వెంటాడే నీడ

1 Nov, 2015 16:19 IST|Sakshi
వెంటాడే నీడ

మిస్టరీ
ఎండ మండిపోతోంది. అంత ఎండలో ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నాడు బిల్లూ. బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఆ ఊరి పొలిమేర దగ్గరకు వచ్చేసరికి ఓపిక సన్నగిల్లిపోయింది ఇక విశ్రాంతి తీసుకోక తప్పదనిపించింది. చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. చెట్టు చుట్టూ రాతి గట్టు. గట్టు మీద చల్లని చెట్టు నీడ. విశ్రాంతి తీసుకోడానికి అదే మంచి చోటు అనిపించింది. మెల్లగా అటువైపు నడిచాడు. చెట్టు దగ్గరకు చేరుకోగానే, భుజమ్మీది సామాను కిందకు దించాడు చప్టా మీద కూలబడ్డాడు బిల్లూ.

సామానంటే మరేమీ లేదు... ఒక నిలువు కర్ర, ఆ కర్రపైన నలు చదరంగా చెక్కబద్దలతో తయారు చేసు కున్న ఫ్రేమ్. ఆ ఫ్రేమ్‌కు వేలాడుతూ సవరాలు, జడకుచ్చులు, బొట్టుబిళ్లల ప్యాకెట్లు, కాటుక ప్యాకెట్లు తదితర ఆడవాళ్ల అలంకరణ సామగ్రి. దాన్ని భుజానికి తగిలించుకుని... ఒక చేతిలో సంచి, అందులో భోజనం క్యారేజీ పెట్టుకుని ఊరూరా తిరుగుతూ సరుకులు అమ్ముకుంటాడు. అదే అతని వృత్తి.  చెట్టునీడ చల్లగా ఉంది. దాంతో హాయిగా సేదదీరాడు. కాస్త అలసట తీరేసరికి కడుపులో ఆకలి కేకలు వేయడం మొదలు పెట్టింది. వెంటనే సంచిలోని క్యారేజీ బయటకు తీశాడు. ఆకలి మీద ఉన్నాడేమో... గబగబా భోజనం ముగించాడు. చెట్టుకు నాలుగడుగుల దూరంలో ఉన్న బోరింగ్ పంపు దగ్గరకు వెళ్లి చేయి కడుక్కుని చల్లని నీళ్లు తాగాడు. ఆకలి దప్పులు తీరాయి. అలసట మాత్రం ఇంకా పూర్తిగా తీరలేదు. అందుకే చెట్టునీడ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, ఆ గట్టుపైనే మేను వాల్చాడు. కునుకు పట్టింది.
     
ఎవరో తట్టినట్టు అనిపిస్తే ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు బిల్లూ. ఎవరా అని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. తన చాతి మీది నుంచి ఓ ఆకు జారి కిందపడింది. ‘ఓహ్... అది ఆకు స్పర్శా? అనవసరంగా కంగారు పడ్డాను’ అని నవ్వుకున్నాడు. అప్పటికే పొద్దు వాలుతోంది. తెలియ కుండా చాలాసేపు నిద్రపోయాడు. ఊళ్లోకి త్వరగా వెళ్లి తొందరగా బేరాలు ముగించు కోకపోతే చీకటి పడిపోతుంది. అందుకే గబగబా సామాను భుజానికెత్తుకుని నడక మొదలుపెట్టాడు.
 
పది నిమిషాల్లో ఊళ్లోకి చేరుకున్నాడు బిల్లూ. అతన్ని చూస్తూనే అమ్మలక్కలంతా చుట్టూ మూగారు. అదెంత, ఇదెంత అంటూ బేరాలు మొదలుపెట్టారు. ఓపిగ్గా సమాధానలు చెబితూ, వారిని తన మాటలతో ఆకట్టుకుంటూ సరుకులు అమ్ముతున్నాడు. అంతలో ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్టయ్యింది. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. కాసేపటికి ఒళ్లంతా సలపరంగా అనిపించసాగింది. జ్వరం వచ్చినట్టనిపిస్తోంది. కడుపులో వికారం మొదలైంది. ఎంత మామూలుగా ఉందామన్నా అతడి వల్ల కావడం లేదు.

బిల్లూ అవస్థను గమనించింది ఓ మహిళ. ‘‘ఏం బాబూ... ఒంట్లో బాలేదా?’’ అంది. ‘‘అవునండీ. ఇప్పుడే ఎందుకో తేడా అనిపిస్తోంది. జ్వరం వస్తోందనుకుంటా. కడుపులో కూడా’’... మాట పూర్తి కాకముందే భళ్లున వాంతి చేసుకున్నాడు బిల్లూ.  అది చూసి అందరూ అవాక్కయి పోయారు. ‘‘అమ్మో... రక్తం’’ అంది ఒకామె కంగారుగా. అప్పుడు చూసుకున్నాడు బిల్లూ. అవును. తను రక్తం కక్కుకున్నాడు. ఏంటిది? తనకి ఏమైంది? రక్తం కక్కుకోవడమేంటి? అతడు ఆలోచిస్తుండగానే మరో వాంతి. అలా వరుసగా వాంతులు చేసుకుంటున్నాడు. రక్తం కక్కుకుంటు న్నాడు. ఊరివాళ్లు కంగారు పడిపోయారు. నాటు వైద్యుడికి కబురు చేశారు. అతను వచ్చి ఏవో బిళ్లలు మింగించాడు. ఓ ఇంటి అరుగుమీద పక్క వేసి పడుకోబెట్టారు. ఆ రాత్రి అతను అక్కడే ఉండిపోయాడు.
     
తెల్లారింది. ఊళ్లో జనాల అలికిడి మొదలైంది. బిల్లూ పరిస్థితి ఎలా ఉందో చూద్దామనుకున్నారు కొందరు. నెమ్మదిగా నిద్రలేపడానికి ప్రయత్నించారు. ఎవరో అతణ్ణి తట్టారు. ఒళ్లు చల్లగా తగలడంతో ఉలిక్కిపడ్డారు. లేవమంటూ పట్టి కుదిపారు. కానీ అతను లేవలేదు. ఎందు కంటే అప్పటికే అతడు మరణించాడు.  ఎప్పుడు ప్రాణాలు విడిచాడో తెలీదు. అతడి బంధువులకు కబురు చేద్దామన్నా, అతడు ఎక్కడి వాడో కూడా ఎవరికీ తెలీదు. ఊళ్లోవాళ్లే అంత్యక్రియలు కానిచ్చే శారు.

అంతుచిక్కని అతడి మరణం గురించి కొన్నాళ్లు మాట్లాడుకున్నారు. రోజులు ఆగవు కదా, ఎవరి జీవితంలో వాళ్లు పడ్డారు. కానీ ఆ కథ అక్కడితో ముగిసిపోలేదని, అలాంటి దారుణాలు మరిన్ని జరగబోతున్నాయని అప్పుడు వాళ్లెవరకీ తెలియదు. బిల్లూ మరణించిన తర్వాత పక్షం రోజుల్లోనే ఇద్దరు యువకులు అదే విధంగా రక్తం కక్కుకుని మరణించారు. దాంతో ఊరి వాళ్ల మనసులు కీడు శంకించాయి. ఏదో భయం మొదలైంది. మంత్రగాళ్లను పిలిపించారు. ఫలితం లేదు. మూడు నెలలు గడిచేలోగానే ఏడుగురు అదే రీతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందరూ యువకులే.
 
ఏం జరుగుతోందసలు? అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా నెత్తురు కక్కుకుంటూ చనిపోతున్నారేంటి? ఆరా తీస్తే, వాళ్లంతా ఆ చెట్టుకింద కూర్చుని వచ్చాకే అలా కన్ను మూశారని అర్థమైంది. దాంతో ఆ మర్రిచెట్టులోనే ఏదో రహస్యం ఉందనిపించింది. నాటి నుంచి పట్టపగలు సైతం ఆ మర్రిచెట్టు దగ్గరకు వెళ్లడానికి అందరూ జంకసాగారు. ఆ ఊరి పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ఆ చెట్టు మీదుగా వెళ్లడమే దగ్గరి దారి. అయినా ఆ దారిని వదిలేశాడు. మూడు కిలోమీటర్లు ఎక్కువ దూరమైనా ఊరి చుట్టూ తిరిగి బడికి వెళ్లడం ప్రారంభించారు. అయితే అంతలోనే మరో విషాదం. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఓ యువకుడు విషయం తెలియక చెట్టు దగ్గరకు వెళ్లి మరణించాడు. పాపం... బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. అతడి మరణంతో ఊళ్లో శ్మశాన నిశ్శబ్దం ఏర్పడింది. ఇక లాభం లేదని ఊళ్లో వాళ్లంతా ఒక నిర్ణయం తీసుకున్నారు.
     
ఊరి చివర మర్రిచెట్టు... ఊరి జనమంతా గుమిగూడి ఉన్నారు. వారి మధ్యలో ఓ పూజారి మఠం వేసుకుని కూర్చున్నాడు. అతని పక్కనే అతని సహాయకురాలు ఉంది. ఇద్దరూ ఏదేదో చూస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి ఆ సహాయకురాలు గట్టిగా అరిచింది. ఉలిక్కిపడి చూశారంతా.  అంతే... వాళ్ల పై ప్రాణాలు పైనే పోయాయి. జుట్టు విరబోసుకుంది. గుడ్లెర్ర చేసి పట్టరాని కోపంతో కేకలు వేయడం మొదలు పెట్టింది. అందరికీ విషయం అర్థమైపోయింది. ఆ చెట్టు మీద దెయ్యం ఉందన్నమాట. అదే అందరినీ చంపుతోందన్నమాట. ‘‘ఏయ్... ఎవరు నువ్వు? ఎందుకు అందరినీ చంపుతున్నావ్’’... గద్దించాడు పూజారి.
 
అంతే... పగలబడి నవ్వసాగిందామె. ‘అప్పుడే అయిపోలేదు. ఇంకా చంపుతాను. ఈ ఏడాది దసరా పండుగ లోగా ఇరవయ్యొక్క మందిని చంపేస్తాను. నన్నెవరూ ఆపలేరు’ అంటూ భయాన కంగా నవ్వసాగింది.
 ‘‘అసలెందుకు జనాన్ని ఇలా చంపుతున్నావు?’’ ప్రశ్నించాడు పూజారి.
 ‘‘పగ చల్లార్చుకోవడానికి.’’
 ‘‘పగ దేనికి..? ఎవరి మీద..?’’
 ‘‘మంత్రగత్తెననే నెపంతో నన్ను చంపేశాడు ఈ ఊరి పెద్ద. ఊరి జనంలో ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. అందుకే ఈ ఊరి జనం మీద నాకు పగ...’’ చెప్పిందామె.
 
అది వినగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. ఆమె ఎవరో అర్థమైంది. పదేళ్ల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది.
దాదాపు పదేళ్ల కిందట ఊరిపెద్ద మనవడు... మూడేళ్ల పిల్లాడు అనుమానా స్పద జబ్బుతో మరణించాడు. ఊళ్లో ఒంటరిగా ఉంటున్న ఒక మహిళను మంత్రగత్తెగా అనుమానించాడు ఊరిపెద్ద. ఆమే తన మనవడి చావుకు కారణం అని భావించి, రాత్రికి రాత్రే ఆమె ఇల్లు తగలబెట్టించాడు. దాంతో ఆమె సజీవ దహనమైంది. ఇది జరిగాక ఊరిపెద్ద కుటుంబం ముంబై తరలిపోయింది. ఈ కథ మొత్తం పూజారితో చెప్పారు. అతను ఆ దెయ్యాన్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. మర్రిచెట్టు కిందనే హోమగుండం వెలిగించాడు. దెయ్యం పూనిన సహాయకురాలిని వేప మండలతో చితకబాదడం మొదలు పెట్టాడు. ఆమె కేకలు వేయసాగింది. అతనిపై తిరగబడటానికి విఫలయత్నం చేసింది. శక్తి సన్నగిల్లడంతో స్పృహ కోల్పోయింది. మర్రిచెట్టు నుంచి ఒక కొమ్మ తెగి హోమగుండంలో పడింది. దెయ్యం ఆమెను, ఆ చెట్టును వదిలి పారిపోయింది.
 
‘‘దెయ్యం వెళ్లిపోయింది, మీరు నిశ్చింతంగా ఉండండి’’ అన్నాడు పూజారి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆ ఊళ్లో అలాంటి మరణాలు మళ్లీ సంభవించలేదు. సాధారణంగా ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్లు అయ్యబాబోయ్ అనుకుంటారు. నమ్మనివాళ్లు సినిమాయే కదా అని మర్చిపోతారు. అయితే ఇలాంటివి నిజంగా కూడా జరుగుతాయని నిరూపించింది ఈ సంఘటన. ఇది కల్పిత కథ కాదు. ఓ యదార్థ ఘటన. ఇది జరిగిన ఊరి పేరు మంగళజోడి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో, జిల్లా కేంద్రానికి చేరువలోనే ఉంటుంది. ఈ సంఘటన ఎనిమిదేళ్ల కిందట జరిగింది. ఆ ఊరికి వెళ్లి ఎవరిని అడిగినా ఈ కథ వినిపిస్తారు. దెయ్యాలు ఉన్నాయి అంటూ బల్లగుద్ది మరీ చెబుతారు!

 - కాద్రా

మరిన్ని వార్తలు