వాయనం: పాదరక్షలూ ఫ్యాషన్‌లో భాగమే!

18 May, 2014 02:23 IST|Sakshi
వాయనం: పాదరక్షలూ ఫ్యాషన్‌లో భాగమే!

 చక్కటి డ్రెస్ వేసుకుంటాం. హెయిర్ స్టయిల్‌ను అందంగా తీర్చిదిద్దుకుంటాం. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చెయిన్, బ్రేస్‌లాంటి లాంటివన్నీ పెట్టుకుంటాం. కానీ పాదరక్షల సంగతి మర్చిపోతాం. ఏవి వేసుకుంటే ఏమని సరిపెట్టేసుకుంటాం. కానీ మన అలంకరణకు మరింత అందం రావాలంటే సరయిన చెప్పులు వేసుకోవడం కూడా ముఖ్యమే. అందుకే కంపెనీలు రకరకాల మోడళ్లలో పాదరక్షలు తయారు చేస్తున్నాయి. ఎలాంటి దుస్తులు వేసుకున్నప్పుడు ఏ మోడల్ పాదరక్షలు వేసుకోవాలో తెలుసుకుంటే ఇక మీకు తిరుగే ఉండదు.


 బ్లాక్ పంప్స్ - అసలు ఇవి ఇచ్చినంత అందం కాళ్లకు మరేవీ ఇవ్వవేమో అంటారు ఫ్యాషన్ నిపుణులు. ఏ డ్రెస్ మీదికైనా సూటయిపోతాయి. బిజినెస్ మీటింగ్, డిన్నర్, పార్టీ... ఎక్కడికి వేసుకెళ్లేందుకైనా అనువుగా ఉంటాయి. వీటి సోల్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందువల్ల నడవడంలో కూడా పెద్ద ఇబ్బంది ఉండదు.


 డ్రెస్సీ హై హీల్స్- రిచ్ లుక్ ఇవ్వడంలో వీటిని మించినవేవీ లేవు. జీన్స్, చీరల మీదికి ఇవి పెద్ద నప్పవు కానీ... స్కర్ట్స్, ఫ్రాక్స్ లాంటివి వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. సిల్వర్, గ్రే, ఎరుపు, మెటాలిక్... ఇలా చాలా రంగుల్లో ఉంటాయి. మన డ్రెస్‌ని బట్టి రంగు ఎంచుకోవడమే. విదేశాల్లో అయితే నలుపు రంగు డ్రెస్ వేసుకుంటే కచ్చితంగా వీటినే కాంబినేషన్‌గా ఎంచుకుంటారు అమ్మాయిలు.


 ఫీల్‌గుడ్ ఫ్లాట్స్- చాలామంది జీన్స్ మీదికి హీల్స్ వేసుకుంటారు కానీ... ఫ్లాట్స్ వేస్తే ఆ అందమే వేరు. కాస్త హైట్ తక్కువున్నవాళ్లు వీటి జోలికి పోకపోయినా, మంచి పొడవు ఉన్నవాళ్లు వీటిని ఎంచుకోవడమే బెటర్. కప్రీలు, షార్ట్స్, లెగ్గింగ్-కుర్తీల్లాంటివి వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. రకరకాల మెటీరియల్స్‌తో తయారవుతాయివి. మెత్తగా ఉండేవి, కాస్త గట్టిగా ఉండేవి, లైట్ వెయిట్ అంటూ కొన్ని రకాలున్నాయి. బోలెడన్ని రంగుల్లో ఉంటాయి. నచ్చినవి ఎంచుకోవచ్చు.


 డ్యాజ్లింగ్ బూట్స్- వీటిని మనవాళ్లు ఎక్కువగా వాడరు కానీ విదేశాల్లో అమ్మాయిలకు ఇవంటే మహా మోజు. ముఖ్యంగా వాళ్లవి చలి ప్రదేశాలు కాబట్టి వీటివైపు మొగ్గు చూపుతుంటారు. స్టైల్‌గానూ ఉంటాయి, వెచ్చగానూ ఉంటాయి. జీన్స్, షార్ట్స్, త్రీ ఫోర్త్స్ వేసినప్పుడు బాగా సూటవుతాయి. స్కర్టుల మీద కూడా బాగానే నప్పుతాయి. వీటిలో హీల్ ఎక్కువుండేవి, తక్కువుండేవి కూడా ఉంటాయి. హైట్‌ని, కంఫర్ట్‌ని దృష్టిలో ఉంచుకుని ఎంచుకోవచ్చు.


 రిలాక్సింగ్ స్నీకర్స్- వీటి అంత సౌకర్యంగా మరే మోడల్ పాదరక్షలూ ఉండవు. అందుకే వాకింగ్‌కి వెళ్లినప్పుడు, జిమ్ చేసేటప్పుడు వీటినే ఎంచుకుంటారు. వర్షాకాలంలోను, రోడ్లు బురదగా ఉన్నప్పుడు కూడా నడవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయివి. పార్టీలకు, ఆఫీసులకు వేసుకోవడానికి బాగోవు కానీ... ఏ షాపింగుకు వెళ్లినప్పుడో, సరదాగా షికారుకు వెళ్లినప్పుడో చక్కగా వేసుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు