అరణ్యం: పావురాలు పిల్లలకు పాలిచ్చి పెంచుతాయా?

24 Aug, 2013 22:50 IST|Sakshi
అరణ్యం: పావురాలు పిల్లలకు పాలిచ్చి పెంచుతాయా?

పూర్తిగా ఎదిగిన పావురం ఒంటిమీద దాదాపు పదివేల ఈకలుంటాయి!
     పావురాలు దాదాపు ఇరవై ఆరు మైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా గుర్తిస్తాయి. అందుకే యుద్ధాల్లో శత్రు సైన్యాలను గుర్తించేందుకు పావురాలను ఉపయోగించేవారు. అంతేకాదు, వీటికి ఏకాగ్రత ఎక్కువ. ఎలాంటి దారిలోనయినా కన్‌ఫ్యూజ్ అవకుండా వెళ్లిపోగలవు. అందుకే సందేశాలను వీటితో పంపించేవారు!
     వీటి గుండె నిమిషానికి ఆరు వందలసార్లు కొట్టుకుంటుంది. ఇవి సెకనుకు పదిసార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి. పదహారు గంటలపాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి!
     తలను పైకి ఎత్తకుండా మింగే శక్తి ఉన్న పక్షి పావురం మాత్రమే. ఇతర పక్షులన్నీ నీటినిగానీ, ఆహారాన్నిగానీ నోటిలోకి తీసుకున్న తర్వాత తలను పెకైత్తి మింగుతాయి!
     పావురాలు జీవితంలో ఒక్కదానితోనే జతకడతాయి. చాలా పావురాలు తమ జంట పావురం చనిపోతే మరో దానికి దగ్గర కాకుండా అలాగే ఉండిపోతాయని పరిశోధనల్లో తేలింది!
     వీటి గొంతులో ఓ సంచిలాంటి గ్రంథి ఉంటుంది. అందులో పాలలాంటి తెల్లటి ద్రవం ఉత్పత్తి అవుతుంది. ఈ ద్రవాన్ని పిల్లల నోటిలో వేస్తాయి పావురాలు. కొంతకాలం పాటు తల్లిదండ్రులిచ్చే ఈ పాలతోనే పిల్లలు పెరుగుతాయి!
     అన్ని పక్షుల పిల్లలూ కనిపిస్తాయి కానీ, పావురాల పిల్లలు సాధారణంగా ఎక్కడా కనిపించవు. దానికి కారణమేంటో తెలుసా? అన్ని పక్షుల పిల్లలూ పుట్టిన పది, పదిహేను రోజులకు ఎగరడం మొదలుపెడతాయి. కానీ పావురాల పిల్లలు మాత్రం రెండు నెలలకు గానీ ఎగరవు!
 
 వాటి చెలిమే ఆమెకు ఊరట!
 బ్రిట్నీ స్పియర్న్ అనగానే... హోరెత్తే సంగీతంతో పాటు వివాదాలు కూడా గుర్తొస్తాయి. సెలెబ్రిటీల జీవితం సెలెబ్రేషన్స్‌తో నిండి ఉండదనడానికి బ్రిట్నీ జీవితమే ఉదాహరణ. ప్రేమ వ్యవహారాలతో పాటు పెళ్లి కూడా ఆమెకు చేదునే మిగిల్చింది. ఓ దశలో మానసిక రోగిగా మారిపోయింది. శోక లోకంలో మునిగి తేలింది. అలాంటప్పుడు ఆమె వెంట ఉన్నవేంటో తెలుసా... ఆమె పెంపుడు జంతువులు!
 బ్రిట్నీ సన్నిహితులు అంటారు... బ్రిట్నీ మనసును దిగులు కమ్ముకుంటే, ఆమె ఇంట్లోకి ఓ కొత్త జంతువు వస్తుంది అని. కుక్కలు, పిల్లులు, చిలుకల వంటి వాటిని పెంచుకుంటూ... వాటితో ఆడిపాడుతూ ఆమె తన బాధల్ని మర్చిపోతుందట. బ్రిట్నీ చాలాసార్లు చేతిలో పెట్‌తో కనిపిస్తుంది కాబట్టి, వారు చెప్పేది నిజమే కావచ్చు!
 
 ఇది ఎవరికి సెక్రెటరీ?
 ఆఫ్రికా గడ్డిభూముల్లో ఠీవిగా తిరిగే ఈ పక్షి పేరు సెక్రెటరీ బర్డ్. దాదాపు నాలుగడుగుల ఎత్తు వరకూ పెరిగే ఈ పక్షి... మహా చురుకైనది. పాముల్ని ఒడుపుగా వేటాడేస్తుంది. పురుగుల్ని, గుడ్లనీ తెలివిగా పట్టి తినేస్తుంది. పైగా ఇది పక్షి అయివుండి ఇతర చిన్న చిన్న పక్షుల్ని తింటుంది.
 
 ఇంతకీ దీనికి సెక్రెటరీ బర్డ్ అని పేరేందుకు వచ్చిందో తెలుసా... నెత్తిమీదున్న ఈ ఈకల వల్ల. పెన్నులు కనిపెట్టకముందు పక్షుల ఈకలను సిరాలో ముంచి, వాటితో రాసేవారు. ముఖ్యంగా ప్రముఖుల సెక్రెటరీలకు ఇలా ఈకలతో రాసే పని ఎక్కువగా ఉండేది. వారు రాస్తూ రాస్తూ గ్యాప్ ఇచ్చినప్పుడు, ఆ ఈకల్ని తలలో గుచ్చుకునేవారు. ఈ పక్షి నెత్తిమీద ఈకలు అలా కనిపించేసరికి సెక్రెటరీ బర్డ్ అని పేరు పెట్టేశారు. అదీ సంగతి!

మరిన్ని వార్తలు