జంధ్యాలాఫ్టర్‌ క్లబ్‌

5 May, 2019 00:08 IST|Sakshi

కవర్‌ స్టోరీ

‘నేడు వరల్డ్‌ లాఫ్టర్‌ డే’‘అంటే?’‘చరిత్ర అడక్కు. చెప్పింది విను’ అన్నాడు జంధ్యాల.‘అడిగితే?’‘అడిగితేనా? శ్రీవారికి ప్రేమలేఖలోని సంగీత వచ్చి ‘చికెనోవా ఉష్టినోవా’ అనే రష్యన్‌ పాయసం చేసి తినిపించేస్తుంది. చంటబ్బాయ్‌లోని శ్రీలక్ష్మి వచ్చి ‘నేను కవిని కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తా...’ అని తాజా కవిత ఒకటి వినిపిస్తుంది. నాలుగు స్తంభాలాటలోని సుత్తి వీరభద్రరావు వచ్చి– ‘అసలు న్యూటన్‌ అంటే ఎవరు? అతని అసలు పేరు నూతనుడు... మన బెంగాలీ వాడు. పైథాగరస్‌ అంటే రాజమండ్రిలోని పైథావారబ్బాయి’... అని సుత్తి కొట్టడం మొదలుపెడతాడు. అహ నా పెళ్లంటలోని బ్రహ్మానందం వచ్చి– సెల్‌ఫోన్‌ లేనోడికి సిమ్‌ కార్డ్‌ అమ్మే మొహమూ నువ్వూను అని వెరైటీ తిట్లు తిడతాడు. రెండు రెళ్లు ఆరులోని పొట్టి ప్రసాద్‌ వచ్చి ‘పితా’ అని పెద్దగా కేకేసి, చేతిలో ఒక బెరడు పెట్టి, ఈ పూట ఒక అంగుళం తిను... రేపటికి లేస్తే మరో అంగుళం తిను అంటాడు. రావూ గోపాలరావు సినిమాలోని రాధాకుమారి వచ్చి ఉన్న పళాన నీ బట్టలన్నీ ఊడబెరికి స్పూను వస్తుందని స్టీలు సామాన్లవాడికి వేసేస్తుంది. ఇంకా హైహై నాయకలో...’
‘చాలు స్వామీ... చాలు. ఇంకేమీ చెప్పొద్దు. చరిత్ర అడగను. వరల్డ్‌ లాఫ్టర్‌ డే గురించి చెప్పినా లేదంటే నవ్వుకు మారుపేరైన జంధ్యాల గురించి చెప్పినా వింటా’‘ఊ. అలా రా దారికి. కిష్యోటికా’‘అంటే?’ ‘నాక్కూడా తెలియదు. జంధ్యాల కనిపెట్టిన కొత్త తిట్టు’. పూర్వం చాలామంది సీనియర్‌ నాటక రచయితలు, పరిషత్‌ ప్రకాండులు అవకాశాల కోసం మద్రాసు పాండీబజారులో రెండిడ్లీ ప్లేటు సాంబార్‌తో అడ్జస్టయ్యి సినిమా ఆఫీసుల చుట్టూ తెగ తిరుగుతుంటే జూనియర్‌ నాటక రచయితైన ఒక యువకుడు మాత్రం బెజవాడలో పద్మినీ కారులో ఎండల్ని లెక్క చేయకుండా యమా హుషారుగా తిరుగుతుండేవాడు. ప్రపంచంలో బాగా ఫేమస్సయిన ‘ది ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌’ నాటకాన్ని స్ఫూర్తిగా తీసుకొని అతడు రాసిన ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ పెద్ద హిట్టు. ఆ తర్వాత  ‘గుండెలు మార్చబడును’ నాటకం కూడా. ఒక అవకతవకల డాక్టరు గుండెలు మార్చే పనికి బయలుదేరి చిన్న పిల్లల గుండె ముసలాళ్లకి, పిచ్చోడి గుండె మంచోడికి, ఆడాళ్ల గుండె మగాళ్లకి పెట్టి కంగాళీ సృష్టిస్తాడు. చివరకు అందరూ కలిసి తన్ని తలస్నానం చేయించబోతే క్లినిక్‌ బయట ఉన్న బోర్డును ‘గుండీలు మార్చబడును’గా మార్చి బతికి బనీను వేసుకుంటాడు. ఆ నాటకాల ప్రదర్శనలు జోరుగా సాగడం చూసి ఈ నవ్వులు పూయిస్తున్నది ఎవరా అని ఆరా తీస్తే అందరూ అతగాడి పేరును ‘జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి’ అని చెప్పారు. టాలెంటే అనుకుంటే పేరు కూడా పెద్దదిగానే ఉందే అని... సౌకర్యం కోసం జంధ్యాల వరకు కోసి తక్కిన పేరును పక్కన పెట్టారు.

అప్పట్లో చెన్నై సినిమా ఎక్స్‌ప్రెస్‌ ఏదైనా వయా విజయవాడే వెళ్లేది.కలం ఉన్నోడు బలం ఉన్నోడు సినిమా వాళ్ల కంట్లో తప్పక పడేవాడు.జంధ్యాల కూడా పడ్డాడు.అప్పట్లో జంధ్యాల ‘సంధ్యారాగంలో శంఖారావం’ అనే నాటకం రాసి, తనే హీరోగా నటిస్తే బి.ఎన్‌.రెడ్డి ఆ  చూసి ‘హీరోగా చేస్తావా... రచయితగా రాస్తావా?’ అని అడిగితే... హీరో అనేవాడు రచయిత సృష్టిస్తేపుడతాడు... నేను హీరోలను సృష్టించేవాడిగా ఉంటాను అని రచయితగా ఉండటానికే నిశ్చయించుకున్నాడు.ఒక శుభముహూర్తాన మద్రాసుకు స్లీపర్‌ క్లాసులో బయల్దేరిన జంధ్యాల కలం రాబోయే రోజుల్లో కోట్లాది నవ్వులను మేల్కొలపనుందని అప్పుడు ఎవరికీ తెలియదు... జంధ్యాలకు తప్ప.‘ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం’ అని ‘సిరిసిరి మువ్వ’ (1976) కోసం రాశాడు వేటూరి. జంధ్యాల కూడా ఆ సినిమాతోనే మాటల రచయితగా నలుగురికీ తెలిశాడు. కాని ఇద్దరికీ ఊపునిచ్చిన సినిమా ఆ తర్వాతి సంవత్సరం వచ్చింది. ‘అడవి రాముడు’. వేటూరి, జంధ్యాల ఇద్దరూ ఆ సినిమాతో మాస్‌ అయిపోయారు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అని వేటూరి రాస్తే ‘చరిత్ర అడక్కు... చెప్పింది విను’ పంచ్‌ డైలాగ్‌ జంధ్యాల రాశాడు.  ఆ సినిమాలో నాగభూషణం కొడుకైన సత్యనారాయణ ఏదడిగినా ఏదో ఒక పాత ఉదంతం చెబుతుంటాడు. నాగభూషణం: రేయ్‌... హరిశ్చంద్ర నాటకంలో కృష్ణుడి పద్యాలు పాడి చెప్పుదెబ్బలు తిన్న దొనకొండ గాబ్రియల్‌లాగా కావడం నాకిష్టం లేదుసత్యనారాయణ: దొనకొండ గాబ్రియలా? ఆయనెవరు?నాగభూషణం: చరిత్ర అడక్కు. చెప్పింది విను.ఈ డైలాగ్‌ పండి, నవ్వి, ఇప్పటికీ నిలిచి ఉంది. ఆ సినిమాలోనే వంటవాడైన రాజబాబు తనకు గిట్టని వాళ్ల కోసం అన్ని కూరగాయలు కైమా కొట్టి ‘ఆల్‌ కూర్‌ చమ్‌చమ్‌’ చేస్తాడు. అది జంధ్యాల కనిపెట్టిన పేరు. ఇవాళ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ‘ఆల్‌ కూర్‌ చమ్‌చమ్‌’ అని పెడితే మనం సీరియస్‌గా తినేస్తాంగాని ఆ రోజుల్లో జనం బాగా నవ్వారు. అక్కణ్ణుంచి జంధ్యాల రాఘవేంద్రరావు సినిమాలకు టీ షర్ట్‌ వేసుకొని, కె.విశ్వనాథ్‌ సినిమాలకు ధోవతి కట్టుకుని ద్విపాత్రాభినయం చేస్తూ ఈ ఇద్దరూ ఒకరేనా అన్నట్టు సంబంధం లేని ధోరణిలో మాటలు రాసి రాణించాడు.తనకు వీలున్నప్పుడు హాస్యాన్ని పొదుపుగా, అదుపుగా వాడి సరిగ్గా వేసిన ఉప్పు రుచి తెచ్చాడు. ‘శంకరాభరణం’లో ‘బ్రోచేవారెవరురా’ పాడిన డూప్లికేటు దాసు సీను తలుచుకుంటే అందరికీ నవ్వు. ఆ కీర్తనను సంప్రదాయం ప్రకారం పాడిన శిష్యురాలితో దాసు– ‘ఆపేయ్‌. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణించేటప్పుడు పాడిన పాటా కట్టిన రాగమూ అది. ఇప్పుడు? బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు... ఇన్ని వచ్చాయా? స్పీడు.. స్పీడు కావాలి’ అని ఆ కీర్తనను ఖరాబుగా పాడి శంకర శాస్త్రి చేత బుర్ర రామకీర్తన పాడించుకుంటాడు. అదే సినిమాలో లాయరైన అల్లు రామలింగయ్య, ఆయన దగ్గరకు క్లయింట్‌గా వచ్చిన థమ్‌ల మధ్య నడిచే సీన్‌ కూడా చాలా నవ్వు. వాళ్ల నాన్న రెండో భార్య కొడుక్కి ఆస్తంతా రాసేస్తున్నాడని కేసు వేయడానికి వస్తాడు థమ్‌. ‘మా నాన్నకు ఇద్దరు భార్యలు. మా అమ్మ పోయింది’ అని మొదలెడతాడు కేసు. కాని అల్లు రామలింగయ్య సరిగ్గా వినడు. భార్య విసిగిస్తూ ఉండే సరికి మధ్య మధ్య ఇంట్లోకి వెళుతూ వస్తూ థమ్‌తో అంటాడు–
అల్లు రామలింగయ్య: ఆ... ఇంతకీ ఏమిటయ్యా నువ్వనేది? నీకు ఇద్దరు భార్యలు. నీ మొదటిభార్య పోయింది.

థమ్‌: కాదండి. నేను... నేను పోయాను. నమస్కారం. వెళ్లొస్తా.‘శంకరాభరణం’కు ఇది రాసిన జంధ్యాలే ‘వేటగాడు’లో రావు గోపాలరావుకు ప్రాసల డైలాగులు పెట్టి ఈ విద్యలో తానే బెస్ట్‌ అని నిరూపించాడు. ఆ సినిమాలో ఒక సీన్‌లో–సత్యనారాయణ: అబ్బా... నీ ప్రాసతో చస్తున్నాను నాన్నా. గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస మాట్లాడతావో మాట్లాడు చూస్తాను. రావు గోపాలరావు: సరదాగా ఉందా? అయితే విను. ఈస్ట్‌ స్టువర్ట్‌పురం స్టేషన్‌ మాస్టారుగారి ఫస్ట్‌ సన్‌ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టర్‌ టెస్ట్‌లో ఫస్ట్‌ క్లాసులో బెస్టుగా ప్యాసయ్యాడని తన నెక్ట్స్‌ ఇంటాయన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్‌ రోస్ట్‌ను బెస్ట్‌ బెస్టని తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్టు చేయకుండా సుష్టుగా భోంచేసి పేస్టు పెట్టుకుని పళ్లు తోముకొని రెస్టు తీసుకున్నాడట ఏ రొష్టు లేకుండా. చాలా ఇంకా వదలమంటావా భాషా భరాటాలు.. మాటల తూటాలు.. యతి ప్రాసల పరోటాలు’...సత్యనారాయణ: వద్దు నాన్నోయ్‌... తల తిరిగిపోయింది నాన్నోయ్‌...ఇంత పొడుగ్గా రాసి నవ్వించిన జంధ్యాలే చిన్న డైలాగ్‌తో కూడా అంతే నవ్వు నవ్వించాడు. ‘సాగర సంగమం’లో డాన్సూ కెమెరా రెండూ తెలియని స్టుడియో కుర్రాడిని ఫొటో షూట్‌కు తీసుకెళ్లిన కమలహాసన్‌ మంచి ఫోజ్‌కు రెడీ అవుతూ ‘ఇప్పుడో భంగిమ పెడతాను’ అనగానే ఆ కుర్రాడు ‘తొందరగా పెట్టుబాబు. ఆకలేస్తోంది’ అంటాడు తినడానికి కూచొని. ఎంత నవ్వు.కూర చేయడం వచ్చినవాడికి చారు కాచడం ఒక లెక్కా అని అందరూ అనుకుంటారుగాని అసలు చారు కాచడం బాగా వచ్చినవాడే కూర బాగా చేయగలడు. చారు కాచడం రాకపోతే కూరేం చేయగలడు. హాస్యం బాగా రాయడం తెలుసు కనుకే జంధ్యాల ఏ రసాన్నైనా బాగా పండించాడు. సినీ జనరల్‌ మెడిసిన్‌లో ఎం.డి చేసినా ఆయన మళ్లీ పని గట్టుకుని కార్డియాలజీ చేశాడు– గుండెల నిండా నవ్వించడమే తన స్పెషాలిటీ అని. కాదు ఆయన చదివింది గ్యాస్ట్రో ఎంటరాలజీ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే అందుకు తార్కాణం అని కొందరు పేచీకి వస్తారు కాని అనుకునేవాళ్లు ఎన్నైనా అనుకుంటారు అని మనం వాళ్ల జోలికి పోవాల్సిన పని లేదు.

ఇప్పుడు జంధ్యాల దర్శకుడయ్యాడు. తన కథలకు తానే పాత్రధారి అయ్యాడు. తన పాత్రలకు తానే సూత్రధారి అయ్యాడు. ఢిష్యూం ఢిష్యూంలు, చెవులు మూసేసే విగ్గులు, కృతకమైన కాస్ట్యూమ్‌లు రాజ్యం చేస్తున్న రోజుల్లో లేలేత వయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయిల ప్రేమ కథను ‘ముద్దమందారం’గా తీశాడు. ఇండస్ట్రీకి ప్రదీప్‌ను, పూర్ణిమను పరిచయం చేశాడు. ఆ తర్వాత విజ్జిబాబును హీరోగా పెట్టి ‘మల్లె పందిరి’ సినిమా తీశాడు. అందులో వేటూరి చేత ‘ప్రేమ గురువు’ పాత్ర కూడా చేయించాడు. ఆ పాత్ర ఒక చోట ఇలా ఉపదేశం చేస్తుంది–ప్రేమ అనేది దుష్ట సమాసం నాయనా. పి..ఆర్‌..ఇ..వై... ప్రే... అంటే ఇంగ్లిష్‌లో ఎర అని అర్థం. మ నిషాద. మ అంటే సంస్కృతంలో వద్దు అని. అంచేత ప్రేమంటే ఎర కావద్దు బలి కావద్దు అని తాత్పర్యం..త్రివిక్రమ్‌ ‘మల్లీశ్వరి’లోని ‘పెళ్లి కాని ప్రసాద్‌’ పాత్రకు ఈ సినిమాలోని హీరో ఒక ప్రేరణ కావచ్చు. ఈ రెండు సినిమాల్లో హాస్యాన్ని అంతర్లీనంగా ఉంచిన జంధ్యాల తన మూడో సినిమా ‘నాలుగు స్తంభాలాట’ లో మాత్రం ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమాతోనే ఆయన ‘సుత్తి’ అనే మాటను తెలుగు జాతికి అందించాడు. వీరభద్రరావు, వేలు అనే నటులు ‘సుత్తి’ ని ఇంటి పేరుగా మార్చుకుని ఖ్యాతి గడించారు. ‘నిన్నూ ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదురా బాబు.. నా వల్ల కాదు’ అంటుంటాడు వీరభద్రరావు ఈ సినిమాలో. షేక్స్‌పియర్‌ అసలు పేరు శేషప్పయ్యార్‌ అని అతడు తమిళుడని రామనాథం జిల్లావాడని అతడి థియరీ. అతడి సుత్తి భరించలేక తిరుగు సుత్తి అంటే రివర్స్‌ హ్యామరింగ్‌ వేసినట్టుగా కలలు కంటుంటాడు సుత్తి వేలు. ప్రతివాడూ ఎదుటివాడికి ఎంతో కొంత సుత్తి వేస్తాడని, కాని సుదీర్ఘ సుత్తి అనగా ప్రొలాంగ్డ్‌ హ్యామరింగ్‌ మాత్రం పాపమని ఈ సినిమా ద్వారా జంధ్యాల బొప్పి కట్టకుండా చెప్పిన హితవు. చేసిన హెచ్చరిక.

మనది మధ్యతరగతి దేశం. మధ్యతరగతి జీవుల చిత్రవిచిత్ర వ్యాపకాలు నిండిన దేశం. వారి పరిమితి, అపరిమితి, అలవాట్లు, చాదస్తాలు, శాడిజం... వీటిని కొద్దిగా ఎగ్జాగరేట్‌ చేస్తే హాస్యం పండుతుందని తెలిసినవాడు జంధ్యాల. బాపుగారు కార్టూ్టన్లలో చేసిన పనిని జంధ్యాల సినిమాలలో చేశాడు. ప్రతి పాత్రనూ ఒక నమూనాగా చేసి అతడు తీసిన సంపూర్ణ తొలి హాస్య సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’. ఈ సినిమాతోనే తెలుగు సినిమాల్లో హాస్య సినిమాల ధోరణి స్థిరపడింది. ఇంతకు మునుపు తెలుగులో సంపూర్ణ హాస్య సినిమాలు తీసే ఆనవాయితీ లేదు. ‘మాయాబజార్‌’, ‘మిస్సమ్మ’, ‘పెళ్లి చేసి చూడు’... వంటివి హాస్యం నిండిన సినిమాలే తప్ప హాస్య సినిమాలు కాదు. తెలుగులో అలాంటి పాదు వేసింది మాత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమా. దానిని సృష్టించిన జంధ్యాల. (ఇందుకు మూల కథ అందించిన పొత్తూరి విజయలక్ష్మిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి).ఈ సినిమాలో ప్రతి పాత్రా ఒక నమూనా పాత్రే. కోపం వస్తే గోడకు తల కొట్టుకుని బిల్డింగ్‌కు పెద్ద పెద్ద క్రాకులిచ్చే వీరభద్రరావు, తెలుగు తమిళ మలయాళ సినిమాలు చూసి వాటిని టైటిల్స్‌తో సహా చెప్పే శ్రీ లక్ష్మి, వింత వంటకాలు చేసే సంగీత, పేకాట కోసం ప్రాణాలర్పించే నూతన్‌ ప్రసాద్, కోపం వస్తే నవ్వే మేల్కొటే, మందు కొట్టడాన్ని ‘మాట్లాడుకోవడం’గా గౌరవించే రాళ్లపల్లి, వీరభద్రరావు మొక్కులకు బలయ్యే మిశ్రో... వీటితో ఈ సినిమా జరుగుతున్నంత సేపు ప్రేక్షకుల చేత ‘హహ్హ’, ‘హొహ్హో’ అని హ గుణింతం వల్లె వేయిస్తూనే ఉంటుంది.క్లయిమాక్స్‌లో పెళ్లి మాటిమాటికి ఆగిపోతుంటే పట్టు చీర కట్టుకున్న ఒక బంధువు ‘అయితే పట్టుచీర విప్పేయ్యాల్సిందేనా’ అంటూ ఉంటుంది. ఈ పెళ్లి జరిగితే మిశ్రోకు గుండు గీయించి మొక్కు చెల్లిస్తాననే వీర భద్రరావు పెళ్లి ఆగిన ప్రతిసారీ గుండు కూడా ఆపించేస్తుంటాడు. సగం గుండుతో అతడు పడే బాధ ఒకటి. ఇంత పెళ్లి గొడవలో తన మానాన తాను పేకాట ఆడుకుంటున్న పొట్టి ప్రసాద్‌ను చూసి ‘నువ్విలాగే చేస్తే నిన్ను పేక దస్తాల మీద వేసి తగలెడతా’ అంటాడు వీరభద్రరావు. దానికి పొట్టి ప్రసాద్‌ ముచ్చటపడుతూ ‘అరె.. నా అంతిమ కోరిక మీకెలా తెలుసు’ అంటాడు.ఇక ఈ సినిమా గురించి రాసింది చాలు.నవ్వలేక చావాల్సొస్తోంది.

జంధ్యాల ఈ స్థాయిలోనే ఇచ్చిన మరొక బ్లాక్‌బస్టర్‌ ‘అహ నా పెళ్లంట’. తెలుగువారికి బ్రహ్మానందం నిత్యానందంలా మారడానికి ఫౌండేషన్‌ వేసిన సినిమా. భారీ కలెక్షన్ల లాభాలతో రామానాయుడు స్టూడియోకు కూడా ఫౌండేషన్‌ వేసిన సినిమా ఇది. చిన్న నవ్వులా ఇందులో. ‘మీరెవరు సార్‌’ అన్న పాపానికి తాత తండ్రుల కాలం నాటి ఆటోబయోగ్రఫీని ఎత్తుకునే నూతన్‌ ప్రసాద్, ఖంగు తిన్న ప్రతిసారీ ‘ఎక్స్‌పెక్ట్‌ చేశా’అనే రాజేంద్ర ప్రసాద్, ‘నాకేంటి?’ అని పురుగు నోట్లోని చక్కెర పలుకును కూడా వదలని దారుణ పిసినారి కోట శ్రీనివాసరావు, దేశంలో వాన పడకపోయినా ఎండ ఎక్కువ కాసినా చలి తగినంతగా లేకపోయినా జీతం కోతకు గురయ్యే పాలేరు బ్రహ్మానందం, పెళ్లిచూపుల్లో ఏ చిరుతిండీ పెట్టకపోయినా ఆవకాయ జాడీలు తెప్పించుకుని శుభ్రంగా నాకేసే బకాసుర సోదరులు... చూసి తెలుగు ప్రేక్షకులు దొర్లి దొర్లి నవ్వారు. పిసినారుల స్వభావాన్ని జంధ్యాల ఇందులో పరాకాష్టకు తీసుకెళ్లాడు. పేపర్‌ కట్టుకుని నిద్రపోవడం, వంటకు అగ్గిపుల్లలు ఏరుకోవడం, రాత్రుళ్లు బస్టాండులో టీ అమ్మడం... ఇవన్నీ కోట శ్రీనివాసరావు చేస్తుంటే అతని బావ మరిది అయిన వీరభద్రరావుకు హడలు పుడుతుంటుంది.ఒకరోజు అతను భోజన వేళకు అక్కను చూసి పోదామని ఊర్నుంచి వస్తాడు. ఆ సమయానికి కోట శ్రీనివాసరావు భోజనం చేస్తుంటాడు.వీరభద్రరావు: ఆహా.. సమయానికి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. నేను కూడా భోం చేస్తాను.కోట శ్రీనివాసరావు: (భార్యతో) మీ తమ్ముడికి కూడా ఆకేయవే. కూచోవయ్యా. ఇవాళ మా ఇంట్లో కోడి కూర.వీరభద్రరావు: ఏదీ?కోట శ్రీనివాసరావు: (చూరుకు వేళ్లాడుతున్న కోడిని చూపిస్తూ) అదిగో ఆ కోడిని చూస్తూ ఒట్టన్నం మింగేయడమే.ఈ ఒక్క సీనుతో ఈ సినిమా నవ్వు సమాప్తం. కళ్లు తుడుచుకోండి.. నవ్వి నవ్వి తడితేరి ఉంటాయి.

ఎన్ని సినిమాలు జంధ్యాల నుంచి.అతడు తలుచుకుంటే బూతులు, డబుల్‌ మీనింగ్, లేకి కామెడీ చేసి ఉండొచ్చు. కాని ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ చేయలేదు. ఆరోగ్యకరమైన హాస్యం, తెలుగు హాస్యం, జీవితాల నుంచి పిండిన హాస్యం మాత్రమే వెతికి వెతికి తెలుగువారికి పంచాడు. చిరంజీవి అంతటి మాస్‌ హీరో చేత ‘చంటబ్బాయ్‌’లో పూర్తిస్థాయి కామెడీ రోల్‌ చేయించడం సామాన్యమా. అందులో చిరంజీవి పాత్ర పేరు డిటెక్టివ్‌ పాండు రంగారావు. ఒక సీన్‌లో చాలా స్టయిల్‌గా శ్రీలక్ష్మి వాళ్ల గేట్‌లో అడుగు పెట్టి ‘ఐయామ్‌ పాండ్‌. జేమ్స్‌ పాండ్‌’ అనగానే శ్రీలక్ష్మి ‘పాండ్స్‌ పౌడర్‌ అమ్మేవాడివా బాబూ. మాకొద్దు’ అంటుంది. ఈ సినిమాలోనే శ్రీలక్ష్మి వండిన ‘బంగాళ భౌభౌ’, ‘అరటికాయ లంబా లంబా’ వంటలు తెలుగు ప్రేక్షకులు గొంతుకు అడ్డం పడేలా తిన్నారు. జంధ్యాల సినిమాలనగానే ఒక సెట్‌ ఆఫ్‌ ఆర్టిస్టులు ప్రత్యక్షమయ్యేవారు. కొంచెం అటు ఇటుగా వారే ప్రతి సినిమాలో కనిపించేవారు. నరేశ్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, సుత్తి జంట, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, నూతన్‌ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రాళ్లపల్లి, థమ్, పొట్టి ప్రసాద్‌... కామెడీ అంటేనే టైమింగు. ఆ టైమింగును తప్పినా, దానికి ఉండాల్సిన ఎడిటింగ్‌ నెమ్మదించినా, రీరికార్డింగ్‌ పండకపోయినా ఆ సన్నివేశం వీగిపోతుంది. కాని జంధ్యాల వీటన్నింటి మీద మాస్టరీ చేసినట్టుగా సన్నివేశాలు పండించేవారు.

‘జయమ్ము నిశ్చయమ్మురా’లో శ్రీలక్ష్మి కొడుకు చిన్న వయసులోనే చనిపోయి ఉంటాడు.  సందర్భాన్ని బట్టి ఆమె అందరిలోనూతన కొడుకును చూసుకుంటూ ఉంటుంది. సినిమా మొదట్లోనే రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్‌ భయం భయంగా ఇంట్లోకి అడుగుపెడుతుంటే హౌస్‌ ఓనర్‌ అయిన శ్రీలక్ష్మి ‘ఎక్కణ్ణుంచి నాయనా?’ అని అడుగుతుంది. ‘ఊళ్లో శనిదేవుని లీలలు అనే సినిమా వస్తే చూసి వస్తున్నాం పిన్నిగారూ’ అంటాడు రాజేంద్ర ప్రసాద్‌. అంతే. ‘భక్తి సినిమా చూసి వస్తున్నారా నాయనా’ అంటుంది శ్రీలక్ష్మి. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్‌ల పైప్రాణం పైనే పోతుంది. ‘చెప్పండి. భక్తి సినిమా చూసి వస్తున్నారా’ మళ్లీ అడుగుతుంది శ్రీలక్ష్మి. వెనుక నుంచి పీపీ..డుం..డుం అని ఆర్‌.ఆర్‌. మొదలవుతుంది. వాళ్లిద్దరూ భయం భయంగా చూస్తుంటారు. శ్రీలక్ష్మి కళ్లల్లో పల్చటి నీటిపొర. ‘బాబూ... చిట్టీ... మా చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడు’ అని వచ్చి అమాంతం రాజేంద్రప్రసాద్‌ను కౌగిలించుకుంటుంది. ఆ నవ్వుల కౌగిలింత నుంచి తప్పించుకోవడం ప్రేక్షకులకు చాలా కష్టమవుతుంది.
∙∙ 
సినిమాల జయాపజయాలు వాటి విడుదల సమయాన్ని, ఆ సమయంలో ఇతర సినిమాలు ఏర్పరచిన మూడ్‌ని బట్టి కూడా ఉంటాయి. జంధ్యాల తీసిన కొన్ని సినిమాలలోని చాలామంచి హాస్యం ఆ సినిమాలు విడుదలైనప్పుడు జనం రిసీవ్‌ చేసుకోకపోయినా ఆ తర్వాత టీవీలలో వీడియోల ద్వారా హిట్‌ చేసుకున్నారు. ‘రెండు జెళ్ల సీత’లో పిచ్చి హిందీ భాష మాట్లాడే అల్లు రామలింగయ్య హాస్యం,‘పుత్తడిబొమ్మ’ సినిమాలో అమాయక కవిగా వీరభద్రరావు హాస్యం, ‘బాబాయ్‌ అబ్బాయ్‌’లో పెళ్లికాని పెళ్లికూతురిగా పావలా శ్యామల హాస్యం, ‘శ్రీవారి శోభనం’లో ఎనభై ఏళ్ల పుచ్చా పూర్ణానందం ఏ ఆడపిల్ల కనిపించినా మీసం మెలేస్తూ వెంటబడే హాస్యం ఆ తర్వాతి రోజుల్లో జనం గమనించి యూ ట్యూబ్‌లో నిక్షిప్తం చేసుకున్నారు. ‘సీతారామ కల్యాణం’, ‘పడమటి సంధ్యారాగం’ వంటి అందమైన ప్రేమ కథలు తీసినా ఆ రవ్వలడ్లపై నవ్వులనే ఎండుద్రాక్షను గుచ్చకుండా జంధ్యాల వదల్లేదు.‘పడమటి సంధ్యారాగం’లో తిండిపోతు కొడుకుతో బాధ పడుతూ ఐస్‌ క్రీమ్‌ షాప్‌ నడుపుతున్న తండ్రితో ఎవరో ‘ఏమండీ కులాసానా’ అని అడుగుతారు.దానికి ఆ తండ్రి జవాబు ‘ఊ. కులాసే. (కొడుకును చూపిస్తూ) అంటే కుమారుడి వల్ల లాసు అని అర్థం’ అంటాడు. ఇలాంటి డైలాగు జంధ్యాల వినా మరొకరు రాయలేరు.

శంకర్‌–జైకిషన్‌ జోడీలో జైకిషన్‌ మరణించాక శంకర్‌కు పూర్తి స్థాయి ఆర్కెస్ట్రా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు నిర్మాత, దర్శకులు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు మారాక, జంధ్యాల ఇక్కడకు షిఫ్ట్‌ అయ్యి సినిమాలు తీయడం మొదలెట్టాక, మారిన పరిస్థితుల్లో, ఇ.వి.వి. వంటి కొత్త హాస్య దర్శకుల ఊపులో జంధ్యాల శక్తియుక్తులకు పని చెప్పే పెద్ద స్థాయి బడ్జెట్‌ గొప్ప ఆఫర్లు సినిమా పరిశ్రమ నుంచి అందలేదనే చెప్పాలి. కాని ఆయన టీవీ షోల ద్వారా, చిన్న సినిమాల ద్వారా తనను తాను బిజీగా ఉంచుకున్నారు. నిత్య జీవితంలో అనేకానేక చికాకులతో నిండి ఉండే సగటు మనిషికి నవ్వు అనే అమృతాన్ని పంచడానికి అలుపెరగక ప్రయత్నించిన హాస్య ప్రవక్త జంధ్యాల.చివరగా– పుత్తడి బొమ్మలో రాగం, తాళంతో సహా కవిత్వం చదివి విసిగించే వీరభద్రరావును శిక్షించడానికి ఊరి వాళ్లంతా అతడికి ఒక ఏనుగును బహూకరిస్తారు. ఆ ఏనుగుపై అతడు చెప్పిన కవిత–వీరభద్రరావు: ఈ ఏనుగుపై ఒక పాట రాశా. కుంతల వరాళి రాగం. మిశ్రచాపు తాళం. శ్రుతి ఒకటిన్నర.పాట: ఏనుగూ... ఏనుగూ...ఏనుగు కన్ను చింతాకుఏనుగు తొండం చాంతాడుఏనుగు చెవులు చేటలుఏనుగు పెద్దది టోటలు.మీరిలాగే సదా నవ్వుకుంటూ ఉండాలని కోరిక.జంధ్యాల మళ్లీ మళ్లీ మన పెదాల చిర్నవ్వై ఆయువు పొందుతూ ఉండాలని కోరిక.తెలుగు హాస్యం తెలుగుదనంతో వర్థిల్లాలని కోరిక. నవ్వడం ఒక యోగం. పకపకల సాక్షిగా. 
∙కె. సువర్చల

మరిన్ని వార్తలు