ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్: వయసులో చిన్నోడే... కానీ జ్ఞానంలో పెద్దవాడు!

3 Aug, 2013 21:05 IST|Sakshi
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్: వయసులో చిన్నోడే... కానీ జ్ఞానంలో పెద్దవాడు!

రిలేషణం: రామ్‌గోపాల్‌వర్మ డెరైక్టర్‌గా బ్రిలియంట్... ఆర్టిక్యులేషన్‌లో అదుర్స్, యంగ్ డెరైక్టర్స్‌కి రోల్‌మోడల్... ఫ్యాన్స్‌కి పెద్ద ఫిలాసఫర్!
 మరి రామ్‌గోపాల్‌వర్మలాంటి మేధావికే మైండ్ బ్లాక్ చేశాడంటే
 అతనెంత గ్రేటర్ దేన్ గ్రేటర్ అయివుండాలి!
 ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన వర్మనే ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడంటే
 అతనెంత ఇంటెలిజెంట్  అయ్యుండాలి!
 అతని ఆలోచనల గాలి సోకే రామ్‌గోపాల్‌వర్మ లైఫ్ మారిందంటే
 అతడెంత  జీనియస్ అవ్వాలి!
 తన జీవితాన్ని మలుపుతిప్పిన మిత్రుడు, గురువు సత్యేంద్రతో తన అనుబంధం గురించి రామ్‌గోపాల్‌వర్మ చెప్పిన ముచ్చట్లు...
 
 నా జీవితాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు... సత్యేంద్ర రాకముందు, సత్యేంద్ర వచ్చిన తరువాత అని!                                                                    
 సత్యేంద్ర నాకంటే రెండేళ్లు చిన్నవాడు. జ్ఞానంలో మాత్రం నాకంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. మేం నవలలు చదివినట్టు తను ఇంజినీరింగ్ పుస్తకాలు చదివేవాడు. తను నాకు తాత్వికులను పరిచయం చేసేవాడు. వాళ్ల వాదాలను, వాదనలను వినిపించేవాడు. అతనితో మాట్లాడితే ప్లేటో నుంచి నీషే దాకా అందరితోనూ మాట్లాడినట్టుండేది. ఇక సినిమాల గురించి మాట్లాడితే...  నాకు సినిమాల గురించి బాగా తెలుసు అన్నది ఉత్త భ్రమ అని తేలిపోయేది.
 
 ఏ విషయాన్నయినా అందరూ చూసే దృష్టి వేరు. సత్యేంద్ర దృక్కోణం వేరు. ఒకసారి ‘కోమా’ సినిమాకు వెళ్లాం. హీరోయిన్ ఓ సీన్లో కోల్డ్ స్టోరేజ్‌లో చిక్కుకుపోతుంది. చుట్టూ శవాలు. అందరం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాం. సత్యేంద్ర మాత్రం ఆ అమ్మాయి కంటే శవాలదే ట్రాజెడీ అన్నాడు. ‘అవి ఒకప్పుడు నవ్వేవి, ఏడ్చేవి, కలలు కనేవి, ఇప్పుడు మనల్ని భయపెట్టడానికి వాటిని ప్రక్రియలుగా చేశారు’ అన్నాడు. అతని ఆలోచనాధోరణికి ఆశ్చర్యపోయాను.
 
 మరోసారి ఇద్దరం ‘పాపిలాన్’ సినిమాకు వెళ్లి ప్రిన్సిపాల్ కళ్లలో పడ్డాం. ఆయనతో మాట్లాడుతూ ఈ సినిమా ఏడోసారి చూస్తున్నానన్నాడు సత్యేంద్ర. ‘ఇందులో అన్నిసార్లు చూసే గొప్పతనమేముంది’ అన్నాడు ప్రిన్సిపాల్. ‘నేను చూడగలిగింది మీరు చూసుండకపోవచ్చు’ అన్నాడు సత్యేంద్ర. అంత పరిశీలనాశక్తి వున్నపుడు  అన్నిసార్లు చూడటమెందుకు అన్నాడాయన. ‘మరి మీ భార్యను రోజూ ఎందుకు కలుస్తారు అన్నాడు’ మావాడు. ఇది జరిగిన చాలారోజుల తరువాత ‘నేను మరిచిపోలేని విద్యార్థి సత్యేంద్ర’ అని ఓ మ్యాగజైన్‌కి ఆర్టికల్ రాశారు మా ప్రిన్సిపాల్.
 
 నా ఫైనలియర్‌లో పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం ఒక రెసిడెన్షియల్ కాలనీ అనే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేయాల్సి వచ్చింది. దానికి సత్యేంద్రను ముందుమాట రాయమని అడిగాను. అతను ఇలా రాయడం మొదలుపెట్టాడు. ‘జీవికి మొదటిసారిగా జీవించాలని అనిపించినప్పటి నుంచీ జీవం లేని మట్టికి ఓ రూపం ఇవ్వడం మొదలైంది. ప్రకృతి భీభత్సాల నుంచీ, క్రూరమృగాల నుంచీ ప్రతి ప్రాణీ తనను తాను కాపాడుకునేందుకు ఆశ్రయం తీసుకోవడం అత్యవసరమైంది. ఆ నిర్మాణం జంతు ప్రపంచంలో సహజాతంగానే మిగిలిపోతే, మనుషుల్లో అది ఓ స్పష్టమైన రూపం సంతరించుకుంది.’
 సత్యేంద్రతో నా బంధం... ఆరాధన, అమితాశ్చర్యం, అంతులేని భయం అనే మూడు దశలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. అతడంటే నాకు భయం వేయడానికి కారణం... అతని జ్ఞానకాంతి పట్ల నాలో విపరీతమైన అసూయ ఉండటం. అలాగే కోపమూ వచ్చేది. అతడి ముందు నాకు ఏ విధమైన విలువా లేనట్టు నాకు అనిపించేది.
 
 కాలేజీ ముగిసిన తరువాత చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మేం కలిశాం.  ఐతే  నా అదృష్టం కొద్దీ కొన్ని విలువైన సంభాషణలు అతడు  నాతో జరిపాడు. అవి నా జీవితాన్ని మార్చేశాయి. ఈ ప్రపంచంలో అయాన్‌ర్యాండ్ సృష్టించిన హోవార్డ్ రోర్క్‌లాంటి వాళ్లు నిజంగా ఉండరు అని నమ్మేవాళ్లకు నేను చెప్పేదొకటే. అలాంటి మనుషులుంటారు. అందులో ఒకరిని నేను కలిశాను. మాట్లాడాను. అంతే...!
 (సత్యేంద్ర ప్రస్తుతం ఒక యూనివర్శిటీలో అప్లైడ్ మెకానిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు)
 

మరిన్ని వార్తలు