తొలి స్వాతంత్య్ర పతాక

25 Mar, 2018 00:50 IST|Sakshi
మేడమ్‌ కామా

ధ్రువతారలు

‘చూడండి! స్వతంత్ర భారత పతాకం ఆవిర్భవించింది. దేశ ప్రతిష్టను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన భారతీయ యువకుల నెత్తురుతో పునీతమైన జెండా. ఆ జెండా సాక్షిగా ప్రపంచ స్వేచ్ఛా ప్రియులందరినీ నేను వేడుకుంటున్నాను, ఈ పోరాటానికి చేయూతనివ్వండి!’ఇంత విశ్వాసం నిండిన గొంతు, ఇంతటి ఆత్మ స్థైర్యం నిండిన గుండె, ఒకే కలని అన్ని దశాబ్దాల పాటు భద్రంగా దాచుకున్న కళ్లు బహుశా ప్రపంచ చరిత్రలోనే మనకు తారసపడవు. మేడమ్‌ భికాజీ రుస్తోంజీ కామాకే ఆ ఖ్యాతి దక్కుతుంది. అది  మేడమ్‌ కామా గొంతు. 1907లో ఎక్కడో జర్మనీలో ప్రపంచ విప్లవ యోధులు, మహా రచయితలు, మేధావులు పాల్గొన్న సభలో మేడమ్‌ కామా ఆ పిలుపునిచ్చారు. ఆమె స్వప్నం సాకారమై నలభై ఏళ్ల తరువాత భారతదేశం మీద స్వతంత్ర పతాకం రెపరెపలాడింది. పరాయి పాలనలోని ౖ§ð న్యం భారతీయుల గుండెను తడుతున్న కాలమది. అలాంటి సమయంలో మేడమ్‌ కామా (సెప్టెంబర్‌ 24,1861–ఆగస్ట్‌ 13,1936) పుట్టారు. తండ్రి సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్‌. బొంబాయిలోనే కోటీశ్వరులనదగ్గ పార్శీల కుటుంబం వారిది. పారిశ్రామికవేత్తల వర్గం. నాటి చాలామంది పార్శీల మాదిరిగానే కామా కూడా ఇంగ్లిష్‌ విద్యను అభ్యసించారు. పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనం నుంచి ఆమెలో ఒక తిరుగుబాటు తత్వం ప్రస్ఫుటంగా ఉండేది. పైగా తిరుగులేని జాతీయవాది.

జాతీయవాదం పునాదిగా ఉండే రాజకీయాలంటే అపారమైన ఆసక్తి. ఆమె జాతీయవాదం ఎంత గాఢమైనదంటే అందుకోసం ఆమె వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు. 1885లో ఆమె రుస్తోంజీ కేఆర్‌ కామాను వివాహం చేసుకున్నారు. రుస్తోంజీ కామా పూర్తిగా ఆంగ్లేయ పక్షపాతి. వారి సంస్కృతి అంటే మోజు. వారి ఆలోచనలే ఆయనకు శిరోధార్యం. భారతదేశానికి ఆంగ్లేయులు చేసిన మేలు అసాధారణమైనదని రుస్తోంజీ వాదన. భికాజీ కామా ఇందుకు పూర్తి విరుద్ధం. అణచివేత, దోపిడీ ఆంగ్ల జాతి మౌలిక లక్షణమని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఫలితం–ఆ దంపతులు విడిపోయారు. అప్పటికే భికాజీ కామా సమాజ సేవకురాలిగా మారిపోయారు. కానీ తన పేరులో నుంచి భర్త పేరును ఆమె తొలగించలేదు. 1890లో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్యుబోనిక్‌ ప్లేగు వ్యాధి ప్రబలింది. అదొక భయంకరమైన అంటువ్యాధి. ఒళ్లంతా బొబ్బలతో నరకయాతన అనుభవిస్తూ కొన్ని గంటలలోనే వ్యాధిగ్రస్థులు చనిపోయేవారు. ఒక్క బొంబాయి నగరంలోనే ఆ మహమ్మారికి 22 వేల మంది మరణించారు. వ్యాధి సోకిన వారికి మేడమ్‌ కామా రాత్రీపగలూ సేవలు చేశారు. ఆ వ్యాధి ఆమెకు కూడా సోకింది. కానీ అతికష్టం మీద బతికారు. అప్పుడే పూర్తిగా కోలుకోవడానికి యూరప్‌ వెళ్లవలసిందని వైద్యులు సూచించారు. అలా ఆమె 1902లో ఇంగ్లండ్‌ చేరుకున్నారు. అనుకున్నట్టే అక్కడ భికాజీ కామా కోలుకున్నారు. ఆమె అక్కడ కాలు పెట్టే సమయానికి బ్రిటిష్‌ వ్యతిరేక తీవ్ర జాతీయవాదులకు లండన్‌ కేంద్రంగా ఉండేది. లాలా హరదయాళ్, శ్యాంజీ కృష్ణవర్మ, వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అక్కడే పనిచేసేవారు. వారితో పరిచయం కలిగింది. ఆంగ్ల జాత్యహంకారం గురించి హైడ్‌ పార్క్‌లో ఉపన్యాసాలు ఇచ్చేవారామె. 

అప్పటికి భారత జాతీయ కాంగ్రెస్‌ మితవాద నాయకుడు దాదాభాయ్‌ నౌరోజీ అక్కడే ఉన్నారు. ఆయన బ్రిటిష్‌ పార్లమెంట్‌కు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు (తరువాత పోటీ చేసి నెగ్గారు). అప్పుడు ఆయనకు కార్యదర్శిగా భికాజీ పనిచేశారు. బ్రిటిష్‌ దోపిడీ సంస్కృతి మీద ఆ ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరూ పార్శీలే. తరువాత ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నించారు. భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు ఆమె నిరాకరించి లండన్, పారిస్‌ నగరాలలోనే స్థిరపడ్డారు. అక్కడే ఉండి బ్రిటిష్‌ వ్యతిరేకోద్యమం చేస్తున్న సంస్థలకు ఆర్థిక సాయం అందించేవారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్యాన్ని వెలువరించేవారు. ఇంగ్లిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న ఇక్కట్లు, దేశంలో నశించిన హక్కులు వంటి వాటి గురించి భికాజీ కామా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు. సింగ్‌ రేవాభాయ్‌ రాణా, మంచేర్షా బుర్జోర్జీ గోద్రెజ్, మేడమ్‌ కామా కలసి పారిస్‌ ఇండియన్‌ సొసైటీ స్థాపించారు. ‘వందేమాతరం’, ‘తల్వార్‌’ అనే పత్రికలను నడిపారు. ఏది చేసినా దేశ స్వాతంత్య్రమే ఆమె లక్ష్యం. 

ఇవన్నీ ఒక ఎత్తయితే, భారత జాతికి తొలిసారిగా ఒక ఉమ్మడి పతాకాన్ని తయారు చేసిన ఘనత మేడమ్‌ కామాకే దక్కుతుంది. మూడు రంగులతో–ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో ఆమె పతాకాన్ని తయారు చేశారు. ఆకుపచ్చ రంగు మీద కొన్ని కలువలను చిత్రించారు. పసుపు రంగు మీద ‘వందేమాతరం’ అని రాయించారు. కింద ఎరుపు రంగు భాగంలో సూర్యచంద్రులను చిత్రించారు. ఇవి హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకలు. ఇవన్నీ భారతీయతకీ, హిందూ ముస్లిం ఐక్యతకీ, త్యాగనిరతకీ ప్రతీకలే. ఈ పతాకాన్ని ఆమె ఆగస్టు 22, 1907న జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో ఎగురవేశారు. ఆ సందర్భం ప్రపంచ చరిత్రలోనే గొప్పది. అది అంతర్జాతీయ సోషలిస్ట్‌ సమావేశం. లెనిన్‌ కూడా అందులో పాల్గొన్నారు. ఆసియా దేశాలలో సమానత్వం, స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆ సభ నుంచి ఆమె నినదించారు. ఆ వేదిక మీద నుంచే తొలిసారి భారతీయ పతాకం ఆమె ఎగురవేశారు. అక్కడ నుంచే ఆమె అమెరికా వెళ్లారు. ఆ తరువాత ఈజిప్ట్‌ వెళ్లారు. భారత స్వాతంత్య్రోద్యమంతో పాటు, మహిళల హక్కుల గురించి కూడా ఆమె ప్రచారం చేశారు. ఈజిప్ట్‌లో కామా ఆ కాలంలోనే వేసిన ప్రశ్న ఒక అద్భుతం. ‘మిగిలిన సగం ఈజిప్ట్‌ ఎక్కడ? ఇక్కడ నేను పురుషులని మాత్రమే చూస్తున్నాను. కానీ వీరు దేశంలో సగమే. తల్లులు ఎక్కడ ఉన్నారు? చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు? ఉయ్యాలలు ఊపిన చేతులు మనుషులను కూడా అంటే జాతిని తయారు చేస్తాయన్న సంగతి విస్మరించరాదు’ అన్నారామె. 

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కామా నిర్వహించిన పాత్ర అసాధారణమైనది. యుద్ధాన్ని ఆసరా చేసుకుని వలసలలోని ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కానీ భారతదేశంలో ఆంగ్లేయులకు మద్దతు దొరికింది. ‘మీరు ఎవరి కోసం పోరాడతారు? భారతీయులకు సంకెళ్లు వేసినవాళ్ల తరఫున పోరాడతారా?’ అని నిలదీశారు కామా. భారతదేశంలో గాంధీజీకీ, అనిబీసెంట్, జిన్నా, తిలక్‌ శిబిరానికీ మధ్య ఇదే విషయం మీద విభేదాలు ఉన్నాయి. గాంధీజీ యుద్ధంలో ఉన్న ఆంగ్లేయులకు మద్దతు ఇవ్వాలని గుజరాత్‌లో ప్రతి గ్రామం తిరిగి ప్రచారం చేశారు. తిలక్‌ శిబిరం స్వయంప్రతిపత్తి గురించి చెప్పి, భారతీయ సైన్యాన్ని ఉపయోగించుకోవాలని హోమ్‌రూల్‌ లీగ్‌ తరఫున ఉద్యమించింది. విదేశాలలో ఉన్న భారతీయ ఉద్యమకారులు గ్రేట్‌వార్‌ కాలంలో చెల్లాచెదురై పోయారు. అందుకు కారణం– అప్పటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ యుద్ధంతో ఏకమయ్యాయి. దీనితో ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందుతున్న బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమకారులకు నీడ కరువైంది. ఇంగ్లండ్‌లో కూడా వేట మొదలైంది. పారిస్‌లోని భికాజీ కామా  గృహం గదర్‌ వీరులకు, ఇతర భారతీయ తీవ్ర జాతీయవాదులకు నిలయంగా ఉండేది. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ రచన ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం–1857’ను బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. అప్పుడు నాసిక్‌ కలెక్టర్‌ జాక్సన్‌ హత్య కేసును సావర్కర్‌ ఎదుర్కొంటున్నారు. నాసిక్‌లోనే ఒక నాటకం చూస్తున్న జాక్సన్‌ అనంత్‌ కన్హేరీ అనే యువకుడు కాల్చి చంపాడు. ఇది సావర్కర్‌ కుట్ర అని ప్రభుత్వ ఆరోపణ. ఆ కేసులోనే ఆయనను లండన్‌లో అరెస్టు చేసి, భారత్‌కు తీసుకు వెళుతుండగా, మార్సెల్స్‌ రేవులో తప్పించాలని మేడమ్‌ కామా, వీవీఎస్‌ అయ్యర్‌ పథకం వేశారు. అనుకున్నట్టే ఓడ పాయఖానా రంధ్రం నుంచి వీర సావర్కర్‌ సముద్రంలోకి జారిపోయి, మార్సెల్స్‌ రేవులోకి ఈదుకు వచ్చారు. కానీ కామా, అయ్యర్‌ రావడం కొన్ని నిమిషాలు ఆలస్యమైంది. ఇంతలోనే ఫ్రాన్స్‌ పోలీసులను తప్పించి, ఇంగ్లిష్‌ భద్రతా సిబ్బంది సావర్కర్‌ను పట్టుకుని తీసుకుపోయింది. ఇండియాలో సావర్కర్‌ను అండమాన్‌ జైలులో పెట్టారు. రెండు జీవితకాలాల శిక్ష విధించారు. ఆయనను విడుదల చేయించడానికి కామా బ్రిటన్, ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయాల చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు. 

నిరంతర ప్రయాణాలు, నిరంతర ఉద్యమంతో భికాజీ ఆరోగ్యం దెబ్బ తిన్నది. 1935లో ఆమెకు పక్షవాతం సోకింది. ఒకసారి గుండెపోటు వచ్చినా బయటపడింది. అప్పుడు మళ్లీ భారతదేశం వెళ్లిపోవాలన్న కోరికను వ్యక్తం చేశారామె. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్న నమ్మకంతో ఆంగ్ల ప్రభుత్వం అనుమతించింది. స్వదేశానికి చేరుకున్న తొమ్మిది మాసాలకే ఆగస్టు 13, 1936న ఆ విప్లవ మహిళ తుది శ్వాస విడిచారు. కొందరు పేర్కొన్నట్టు ఆమె ‘భారత విప్లవోద్యమ మాత.’భికాజీ రాజనీతిజ్ఞత విశిష్టమైనది. తీవ్ర జాతీయవాదులు, భారత జాతీయ కాంగ్రెస్‌తో మమేకమైన నౌరోజీ వంటి మహనీయులు–ఈ రెండు శిబిరాల ఉద్దేశం, లక్ష్యం భారత స్వాతంత్య్రమేనన్న వాస్తవాన్ని తొలిసారిగా గుర్తించినవారిలో మొదటిగా గుర్తుకు వచ్చే వ్యక్తి భికాజీ కామా. కానీ స్వదేశంలో మితవాద కాంగ్రెస్‌ నాయకులు ఈ విధమైన ఆలోచనకే సుదూరంగా ఉండిపోయారు. దీని ఫలితమే దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కొన్ని చోట్ల శూన్యం కనిపిస్తుంది.  పరాయి గడ్డ మీద అంతకాలం ఉద్యమించడం దాదాపు ఆమెకు మాత్రమే సాధ్యమైంది. మేడమ్‌ కామా పరాయి గడ్డ మీద ఉండి స్వతంత్ర భారతదేశం కోసం అద్భుతమైన ఉద్యమం సాగించారు. ఆమె రూపొందించిన పతాకాన్ని ఇందులాల్‌ యాగ్నిక్‌ అనే గుజరాత్‌ ప్రాంత సోషలిస్టు ఉద్యమకారుడు స్వదేశానికి చేర్చాడు. కానీ ఆమె త్యాగనిరతి గాధ ఇప్పటికీ స్వదేశానికి చేరలేదు. స్వాతంత్య్రానికి ముందు ఉన్న 37 ఏళ్ల విప్లవ జీవితం, స్వతంత్ర భారతదేశ చరిత్ర పుస్తకాలలో తగిన స్థానం కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పటికైనా నెరవేరుతుందా?
డా. గోపరాజు నారాయణరావు 

మరిన్ని వార్తలు