వర్క్‌ ఏదైనా వర్కవుట్స్‌ పక్కా!

15 Mar, 2020 11:01 IST|Sakshi

వేసుకున్న డ్రెస్‌కి, కట్టుకున్న చీరకు అందం రావాలంటే.. ఒంపుసొంపులు చక్కగా ఉండాలనేది కాదనలేని సత్యం. అందుకోసమే సమయం దొరికిన ప్రతిసారీ వ్యాయామం చేస్తూ, ఆసనాలు వేస్తూ.. ఫిట్‌నెస్‌ కోసం తాపత్రయపడుతుంటారు చాలామంది మగువలు. అయితే టెక్నాలజీ పుణ్యమా అంటూ.. ప్రతి పని తాపీగా కూర్చుని, చేతులతో చేసే పనులే కావడంతో.. దొరికిన కాస్త సమయంలో చేసే చిన్న చిన్న వ్యాయామాలు అంత ప్రభావవంతంగా బరువుని తగ్గించలేవు. ఫిట్‌నెస్‌ని కాపాడలేవు. అందుకే ఈ ‘ఫిట్‌నెస్‌ డెస్క్‌ ఎక్స్‌సర్‌సైజ్‌ బైక్‌’. 

దీని మీద ఎక్కి రిలాక్స్‌డ్‌గా కూర్చుని.. కంప్యూటర్‌ వర్క్‌ చేసుకోవచ్చు, కూరగాయలు కట్‌ చేసుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, ఫోన్‌ మాట్లాడుకోవచ్చు. కూర్చుని చేసే ప్రతి పని దీని మీద కూర్చుని చేసుకుంటూనే.. బాడీ ఫిట్‌నెస్‌ సాధించొచ్చు. అదేలా అంటే.. దీని మీద కూర్చుని, కాళ్లని ఇరువైపులా ఉన్న పెడల్‌(కాళ్లు ఉంచే భాగం) మీద పెట్టి, మెషిన్‌ ఆన్‌ చేసుకుంటే.. కాళ్లు సైకిలింగ్‌ చేస్తున్నట్లుగా తిరుగుతూ ఉంటాయి. దీని స్పీడ్‌ పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు.

ఈ ఎక్స్‌సర్‌సైజ్‌ బైక్‌లో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ వంటివి పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందు వైపు డెస్క్‌ (బల్ల లేదా ప్లాంక్‌) అమర్చుకోవచ్చు. అవసరం లేనప్పుడు తొలగించుకోవచ్చు. దాన్ని పైకి, కిందకీ మార్చుకోవచ్చు. దాని మీద చేతులు పెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన హ్యాండిల్‌ ఉంటుంది. దాన్ని కూడా కావాల్సిన విధంగా సెట్‌ చేసుకోవచ్చు. ట్యాబ్‌ నిలబెట్టుకోవడానికి, దాచి పెట్టుకోవడానికి వీలుగా ప్లాంక్‌లో ప్రత్యేకమైన అమరిక ఉంటుంది. సెల్‌ ఫోన్‌ వంటివి అందుబాటులో ఉంచుకోవడానికి ఆ ప్లాంక్‌కి ఒక సొరుగు కూడా ఉంటుంది. ప్లాంక్‌ ముందు ఒక డిజిటల్‌ మోనిటర్‌ ఉంటుంది.

దానిలో టైమ్, స్పీడ్, డిస్టెన్స్, క్యాలరీస్‌ వంటి లెక్కలు కనిపిస్తుంటాయి. దాంతో చక్కగా ఓ పక్క మన పనీ అయిపోతుంది. మరో పక్క ఫిట్‌నెస్‌ వర్కవుట్‌ పూర్తయిపోతుంది. ఇక కూర్చునే సీట్‌ విషయానికి వస్తే.. దాన్ని ముందుకి, వెనక్కి, పైకి, కిందకి నచ్చిన విధంగా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. సీట్‌ కింద భాగంలో చేతుల వర్కవుట్‌కి ఉపయోగపడే.. రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌ ఉంటాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో ఇంటిపనులు, వంట పనులతో పాటు వర్క్‌ టు హోమ్‌ అంటూ సిస్టమ్‌ వర్క్‌ కూడా భుజాన వేసుకుంటున్న మగువులకు ఈ బైక్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఛైర్‌ని ఆఫీసుల్లో కూడా వాడుకోవచ్చు. దీని ధర సుమారు 199 డాలర్లు అంటే 14,252 రూపాయలు. జిమ్‌కి వెళ్లాల్సిన పని లేకుండా జిమ్మే మన వెంట ఉన్నట్టనిపించే.. ఈ సౌకర్యాల బైక్‌ భలే ఉంది కదూ!                                                                       

మరిన్ని వార్తలు