో జీవిస్తాను.

మరిన్ని వార్తలు