సంగ్రామం: యుద్ధం ప్రేమతో మొదలైంది!

19 Jan, 2014 05:24 IST|Sakshi
సంగ్రామం: యుద్ధం ప్రేమతో మొదలైంది!

మొదటి ప్రపంచ యుద్ధానికి ఈ ఏడాదితో నూరేళ్లు. కానీ వెయ్యేళ్లకు సరిపడా భావోద్వేగాలను  ఈ యుద్ధం ఎగజిమ్మింది. అందులో చిందిన ప్రతి రక్త బిందువూ ఒక వ్యథకు, హృద్యమైన ఓ కథకు కేంద్రబిందువు. ఈవారం నుంచి ‘ఫన్‌డే’ మీకా వ్యథల్ని, కథల్ని వారానికొకటిగా అందించబోతోంది.  ఆ వరుసలో మొదటిదే... ఫ్రాంజ్ ఫెర్డినాండ్-సోఫీల ప్రేమగాథ.
 
 ఆ ప్రేమకావ్యంలో  తుది వాక్యమే రక్తకాసారాలని సృష్టించిన ఓ మహా యుద్ధ చరిత్రకు తొలి వాక్యమయిందంటే నమ్మ శక్యంకాదు. కానీ నిజం. రోమియో- జూలియెట్, లైలా-మజ్నూ, అనార్-సలీం వంటి ప్రేమకథల సరసన చేరుతుందంటారు ఫ్రాంజ్ ఫెర్డినాండ్- సోఫీ చోటెక్ ప్రేమగాథ.  మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆ ప్రేమ జంట హత్యే(జూన్ 28, 1914). ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నాటి ప్రపంచంలో మూడో పెద్ద రాజ్యం ఆస్ట్రియా-హంగెరీ వారసుడు, హాబ్స్‌బర్గ్ వంశీయుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఈ ప్రేమకథలో నాయకుడు.  ఆస్ట్రియా-హంగెరీ చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ తమ్ముడి కొడుకు ఫెర్డినాండ్. ఆయన ప్రేయసి సోఫీ పేదరాలు కాదుగానీ, కులీన కుటుంబం నుంచి వచ్చిన చెక్ జాతీయురాలు.
 
 చిన్న వయసులోనే ఫెర్డినాండ్ ఆస్ట్రియా-హంగెరీ సైన్యాల తనిఖీ అధికారి అయ్యాడు. గొప్ప వరంలా భావించిన సోఫీ వంటి చెలి, ప్రపంచానికి ఘోర శాపంలా పరిణమించిన చావూ- రెండూ ఆ పదవి కారణంగానే ఫెర్డినాండ్‌ను వరించాయి. సోఫీ ఆ కాలపు యూరప్ అందగత్తెలలో ఒకరు. కన్యలు ఉన్న యూరప్ పాలక వంశాలన్నీ ఫెర్డినాండ్ కరుణ కోసం చూసేవి. అతడేమో వేటనీ, గులాబీలనీ సమంగా ప్రేమిస్తాడు. లేత వేసవి ఎండలాంటి ఫెర్డినాండ్, చిరుజల్లులాంటి సోఫీల మధ్య విరిసిన  ప్రేమ అనే ఇంద్రధనుస్సు ప్రపంచం ముందు ఆవిష్కృతం కావడానికి రెండేళ్లు పట్టింది. ఆ తరువాత ఇద్దరూ పెళ్లి కోసం ఎనిమిదేళ్లు  ఆగారు. ప్రాగ్‌లోనే ఓ విందు నృత్యంలో 1888 ప్రాంతంలోనే యువరాజు సోఫీని చూసి, ప్రేమలో పడ్డాడు. సోఫీ బొహిమియా ప్రాంత సైన్యాధ్యక్షుడు ఫ్రెడ్రిక్ మారియా భార్య ఇసబెల్లా ప్రధాన చెలికత్తె మాత్రమే. అక్కడ ‘లేడీ ఇన్ వెయిటింగ్’ అంటారు.  కౌంట్ బొహుస్లా చోటెక్ వాన్ చోటెకోవ్ ఓజ్నిన్ కూతురు సోఫీ. తల్లి కిన్‌స్కీ వాన్ చినిట్జ్. ఆస్ట్రియా-హంగెరీ రాజ్యానికి కౌంట్ బొహుస్లా ఒకప్పుడు అశ్వ విభాగం అధిపతి. తరువాత దౌత్యవేత్త. హాబ్స్‌బర్గ్ పాలక వంశీయుల వివాహం యూరప్‌కే చెందిన మరో పాలక వంశీయులతో జరగాలి. అందుకే చక్రవర్తి మారు మాట లేకుండా ఈ ప్రేమను వ్యతిరేకించాడు.
 
  ప్రాగ్‌లో కొన్నిసార్లు కలుసుకున్నా ఎక్కువ కాలం ఆ ప్రేమికులిద్దరూ ఎక్కడెక్కడో ఉండవలసి వచ్చింది. రాజరికం మీద అలకతో ఫెర్డినాండ్  వియన్నాకు దూరంగా వెళ్లిపోయాడు. మొదట  బొహిమియా అడవులలో కొన్ని రోజులు వేట వ్యసనంలో మునిగి తేలాడు. ఆ విరహంలో అక్షరాలా వందల  జంతువులను చంపాడు. అదీ విసుగనిపించింది. ఆపై ప్రపంచ పర్యటనకు వెళ్లిపోయాడు. అప్పటికే అతని వయస్సు ఇరవై ఎనిమిదేళ్లు.
 
  ఉత్తర అమెరికాకు వెళుతూ భారతదేశం చూశాడు. హిమాలయాల అందానికి పరవశించి, గానం చేశాడు. కలకత్తా చూశాడు. బెంగాల్ టైగర్‌ని వేటాడాడు. నిజాం ఆతిథ్యం తీసుకున్నాడు. ఢిల్లీ చూశాడు. నేపాల్, సిలన్ కూడా వెళ్లాడు. కానీ యాత్ర మధ్యలోనే ఆరోగ్యం దెబ్బతింది. పది మాసాల తరువాత వియన్నా వెళ్లిపోయాడు. తన ప్రేమ పట్ల రాజరికపు వైఖరిలో ఏ మార్పూ లేదు. అప్పుడే  తన వ్యక్తిగత వైద్యుడు ఇచ్చిన మందు వికటించి,  క్షయ సోకింది. మారుటితల్లి మేరియా థెరిసా మినహా అంతా తనని శత్రువులా చూడడం భరించలేకపోతున్నాడు. వైద్యం కోసం లోషీన్‌కు వెళ్లిపోవడం మంచిదనిపించింది.లోషీన్- నీలి సంద్రంలో ఆకుపచ్చ స్వర్గం. టీబీ శానెటోరియంకు ప్రసిద్ధి.
 
 అడ్రియాటిక్ సముద్రంలో ఉత్తర దిశగా ఉన్న క్రెస్-లోషీన్ ద్వీపసమూహంలోనిది. ప్రతి ద్వీపం పైన్ చెట్ల నీడలో సేద తీరుతున్నట్టే ఉంటుంది. పలచటి కెరటాల సముద్రంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి అక్కడి బాటిల్‌నోస్ డాల్ఫిన్లు.  మందులు వాడుతూ, వ్యాయామం కోసం తీరాలలో నడుస్తూ ఉండేవాడు ఫెర్డినాండ్. అప్పుడు సోఫీ రాసిన లేఖలు అతడికి గొప్ప సాంత్వన. బంధం బలపడింది. ఆరోగ్యం కుదుటపడి, వియన్నా వచ్చాక సోఫీని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోననీ, రాజ్యం అక్కరలేదనీ తెగేసి చెప్పేశాడు ఫెర్డినాండ్. దీనితో జర్మనీ చాన్సలర్ విల్‌హెల్మ్, రష్యా చక్రవర్తి నికోలస్, పోప్ లియో కల్పించుకుని చక్రవర్తి జోసెఫ్‌కు నచ్చ చెప్పారు. ఫెర్డినాండ్ సవతితల్లి మేరియా థెరిసా రాయబారం నడిపింది.
 
 చివరికి జూన్ 28, 1900 సంవత్సరంలో వారసత్వ నిరాకరణ ప్రమాణం (మోర్గనాటిక్ ఓత్)చేయించారు. దీని ప్రకారం ఫెర్డినాండ్‌తో పెళ్లి జరిగినా సోఫీకి రాణి హోదా ఇవ్వరు. ఏ ఉత్సవంలోను ఫెర్డినాండ్ వెంట ఉండరాదు. భవిష్యత్తులో పిల్లలకు సింహాసనం మీద హక్కు రాదు.  జూలై 1న సవతి తల్లి థెరిసా సొంత భవనం రీచ్‌స్టాడ్‌లో పెళ్లయింది. రాచరికం ఆరళ్లతో సోఫీ రహస్యంగా ఎంత కన్నీరు కార్చిందో ఆమె జేబురుమాళ్లకే తెలుసు. ముగ్గురు పిల్లలు పుట్టినా అవే అవమానాలు. కానీ భర్త సమక్షంలో ముఖం మీద చిరునవ్వు చెరగనీయలేదు.
 
 ఫెర్డినాండ్ ప్రేమ వ్యవహారానికే కాదు, రాజకీయ చింతనకి కూడా ఆస్ట్రియా రాచరికం బద్ధ వ్యతిరేకం. అతడు రష్యాతో మైత్రిని కోరేవాడు. అంటే రష్యా అండ ఉన్న సెర్బులతో - దక్షిణాది స్లావ్‌లు- రాజీ పడాలనుకుంటున్నాడు. ఆస్ట్రియా-హంగెరీని ఆనుకుని ఉన్న బోస్నియా,హెర్జిగోవినా ప్రాంతాలని చక్రవర్తి ఆక్రమించడానికి కూడా ఫెర్డినాండ్ వ్యతిరేకమని చెబుతారు. బోస్నియా రాజధాని సరాయేవోలో సైనిక తనిఖీకి వెళ్లవలసి వచ్చినపుడు అతడు తీవ్రంగానే కలత పడ్డాడు. చావును ముందే ఊహించాడు కూడా.


 14వ శతాబ్దం నుంచి టర్కీ పాలనలో ఉన్న బోస్నియా -హెర్జిగోవినాలనే 1908లో జోసెఫ్ ఆక్రమించాడు. అప్పటికే అక్కడ సెర్బియా అండతో స్లావ్‌లు, క్రొయేట్లు ఉద్యమిస్తున్నారు. ఏ గోడమీద చూసినా ‘బ్లాక్ హ్యాండ్’ పేరుతో, ‘యూనియన్ ఆర్ డెత్’ పేరుతో ఆస్ట్రియా రాజవంశీకులని  చంపుతామంటూ నినాదాలు దర్శనమిచ్చేవి. ఒక గవర్నర్ మీద హత్యాయత్నం జరిగింది.
 
 జూన్ 25, 1914న ఫెర్డినాండ్, సోఫీ బోస్నియా వచ్చారు. అంతకు ముందే అక్కడి వీధులలో ఆస్ట్రియా పతాకాన్ని ఎవరో తగులబెట్టారు కూడా.  అలాంటి చోటికి ఫెర్డినాండ్ సోఫీతో వెళ్లాడు. ప్రధాన కారణం- చక్రవర్తి ఆదేశం. బోస్నియా గవర్నర్ ఆస్కార్ పొటియోరిక్ విన్నపం. ఇంకొకటి, వియన్నాలో సోఫీకి దక్కని రాణి మర్యాద అక్కడ దొరకుతుంది. కానీ నాలుగో బిడ్డకు తల్లి కాబోతున్న సోఫీకి సరాయేవో (బోస్నియా ప్రాంత రాజధాని)లో రాణి మర్యాద మాటేమో కానీ  మృత్యువు ఎదురైంది. విశాల సెర్బియా ఆశయానికి పూర్తి అండగా ఉన్న సెర్బియా దేశం ప్రోద్బలంతో సెర్బు జాతి యువ కుడు గవ్‌రిలో ప్రిన్సిప్ ఆ ఇద్దరినీ మిల్జాకా నది ఒడ్డున, లాటిన్ బ్రిడ్జి దగ్గర కాల్చి చంపాడు. ముందు ఫెర్డినాండ్, ఆపై సోఫీ అరగంట తేడాలో చనిపోయారు.  
 
  మరణానంతరం కూడా సోఫీ పట్ల రాచరికం కరుణ చూపలేదు. ఆమె శవపేటిక మీద గ్లోవ్స్ పెట్టి, ఒకప్పుడు ఆమె ప్రధాన చెలికత్తె  అన్న విషయాన్ని రాచరికం గుర్తుకు తెచ్చింది.  ముగ్గురు పిల్లలకు కడసారి చూపూ దక్కలేదు.  ఆ చిన్నారులు పంపిన పుష్పగుచ్ఛాలు మాత్రం భౌతికకాయాల మీద ఉంచారు. వియన్నాలోని కేపూచిన్ చర్చి దగ్గరి స్మశానం హాప్స్‌బర్గ్ వంశీయులకు ప్రత్యేకం. కానీ ఆర్ట్స్‌టెటెన్‌లో తన భౌతికకాయాన్ని ఖననం చేయాలని ఫెర్డినాండ్ ముందే చెప్పేశాడు.
 
 పాలక కుటుంబానికి ప్రత్యేకించిన స్మశానంలో  సోఫియా మృతదేహాన్ని అనుమతించరు. ఆమె మృతదేహాన్ని ఆర్ట్స్‌టెటెన్ స్మశాన వాటికకే తరలిస్తారు.  మరణం తరువాత కూడా కలిసి ఉండాలన్న వెర్రి ప్రేమతో తన మృతదేహాన్ని కూడా ఆర్ట్స్‌టెటెన్‌లోనే ఖననం చేయాలని ఫెర్డినాండ్ కోరుకున్నాడు. కానీ వారి భౌతికకాయాలను  వేర్వేరుగానే ఖననం చేశారు. జర్మనీ మద్దతుతో ఆస్ట్రియా  సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. వరసగా ఇంగ్లండ్, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, 33 దేశాలు యుద్ధంలో దిగాయి.
 
  చిన్న రివాల్వర్- బ్రౌనింగ్ సెమీ ఆటోమాటిక్ పిస్టల్. ఎం 1910 మోడల్, సీరియల్ నెంబరు 19074తో సెర్బు జాతీయవాది గవ్‌రిలో ప్రిన్సిప్ కాల్చినవి రెండు బులెట్లే. కానీ అవే, ఐదు వారాల తరువాత కొన్ని లక్షల విస్ఫోటనాలై భూగోళమంతా ప్రతిధ్వనించాయి.
  - డా॥గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు