అడిగింది ఒకటి..? అనుకుంది యింకోటి..!

28 Jan, 2018 01:09 IST|Sakshi

పిల్లల కథ

అనంగ అనంగ ఒక రాజు వుండేటోడు. ఆయిన శాన మేదావి. యెప్పుడు యేదో ఒక దాని గురించి లోతుగ ఆలోశన జేస్తుండేటోడు. అట్ల ఆలోశన జేశి కొత్త కొత్త ముచ్చట్లు జెప్పేటోడు. అయన్ని యిన్నోల్లు రాజు మస్తు తెలివిగల్లోడని శిత్రపొయ్యేటోల్లు. రాజు కాడ పెద్ద పెద్ద సదువులు సదివిన మస్తుమంది పండితులు వుండేటోల్లు. ఆల్లంత యెప్పటికప్పుడు రాజు అడిగిన ప్రశ్నలకు, అనుమానాలకు జెవాబు జెప్తుండేటోల్లు. అప్పుడప్పుడు రాజు కొత్త కొత్త ప్రశ్నలు యేశి ఆల్లకు గూడ పరిక్ష వెట్టెటోడు. ఆటికి జెవాబు జెప్పలేక పండితులంత కిందమీద అయ్యేటోల్లు.  ఒకసారి ఆయిన సబల కూసోని ఒక యేలు సూపెట్టుకుంట ‘యిది యేంటిది?’ అని అడిగిండు. శానమంది అది సూపుడు యేలని శెప్పాలనుకున్నరు. కని రాజు గంత అల్కటి ప్రశ్న యెందుకు అడుగుతడు? అండ్ల యేదో పరమార్దం వుంటది అనుకోని యెన్కకు తగ్గిర్రు. రాజు యెంతశేపు జూశినా ఒక్కలు గూడ జెవాబు యియ్యకపొయ్యేసరికి ‘మీకు మూడు దినాల టైమిస్తున్న! యీ లోపల బాగ ఆలోశించి శెప్పుర్రి! మీరు జెప్పినా సరే, యింకెవలినన్న తీస్కొచ్చి శెప్పిచ్చినా సరె! మొత్తం మీద నాకు సమదానం గావాలె!’ అన్నడు రాజు.

యిగ అందరు తల్కాయ పలిగిపోయేటట్టు ఆలోశన జేశిర్రు. యెంత ఆలోశించినా ఆల్లకేం అర్దంగాలే. అందరు గల్శి గుంపుగ గూసోని గూడ మాట్లాడుకుర్రు. తెల్శినోల్లనందరిని అడిగి జూశిర్రు. యెంత జేశినా యేం లాబం లేకుంటవొయ్యింది. ఆకర్కి ఒక పండితుడు దాని గురించే కింద మీదవడుకుంట వూరి బైటికివొయ్యిండు. శెరువు కట్ట మీదున్న శెట్టు కింద గూసుండు. ‘యింత సదువు సదివి రాజుకు జెవాబు జెప్పలేకపోతున్న గదా!’ అని పరేషాన్ల వడ్డడు. ఆడ గొర్లు మేపుకుంటున్న ఒక గొర్లకాపరి పండితుని దిక్కు జూశిండు. ‘యేవైంది పంతులూ! యెందుకిట్ల దివాలుగ గూసున్నవు?’ అని అడిగిండు దెగ్గెరికొచ్చి. దానికి పండితుడు రాజు అడిగిన ప్రశ్న గురించి జెప్పిండు. అది యిన్నంక గొర్లకాపరి గట్టిగ నవ్వి ‘గీ దానికే గింత యిదైపోతవేంది పంతులూ? మీ రాజుకు నేను సమదానం జెప్త పోదాం పా!’ అన్నడు. ‘యెంతో సదువు సదివి, శాస్త్రాలు, పురానాలు ఒంట వట్టిచ్చుకున్న నాకే అర్దం గానిది గొర్లకాపరివి నీకేం అర్దమైంది?’ శిత్రంగ జూస్కుంట అడిగిండు పండితుడు. దానికి గొర్లకాపరి ‘అయన్ని యెందుకు పంతులూ! మీ రాజుకు సమదానం జెప్పాలె అంతే గద, నువ్వు నిమ్మలంగ వుండు!’ అన్నడు గట్టిగ. పండితుడు మారు మాట్లాడకుంట గొర్లకాపరిని యెంట వెట్కోని రాజు కాడికి తీస్కపొయ్యిండు.
       
‘రాజా రాజా! నువ్వు అడిగిన దానికి యీన జెవాబు జెప్తడట!’ అని జెప్పిండు. యెవ్వలూ జెప్పలేంది యీ గొర్లకాపరి యేం జెప్తడా అని అందరు ఆత్రంగ సూడవట్టిర్రు. అప్పుడు రాజు ఒక యేలు సూపెట్టిండు. గొర్లకాపరి యెంబడే రొండు యేల్లు సూపెట్టిండు. దానికి రాజు యేదో ఆలోశించి మూడు యేల్లు సూపెట్టిండు. అందుకు గొర్లకాపరి జెరంత కోపంతోని ‘లేదు పో!’ అన్కుంట బైటికి వొయ్యిండు. అప్పుడు రాజు యెంతో సంతోషంగ ‘నాకు జెవాబు దొర్కింది!’ అని గట్టిగ మొత్కుండు. పండితులకు యేం అర్దంగాలే. ‘రాజా! నువ్వు అడిగింది యేంది? ఆయిన జెప్పింది యేంది? జెర మాకు అర్దమైతట్టు జెప్పవా!‘ అని అడిగిర్రు నెత్తి గోక్కుంట. అప్పుడు రాజు ‘నేను దేవుడు ఒక్కడే అని ఒక యేలు సూపెట్టిన. అందుకు గొర్లకాపరి శెంకరుడు, విష్ణుమూర్తి యిద్దరు దేవుల్లు గద అని రొండు యేల్లు సూపెట్టిండు. నేనప్పుడు బ్రమ్మదేవునితోటి ముగ్గురైతరు గద అని మూడు యేల్లు సూపెట్టిన! దానికి గొర్లకాపరి ఒప్పుకోక అసలు దేవుడే లేడు పో! అన్కుంట వొయ్యిండు. అది సంగతి!’ అని జెప్పిండు. పండితులు ‘ఓ అదా సంగతి!’ అనుకున్నరు. అనుకోని వూకోకుంట యెంబడే శెరువు కాడికి వుర్కిర్రు. గొర్లకాపరిని దొర్కిచ్చుకుర్రు. ‘రాజు అడిగిన ముచ్చటల నీకేం అర్దమైందో జెప్పు?’ అని అడిగిర్రు ఆయినేం జెప్తడో యిందామని!
         
అప్పుడాయిన ‘రాజు ఒక గొర్రెని యియ్యమని ఒక యేలు సూపెట్టిండు. అడుగుతుంది మన రాజే గద రొండు యిద్దాంలే అని, నేను రొండు యేల్లు సూపెట్టిన! రాజు మస్తు ఆశగొండోడు వున్నట్టుండు గద! రొండు గాదు మూడు గావాలె అని మూడు యేల్లు సూపెట్టిండు. నాకు తిక్కలేశి యేది లేదుపో అన్న!’ అని అసలు ముచ్చట జెప్పిండు గొర్లని అల్లిచ్చుకుంట.అది యిన్నంక పండితులందరు ‘అడిగింది ఒకటి... అనుకుంది యింకోటి!’ అని కడుపువలిగేటట్టు పక్కపక్క నవ్విర్రు. యీ సంగతి తెల్సుకోని జెనాలందరు కండ్లల్లకు నీల్లొచ్చేదాక నవ్వుకున్నరు. ఆకర్కి ముచ్చట రాజు కాడికి వొయ్యింది. యేముంటదిగ? నోరెల్లవెట్టిండు రాజు! 
 - పెండెం జగదీశ్వర్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

శార్వరి నామ సంవత్సర (మేష రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర ( వృషభ రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర (కర్కాటక రాశి ) రాశిఫలాలు

సినిమా

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు

ఇంట్లో ఉండండి

కుశలమా? నీకు కుశలమేనా?

లెటజ్‌ ఫైట్‌ కరోనా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా