వివరం: స్ఫూర్తి శిఖరాలు

25 May, 2014 01:22 IST|Sakshi
వివరం: స్ఫూర్తి శిఖరాలు

శిఖరం కన్న సంకల్పబలం ఎత్తైదని నిరూపించిన భారతీయ మహిళలు వీరంతా! బచేంద్రీపాల్ మొదలు... ఒంటికాలితో ఎవరెస్టును ఎక్కిన అరుణిమ సిన్హా వరకు ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. అందరిదీ ఒకే పట్టుదల. అందుకే వీరు స్ఫూర్తి శిఖరాలయ్యారు.
 
ప్రపంచంలోకెల్లా ఎత్తయిన శిఖరం ఏది? ప్రశ్న పూర్తయే లోపు ‘ఎవరెస్టు’ అనే సమాధానం వస్తుంది. 29,029 అడుగుల ఎత్తయిన  హిమాలయ పర్వతాల్లో మహలాంగుర్ సెక్షన్‌లో ఉంది ఎవరెస్టు శిఖరం. దీనిని నేపాలీయులు ‘సాగర్‌మాత’ అనీ, టిబెట్ వాసులు చోమోలుంగ్‌మా అనీ పిలుచుకుంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా... శిఖరం ఎప్పుడూ గొప్పదే. ఎవరికీ అందనంత ఎత్తులో ఉండడమే దాని గొప్పదనం. అయితే, ‘ఆ గొప్పదనమేంటో మేమూ చూస్తాం’ అంటూ ఎగబాకుతారు సాహసికులు. ఎవరెస్టును అధిరోహించిన సాహసికుల్లో...  ఏడడుగులే కాదు, శిఖరయానం కూడా కలిసే అంటూ ఎవరెస్టునెక్కిన దంపతులు మరీజా, ఆమె భర్త యాండ్రెజ్ స్ట్రెమ్‌ఫెల్జ్... అరవైలలో ఒకసారి, డెబ్బైలలో మరోసారి ఎవరెస్టు ఎక్కిన రికార్డు నాది అంటూ టేమీ వాటనబుల్... ఇప్పటికి ఇరవైసార్లకు పైగా ఎక్కాను తెలుసా అంటూ అపా షెర్పా... ఇలా ప్రపంచదేశాల నుంచి లెక్కలేనంత మంది ఎవరెస్టును అధిరోహించి తమ కీర్తిని శిఖర స్థాయికి చేర్చుకున్నారు.
 
 ఈ అధిరోహణలో భారతీయుల స్థానం కూడా తక్కువేం కాదు. ఈ పరంపరకు తొలి అడుగు బచేంద్రిపాల్. ఆ తర్వాత తండోపతండాల్! ఆ మహిళల అడుగులే ఈవారం మన ‘వివరం’. బచేంద్రిపాల్: ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్. ఆమె 1984 మే నెల 23న ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. బచేంద్రిపాల్ భారతీయ మహిళా పర్వతారోహకులకు స్ఫూర్తి ప్రదాత. ఆమె తర్వాత ఎవరెస్టును అధిరోహణకు పూనుకున్న ప్రతి పర్వతారోహకులూ ఒక్కసారైనా ఆమెను కలవాలనీ, సూచనలను తీసుకోవాలనీ, ఆమెతో ఫొటో తీసుకోవాలనీ ఉవ్విళ్లూరినవారే.
 
 బచేంద్రిపాల్ 1954 మే నెల 24వ తేదీన జన్మించారు. అంటే నిన్నటికి అరవై ఏళ్ల కిందట అన్నమాట. విశేషం ఏమిటంటే... ఆమె ఎవరెస్టును అధిరోహించింది 1984 మే నెలలోనే తన పుట్టినరోజుకు సరిగ్గా ఒక రోజు ముందే. అంటే ఆమెకు 30 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె కీర్తి ఎవరెస్టు శిఖరానికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడచిన ముప్ఫై ఏళ్లుగా ఆమె కీర్తి అలాగే శిఖరస్థాయిలో కొనసాగుతోంది. నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ద్వారా ఆమె చాలాకాలంగా పర్వతారోహణలో మహిళలకు (పురుషులకు కూడా) శిక్షణనిస్తున్నారు. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్‌కు అధినేతగా వ్యవహరిస్తున్నారు.
 
 ఈ రికార్డులకంటే ముందు ఆమె సాధించిన మరో రికార్డు కూడా ఉంది. నకురి గ్రామంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి అమ్మాయి బచేంద్రిపాల్. ఆ తర్వాత ఆమె సంస్కృతంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె తొలిసారి పర్వతారోహణ చేసింది పన్నెండేళ్ల వయసులో. స్కూలు విద్యార్థులతోపాటు పిక్నిక్‌లో భాగంగా 13, 123 అడుగుల పర్వతాన్ని అధిరోహించారు.   
 
 సంతోష్‌యాదవ్:  ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండవ భారతీయ మహిళ సంతోష్ యాదవ్. ఆమె 1992, 1993లలో మే నెలలో ఎవరెస్టును అధిరోహించారు. అలా ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించారు. సంతోష్ యాదవ్1967 అక్టోబర్ 10న జన్మించారు. ఆమెది హర్యానా రాష్ట్రం, రెవారీ జిల్లాలో జోనియావాస్ గ్రామం. జైపూర్‌లోని మహారాణి కాలేజ్‌లో చదివారు. ఉత్తరకాశిలోని కస్తూర్బా హాస్టల్‌లో ఉంటూ ‘నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్’ సంస్థలో శిక్షణ పొందారు. ఆమె ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షలకు చదువుతూనే పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. ఇరవై ఐదేళ్ల వయసులోనే ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఆమె ఇండో- టిబెట్ సరిహద్దు పోలీస్ అధికారి. ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.
 
 కల్పనా దాస్: 2008, మే 21వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని చేరారు. అది ఆమెకు మూడవ ప్రయత్నం. ప్రతికూలమైన వాతావరణపరిస్థితులు, ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాల వల్ల ఈమె 2004, 2006లలో రెండుసార్లు విఫలమయ్యారు. మొదటిసారి 7,300 మీటర్లు, రెండవసారి 8, 048 మీటర్ల వరకు మాత్రమే వెళ్లగలిగారు. మూడవ ప్రయత్నానికి ముందు బచేంద్రిపాల్‌ను కలిసి సలహా తీసుకున్నట్లు ఆమె చెప్తారు.
 
 కల్పనాదాస్ 1966 జూలై 7వ తేదీన ఒరిస్సా రాష్ట్రం థేన్‌కానల్ జిల్లా సరియాపారా గ్రామంలో జన్మించారు. ఆమె వృత్తి రీత్యా న్యాయవాది. ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ ‘దేవుడి దయ వల్ల, మా కుటుంబ సభ్యుల ఆశీస్సుల వల్ల అత్యంత ఎత్తై శిఖరాన్ని అధిరోహించి రికార్డు సాధించగలిగాను. విఘ్నాలను అధిగమిస్తూ శిఖరాన్ని చేరడంతోపాటు అంతే క్షేమంగా వెనక్కు రాగలిగాను. ఆ శిఖరాన్ని మళ్లీ మళ్లీ అధిరోహించాలనుంది’’ అన్నారామె. ప్రస్తుతం ఆమె థేన్‌కానల్ పట్టణంలో నివసిస్తున్నారు.
 ప్రేమలతా అగర్వాల్:  2011, మే నెల 20వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ రికార్డుతోపాటు ఆమెకు ‘ఎవరెస్టును అధిరోహించిన భారతీయ మహిళల్లో పెద్ద వయస్కురాలిగా’ మరో రికార్డు కూడా ఉంది. ఎవరెస్టు ఎక్కేనాటికి ఆమె వయసు 45 ఏళ్లు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు. ఆమె ఎవరెస్టు ఎక్కే నాటికే పెద్దమ్మాయికి వివాహమైంది కూడ.
 
 జార్ఖండ్‌కు చెందిన ప్రేమలత గృహిణి. ఆమె భర్త విమల్ అగర్వాల్ సీనియర్ పాత్రికేయులు. ఎవరెస్టు ఆరోహణకు ముందు ఆమె 40 రోజుల పాటు ఎడారిలో పర్యటించారు. థార్ డెజర్ట్ ఎక్స్‌పిడిషన్‌లో భాగంగా ఆమె గుజరాత్ లోని భుజ్ ప్రాంతం నుంచి పంజాబ్‌లోని అట్టారి (వాఘా బోర్డరు) వరకు ఒంటె మీద సవారీ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయ్యారు. ప్రపంచంలోని ఏడు శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఆఫ్రికాలో ఎత్తై శిఖరం కిలిమంజరో అగ్నిపర్వత శిఖరాన్నీ, అర్జెంటీనాలోని మౌంట్ అకాంగువా శిఖరాన్నీ అధిరోహించారు. ఆమె తన పెద్ద కూతురు ప్రియాన్‌ష తోపాటు టాటా స్టీల్ అడ్వెంచర్ ఇన్స్‌ట్యూట్‌లో బచేంద్రిపాల్ దగ్గర శిక్షణ తీసుకున్నారు.
 
 విద్యాపతీ దేవి: 2013, మే 17వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. పూర్తిపేరు నింగ్‌తోజమ్ విద్యాపతీదేవి. ఆ ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ఆమె ఎవరెస్టు బేస్ క్యాంపుకు చేరారు. అక్కడి నుంచి హిమాలయ పర్వతాల ఆరోహణ మొదలు పెట్టిన వీరి బృందం ఏప్రిల్ నెలాఖరుకు 24,000 అడుగుల ఎత్తులో ఉన్న మూడవ క్యాంపుకు చేరింది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఆ వాతావరణంలో కొనసాగుతూ మే నెల 17వ తేదీకి శిఖరాన్ని చేరారు.
 
 విద్యాపతీదేవి 2004లో ఉత్తరకాశిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణలో శిక్షణ పొందారు. దీనితోపాటు సియాచిన్ గ్లేసియర్‌లో వింటర్ ట్రైనింగ్ కోర్సు కూడా చేశారు. లైజన్ ఆఫీసర్ కోర్సు, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఆల్పైన్ కోర్సు, మెథడ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ కోర్సులు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె మణిపూర్ మౌంటనియరింగ్ ట్రెకింగ్ అసోసియేషన్‌లో అడ్వెంచర్ ఇన్‌స్ట్రక్టర్‌గా కొనసాగుతున్నారు. విద్యాపతీదేవి ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్‌ని మణిపూర్‌లోని ‘మణిపూర్ మౌంటనియరింగ్ అండ్ ట్రెక్కింగ్ అసోసియేషన్’ నిర్వహించారు. ఈ బృందంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్షు జామ్‌సెన్‌పా కూడా ఉన్నారు.
 
 వాన్‌షుక్ మిర్తాంగ్: ఈమె మేఘాలయకు చెందిన ఆర్మ్‌డ్ పోలీసు కానిస్టేబుల్. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 16 మంది పర్వతారోహకుల బృందంతోపాటు ఈమె 2013 మే నెల 17వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. వీరు బృందాలుగా విడిపోయి ఆరోహణ కొనసాగించారు. మొదటి బృందంలో విద్యాపతీదేవితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఆరుగురితో కూడిన రెండవ బృందంలో వాన్‌షుక్ ఉన్నారు.
 వాన్‌షుక్ ‘నార్త్ ఈస్ట్ జోన్ స్పోర్ట్స్ క్లైంబింగ్ కమిటీ’ నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2006లలో మేఘాలయ పోలీస్ శాఖలో చేరిన వాన్‌షుక్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ‘ఔలి’ లో ఉన్న మౌంటనియరింగ్ అండ్ స్కీయింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు.
 
 చందా గయేన్: 2013, మే నెల 18వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. హౌరాలో నివసిస్తున్న చందా ఈ రికార్డును సాధించిన బెంగాలీ మహిళ. డార్జిలింగ్‌లోని ‘హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్‌స్టిట్యూట్’లో ఆమె శిక్షణ పొందారు. ఎవరెస్టు అరోహణకు ముందు ఆమె గర్వాల్ జిల్లాలోని జోగిన్ శిఖరాలను, హిమాచల్ ప్రదేశ్‌లోని మనిరంగ్ శిఖరాన్ని అధిరోహించారు. కరాటే వంటి యుద్ధకళల్లో ప్రావీణ్యత సాధించిన చందా గయేన్ ఆత్మరక్షణ మెళకువలు నేర్పించే ఉపాధ్యాయిని. తన తల్లి జయా గయేన్ నుంచి స్ఫూర్తి పొందారు. జయాగయేన్‌కు ట్రెకింగ్ హాబీ. చందాగయేన్ రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్, మౌంటనియరింగ్‌లలో శిక్షణ పొందారు.
 
 చందా డార్జిలింగ్‌లో హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్‌స్టిట్యూట్, నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణ సాధన చేశారు. దీంతోపాటు హిమాలయన్ నేచర్ అండ్ అడ్వెంచర్ ఫౌండేషన్ నిర్వహించిన అడ్వెంచర్ ట్రెకింగ్ క్యాంపులో పాల్గొన్నారు. ఆమె స్విమ్మింగ్, కబడీ, ఎన్‌సిసి, మార్షల్ ఆర్ట్స్, మౌంటనియరింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్‌తోపాటుగా పాటలు పాడడంలో కూడా సుశిక్షితురాలు. జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం, రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చాంపియన్‌షిప్, కరాటే చాంపియన్‌షిప్‌లు సాధించారు.
 తాషి మాలిక్, నాంగ్‌షి మాలిక్: ఈ అక్కాచెల్లెళ్లు ఎవరెస్టును అధిరోహించిన తొలి కవలలు. వీరు 2013 మే 19వ తేదీన శిఖరాన్ని చేరారు. అప్పటికి వారి వయసు 21 ఏళ్లు. వీరిది హర్యానాలోని సోనీపత్ జిల్లా. వీరి తండ్రి కల్నల్ వీరేంద్రసింగ్ మాలిక్ మిలటరీలో ఉద్యోగం చేసి డెహ్రాడూన్‌లో రిటైరవడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. వీరు 2010లో ఉత్తరకాశిలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం, గుల్‌మార్గ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటనియరింగ్‌లో శిక్షణ పొందారు. పాఠశాల స్థాయి నుంచి ఆటల్లో, సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న నేపథ్యం వీరిది. జర్నలిజం- మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.
 
  ఏడు శిఖరాల అధిరోహణలో భాగంగా ఇప్పటికి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలలోని శిఖరాలను అధిరోహించారు. ఇండోనేసియా, యుఎస్, అంటార్కిటికాలలోని శిఖరాలను ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. అరుణిమా సిన్హా :  2013, మే 22వ తేదీన శిఖరాన్ని చేరారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అరుణిమా సిన్హా. ప్రమాదవశాత్తూ ఒక కాలిని కోల్పోయిన తర్వాత అందరూ తన మీద చూపించే సానుభూతికి సమాధానంగా ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.
 
 ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణిమ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. మూడేళ్ల కిందట ఒకసారి అరుణిమ రైలో ప్రయాణిస్తుండగా దొంగలు ఆమె పర్సును లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ ప్రతిఘటనలో దొంగలు ఆమెను కదులుతున్న రైల్లోంచి బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె ఎడమకాలు నుజ్జనుజ్జయింది. ఆమెను బతికించాలంటే ఆ కాలిని తీసేయడమే మార్గం అని తేల్చేశారు డాక్టర్లు.
 ఆమె ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ... ‘కాలు పోతే జీవితాన్ని కోల్పోయినట్లు కాదు...’ అని నిరూపించడానికే ఈ సాహసం చేశానన్నారు. తన సాహసయాత్రను ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’ స్పాన్సర్ చేసింది.
 
 వ్యక్తిగతంగా వీళ్లే కాకుండా, 2005లో అంతా మహిళలే ఉండే ‘ఆల్ ఉమెన్ ఆర్మీ ఎక్స్‌పెడిషన్’ జరిగింది. భారతీయ సైనిక రంగానికి చెందిన మహిళల బృందం ఎవరెస్టును అధిరోహించి వచ్చింది.  ఇక ఈ ఏడాది (2014) ఏప్రిల్ 18వ తేదీన శిఖరం మీద జరిగిన ప్రకృతి వైపరీత్యం కారణంగా 16 మంది పర్వతారోహకులు మరణించారు. ఈ ఘటన కారణంగా ఈ ఏడాది ఎవరెస్టు శిఖరారోహణను నిషేధించారు. అలా జరగకపోయి ఉంటే ఈ మే నెల మరికొంత మంది మహిళలను ఎవరెస్టు శిఖరంపై ఖాయంగా నిలబెట్టి ఉండేదే.ఎవరెస్టు శిఖరం అన్నిటి కన్నా ఎత్తయినది కావచ్చు. అయితే మహిళల సంకల్పబలం ఎవరెస్టును మించినదని ఈ పది మంది మహిళా పర్వతారోహకులు నిరూపించారు.
 - వాకా మంజులారెడ్డి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా