నక్క ఆ ఊరికి సాధుజంతువు!

12 Oct, 2014 00:59 IST|Sakshi
నక్క ఆ ఊరికి సాధుజంతువు!

అసాధారణం: ఆ గ్రామంలో ఇపుడున్న వృద్ధులు ‘‘మా చిన్నప్పటి నుంచే నక్కలు ఇక్కడ భోజనం చేయడం చూస్తున్నాం’’ అని చెబుతున్నారంటే ఈ కథను నమ్మకతప్పదు. మనిషి జీవితంలో అసలు చూడకుండా మొదట పరిచయం చేసుకునే జంతువు ఏదైనా ఉందంటే అది నక్క. దాని గురించి తెలుసుకోకుండా ఏ పిల్లాడు పెరిగి పెద్ద కాడు. అది మోసాలకు, అతి తెలివికి చిహ్నంగా చెప్పుకునే జంతువు. అందుకే మనిషి ఎన్నో జంతువులను పెంచుకున్నాడు... చివరకు పులుల్ని కూడా పెంచుకున్న చరిత్రలు, పురాణాలు విన్నాం. కానీ మీరిప్పుడు మొట్టమొదటి సారి నక్కను నమ్మిన వారి గురించి తెలుసుకుంటారు.
 
 కుక్కకు నక్కకు పెద్దగా వేరుచేసి చూడతగినన్ని తేడాలుండవు. అంతేకాదు, అవి రెండూ ఒకేజాతికి చెందినవి. అయితే, లక్షణాల్లో మాత్రం వాటి రెంటికీ చాలా తేడా ఉంది. ఒకటి విశ్వాసానికి, ఇంకోటి అవిశ్వాసానికి ప్రతిరూపాలు. అందుకే ఎవరూ నక్కను పెంచుకునే సాహసం చేయలేదు. కానీ ఆ నక్కలను కూడా ఇతర జంతువుల్లా చూసే సంప్రదాయం దేశం మొత్తం మీద గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్‌లో ఉంది. అత్యంత వైవిధ్యమైన ఈ నేలలో ఇది అంతకంటే వైవిధ్యమైన విషయం. గుజరాత్‌లోని భుజ్ జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే కళా దుంగర్ వస్తుంది.
 
 ఈ కళాదుంగర్ సముద్ర మట్టం నుంచి పదిహేడు వందల అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతం. ఇక్కడ ఒక ఆశ్రమం, గుడి ఉన్నాయి. గుట్టలకు దిగువన ఊరు ఉంటుంది. ప్రతిరోజు రెండు పూటలా గుడిలో పూజలు మాత్రమే కాదు, రెండు పూటలా అన్నదానం ఉంటుంది. అయితే అది మనుషులకు కాదు, ప్రత్యేకంగా నక్కలకు. మీరిక్కడో విషయం గమనించాలి. నక్క మాంసాహారి. కానీ ఈ గుడిలో వాటికి పెట్టేది శాకాహారం. అయినా కూడా అవి భుజిస్తున్నాయి. ఆ గుడి గుట్టల కింద ఉన్న గ్రామస్తులు సనాతనంగా ఆచరిస్తూ వస్తున్న సంప్రదాయం ఇది. దీని వెనుక ఓ కథ ఉంది.
 
 సుమారు నాలుగువందల సంవత్సరాల క్రితం ఆ గుడి పక్కన ఉన్న దత్తాత్రేయ స్వామి అనే ఓ మహాపురుషుడి ఆశ్రమం ఉండేది. ఓ రోజు ఆయన ధ్యానంలో ఉండగా... కొన్ని నక్కలు ఆయన ముందు నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నాయి. కళ్లు తెరిచిన ఆయన వాటిని చూడగానే అవి ఆకలితో ఉన్నాయన్న విషయం గ్రహించి వెంటనే వాటికి ఆశ్రమంలోని ఆహారం పెట్టించాడు. తిన్నవెంటనే అవి తిరిగివెళ్లిపోయాయి. మరుసటి రోజు ఆశ్చర్యకరంగా ఎవరో పిలిచినట్టు అదే సమయానికి అవి అక్కడికి వచ్చాయి. విషయం అర్థం చేసుకున్న ఆశ్రమ పీఠాధిపతి దత్తాత్రేయుడు వాటికి ప్రతిరోజు భోజనం పెట్టండి అంటూ ఆశ్రమంలో శిష్యులను ఆదేశించారట. ఒకరోజు ఆశ్రమంలో అన్నం లేకపోవడంతో అవి వెనక్కు వెళ్లలేదు. దీంతో వాటి ఆకలిని చూసి ఆయన తన దేహంలోని కొంత మాంసాన్ని తీసి వాటికి వేస్తూ ‘లీ ఆంగ్’ (ఇదిగో తిను) అని చెబితే వాటితో అవి సర్దుకుని వెళ్లిపోయాయి. ఇక ఆరోజు నుంచి ఆశ్రమంలో ప్రతిరోజు అన్నం ఉండేలా చూసుకుని వాటి ఆకలిని తీరుస్తూ వచ్చారట.
 
 ఆ గ్రామంలో ఇపుడున్న వృద్ధులు ‘‘మా చిన్నప్పటి నుంచే నక్కలు ఇక్కడ భోజనం చేయడం చూస్తున్నాం’’ అని చెబుతున్నారంటే ఈ కథను నమ్మకతప్పదు. ప్రతిరోజూ పూటకు ఎనిమిది కిలోల బియ్యం, నాలుగు కిలోల బెల్లం కలిపి వాటికి వండిపెడతారు. ఈ పనిచేయడానికి అక్కడ ప్రత్యేకంగా ఒక మనిషి ఉంటాడు. ఆ బియ్యం ఊరి ప్రజలే ఇస్తారు. అన్నం అయిన వెంటనే లీ ఆంగ్, లీ ఆంగ్ అని పిలుస్తూ గంట కొడతారు. ఆ శబ్దం వినగానే నక్కలన్నీ తిండికోసం వస్తాయి. అవి తిని వెళ్లిపోగానే మిగతా పక్షులు, చిన్న చిన్న జంతువులు వచ్చి మిగిలిన ఆహారాన్ని తినేస్తాయి.
 
 ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి... ఇవాన్ పావ్‌లోవ్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త 1850-1940ల మధ్య జీవించారు. జంతువులకు ప్రేరణ ఉంటుందని, ఆ ప్రేరణకు కొన్ని కారకాలు ఉంటాయని ఆయన నిరూపించాడు. దీనికోసం ఆయన ఓ ప్రయోగం చేశాడు. ప్రతిరోజు గంట శబ్దం చేసి కుక్కకు అన్నం పెట్టేవాడు. కొంతకాలానికి గంట శబ్దం చేయగానే ఆహారం పెట్టకపోయినా ఆహారం ఉందనుకని వాటికి నోట్లో లాలాజలం పుట్టేది. ఇది ప్రపంచ వ్యాపంగా చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రేరణ సిద్ధాంతం. కానీ, అంతకంటే ముందే (స్థానిక కథ ప్రకారం నాలుగువందల ఏళ్లుగా) ఇక్కడ ఇదే ప్రయోగం జరుగుతోంది. ఓ శబ్దం చేయడం, ఆ శబ్దాన్ని విని నక్కలు తిండికోసం రావడం జరుగుతోంది. అంటే ఇవాన్‌పావ్‌లోవ్ సిద్ధాంతాన్ని వీళ్లెప్పట్నుంచో చాలా సాధారణంగా పాటించేస్తున్నారు!

మరిన్ని వార్తలు