'అప్పన్న' పచ్చలపతకం చోరీ స్టోరీ

25 Jan, 2015 09:57 IST|Sakshi
'అప్పన్న' పచ్చలపతకం చోరీ స్టోరీ

మాజీ డీజీపీ ఎం.వి.భాస్కరరావు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ
పొద్దున్నే ఐదున్నరకు సింహాచలం ఆలయ పూజారుల నుంచి ఫోన్... ‘‘గర్భగుడిలో దొంగలు చొరబడి స్వామివారి ఆభరణాలన్నీ దోచుకుపోయా’’రని. తిరుపతి తర్వాత ఆ స్థాయి ఆదరణ ఉన్న ఆలయం సింహాచలం.  తెలుగువారు, ఒడిశా భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడే దేవాలయంలోకి దొంగలు రావడమేంటి?  వెళ్లి చూస్తే దొంగలు గుడి వెనకద్వారం గొళ్లెం పగులగొట్టి లోపలికి వచ్చారు.

స్వామివారి ఒంటిపై ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లిపోయారు. ఇంకా నయం... బోషాణం పెట్టె దగ్గరికి పోలేదని మనసులో అనుకుంటుండగా... ఆలయ పూజారి కంగారుగా ‘సార్... స్వామివారి మెడలోని పచ్చలపతకంతో ఉన్న హారం కూడా పోయింది సార్’ అన్నాడు.
 
ఆ జిల్లా ఎంపీ హడావుడి చేయడం మొదలుపెట్టాడు. దొంగలెత్తుకుపోయిన పచ్చలపతకం ఐదు వందల ఏళ్లక్రితపుదనీ, అంతర్జాతీయ మార్కెట్‌లో దాని వెల ఎనిమిది వందల నుంచి వెయ్యికోట్లవరకూ పలుకుతుందనీ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 1978లో జరిగిన ఈ దొంగతనం కేసు చాలా పాపులర్ అయ్యింది. అప్పుడు నేను విశాఖపట్నం ఎస్పీగా పనిచేస్తున్నాను.
 
ఎప్పటిలాగే ఉదయం నాలుగున్నరకు గుడి పూజారులు తమ పనులకు దిగారు. ఐదింటికి గర్భగుడి దగ్గరికి వెళ్లేసరికి దొంగతనం జరిగిన విషయం తెలిసింది. వెంటనే మాకు కబురు పంపారు.  వాచ్‌మేన్‌ని అడిగితే రాత్రి ఒంటిగంటవరకూ మెలకువగా ఉన్నట్లు చెప్పాడు. తాను నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగినట్టు చెప్పాడు. దొంగతనం జరిగిన తీరును చూస్తే గుడిలో దొంగలు రెండుగంటలపాటు ఉన్నట్లు అర్థమవుతోంది.

ఆరు కిలోమీటర్ల ఎత్తున ఉన్న దేవాలయం కొండ దిగి మెయిన్‌రోడ్డుపైకి వెళ్లాలంటే కనీసంరెండు మూడు గంటలు పడుతుంది. గుడికి వెళ్లే రోడ్డుగుండా దొంగలు వెళ్లే ఆస్కారం లేదు. ఎందుకంటే నాలుగింటినుంచే పాలవాళ్లు, పూలవాళ్లు, పండ్ల వ్యాపారులు ఆ మార్గం నుంచి వస్తుంటారు. ఇక మరో మార్గం అంటే గుడి వెనకవైపున్న అడవిలోనుంచి కాలినడకన పారిపోవాలి. ఆలస్యం చేయకుండా పోలీసులు అడవంతా గాలిస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది. ఒకర్ని ఇద్దరినీ కాదు... డీఎస్పీతో సహా వందమందికిపైగా పోలీసుల్ని ఐదారు జట్లుగా చేసి అడవిలోకి పంపించాను.
 
ఒత్తిడి కారణంగా...
జరిగింది చిన్నచోరీ కాదు. బంగారం రెండు కిలోలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. పచ్చలపతకమున్న హారం వల్ల నాపై ప్రెజర్ పెరిగిపోయింది. ఇప్పట్లోలా డాగ్స్‌టీం వంటివి లేవు. ఒకవేళ హైదరాబాద్ నుంచి కుక్కల్ని రప్పిద్దామన్నా రోజు పడుతుంది. హైదరాబాద్ నుంచి ఐజీ, డీఐజీ, ముఖ్యమంత్రిల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అడవిలోకి వెళ్లిన పోలీసులేమో వెనక్కి వచ్చేసి ఎవరూ కనిపించలేదని చెప్పడం మొదలెట్టారు.

నా అంచనా ప్రకారం వారు అడవిదాటిపోయే అవకాశమే లేదు. బాస్ దగ్గర లేకపోతే ఎవరికైనా అలుసేకదా! ఏం చేస్తాను... సంఘటనా స్థలానికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించాను. తాళం పగలగొట్టిన గడ్డపారకు బట్టచుట్టడం, దేవుడి దగ్గర ప్రసాదం మొత్తం తినడం, సగం కాల్చిన సిగరెట్ పీకలు... ఇది కచ్చితంగా బిట్రగుంట గ్యాంగ్ పనే అనుకున్నాను. వాళ్లే అనడానికి ఆలయ ప్రాంగణంలో దొరికిన సిజర్స్ బ్రాండ్ సిగరెట్ పెట్టె ఒక ఆధారమైంది. అప్పట్లో అంత ఖరీదైన సిగరెట్ కాల్చేవారు విశాఖపట్నం ప్రాంతంలోనే లేరు.
 
గర్ల్‌ఫ్రెండ్‌ని అడిగితే...
నేను ఉద్యోగంలోకి చేరిన కొత్తల్లో కొన్నాళ్లు గుంటూరులో పనిచేశాను. అక్కడే ఉండే బిట్రగుంట దొంగల గురించి తెలుసుకున్నాను. వాళ్లు దొంగతనం చేసే విధానం గురించి నాకు అవగాహన ఉంది. నాకు ఎప్పుడయితే అనుమానం వచ్చిందో ఆ గ్యాంగ్ లీడర్ చవటా ప్రసాద్ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను. అతని స్పెషాలిటీ ఏంటంటే... దాదాపు నలభై ప్రాంతాల్లో గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. మా సింహాచలం ప్రాంతంలో కూడా ఒకామె ఉంది.

ఆమెని స్టేషన్‌కి తీసుకొచ్చి నాలుగు కేకలు వేయగానే జరిగిందంతా చెప్పింది. చవటా ప్రసాద్, అతని గ్యాంగ్ మూడురోజుల క్రితమే తన ఇంటికి వచ్చి గుడికి సంబంధించి రెక్కీలు వేసుకుని పనిపూర్తిచేసుకుని పారిపోయారని చెప్పింది. బిట్రగుంట దొంగలముఠాకి అప్పట్లో పెద్ద పేరు. వాళ్లు క్రిమినల్ ట్రైబ్స్ అన్నమాట. దృఢంగా, తెలివిగా ఉండేవారు. చవటా ప్రసాద్‌పై అప్పటికే నలభై కేసులున్నాయి. ఆరుసార్లు పోలీసుల చేతుల్లోనుంచి తప్పించుకున్నాడు. మద్రాసు సెంట్రల్‌జైలు నుంచి కూడా తప్పించుకున్న చరిత్ర ఉంది.
 
పదిహేను రోజుల్లో...
దొంగలెవరో తెలిసిపోయింది కాబట్టి ప్రెజర్ తగ్గింది. కానీ ప్రతిపక్షంవారు, ఢిల్లీ అధికారులు పచ్చలపతకం దేశం దాటిపోతోందంటూ చేస్తున్న ఊహగానాలు ప్రశాంతత లేకుండా చేశాయి. ఆ పతకం శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ప్రేమతో స్వామివారికి బహుమానంగా ఇచ్చారనీ, ఇలాంటి పతకం ఎలిజిబెత్‌రాణి దగ్గర కూడా లేదనీ, ఆ పతకంగానీ దొరక్కపోతే డిపార్టుమెంట్ పరువుపోతుందనీ నానాయాగీ చేశారు.

దొంగలు ఎక్కడివారో తెలియగానే నేను వెంటనే గుంటూరు ఫోన్ చేసి బిట్రగుంట దొంగలుండే ప్రాంతంపై నిఘా పెట్టమన్నాను. నేను చెప్పిన పద్ధతిలోనే మెరుపుదాడి చేసి వారిని పట్టుకున్నారు. అందరూ దొరికారు కానీ చవటా ప్రసాద్ దొరకలేదు. దొరికినవారు బంగారాన్ని పంచేసుకుని ఎవరికివారు దాచేసుకున్నారు. అందరినీ ఇంటరాగేషన్ చేసి సొమ్ము మొత్తాన్ని రాబట్టాం. అరవైశాతం బంగారం దొరికింది. పెద్దవాటా తీసుకోవడం వల్ల ప్రసాద్ దగ్గర 40 శాతం సొమ్ము ఉండిపోయింది. పచ్చలపతకం ఉందో లేదో చూస్తే...దాన్ని ఐదు ముక్కలు చేశారు. మూడు ముక్కలు మాత్రమే దొరికాయి.
 
15వేలు మాత్రమే...
దొరికిన బంగారం మొత్తం తీసుకెళ్లి మార్వాడి ముందుపెడితే పదిహేనువేల రూపాయలు కూడా ఉండదన్నాడు. పచ్చలపతకం గురించి అడిగితే... అవి జైపూర్ పచ్చలని చెప్పాడు. పెద్ద ఖరీదు కావన్నాడు. పూర్వంనాటి హారం కావడంతో నలుగురు నాలుగు రకాలుగా ఊహించుకుని మమ్మల్ని పరుగులు పెట్టించారు. అఫ్‌కోర్స్... ఖరీదైంది కాకపోయినా మా డ్యూటీ మేం చేసేవాళ్లం. దొంగలు దొరికినా, బంగారం దొరికినా... అసలైనవాడు దొరకలేదు. మా గాలింపు ఆగలేదు.
 
ఐదేళ్ల తర్వాత...
చవటా ప్రసాద్‌ని అరెస్ట్ చేస్తేగానీ సింహాచలం ఆలయం కేసు ఫైలు మూతపడదు. వెంటనే దొరకడానికి వాడు సామాన్యమైన దొంగా? వాడెంత డెడికేటెడ్ ఫెలో అంటే దొంగకి బలహీనత ఉండకూడదని మద్యం కూడా తీసుకోడు. ఎక్కడికక్కడ బలమైన నెట్‌వర్క్ ఉంటుంది. ప్రాంతాలవారీగా పోలీసుల బలహీనతలు కూడా తెలుసు వాడికి. సింహాచలం కేసు పెద్దదవడంతో జిల్లా జిల్లా జల్లెడ పట్టడం మొదలుపెట్టాను.

ఇక లాభం లేదనుకుని వాడు దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి వరంగల్ దగ్గర ములుగు ప్రాంతానికెళ్లి లారీల వ్యాపారం పెట్టాడు. చాలా బుద్ధిమంతుడిగా రంగేసుకుని బతకడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సందర్భంలో మా కంట్లో పడ్డాడు. వెంటనే అరెస్ట్ చేశాం. మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరికి ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆ రోజు సింహాచలం ఆలయం కేసు ఫైలు మూతపడింది.

బిట్రగుంట దొంగలు దొంగతనం వృత్తిలో బాగా రిచ్ క్యాడరన్నమాట. వారు కేవలం అమావాస్య చీకట్లోనే దొంగతనానికి బయలుదేరేవారు. దానికి కూడా ఒక సెంటిమెంటు ఉండేది. అర్ధరాత్రి కోడిని కోసి దాని తలను నేలమీదకు విసిరేవారు. దాని ముక్కు ఏ దిశను చూపిస్తే ఆ దిశగా దొంగతనానికి బయలుదేరేవారు. దొంగతానికి వెళ్లినచోట ఏదైనా తినివస్తే... పాపం తగలదని వారి నమ్మకం!
రిపోర్టింగ్: భువనేశ్వరి
ఫొటో: ఎస్. ఎస్ ఠాకూర్

మరిన్ని వార్తలు