జ్వాలావలయం

16 Feb, 2020 11:52 IST|Sakshi

కథా ప్రపంచం

హఠాత్తుగా కుండపోత వర్షం మొదలైంది. ఈ వేళ కాని వేళలో వర్షం రాజాకు ఇబ్బందిగా ఉంది. అతడు బయటికి బయల్దేరాడు. కాని ఈ వాన వల్ల ఇల్లు కదల్లేకపోతున్నాడు. ఇది మామూలు వాన కాదు. జలప్రళయంలా వున్నది. రాజా గొణుక్కుంటూ, తిట్టుకుంటూ తన ఇంటి ద్వారానికి అతుక్కుపోయాడు. కొద్దిసేపు ఆగి ఇంకా వెనక్కి పోయాడు.
రాజా ఒక కవి, జేబుదొంగ. మరో మాటలో చెప్పాలంటే రెండూనూ. ఇది కొంచెం అసాధారణమైనదే కానీ బెంగాలీలలో అసాధ్యమైంది కాదు. కవిత్వాన్ని బాగా చదువుతాడు. జేబుదొంగ మాత్రమే కాదు తాగుబోతు. తాగడం కోసమే జేబుల్ని కొట్టేవాడో లేక జేబుల్ని కొట్టిన డబ్బు ఖర్చు పెట్టడానికే తాగుతాడో స్పష్టంగా తెలీదు.

ప్రతి వ్యక్తికి ఒక గతం ఉంటుంది. అది అద్భుతమైన గతమయితే చరిత్రగా మారుతుంది. అలా పరిగణిస్తే రాజా గతమేమీ గొప్పది కాదు. మంచి కుటుంబంలోనే పుట్టాడు. బియ్యే చదువుతూ పూర్తి కాకుండానే మానేశాడు. ఎందుకంటే చదువు వల్ల ప్రయోజనం లేదని అతనికొక రోజు అనిపించింది. కేవలం డబ్బు సంపాదించడంలోనే సర్వమూ వున్నదని గ్రహించాడు. అంచేత కాలేజీ నుంచి బయటికి వచ్చేశాడు. తల్లిదండ్రులు అప్పటికే గతించారు. కాబట్టి కుటుంబ బాధ్యతలు లేవు. ఒక ఇల్లు ఉండేది. దాన్ని అమ్మివేసి ఆ డబ్బుని జేబులో వేసుకొని విశాలమైన ప్రపంచంలో తన స్థానాన్ని వెతుక్కుంటూ బయల్దేరాడు.
ఇప్పుడు కలకత్తా మహానగరమే అతడి ప్రపంచంగా వున్నది.
కవిగా జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. అయితే జీవితం సారా గ్లాసుల్లోనూ, సాని కొంపల్లోనూ వున్నదని దృఢంగా నమ్మాడు. అనతి కాలంలోనే తనలాంటి భావాలు గల సహచరుల్నీ పోగు చేసుకున్నాడు. క్రమేణా ఒకనాటి విదేశి మద్యం స్థానంలో నాటుసారా చోటు చేసుకున్నది. అతి సామాన్యంగా బ్రతకడం కూడా నేర్చుకున్నాడు. ఆ తరువాత ఒకనాటి రాజా, కాలేజీ రోజుల రాజా, చరిత్రలో కలిసిపోయాడు.

ఇదంతా జరిగి సుమారు అయిదు సంవత్సరాలైంది. ఒకే ఆకాశంలో సూర్యుడూ, చంద్రుడూ తిరగడానికి పోటీ పడుతున్నట్టు ఒకే దేహంలో ఇద్దరు రాజాల పోరు చాలా కాలం క్రితమే పరిష్కారమైపోయింది. ఇక మిగిలినదంతా ఒక్కటే. కవిత్వం పట్ల ప్రేమ. తాగినా, చదివినా, మాట్లాడిన ఆడెన్, ఇలియట్‌ మొదలైన వారి ప్రస్తావనలు వస్తూనే వుంటాయి.
ఉయయాన్నే ఈ వర్షపాతం అతని మూడ్‌ని పాడు చేసింది. ఇప్పటికే ఎనిమిదిన్నరయింది. ఒక ట్రామ్‌ని అందుకోవాలంటే  మెయిన్‌ రోడ్డుకు వెళ్ళాలి. ఆఫీసుకు పోయే జనాల రద్దీ పది తరువాతనే తగ్గుతుంది. తను బయల్దేరుతున్న పని వర్షపునీటిలో వెళ్ళాల్సింది కాదు. అది సాధ్యం కాదు. పాడువర్షం...తనలో తనే తిట్టుకున్నాడు.
ఇంకా వర్షం కురుస్తున్నది. తగ్గే సూచనలూ లేవు. రాజా గదిలో చాప మీద మేను వాల్చాడు. సగం చేరబడి కళ్ళు మూసుకున్నాడు. రాత్రి సందడి సుమారు ఒంటిగంటకు ముగిసింది. ఇప్పుడు శరీరం దూది పింజలా వున్నది. ఆవులిస్తూ విసుగెత్తించే వర్షపు శబ్దాలను వింటున్నాడు. ఆ తరువాత ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. చేతి వాచీ చూసుకున్నాడు. పది గంటల కొద్ది నిమిషాలయింది. అతడి మూడ్‌ చెడిపోయి పరిసరాలలో ప్రతిదానిపైనా అసహ్యం పుట్టింది.

వర్షం ఆగింది. వీధుల్లో నీరు తగ్గింది. నెమ్మదిగా జనం బయటికి వస్తున్నారు. ఎటు చూసినా బురద చీదరగా వున్నది. రాజా లేచి ముఖం మీద నీళ్ళు చల్లుకొని తల దువ్వుకున్నాడు. తలుపు వద్ద ఏదో ధ్వని వినబడింది. తలుపు తెరిచాడు. ఒక సేవకుడు ఒక ఉత్తరాన్ని తెచ్చి అతడి చేతిలో వుంచాడు.
ఉత్తరం! రాజాకు ఉత్తరం!
ఇది చాలా అసాధారణమైన సంగతి. ఇక బయటికి వెళ్ళాలనిపించడం లేదు. తిరిగి తన గదిలోనికి వెళ్ళాడు. ఉత్తరాన్ని చూస్తూ కొంచెం బెదిరాడు. ఉత్తరం రావడం అనేది ప్రతిరోజూ జరిగే విషయం కాదు. అందులోనూ తనకి! రాజాకి! మరి ఎవరు రాసి వుంటారు?
కవరు చించాడు. అదొక ఆహ్వానపత్రిక. నీలిరంగు కాగితం మీద బంగారురంగు అక్షరాలున్నాయి. ఒకనాటి తన మిత్రుల సమూహం ‘జ్వాలావలయం’ యొక్క వార్షిక సమావేశం. రేపే!
ఆహ్వాన పత్రిక వెనుక చిన్న చేతి రాత ఉన్నది:
‘ఈ పుస్తకం నీకు అందుతుందో తెలీదు. అందితే మాత్రం తప్పకుండా రాగలవు. నీ కోసం ఎదురుచూస్తుంటాను–సునీల్‌’

‘జ్వాలావలయం!’ కాలేజీలో రాజా తన ఎనమండుగురు మిత్రులతో కలిసి సంఘం ఏర్పాటు చేశాడు. పేరు కూడా అతడే నిర్ణయించాడు. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఆశయాలు ఆ పేరుతో ముడిపడి వున్నాయి. ఆ సంఘానికి పేరు రాజా పెట్టాడు. అందరూ సునీల్‌ ఇంటిలో సమావేశమౌతారు. అదొక పండుగలా వుంటుంది. అక్కడికి మంచి గాయకులు, కవులు, రచయితలను కలకత్తా అంతటి నుండీ ఆహ్వానిస్తారు. చర్చలూ, విశ్లేషణలూ, విమర్శలూ, వాదోపవాదాలు కొనసాగుతాయి. చందాలు పోగు చేస్తారు. వినోద కార్యక్రమాలుంటాయి. రాత్రి నిచ్చెనలు పట్టుకొని గోడకు పోస్టర్లు అంటిస్తారు. అదొక తపస్సు. అదొక యజ్ఞం.
‘జ్వాలా వలయం’ ఈ పేరు గుర్తొస్తే అతడికి కళాశాల జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. అప్పటికి ఆ చిన్న జీవితాల్లో అవి ఉజ్వలమైన రోజులు. యౌవనంలో అడుగు పెడుతున్న రోజులు! క్రికెట్‌ మైదానం, వక్తృత్వపోటీలు, వ్యాసరచన పోటీలు, సాహితీ చర్చలు, ఒకటేమి? గౌరీ, స్నిగ్ధా, మాయా...ఇంకో ఆమె పేరు గుర్తు రావడం లేదు. రోల్‌నెం 67. అతడి గదిలో అమ్మాయిలందరూ వరుసగా గుర్తొస్తున్నారు. ఇక అబ్బాయిలు: బుద్ధా, సునీల్, ఆనంద్, బిమల్‌! వీళ్ళందరూ అతడి మనోఫలకంపై చిరంజీవులు! వారికి వార్ధక్యం రాదు. మరణం లేదు. ఎప్పుడూ నిత్యయౌవనంతోనే విలసిల్లుతుంటారు. ‘జ్వాలావలయం’ చిహ్నంలో ఉదయిస్తున్న సూర్యుడు తన సప్తాశ్వ రథాన్ని అధిరోహించి దిగంతాల వైపు పయనిస్తునట్టుగా వుంటాడు. అప్పుడెప్పుడో నిస్సారమై స్తబ్దమైపోయిన జ్ఞాపకాలనీ అతన్లో తిరిగి ఊపిరి పోసుకొంటున్నాయి. మరి తన చిరునామా ఎలా దొరికింది? నిజానికి తాను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. క్రింది సంతకం మరోసారి చూశాడు. సునీల్‌! అంటే సునీల్‌ ఇంకా ఆ సమ్మేళనానికి సంపాదకుడిగా వున్నాడు. అంటే ఎవరూ దాన్ని విడిచి వెళ్ళలేదు. చిరునామా ఎలా సంపాదించాలో తెలీదు. తనని ఆహ్వానించారు...అదేచాలు!

రాజా వెళ్తాడు. తప్పకుండా వెళ్తాడు.
సునీల్‌ పిలుస్తున్నాడు. బుద్ధా పిలుస్తున్నాడు. ఆనంద పిలుస్తున్నాడు. విద్యార్థిదశలోని మిత్రులంతా పిలుస్తున్నారు. రాజా విస్మృతగతం, అప్పటి ప్రేమాభిమానాలు, గిల్లికజ్జాలు, నవ్వులూ, కన్నీళ్ళూ...ఇవన్నీ అతడ్ని ఊరించి మరీ పిలుస్తున్నాయి. తప్పనిసరిగా వెళ్తాడు. అవును వెళ్తాడు. రాజా తనను తాను అద్దంలో చూసుకున్నాడు. గత అయిదు సంవత్సరాల్లో కళ్ళు లోతుకు పోయాయి. కళ్ళ చుట్టూ నల్లని చారలు కూడా ఏర్పడ్డాయి. పెదాల మీద తెలుపూ నలుపూ కలిసిన మచ్చలు ఏర్పడ్డాయి. నవ్వితే ఆ పెదాల మధ్య నుండి గారపట్టిన పళ్ళు వికృతంగా కనబడుతున్నాయి. సంవత్సరాల తరబడి అతడి పొడవైన జుత్తుకు నూనె జాడ తెలీదు. ఈ రూపంలో, ఈ స్థితిలో ఇప్పుడు పాత మిత్రుల్ని కలుసుకోవడం సముచితమైన పనేనా? కాదా? అనే మీమాంసలో పడ్డాడు.
ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఒకప్పటిలాగే వుండే అవకాశం లేదు. జీవితపు ఒడిదొడుకులు వార్ని కూడా ఎంతో కొంత మార్చే వుంటాయి. ఆనాటి వారి అమాయకత్వం కూడా బ్రతుకు చక్రాల క్రింద మాయమైపోయి వుంటుంది. ఇంత వరకూ అతడి మనోఫలకం పైన అందరి చిత్రాలు సజీవంగా నిత్యనూతకంగా ఉన్నాయి. వాట్ని అపురూపుంగా పదిలపరుచుకున్నాడు.

మధ్యాహ్నమైంది. నిరాశలో మునిగి మద్యం సీసాని తెరిచాడు. బహుశా ఇటువంటి అస్థిమిత స్థితికి అంతకన్నా మంచి మందులేదు. అతడి గుండెలో ఒక చిత్రమైన స్పందన కలిగింది. రకరకాల ఆలోచనలతో తల తిరుగుతున్నది. అతడి గొంతులో ఏదో ధ్వని మేల్కొని పైకి లేచింది. జీవితాన్ని దూదిపింజె  కన్నా తేలిగ్గా తీసుకున్న రాజా తాగిన మత్తులో ఏడుస్తున్నాడు. కారణం తేలీదు.
అంతలోనే అతడు మనస్సు మార్చుకున్నాడు. మరుసటిరోజు ఉదయాన్నే రైలు బయల్దేరుతుంది. సాయంత్రానికి చేరుతుంది. ఆ రైలుకే బయల్దేరి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది గంటల ప్రయాణం అంతే. అనుకున్న ప్రకారం ఆ శివారు రైల్వేస్టేషన్‌లో దిగాడు. సాయంకాలమైంది. ఆకాశంలో అక్కడక్కడా మబ్బులు వున్నాయి. చిన్న చినుకులు పడుతున్నాయి. స్టేషన్‌ మెట్ల వద్దకు వచ్చేసరికి గత జీవితపు స్మృతులు రాజాని స్వాగతించాయి. ఆ గాలిలో చిరపరిచితమైన పరిమళం వుంది. అతడి గుండెలోతుల్లో ఒక అనునాదం మార్మోగింది. ఇటువంటి అనుభూతిని పొంది ఎంతో కాలమైంది. ఆశ్చర్యకరంగా ఇక్కడి బురద కూడా చిరాకు కలిగించడం లేదు.
రాజా సంతృప్తిగా నడుస్తున్నాడు. ప్రయాణంలో చాలాసేపు ట్రైను కిటికి వద్దనే ప్రకృతిని చూస్తూ గడిపాడు. మొదట చిన్న కునుకు ముంచుకొచ్చింది. అంతలోనే ఒక కల వచ్చి మేల్కొలిపింది. అతడి పాతజీవితం కళ్ళ ముందు కదలాడింది. కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నట్లనిపించింది. తల్లి భోజనం వడ్డించి పిలుస్తున్నది.

‘‘రా....రా...నాయనా అన్నం పెట్టాను. ఇంకెంతసేపు ఎదురుచూడను?’’
‘‘ఎందుకే అలా అరుస్తావు! చేపల కూరా...త్వరగా తీసుకురా మరి...’’
అన్నాన్ని చల్చార్చడానికి చేతిలో ఒక విసనకర్ర పట్టుకొని ఆమె కూడా అతని ప్రక్కనే కూర్చుంది. అతడికేదో అనుమానం వచ్చింది. తిట్లు తినడానికే అలవాటు పడ్డాడు. నెమ్మదిగా అడిగాడు–‘‘అమ్మా! ఏంటి సంగతి?’’
‘‘రేపు షష్ఠి కదా! నాక్కొన్ని పళ్ళు తెచ్చి పెట్టు’’ అన్నది తల్లి.
చప్పుడు చేస్తూ గ్లాసుని క్రింద పెట్టాడు. కోపంగా లేచాడు.
‘‘నాకు తెలుసు. నేను తేలేను. ఎవరి చేతనో తెప్పించుకో. నేనొక ఆటలో పాల్గొనాలి’’ అతడు త్వరగా బయట పడాలని భావించాడు.
‘‘మరి మజ్జిగా తాగవా?’’
‘‘ఇవ్వయితే’’ అన్నాడు.
అంతే...మరుక్షణంలో తల్లి చిరునవ్వు ముఖం పొగలాగా మాయమైంది. కునుకు నుండి మెలకువ వచ్చింది. ఆ తరువాత నిద్ర పోలేదు. అక్కడికి కొద్దిరోజుల్లోనే తల్లి ఆస్తమాతో చనిపోయింది, ఆమెకు సరైన వైద్యం అందించలేకపోయాడు. ఆమె జీవించి వున్నంతకాలమూ ఇంటి వ్యవహారాలు చూసుకునేది. అతడికి ఏ లోటూ వుండేది కాదు. అందరి తల్లుల్లాగే ఆమె కూడా కొండంత సహనం గల మాతృమూర్తి. ఆమె మరణించగలదని రాజా ఊహించలేకపోయాడు. అతడి హృదయంలో ఆమె ఎప్పుడూ జీవించి వుంటుంది. తప్పుల్ని క్షమిస్తుంది. దుఃఖంలో ఓదారుస్తుంది.

బాగా పరిచయమైన పరిసరాలు అతడ్ని ఎంతో సంతోషంతో నింపాయి. సాయంకాలమే అయినా మేఘాల్లోంచి హఠాత్తుగా సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. నేల మీద పచ్చగడ్డి పైన నీటిబిందువులు మెరవసాగాయి. అతడికి వసంతకాలమంటే ఎంత ఇష్టమో గుర్తు వచ్చింది. మేఘాలు కనిపిస్తే చాలు ఉత్తేజితుడైపోతాడు. కాళిదాసు, రవీంద్రనాథ్‌ టాగోర్‌ల వానపాటలు అతడ్ని పిచ్చెక్కిస్తాయి. ఎంత ఆశ్చర్యం? ఇంతకాలం అతడెక్కడికి పోయాడు? ఇవన్నీ ఎలా మరిచిపోయాడు? ఇది అతడికి ప్రీతిపాత్రమైన ప్రదేశం.
అదిగో కవిరాజ్‌ బనమాలి గారి ఇంటి ముందరి గది. ఆ తరువాత ఇరుగు పొరుగు ఇళ్ళు వరుసగా వున్నాయి. అందులో ఒక ఇంటి రెండో అంతస్తులో తన తల్లిదండ్రులతో గౌరి వుండేది. ఇంకా ఆమె అక్కడే వుందా?
గౌరి అక్కడ సహ విద్యార్థిని. గంభీరంగా, ప్రశాంతంగా బంగారు రంగులో మెరిసే కళ్ళతో వుండేది. అందగత్తె కాదుగానీ ఆమెలో అతడికి ప్రత్యేకమైన ఆకర్షణ కనబడేది. చిన్నగా సన్నగా ఆమె ఎప్పుడూ సిగ్గుపడుతూ మాట్లాడినా అతడి చెవులకు అది శ్రావ్యమైన సంగీతంలా వుండేది. వారిద్దరి మధ్యా ఏమి లేదనే మాట నిజం. కాని వారి స్నేహం గురించి శ్రావ్యమైన సంగీతంలా వుండేది. కాని వారి స్నేహం గురించి కాలేజీలో గోడ కవులు చిలవలు పలవలు అల్లేరు.

మరో మలుపు తరువాత ఒకనాటి తను నివసించిన ఇంటిని దాటి పోయాడు. ఆ ఇంటినే అతడు అమ్మేశాడు. ఇంటి వాకిట్లో చిన్న కుర్రాడు ఆడుకొంటున్నాడు. ఒక యువతి ఒక పదమూడేళ్ళ అబ్బాయిని జామచెట్టు ఎక్కమని ప్రోత్సహిస్తున్నది. ఆ చెట్టు మీదనే అతడి బాల్యం గడిచింది. ఇప్పడా ఇంట్లో వున్న వారు కొత్త ముఖాలు.
వీధుల్లో దీపాలు వెలిగాయి, ప్రధాన వీధి ముఖద్వారం వద్దనే ఒక ఇంటిలో సునీల్‌ వుంటాడు. ఆ ఇంటిలోంచి కాంతిచారలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇంటిలోంచి ఉరుముల్లాగా పెద్దగా నవ్వులు నేలని కుదిపేస్తున్నాయి.
మెట్లెక్కి లోపలికెళ్ళాడు.
రాజాని గుర్తించగానే  ఎనిమిది గొంతులు అతడ్ని స్వాగతించాయి.
‘‘ఎవరూ? రాజా? రాజానే!’’
‘‘రాజా వచ్చాడు. రాజా వచ్చాడు’’
ఒకనాటి మిత్రుడ్నీ, గత కొన్నేళ్ళుగా తప్పిపోయి చిరునామా కూడా తెలియకుండా పోయిన స్నేహితుడ్నీ, ఊహించని ఒకనాటి సహచరుడ్నీ చూసి అందరూ ఉవ్వెత్తున సంబరపడిపోయారు.
నేల మీద అదే తివాచీ వుంది. ఇంటి  ముందర అదే సైన్‌బోర్డ్‌. రంగు వెలిసింది కాని ఇంకా మెరుస్తున్నది. ముందరి తలుపు మీద ‘జ్వాలా వలయం’ స్థాపించినప్పుడు అతడు రాసిన గీతమే వున్నది. అక్కడ సునీల్, ఆనంద్‌ వున్నారు. బుద్ధా ఒక మూలనున్నాడు. బిమల్‌ తివాచీ మీద కూర్చొని వున్నాడు. ఇంకా ఇతర మిత్రులూ వున్నారు. రాజా అందర్నీ ఒకసారి తేరిపార చూశాడు. ఎవరిలోనూ పెద్దగా మార్పు కనబడలేదు.

‘‘అద్భుతం! రాజా! నాతో కూర్చో. కొద్దిగా టీ తీసుకో’’
‘‘అయితే రాజా! ఉత్తరం అందిందన్నమాట’’
‘‘అందుకేగా వచ్చింది’’ అన్నాడు రాజా.
‘‘రాజా! నేనీరోజు కొత్తగీతం రాశాను. నువ్వు విని తీరాలి’’ అన్నాడు అమర్‌.
‘‘ఆగండి! రాజా రైలు దిగి వచ్చాడు. ఊపిరి పీల్చుకోనివ్వండి’’ అన్నాడు బుద్ధా.
రాజా స్థిమితపడ్డాడు. అమర్‌ వినిపించిన గీతాన్ని విన్నాడు. ఆనందా తిండిపోతు. అజీర్తితో బాధపడుతుంటాడు. అతడి అనారోగ్యపు వివరాలన్నీ విన్నాడు. అందరి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. జితిన్‌ కలెక్టరయ్యాడు. ఛోటా కొకా ప్రొఫెసరయ్యాడు. ఆనందా వ్యాపారం చాలాబాగుంది. సునీల్‌ విద్యార్థి ఉద్యమానికి ఇంకా నాయకత్వం వహిస్తున్నాడు. బుద్ధా ఒక చిత్రకారుడిగా మంచి గుర్తింపు పొందాడు. గౌరి గురించి కూడా తెలిసింది. ఆమె పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది. రాజా ఒక పెద్ద దిండుకు చేరబడి కన్నులు మూసుకున్నాడు. ఇప్పుడతడు కలలు కనడం లేదు. మిత్రుల మధ్య, బాగా పరిచయమైన ప్రపంచంలో సంతృప్తిగా కూర్చున్నాడు. భూగోళం మీద ఎక్కడ వున్నాసరే ప్రతిసంవత్సరం ఇదేరోజున ఇక్కడ సమావేశమౌతుంటారు. ఆ వివరాల్ని సునీల్‌ చెబుతున్నాడు. ఆ ఎనమండుగురు మాత్రమే వస్తుంటారు. వేరేవరూ రారు. రాజా ఉనికి తెలీదు. అతడు ఇప్పుడు చేరాడు.

‘‘నా చిరునామా మీకెలా తెలిసింది?’’
‘‘నువ్వు కొద్దిరోజుల క్రితం సరోజ్‌ని కలిశావట కదా’’ . రాజాకు గుర్తొచ్చింది. సురోజ్‌ సునీల్‌ పెద్ద తమ్ముడు. రెండు నెలల క్రితం కలకత్తాలో ట్రామ్‌లో కలిశాడు. చిరునామా అడిగి వుంటాడు. తను చెప్పి వుంటాడు. తన ఉనికి గురించి నిజం ఎందుకు చెప్పాడో అతనికే తెలియదు. సరోజ్‌ ఆ చిరునామాను వాళ్ళకి అందచేశాడన్నమాట.
‘‘సరే, చిరునామా విషయం మరిచిపో. వాస్తవానికి మన అందిరిలో చురుకైనవాడివి, తెలివైన వాడివి నువ్వే. ఇన్ని సంవత్సరాలు ఏంచేస్తున్నావు? ఎలా వున్నావు?’’ అందరూ ముక్తకంఠంతో అడిగారు.
రాజా మిత్రుల ముందర అబద్ధాలతో కూడిన  అందమైన కథని అల్లాడు. అతడు మధ్యప్రదేశ్‌లో ఒక మైనింగ్‌ ఆఫీసర్‌గా చేస్తున్నాడు. హఠాత్తుగా పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఎవర్నీ ఆహ్వానించడానికి సమయం లేకపోయింది. భార్య ముచ్చటగా వుంటుంది. ఒక కుమారుడు కూడా పుట్టాడు. గత రెండు నెలలుగా సెలవుల మీద కలకత్తాలో వుంటున్నాడు. ప్రస్తుతం తన అత్తవారింటికి వెళ్ళాల్సివుంది. అక్కడొక పెళ్ళికార్యక్రమానికి హాజరు కావాలి...ఇలా రాజా ఎన్నో కల్పిత విశేషాలు చెప్పుకొన్నాడు.
రాజా...జ్వాలావలయం స్థాపకుడు రాజా...విద్యార్థినాయకుడు రాజా...మిత్రుల దృష్టిలో ఉన్నతుడైన రాజా, వాళ్ళందరికీ గర్వకారణమైన రాజా...అటువంటి వాడ్ని ఎంతో కాలం తరువాత చూస్తున్నారు. అతడ్ని గురించి వివరాలు వింటున్నారు. 
రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ముగ్గురు కలిసి ఒకే గదిలో, ఒకే రగ్గులో నిద్రపోయారు. రాజా కనులు మూసుకున్నాడేగానీ మనస్సు  ఉరకలు వేస్తున్నది. మధురం...జీవితం మధురం....ఆపాత జ్ఞాపకాలు ఇంకా మధురం. ఈరోజు నుంచి తానొక నూతన యాత్ర ప్రారంభించాలి. తాగడం మానేయాలి. దొంగతనాలు మానేయాలి. నేరగాళ్ళ సహవాసాన్ని తుంచేయాలి. కలకత్తా కూడా వెళ్ళకూడదు. ఇక్కడెక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి. నీతిగా తలెత్తుకొని తిరగాలి. ఇక్కడెక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి.

ఈ శాశ్వతసౌందర్యసీమలో పరిపూర్ణమైన కీర్తిగౌరవాలతో తనని తను పునఃప్రతిష్ఠించుకోవాలి. రాజా ఒకవైపు నుండి మరోవైపు ఒత్తిగిల్లాడు. బుద్ధా గురక పెడుతున్నాడు. తిరుగు రైలు ఉదయం అయిదు గంటలకే బయల్దేరుతుంది. నాలుగున్నరకే సునీల్‌ నిద్ర లేపాడు.
రాజా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆకాశం మేఘావృతంగా వున్నది. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంతమంది ఆత్మీయుల మధ్యకు తిరిగి వచ్చేయడమే మేలని మరోసారి తీర్మానించుకున్నాడు. బయల్దేరే సమయం ఆసన్నమైంది. బుద్ధా, ఆనందా గాఢనిద్రలో వున్నారు. వాళ్ళని మేల్కొలపడం అతనికిష్టం లేదు. ఎలాగు త్వరలోనే వచ్చేస్తాడు. మారిన మనిషిగా తిరిగి జీవితం ప్రారంభిస్తాడు. రాజాకు తన షర్ట్‌ కనబడలేదు. అక్కడున్న దుస్తులన్నీ తొలగిస్తూ తన చొక్కా కోసం వెతకడం మొదలుపెట్టాడు.
సునీల్‌ తల్లిగారు ఇచ్చిన అల్పాహార పొట్లం తీసుకొని, అతడ్ని తోడ్కొని రాజా స్టేషన్‌కు వెళ్ళాలి. ఇంకా తన షర్ట్‌ కోసం వెదుకుతూనే వున్నాడు. అంతలోనే అక్కడ నీలి చొక్కా క్రింద తన చొక్కా పడి వున్నది. దాన్ని పైకి తీసాడు. నీలిచొక్కా జేబులోంచి ఏదో బరువుగా పడింది.

మనీ పర్స్‌! బాగా ఉబ్బెత్తుగా ఉన్న పర్స్‌. రాజా వేళ్ళు తిమ్మిరెక్కాయి. అసంకల్పితంగానే ఆ పర్స్‌ను పైకి తీసి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతడి గుండె గట్టిగా కొట్టుకున్నది. నిద్రపోతున్న మిత్రుల వైపు చూస్తూనే పర్స్‌ తెరిచాడు. దాన్నిండా కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు. ఇది ఆనందాది కావచ్చు. అతడు తన దుకాణం నుంచి తెచ్చుకున్న నగదు కావచ్చు. రాజా ఆ పర్స్‌ని తిరిగి నీలిచొక్కా జేబులో పెట్టేసాడు. తన చొక్కాని వేసుకున్నాడు.
కానీ రాజా తలలో ఏదో పురుగు తొలచడం మొదలైంది. తాగడానికి అలవాటు పడిన నాలుక పిడచకట్టుకుపోయింది. దానర్థం మిత్రులందరి ముందూ అలనాటి తన అందమైన గతాన్ని తుడిచి వేయడమేనా? తన నిజస్వరూపం వెల్లడించడమేనా? పునఃప్రారంభించాలని భావిస్తున్న కొత్తజీవితం తిరిగి మరుగున పడిపోవడమేనా?

మంచుపొరలు తెరలు తెరలుగా పైకి లేస్తున్నాయి. రాజా ఇంత డబ్బుని గతంలో ఎప్పుడూ కళ్ళ చూడలేదు. అతడి ముఖంలో చిరునవ్వు వికసించింది. సునీల్, ఆనందా, గౌరీ...మొదలైన స్నేహితులు అందరి ముఖాల్నీ పొగమంచు కబళించింది. చీకటి తొలగినట్టే తొలగి మంచుతో మరింత చిక్కనైపోయింది.
అప్పటికే రాజా కోసం తన తల్లి ఇచ్చిన అల్పాహార పొట్లాన్ని పట్టుకొని సునీల్‌ బయట వేచివున్నాడు.
‘‘రాజా! రా! ట్రైన్‌ టైమ్‌ అవుతోంది. ఆలస్యం చేయకు’’ అని పిలుస్తున్నాడు.
రాజా, ‘‘ఇదిగో వచ్చేస్తున్నాను...’’ అన్నాడు. కానీ నాలుక మడతపడింది. మాట తడబడ్డాడు. అక్షరక్రమం మారింది. గుటకలు వేశాడు. ఆనంద వైపు నిశ్చలంగా జాగ్రత్తగా చూశాడు.
నీలిరంగు జేబులోంచి తిరిగి ఆ పర్సుని తన సన్నని నైపుణ్యంగల వేళ్ళతో లాఘవంగా పైకి తీశాడు.                                              ∙ 
బెంగాలీ మూలం : రిత్విక్‌ ఘటక్‌ (ప్రముఖ సినీదర్శకుడు)
అనువాదం: టి.షణ్ముఖరావు 

మరిన్ని వార్తలు