సమయస్ఫూర్తి

4 Nov, 2018 02:29 IST|Sakshi

రంగరాజపురంలో రమణయ్య అనే రైతు ఉండేవాడు. అతని కూతురుకు వివాహం నిశ్చయమైంది. బంగారు నగలు కొనటానికి పట్నానికెళ్ళాడు. నగలు కొని ఇంటిదారి పట్టాడు. అప్పటికే చీకటి పడుతుండటంతో త్వరగా ఇల్లుచేరాలని అడ్డదారిన గబగబా నడుస్తున్నాడు. దారిలో గజదొంగ వీరయ్య కత్తితో అడ్డగించాడు. ‘నీ దగ్గరున్న ధనంతీసివ్వు’ అన్నాడు. రమణయ్య గజగజ వణుకుతూ ‘అయ్యా! నా దగ్గర ధనం లేదు.మా అమ్మాయి పెళ్ళి ఉంది. నగలు కొని తెస్తున్నాను. అవిలేకుంటే పెళ్ళి ఆగిపోతుంది. దయవుంచి నన్ను వదిలేయండి. మీకు పుణ్యమొస్తుంది’ అని ప్రాధేయపడ్డాడు. దొంగ తనపంట పండిందని సంతోష పడుతూ ‘నువ్వు ప్రాణాలతో వెళ్ళాలనుకుంటే నగలివ్వు. నువ్వు ఎంత ప్రాధేయపడినా నేను దయతో వదలను. నగలివ్వటంతప్ప నీకు మరో మార్గంలేదు’ అన్నాడు.  రమణయ్య ఏడ్పు ముఖంతో వణికిపోతూ చొక్కాలోపల నడుముకు కట్టుకున్న నగల మూట తీసి దొంగ చేతిలో పెట్టాడు. వాడు సంతోషంపట్టలేక మూటవిప్పి చూశాడు. తళతళా మెరిసిపోతున్న పెళ్ళినగలను చూసి ఉక్కిరిబిక్కిరయ్యాడు.రమణయ్య దొంగతో ‘అయ్యా! ఓ చిన్నమాట చెబుతావినండి. నా ఇంటిపక్కనున్న గోవిందయ్య నాకు బద్ధశత్రువు. వాడికీ నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాడి కూతురికీ పెళ్ళి నిశ్చయమైంది.  రేపు వాడు నగలకోసం పట్నం పోతున్నాడనే విషయం నా చెవినపడింది.

రేపు వాడు నగలుకొని ఈ దగ్గరి దారిన రావచ్చు. వాడి నగలను కూడా తీసుకోండి. వాడి కూతురి పెళ్ళి కూడా ఆగిపోవాలి’ అన్నాడు.వీరయ్య సంతోషపడిపోయి ‘వాడి నగలను లాక్కుని నీకోరిక నెరవేర్చుతాను’ అన్నాడు.రమణయ్య ఇల్లు చేరుకున్నాడు. జరిగిన సంఘటనను భార్యతో చెప్పి ‘ఇలాంటి దొంగలుంటారనే నేను కొన్ని నకిలీ నగలను, బంగారు నగలను కొని నడుముకు కట్టుకున్నాను. వాడిని ప్రాధేయపడుతూభయం, ఏడ్పు నటిస్తూ వాడికి నకిలీ బంగారు నగలమూట తీసిచ్చాను.పెళ్ళి కోసం కొన్న బంగారు నగల మూట నా నడుముకు మరో వైపు భద్రంగా ఉంది’ అని చెప్పి తీసిచ్చి భద్రపరచమన్నాడు.వెంటనే ఇంటి నుండి బయటపడి రాజభటులను కలిసి, జరిగిన సంగతి చెప్పి, ‘గోవిందయ్య నాకు శత్రువని, రేపు నగలతో ఆ దారిన వస్తాడని దొంగకు కట్టుకథ చెప్పాను. మీరు అక్కడ కాపుకాస్తే గజదొంగ దొరుకుతాడు’ అని వివరించాడు.మరుసటిదినం భటులు ఆ దారిలో మాటు వేసి దొంగను బంధించారు. ఊరందరూ రమణయ్య ముందుచూపును, సమయస్ఫూర్తిని అభినందించారు. 
డి.కె.చదువుల బాబు

మరిన్ని వార్తలు