పాదరక్షలు పాత ఫ్యాషనే!

12 Mar, 2016 23:10 IST|Sakshi
పాదరక్షలు పాత ఫ్యాషనే!

ఫ్లాష్‌బ్యాక్
తోలుతో తయారు చేసిన షూస్ చాలా ఆధునికమైనవని అనుకుంటాం గానీ, ఇవి చాలా పాత ఫ్యాషనే! క్రీస్తుపూర్వం ఏడువేల సంవత్సరాల నాడే  మనుషులు తోలు పాదరక్షలను వాడటం నేర్చుకున్నారు. అప్పట్లో తయారు చేసుకున్న షూస్‌కు తోలు పీలికలనే లేసుల మాదిరిగా వాడేవారు. కలపతో తయారు చేసిన పాదరక్షలను కూడా వాడేవారు. మధ్యయుగాల నాటికి పాదరక్షల తయారీలో నైపుణ్యం, కళాత్మకత పెరిగింది. క్రీస్తుశకం పదిహేనో శతాబ్ది నాటికి యూరోప్‌లో హైహీల్స్ షూస్ వాడుకలోకి వచ్చాయి.

వీటి మడమలు ఏడెనిమిది అంగుళాల ఎత్తు వరకు ఉండేవి. స్త్రీ పురుష భేదం లేకుండా అప్పటి సంపన్న వర్గాల్లో అందరికీ ఆ రకం పాదరక్షలే ఫ్యాషన్‌గా ఉండేవి. పద్దెనిమిదో శతాబ్ది నాటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో పాదరక్షల తయారీ కుటీర పరిశ్రమగా ఉండేది. పారిశ్రామిక విప్లవం తర్వాత, యంత్రాలతో పాదరక్షల తయారీ మొదలైన తర్వాత విప్లవాత్మక మార్పులే వచ్చాయి. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పాదరక్షలను తయారు చేయడం మొదలైంది. ముఖ్యంగా సైనికుల కోసం ప్రత్యేకమైన షూస్ తయారు చేసేవారు.

చాలాకాలం పాటు తోలు పాదరక్షలే ఎక్కువగా అందుబాటులో ఉండేవి. అయితే, ఇరవయ్యో శతాబ్దిలో రబ్బర్, ప్లాస్టిక్, సింథటిక్ వస్త్రం, కేన్వాస్ వంటి వాటితో కూడా పాదరక్షలను తయారు చేయడం ప్రారంభమైంది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు పాదరక్షల తయారీరంగంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా బ్రాండెడ్ షూస్‌కు గిరాకీ పెరిగింది.

క్రీ.పూ. 7 వేల సంవత్సరం నాటి తోలు షూ
 

మరిన్ని వార్తలు