భారతీయ ఆత్మను కదిలించినవాడు

1 Sep, 2019 09:54 IST|Sakshi

చక్రవర్తి రాజగోపాలాచారి

• ధ్రువతారలు

చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తిగా చరిత్రలో నమోదు కావడం అసాధారణ ఘట్టం. భారత స్వాతంత్రోద్యమ చర్రితను మలుపు తిప్పిన వ్యక్తిగా తృటిలో అవకాశం తప్పిపోయిన వారు చక్రవర్తి రాజగోపాలాచారి. క్విట్‌ ఇండియా పిలుపు తరువాత స్వాతంత్రోద్యమంలో ఏర్పడిన దారుణమైన నిశ్శబ్దాన్ని ఛేదించినవారు రాజాజీయే. పాకిస్తాన్‌ ఏర్పాటును ఆపడం ఎవరితరమూ కాదని మహమ్మద్‌ అలీ జిన్నా అప్పటికే ప్రకటించాడు. అందులోని అనివార్యతను మొదటిసారి బాహాటంగా చెప్పిన వారు కూడా రాజాజీయే. ఈ ప్రతిపాదనే రాజాజీ ప్రణాళిక పేరుతో చరిత్రలో ఒక మూల దాక్కుని ఉంది. గాంధీజీ అనుమతితో రాజాజీ ఈ అంశాన్ని జిన్నాతో చర్చించాలని అనుకున్నారు. జిన్నా ముందుకు రాకపోవడంతో, 1944, సెప్టెంబర్‌లో గాంధీజీయే ఈ ప్రణాళిక గురించి జిన్నాతో చర్చించారు.

19 రోజుల పాటు జిన్నా స్వగృహంలో జరిగిన చర్చలలో ఇదే ప్రధానాంశం. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలన్న డిమాండ్‌కు ముస్లిం లీగ్‌ మద్దతు ప్రకటించడం ఐదు సూత్రాల రాజాజీ ప్రణాళికలో తొలి అంశం. మిగలిన నాలుగు సూత్రాలు ఎలా ఉన్నా, దీనిలో అంతరార్థం ఒకటే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ విభజన గురించి ఆలోచించాలంటుంది ఆ సూత్రం. జిన్నా దీనిని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం లేదు. జాతీయ కాంగ్రెస్‌ కంటే ఆంగ్లేయుల మీదనే ఆయనకు నమ్మకం ఎక్కువ కూడా.  రెండో ప్రపంచ యుద్ధం వేళ మద్రాస్‌ నగరం మీద జపాన్‌ బాంబు దాడులకు పాల్పడిన సందర్భమే రాజాజీని అప్పుడున్న ఆ ప్రమాదకర నిశ్శబ్దాన్ని ఛేధించడానికీ, యథాతథ స్థితి మీద దండెత్తడానికీ ప్రేరేపించింది. ఒకటి నిజం. అవిభాజ్య భారత్‌గా ఉండగానే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఉంటే ఆ పరిణామం చరిత్రలో మలుపు అని పిలవడానికి అర్హమైనదిగా ఉండేదేమో! కానీ  ‘ఏమో’, ‘అయితే’ వంటి ఊహాగానాలను చరిత్ర అనుమతించదు.

చక్రవర్తి రాజగోపాలాచారి (డిసెంబర్‌ 10,1878–డిసెంబర్‌ 25,1972) ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. తండ్రి వెంకటరాయన్‌ అయ్యంగార్‌  థోరాపల్లి (తమిళనాడు, కృష్ణగిరి జిల్లా) మున్సిఫ్‌. తల్లి సింగారమ్మ. రాజాజీ, సీఆర్‌ అని కూడా పిలుచుకునే రాజగోపాలాచారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే జరిగింది. తరువాత మైసూరు రాష్ట్రం (నేటి కర్ణాటక) లో కొంతకాలం చదివారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని, 1900 సంవత్సరంలో సేలంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కొద్దికాలంలోనే పెద్ద న్యాయవాదిగా కీర్తి సంపాదించారు.

1906 నాటి కలకత్తా  కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరు కావడంతో రాజాజీ స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. అంటే బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం నేపథ్యంలోనే రాజాజీ స్వరాజ్య సమరం వైపు నడిచారు. నిజానికి ఆయన ఆనాటికి లోకమాన్య బాలగంగాధర తిలక్‌ అనుచరుడు. 
 రాజాజీ అటు ఉద్యమాన్ని, ఇటు అధికార పదవులనూ సమానంగానే స్వీకరించారు. 1911లోనే సేలం మునిసిపాలిటీలో సభ్యుడయ్యారు. 1917లో తాను అధ్యక్షునిగా ఎన్నికై,  ఒక దళితుడిని కూడా సభ్యునిగా ఎంపిక చేసిన ఘనతను దక్కించుకున్నారు. గాంధీజీ హరిజనోద్ధరణ ఆరంభించడానికి చాలా ముందే రాజాజీ ఇలాంటి అడుగు వేశారు. మునిసిపల్‌ చైర్మన్‌ పదవీ కాలం ముగిసిపోతున్న కాలంలో, అంటే 1919 లో మొదటిసారి ఆయనను గాంధీజీని కలుసుకున్నారు. రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో కలసి నడిచారు.

ఇటు గాంధీ పథంలో ఉన్నప్పటికీ తిలక్‌ అనుచరుడు, తీవ్ర జాతీయవాది ఓవీ చిదరబరం పిళ్లై అంటే ఎంతో అభిమానించేవారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని, పూర్తిస్థాయి ఉద్యమకారునిగా మారారు. అప్పుడే న్యాయవాద వృత్తి వదిలేశారు. 1924–25లో తమిళనాడులో జరిగిన వైకోమ్‌ సత్యాగ్రహంలో కీలక పాత్ర వహించారు. అంటరాని కులాల వారిని దేవాలయాలలోకి అనుమతించాలన్న ఆశయంతో ఈ ఉద్యమం ఆరంభమైంది. 1930లో గాంధీజీ దండిలో ఉప్పు సత్యాగ్రహం ఆరంభిస్తే, నాగపట్నం దగ్గరి వేదారణ్యంలో రాజాజీ ఆరంభించారు. జైలు జీవితం తరువాత తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులయ్యారు. 1937 ఎన్నికలలో రాజాజీ మద్రాస్‌ విశ్వవిద్యాలయం ప్రతినిధిగా శాసనసభలో ప్రవేశించారు.

మద్రాస్‌ తొలి ప్రధాని అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మధుర మీనాక్షి ఆలయంలో అంటరానివారి ప్రవేశం (1939) జరిగింది. ఆలయాలలో అంటరానివారి ప్రవేశం కోసం ఆయన చట్టాన్ని తెచ్చారు. రైతు రుణ విమోచన చట్టం కూడా ఆయనదే. మద్యపాన నిషేధం విధించి, దీని ద్వారా వచ్చే లోటును భర్తీ చేసుకోవడానికి అమ్మకం పన్ను పెంచారు. అయినా లోటు తప్పలేదు. దీనితో కొన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. కింది వర్గాల వారి విద్యాభివృద్ధికి రాజాజీ ఈ విధంగా కావాలనే భంగం కలిగించారని ఆయన వ్యతిరేకులు, అంటే ద్రవిడ పార్టీలు విమర్శలకు దిగడం విశేషం. అలాగే హిందీని పాఠ్య ప్రణాళికలో చేర్చాలన్న రాజాజీ నిర్ణయం కూడా వ్యతిరేకులు రాజకీయం కోసమే ఉపయోగించుకున్నారు. 

బ్రిటిష్‌ ప్రభుత్వం జర్మనీ మీద యుద్ధం ప్రకటించినందుకు నిరసనగా 1940లో కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేశారు. రాజాజీ కూడా ప్రధానమంత్రి పదవికి (నాటి ముఖ్యమంత్రులను ఇలాగే పిలిచేవారు) రాజీనామా చేశారు. ఇందుకు ఇంగ్లిష్‌ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలుకు పంపించింది. అప్పుడే క్విట్‌ ఇండియా ఉద్యమం ఆరంభమైంది. కానీ ఆ ఉద్యమాన్ని రాజాజీ సమర్థించలేకపోయారు. అంతకంటే బ్రిటిష్‌ వారితో చర్చించి, వారు దేశాన్ని విడిచిపోయేందుకు ఒప్పించాలని ఆయన అభిప్రాయం. అప్పటికే జపాన్‌ మద్రాస్, విశాఖల మీద బాంబులు వేసింది. ఇంగ్లిష్‌ వాళ్లు వెళ్లిపోయిన తరువాత జర్మనీ లేదా జపాన్‌ భారత్‌ మీద ఆధిపత్యం సంపాదించే పరిస్థితిని కల్పించకూడదన్నదే రాజాజీ అభిప్రాయం. అందుకే ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వంతో పాటు ముస్లింలీగ్‌తో కూడా చర్చలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇందుకు జాతీయ కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. రాజాజీ పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌ను, గాంధీ–నెహ్రూ నాయకత్వాన్ని రాజాజీ నిరాకరించినా, రాజాజీ అవసరాన్ని నాటి పరిస్థితులలో గుర్తించకుండా తప్పుకునే అవకాశం లేకపోయింది. 1946లో నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అందులో భాగస్వామి కావలసిందంటూ ఆయనను ఆహ్వానించక తప్పలేదు. అత్యంత కీలకమైన నాలుగు శాఖలు– పరిశ్రమలు, రవాణా, విద్య, ఆర్థిక వ్యవహారాలు రాజాజీకి అప్పగించారు. 1948లో మళ్లీ ఆయన అవసరం అనివార్యమైంది. 1947, ఆగస్టు 15న బెంగాల్‌లోని తూర్పు బెంగాల్‌ పాక్‌లో భాగమైంది. నాటి బెంగాల్‌ పరిస్థితిని తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

హిందూ–ముస్లిం ఘర్షణలు అంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ముస్లిం లీగ్‌ నాయకుడు సుహ్రావర్ధి నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యథేచ్ఛగా రక్తపాతం సృష్టించారు. నౌఖాలి వంటి ఘటనలన్నీ అప్పుడే చోటు చేసుకున్నాయి. ఆ స్థితిలో నెహ్రూ పూర్తి మద్దతుతో రాజాజీని ఆ రాష్ట్ర గవర్నర్‌గా పంపించారు. కానీ సుభాష్‌ బోస్‌ను విమర్శించిన వ్యక్తిగా రాజాజీ అంటే బెంగాలీలు తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. అయినా తూర్పు ప్రాంతం నుంచి వచ్చిన శరణార్థుల పునరావాసం, శాంతి స్థాపన ధ్యేయంగా రాజాజీ గట్టి కృషి జరిపారని పేరుంది. కొన్ని మాసాల తరువాతే అక్కడ నుంచి వెనక్కి తిరగవలసి వచ్చింది.

ఆఖరి బ్రిటిష్‌ వైస్రాయ్‌ మౌంట్‌బాటన్‌ రెండేళ్లు సెలవులో వెళ్లారు. తన మేనల్లుడు ప్రిన్స్‌ ఫిలిప్‌కు, యువరాణి ఎలిజబెత్‌కు వివాహం. ఆ సమయంలో మౌంట్‌బాటన్‌ తాత్కాలిక వైస్రాయ్‌గా రెండు పేర్లు సూచించారు. ఒకటి సర్దార్‌ వల్లభ్‌ బాయ్‌ పటేల్, రెండు రాజాజీ. కానీ పటేల్‌ పేరును నెహ్రూ అంగీకరించలేదు. అలా రాజాజీ భారతీయుడైన తొలి, మలి వైస్రాయ్‌గా (జూన్‌ 1948–జనవరి 26,1950) పదవిని అలంకరించి, కీర్తి పొందారు. అంత పెద్ద వైస్‌రీగల్‌ భవనంలో ఆయన (నేటి రాష్ట్రపతి భవన్‌) అతి సాధారణ జీవితం గడిపారు.

వైస్రాయ్‌ పదవిని అలంకరించారు కాబట్టి, స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి పదవికి రాజాజీ అభ్యర్థిత్వమే సహజంగా ముందుకు వస్తుందని అంతా ఆశించారు. నెహ్రూ కూడా ఆయనకే మద్దతు ఇచ్చారు. రాజాజీ కూడా బరిలో దిగాలని ఆశించినా, తరువాత నిర్ణయం మార్చుకున్నారు. కారణం, ఉత్తరాది ఎంపీల ఆధిపత్యం ఒకటని చెప్పినా, క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని రాజాజీ వ్యతిరేకించిన విషయాన్ని విస్మరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. రాజాజీ కాకుండా బాబూ రాజేంద్రప్రసాద్‌ వైపు జాతీయ కాంగ్రెస్‌ ఎంపీలు మొగ్గారు. తరువాత మళ్లీ నెహ్రూ ఆహ్వానం మేరకు రాజాజీ కేంద్ర మంత్రి వర్గంలో ఏ శాఖా కేటాయించని మంత్రిగా చేరారు. డిసెంబర్‌ 15, 1950న పటేల్‌ మరణంతో హోంశాఖ బాధ్యతను రాజాజీ స్వీకరించారు. కానీ పదిమాసాల తరువాత బయటకు వచ్చేశారు.

కారణం– నెహ్రూతో విభేదాలు. చైనా విస్తరణ కాంక్ష గురించి, టిబెట్‌ సమస్య గురించి పదే పదే రాజాజీ నెహ్రూను హెచ్చరించేవారని చెబుతారు. నిజానికి ఆ ఇద్దరి అభిప్రాయాలకు పొంతన లేదు. నెహ్రూ ఉద్దేశం హిందూ మహాసభ దేశానికి పెద్ద బెడద. కానీ రాజాజీ నమ్మకం, దేశానికి అతి పెద్ద ప్రమాదం కమ్యూనిస్టులు. అంటే సోవియెట్‌ రష్యా వైపు నెహ్రూ మొగ్గడం ఆయన ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. ఇక్కడ ఒక పరిణామాన్ని గమనించాలి. నాటికి నెహ్రూ జీవించి ఉన్నా ఇది జరిగింది. 1952 మద్రాస్‌ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలు దక్కలేదు. కమ్యూనిస్టుల నాయకత్వంలోని కూటమి ఆధిపత్యం సాధించింది.

ఆ కూటమి, అంటే కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా నాటి గవర్నర్‌ శ్రీప్రకాశ్‌ రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ ఎన్నికలలో పోటీ చేయకున్నా, అటు ప్రధాని నెహ్రూకు గాని, ఇటు రాష్ట్ర నాయకులకుగాని తెలియకుండా గవర్నర్‌ రాజాజీని ఎంఎల్‌సిగా నామినేట్‌ చేసి, ముఖ్యమంత్రిగా నియమించారు. తరువాత విపక్షాల ఎంఎల్‌ఏలను చేర్చుకుని రాజాజీ బలం నిరూపించుకున్నారు. కానీ ప్రత్యేక ఆంధ్రోద్యమం ఆయన కాలంలోనే వచ్చింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అప్పుడే జరిగింది. 1953లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. తరువాత ఆయన కాంగ్రెస్‌ను విడిచిపెట్టి స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 

భారత స్వాతంత్య్రోద్యమం మీద, పరిపాలన మీద రాజాజీ ముద్ర చెరిపివేయలేనిది. అంటే ఆరు దశాబ్దాల చరిత్ర మీద ఆయన జాడ సుస్పష్టం. ఆయన మౌంట్‌బాటన్‌ వారసుడు. సర్దార్‌ పటేల్‌ వారసుడు. గాంధీగారి వియ్యంకుడు. గాంధీజీ∙నాల్గవ కుమారుడు దేవదాస్‌ గాంధీకి, తన కుమార్తె లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. ఇంగ్లిష్‌లో 26 అక్షరాలతో కూడిన  చక్రవర్తి రాజగోపాలాచారి పేరేను రాజాజీ అని క్లుప్తీకరించినవారు గాంధీజీయే. గాంధీజీకి ఐదుగురు గొప్ప సన్నిహితులు ఉన్నారని తాతగారి జీవిత చరిత్రలో రాజ్‌మోహన్‌గాంధీ (మనుమడు) రాశారు. పటేల్, నెహ్రూ, అబుల్‌ కలామ్, రాజేంద్ర ప్రసాద్‌.. ఆ ఐదో సన్నిహితుడు రాజాజీ. వ్యక్తి స్వేచ్ఛలో, పాలనలో ప్రభుత్వం ప్రమేయం కనిష్టంగా ఉండాలని ఆయన ఆనాడే భావించారు. స్వేచ్ఛా విపణి అవసరమని కూడా వాదించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాట ఆయన ప్రతిభ ముందు చిన్నదే. రామాయణం, భారతం, భాగవతం కూడా ఆయన మళ్లీ రాశారు. సంగీతంతో పరిచయం ఉంది. ఆయన రచనలకు సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా దక్కింది. 1954లోనే ఆయన భారతరత్నకు ఎంపికయ్యారు. ఆయన జీవితంలోని వెలుగు చూడని మరొక కోణం, అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా ఆయన చేసిస కృషి. 1962లో ఈ అంశం మీద అమెరికా ప్రభుత్వంతో మాట్లాడడానికి గాంధీ శాంతి మండలి తరఫున వెళ్లిన బృందానికి నాయకుడు రాజాజీ. అప్పుడే అక్కడ ఉన్న దౌత్యవేత్త కె. నట్వర్‌సింగ్‌ రాజాజీతో ముచ్చటించారు. మంచి ప్రశ్నలే రాజాజీని ఆయన అడిగారు.

దేశ విభజనకి మొదట గాంధీజీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు కదా, తరువాత ఎందుకు వెనక్కి తగ్గారు? ఆయన అలా వెనక్కి తగ్గడం అప్పుడు నాలాంటి యువకులందరికీ పెద్ద షాక్‌ అన్నారు నట్వర్‌. గాంధీజీ చాలా గొప్పవారు. కాదనలేం. కానీ తరువాతి పరిణామాలతో ఆయన చాలా నిరాశలో కూరుకుపోయారు. చివరికి మీరంతా అంగీకరిస్తే, మీతో పాటే నేను అనేశారు అని చెప్పారు రాజాజీ. ఆపై,‘మీరు జీవిత చరిత్ర ఎందుకు రాయలేదు?’ అని అడిగారు నట్వర్‌సింగ్‌. ‘ఖాళీ ఎక్కడ దొరికింది?’ అన్నారు రాజాజీ. వైస్రాయ్‌గా ఉన్నప్పుడు బోలెడు సమయం దొరికి ఉండాలి మీకు అని అన్నారు నట్వర్‌సింగ్‌. అందుకు నవ్వుతూ సమాధానం చెప్పారు, రాజాజీ. ‘నిజమే, అక్కడ చాలా వెసులుబాటు దొరికిన మాట నిజం. కానీ ప్రధానికీ, ఉప ప్రధానికీ (నెహ్రూ, పటేల్‌) మధ్య నిత్యం జరిగే కీచులాటలు పరిష్కరించడానికే నా సమయమంతా గడచిపోయింది’ అన్నారు రాజాజీ.

‘అప్పుడే, నీవు నాతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఉండాల్సింది’ అన్నారు నట్వర్‌తో. ‘అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా చురుకుగా కనిపించారు. వాళ్లు నన్ను అర్థవంతమైన ప్రశ్నలు అడిగారు. అందులో ధర్మం అంటే ఏమిటి; కర్మ అంటే ఏమిటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. ధర్మం అంటే, ప్రపంచ ప్రజలందరి బాధ్యత, అలాగే సహజ ఆదేశం అని చెప్పాను. అందుకు వాళ్లు, అంటే సోషలిజమే కదా అన్నారు. సోషలిజమే, కానీ అది స్వచ్ఛందంగా ఉండాలి. భారత్‌లో సోషలిజం మాదిరిగా కాదు అని చెప్పాను’ అన్నారు రాజాజీ. మళ్లీ, అది బహిరంగ సమావేశం కాదులే, అందుకే అలా చెప్పాను అన్నారాయన. ఉద్యమం, సంస్కృతి, సంస్కరణ, సాహిత్యం, పాలనా దక్షత మేళవించిన అరుదైన నాయకుడు రాజాజీ. ఆయన ప్రభావం కాదనలేనది. గాంధీజీ ఉద్దేశంలో రాజాజీ అంటే భారతీయ ఆత్మను కదలించినవారు.
- డా. గోపరాజు నారాయణరావు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా