మొదటి సినిమా

20 May, 2018 00:02 IST|Sakshi

ఈరోజు ఉదయం లేచినప్పట్నుంచీ చాలా చిరాకుగా ఉంది. మనసంతా ఏదో ఆందోళనతో నిండిపోయినట్టు అనిపిస్తోంది. గడియారంలో సెకండ్ల ముల్లు గంటల ముల్లంత చిన్నగా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో అసలెప్పుడూ ఇలా లేదు. అసలు ఏ పని చేయాలో అర్థం కావడం లేదు. నాన్న, తమ్ముడు సినిమాకు వెళుతున్నారు. నేనిప్పటివరకూ సినిమా చూడలేదు. థియేటర్‌ ఎలా ఉంటుందో తెలీదు. తమ్ముడు ఇప్పటికే చాలాసార్లు నాన్నతో కలిసి సినిమాలు చూశాడు. నేను మాత్రం ఎప్పుడూ సినిమా చూసింది లేదు. ఎందుకో ఆ ఆలోచనే ఉండదు. ఇవ్వాళెందుకో మొదటిసారి సినిమా చూడాలనిపిస్తోంది. వాళ్లు వెళ్తూ వెళ్తూ ప్రతిసారీ, ‘‘సినిమాకు వెళ్తున్నాం. వస్తావా?’’ అని అడుగుతారు. ‘‘నాకిష్టం లేదు.’’ అంటుంటాను నేను. ఈసారి వాళ్లు అడక్కముందే, నేనే అన్నా – ‘‘నేనూ వస్తా’’.

చిరాకు అంతా ఎక్కడికో ఎగిరిపోయింది. తెలియని ఉత్సాహమేదో నన్నలా పూర్తిగా పట్టేసుకున్నట్టు ఒకలాంటి ఆనందం. ఆలోచనలు మనం అనుకున్నట్టు మారిపోతాయేమో! సంతోషంగా ఉండటం, అన్నింటికంటే ముందు మనకు మనం అనుకోవడంలోనే ఉంటుందనుకుంటా. కొత్తబట్టలు వేసుకున్నా. నాకెంతో ఇష్టమైన చెప్పులు వేసుకున్నా. ఈ చెప్పుల గురించి చెప్పాలంటే పెద్ద కథే ఉంది. మా నాన్న, నేను ఒకసారి పక్క ఊరికి వెళ్లాం. మేం సినిమా చూడాలన్నా, పండగ బట్టలేమైనా కొనుక్కోవాలన్నా, ఇంకే పనున్నా పక్క ఊరికి వెళ్లాల్సిందే. అప్పుడది పండగ సీజన్‌ కూడా కాదు. ఏదో పెళ్లి ఉందంటే నాన్న, నేను, తమ్ముడు వెళ్లాం. ఆరోజు వర్షం బాగా పడుతోంది. బస్టాండ్‌కి వెళ్లడానికి ముందే ఎక్కువైంది వర్షం. ఒక చెప్పుల షాపు ముందు వర్షం తగ్గేంతవరకూ నిలబడ్డాం.

నాన్న ఆ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నాడు. తమ్ముడికి ఇవేవీ పట్టవు కదా.. ఇంటికెళ్దామని గొడవ చేస్తున్నాడు. నాకేదీ కనిపించట్లేదు. మేం నిలబడ్డ చోటునే వరుసగా కొత్త కొత్త డిజైన్‌ చెప్పులు లైన్‌గా పెట్టి ఉన్నాయి. అవి తప్ప ఏం కనిపించట్లేదు. అదిగో అప్పుడు మెచ్చిన చెప్పులే ఇవి. నాన్నని ఎంతగా బతిమిలాడానో ఈ చెప్పుల కోసం. ఈరోజు ఈ చెప్పులు వేసుకొని సినిమాకు వెళుతున్నానంటే చాలా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గర్నుంచి అర కిలోమీటరు దూరం నడిస్తే బస్టాండ్‌ వస్తుంది. అక్కడ బస్‌ ఎక్కితే ఇరవై నిమిషాల్లో పక్క ఊర్లో ఉండొచ్చు. బస్సెక్కి ఈ దారంతా వెళుతూంటే నాకు ఆరోజు పెళ్లికి వెళ్లిందే గుర్తొస్తోంది. కొన్ని నెలల్లోనే ఇదంతా ఎలా మారిపోయిందో కదా అని చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ బస్‌లోంచి చూస్తూ కూర్చున్నా. ఊరొచ్చేసింది.

ఎర్రటి ఎండాకాలం కాబట్టి అప్పటికే సూర్యుడు మండిపోతున్నాడు. బస్టాండ్‌ నుంచి కొద్దిదూరం నడిచెళ్తే సినిమా థియేటర్‌ వచ్చేస్తుంది. ముగ్గురం ఎండలో నడుస్తున్నాం. సరిగ్గా అప్పుడే నాకిష్టమైన చెప్పు తెగిపోయింది. ‘అబ్బా! ఈ టైమ్‌లో ఇలా జరిగిందేంటీ?’ అనుకుంటూ ఆ తెగిపోయిన చెప్పుతోనే నడుస్తూ ఉన్నా. వల్ల కాలేదు. కొద్దిసేపటికి ఆ చెప్పులు చేతిలోకి తీసుకొని నడవడం మొదలుపెట్టా. ఎండకు కాళ్లు మండిపోతున్నాయి. ‘సినిమా వద్దు. ఏం వద్దు.’ అనిపించింది ఒక్కసారే. చుట్టుపక్కల ఎక్కడా ఒక్క చెప్పుల షాపు కూడా కనిపించట్లేదు.అంతలోనే అదే వెతుక్కుంటూ వచ్చిందా అన్నట్టు థియేటర్‌ కనిపించింది. ‘హమ్మయ్యా!’ అనుకుంటూ ఆ థియేటర్‌ గోడ వైపు పరిగెత్తి నీడలో నిలబడ్డా.‘‘ఇక్కడ ఆగావేంటీ? ఇది కాదు మనం వెళ్లే సినిమా!’’ అని ముందుకు నడిపించాడు. నాకు కాళ్లు కాలిపోతున్నాయి.

‘‘ఒరేయ్‌ తమ్ముడూ! కాసేపు నీ చెప్పులు ఇవ్వవూ..’’ అనడిగా.నేనేం అడిగినా, ఏం మాట్లాడినా నాతో గొడవ పెట్టుకునే నా తమ్ముడు, ఇవ్వాళేంటో అడగ్గానే చెప్పులు ఇచ్చేశాడు. అవి వేస్కొని కొద్దిదూరం నడిచా. మళ్లీ వాడికి కూడా కాళ్లు కాలుతాయి కదా అని ఇచ్చేశా. ఎంతదూరం నడుస్తున్నా ఈ థియేటర్‌ రావట్లేదు. వెనక్కి వెళ్లిపోవాలనిపించింది. అలాఅనిపించిందో లేదో థియేటర్‌ వచ్చేసింది. మూడు బెంచీ టికెట్లు కొన్నాడు నాన్న.నీడపట్టుకు వచ్చేశా కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. ‘‘సినిమా మొదలవ్వడానికి ఇంకా టైముంది’’ అని చెప్పి వెళ్లిపోయారు థియేటర్‌ వాళ్లు. నేను, నాన్న, తమ్ముడు బయటే కూర్చున్నాం. కాసేపటికి రోడ్డు మీద ఉన్న చెట్టు కిందకి వెళ్లి కూర్చున్నాం. అక్కడ కూర్చొని ఈ రోడ్డంతా గమనిస్తూ ఉంటే మా ఊరికీ, ఈ ఊరికీ ఎంత తేడానో కదా అనిపించింది.

చాలాసేపు ఎవ్వరితో ఏం మాట్లాడకుండా రోడ్డు వైపే చూస్తూ కూర్చున్నా.థియేటర్‌ వాళ్లు లోపలి గేటు తెరిచారు. దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్లి కూర్చున్నాం. బెంచీ టిక్కెట్లు. తెరేమో చాలా దగ్గరగా ఉంది. ఎంతోసేపు ఎదురుచూశాక కానీ సినిమాను ప్రారంభించలేదు. ఇంతసేపూనేను నా మొదటి సినిమా చూస్తున్నానన్న ఉత్సాహంతోనే కాళ్లు కాలినా ఏదీ పట్టించుకోలేదు. సినిమా మొదలైంది.చాలాసేపు ఇంత దగ్గరగా ఉన్న తెరను చూడటం చాలా ఇబ్బందిగా కనిపించింది. తలంతా ఎత్తి చూస్తే తప్ప తెరంతా కనిపించడం లేదు. అలా చూసీ చూసీ మెడ పట్టేసుకుంది. కాసేపు ఏం చూడకుండా పడుకున్నా. మధ్య మధ్యలోలేచి చూస్తుంటే మళ్లీ చూడాలనిపిస్తోంది.

అలా ఎంతసేపు సినిమా చూశానో, ఎంతసేపు పడుకున్నానో తెలీదు కానీ, మొదటిసారి సినిమా చూడటం మాత్రం చాలా బాగుంది. ఒక ఊహాలోకంలోకి తీసుకుపోయి పడేసినట్టు అనిపించింది.నాన్న, తమ్ముడు ఇన్నిసార్లు పిలిచినా నేను ఇవ్వాళ్టివరకూ సినిమా ఎందుకు చూడలేదా అనిపించింది. సినిమా అయిపోయింది.అప్పటివరకూ సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తున్న వాళ్లంతా బయటకు వెళ్లడానికి ఎగబడుతున్నారు. ఈ దృశ్యం నాకెందుకో వింతగా కనిపించింది. ఎవరో పిలుస్తున్నట్టు ఎందుకు వీళ్లంతా ఎగబడుతున్నారనిపించింది. నేనూ మెల్లిగా కుర్చీలోంచి లేచి బయటకొచ్చా. బయట ఇంత ఎండ ఉందన్న విషయం మళ్లీ గుర్తొచ్చింది.

నా కాళ్లకు చెప్పులు లేవన్న విషయం కూడా ఆ వెంటనే గుర్తొచ్చింది. మేం థియేటర్‌కి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎండ ఇంకా ఎక్కువైంది. కాసేపు చెప్పులు వేసుకొని నడిచే ప్రయత్నం చేశా. కుదర్లేదు.‘‘పడెయ్యొచ్చు కదా!’’ అన్నాడు నాన్న.కానీ నేనెలా ఆ చెప్పుల్ని వదిలేసుకుంటాను? ఇష్టంగా కొన్నవి. కుట్టుకుంటే మళ్లీ పనికొస్తాయి. పడెయ్యిఅన్నాడు నాన్న కానీ పడేస్తే ఇప్పుడు మళ్లీ కొత్తవి, ఇలాంటివే, నేనిష్టపడేవే కొనిస్తాడా?చెప్పులు మళ్లీ చేతులోకి తీసుకొని నడుస్తున్నా. ఎండ మండిపోతోంది. కాళ్లు కాలిపోతున్నాయి. అలా చాలాసేపు చెప్పుల్లేకుండా నడుస్తుంటే అనిపించింది.‘అవును. నేనిలా చెప్పులు లేకుండా నడవడం చూస్తూ ఈ జనాలు నా గురించి ఏమనుకుంటూ ఉంటారు?’అక్కడ మొదలైంది నాలో నాకే ప్రశ్నలు మీద పడటం. ఈ ప్రశ్నల వల్లనో ఏమో కాళ్లు ఇప్పుడింకా ఎక్కువ కాలుతున్నాయి.

ఒక్కో అడుగుకి ఒక్కో ప్రశ్న. ‘వీళ్లంతా నా గురించి ఏమనుకుంటున్నారో!’.సిగ్గనిపించింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయాలనిపించలేదు. కాసేపు చుట్టూ చూశా. ఎవ్వరి పనుల్లో వాళ్లున్నారు. చాలాసేపు వాళ్లను చూస్తూంటే అనిపించింది – ‘ఇందులో ఎంతమందిని నేను మళ్లీ కలుస్తా? ఇక్కడ చూసిన వాళ్లు నన్నెప్పుడైనా మళ్లీ చూస్తారా? చూసినా గుర్తుపడతారా? ఈ ప్రయాణంలో ఇక్కడ నేనొక మనిషిని అంతే కదా!’. ఆలోచనలు అలా నాకే తెలియకుండా పరుగులు పెడుతూ ఉంటే, ‘నేనెందుకు ఇప్పుడు ఎవరు నన్నెలా చూస్తున్నారో ఆలోచించాలి?’ అనుకున్నా. చేతిలో పట్టుకున్న చెప్పులు చేతిలోనే ఉన్నాయి. ఎండ అలాగే ఉంది. నాన్న, తమ్ముడు నాకంటే వేగంగా నడుస్తూనే ఉన్నారు. నేనూ వాళ్లను అందుకునేంత వేగంగా ముందుకెళ్లా. నాకోసమేనేమో అంతసేపూ కాసిన ఎండ ఒక్కసారే మాయమైంది. మబ్బులు కమ్ముకున్నాయి అంతటా. నాకవి గొడుగుపడుతున్నాయి. నా మొదటి సినిమా అనుభవం ఇప్పుడు కూడా బాగుంది.

మరిన్ని వార్తలు