పంట వంటలు

12 Jan, 2019 22:07 IST|Sakshi

కవర్‌ స్టోరీ

కొత్త పంటలు కోతకు వచ్చాక వచ్చే తొలి పండుగ సంక్రాంతి.కొత్త పంటలతో సంక్రాంతి పిండివంటలు చేసుకుని ఆరగించడం మన సంప్రదాయం.కొత్తబియ్యంతో పాటు పెసలు, మినుములు, నువ్వుల వంటి అపరాలు కూడా..సంక్రాంతి నాటికి ఇంటికి చేరుతాయి. భోగినాడు బూరెలు, సంక్రాంతినాడు కొత్తబియ్యం పరవాన్నం...కనుమనాడు మినుముతో చేసిన వంటలు తినాలంటారు.ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో... పండుగ రోజుల్లో ఆరగించి ఆస్వాదించే కొత్త పంటల పిండివంటలు మీ కోసం...

బెల్లం పరమాన్నం
కావలసినవి:   బియ్యం – అర కప్పు చిక్కటి పాలు – ఒకటిన్నర కప్పు పాత బెల్లం తురుము – పావు కప్పు నీళ్లు – పావు కప్పు నెయ్యి – 1 టేబుల్‌ స్పూన్‌ జీడిపప్పు – 6 లేదా 8
తయారీ:  ముందుగా బియ్యం శుభ్రం చేసుకోవాలి. తర్వాత పాలు, బియ్యం కలిపి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాన్‌ తీసుకుని అందులో బెల్లం తురుము, నీళ్లు వేసుకుని గరిటెతో తిప్పుతూ బెల్లం కరిగించాలి. ఇప్పుడు పాలలో ఉడికిన అన్నాన్ని బెల్లం నీళ్లలో వేసుకుని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడగానే నెయ్యి, జీడిపప్పు వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. 

బూరెలు
కావలసినవి:   బియ్యం – 1 కప్పు మినçప్పప్పు – 1 కప్పు ఉప్పు – తగినంత కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు బెల్లం తురుము – ముప్పావు కప్పు ఏలకుల పొడి – అర టీ స్పూన్‌ నీళ్లు – పావు కప్పు
నెయ్యి – 1 టేబుల్‌ స్పూన్‌ నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ:  ముందుగా బియ్యం, మినప్పప్పు నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌లో బెల్లం తురుము, నీళ్లు వేసుకుని పాకం పట్టించుకోవాలి. లేత పాకం రాగానే కొబ్బరి తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం దగ్గర పడగానే ఏలకుల పొడి, నెయ్యి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, మినప్పప్పు గ్రైండర్‌లో రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని పాత్రలోకి వేసుకోవాలి. మళ్లీ స్టవ్‌ ఆన్‌ చేసుకుని నూనె పాన్‌లో వేసుకుని వేడి కాగానే కొబ్బరి ఉండలను బియ్యం–మినప్పిండిలో ముంచి బూరెలు వేసుకోవాలి.

కొయ్యరొట్టె
కావలసినవి:  బియ్యప్పిండి – 2 కప్పులుశనగపప్పు – అర కప్పు(రెండు గంటల ముందు నానబెట్టాలి)ఉల్లిపాయ తరుగు – 1 కప్పు / క్యారెట్‌ తురుము – 1 కప్పు కొత్తిమీర తురుము – అర కప్పు / పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్‌ స్పూన్‌జీలకర్ర – 2 టేబుల్‌ స్పూన్లు / నూనె – 2 టేబుల్‌ స్పూన్లుఉప్పు – తగినంత / వేడి నీళ్లు – తగినన్ని
తయారీ:  ముందుగా నానబెట్టిన శనగపప్పును మిక్సీ బౌల్‌లో వేసుకుని, మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్‌లో బియ్యప్పిండి, శనగపప్పు ముద్ద, ఉల్లిపాయ తరుగు, క్యారెట్‌ తురుము, కొత్తిమీర  తురుము, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉప్పు వేసుకుని అందులో కొద్ది కొద్దిగా వేడి నీళ్లు వేస్తూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను బాల్స్‌లా చేసుకుని, కొద్దిగా చేతులకు నూనె రాసుకుని... ఆ బాల్స్‌ని రొట్టెలా అత్తుకుని... నూనెలో దోరగా వేయించుకోవాలి.

రైస్‌ హల్వా
కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు / బెల్లం తురుము – 2 కప్పులు క్కటి పాలు – 1 కప్పు / కొబ్బరి పాలు – 3 కప్పులుఏలకుల పొడి – 1 టీ స్పూన్‌ / నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు / డ్రై ఫ్రూట్స్‌ – కొన్ని
తయారీ:  ముందుగా పాన్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేడి చేసి అందులో డ్రై ఫ్రూట్స్‌ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తురుము, కొబ్బరి పాలు పాన్‌లో వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చెత్తను తొలగించేందుకు ఆ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. పాన్‌ను శుభ్రం చేసుకుని బియ్యప్పిండిని వేసుకుని కొద్ది కొద్దిగా బెల్లం–కొబ్బరిపాల మిశ్రమాన్ని వేస్తూ ఉండలుగా మారకుండా గరిటెతో తిప్పాలి. మీడియం మంటపైనే ఆ మిశ్రమం మొత్తం దగ్గరపడేలా గరిటెను ఉపయోగిస్తూ అడుగంటకుండా జాగ్రత్త పడాలి. మిశ్రమం గట్టిపడటం మొదలైన తర్వాత... చిక్కటి పాలు జోడించి గరిటెతో తిప్పాలి. మళ్లీ దగ్గర పడుతున్న సమయంలో ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి జోడించి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఏలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. మిశ్రమం మరింత దగ్గర పడగానే మిగిలిన నెయ్యి కూడా వేసి గరిటెతో తిప్పి, స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకుని, డ్రై ఫ్రూట్స్‌తో పాటు సర్వ్‌ చేసుకుంటే హల్వా ముక్కలు భలే టేస్టీగా ఉంటాయి.

కొబ్బరి అన్నం
కావలసినవి: అన్నం – 2 కప్పులు / నూనె – 3 టీ స్పూన్లు / ఆవాలు – అర టీ స్పూన్‌ / జీలకర్ర – అర టీ స్పూన్‌ / జీడిపప్పు – 2 టీ స్పూన్లు / పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌ / అల్లం తురుము – అర టీ స్పూన్‌ / ధనియాల పొడి – అర టీ స్పూన్‌/  కరివేపాకు – 2 రెమ్మలు /  కొబ్బరి తురుము – 1 కప్పు / ఇంగువ – చిటికెడు / నిమ్మరసం – 1 టీ స్పూన్‌/  ఉప్పు – తగినంత /  కొత్తిమీర – కొద్దిగా
తయారీ:  ముందుగా పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే... అందులో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, ధనియాల పొడి, కరివేపాకు, ఇంగువ వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, ఉప్పు వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అన్నం కూడా వేసుకుని బాగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా నిమ్మరసం వేసుకుని మరోసారి మొత్తం కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు కొత్తిమీర తురుము వేసుకుని గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

దద్ధోజనం
కావలసినవి: అన్నం – 2 కప్పులు / గడ్డ పెరుగు – ఒకటింపావు కప్పులుతాజా మీగడ – 2 టేబుల్‌ స్పూన్లు/ నూనె – 1 టేబుల్‌ స్పూన్‌శనగపప్పు – 1 టీ స్పూన్‌/ మినప్పప్పు – 1 టీ స్పూన్‌/ ఆవాలు – 1 టీ స్పూన్‌జీలకర్ర – 1 టీ స్పూన్‌/ కరివేపాకు – 12 లేదా 15/ ఎండు మిర్చి – 2ఇంగువ – చిటికెడు/ మెంతులు – అర టీ స్పూన్‌/ ఉప్పు – తగినంతదానిమ్మ గింజలు – 2 టేబుల్‌ స్పూన్లుకొత్తి మీర – 2 రెమ్మలు (అభిరుచిని బట్టి)
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో అన్నం, గడ్డ పెరుగు, తాజా మీగడ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌లో నూనె వేసుకుని, వేడి చేసుకుని, శనగపప్పు, మినçప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, మెంతులు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉప్పు వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పెరుగు అన్నంలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసుకుని సర్వ్‌ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

రవ్వ పులిహార 
కావలసినవి:  బియ్యం రవ్వ – 2 కప్పులు / నీళ్లు – ఒకటిన్నర కప్పునిమ్మకాయ – 1/ పచ్చిమిర్చి – 2 లేదా 3 / నూనె – 2 టేబుల్‌ స్పూన్లుఆవాలు – 1 టీ స్పూన్‌ / జీలకర్ర – 1 టీ స్పూన్‌ / మెంతులు –పావు టీ స్పూన్‌ / శనగపప్పు – 2 టీ స్పూన్లు / మినప్పప్పు – 2 టీ స్పూన్లు / వేరుశనగలు – 1 టేబుల్‌ స్పూన్‌ / ఎండు మిర్చి – 1 / జీడిపప్పు – 1 టేబుల్‌ స్పూన్‌ / ఉప్పు – తగినంతకరివేపాకు – 2 రెమ్మలు / పసుపు – 1 టీ స్పూన్‌అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్‌
తయారీ:  ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని... రవ్వను పాన్‌లో వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు బియ్యం, నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకుని కుక్కర్‌లో మూడు విజిల్స్‌ వెయ్యించాలి. ఇప్పుడు నిమ్మరసంలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని నానబెట్టాలి. తర్వాత పాన్‌లో నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగలు, ఎండు మిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని అందులో ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఆ వేడి మిశ్రమంలో బాగా కలపాలి. తర్వాత ఒక పెద్ద బౌల్‌లో ఉడికిన బియ్యం రవ్వ, తాలింపు మిశ్రమం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం–పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడి వేడిగా సర్వ్‌ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది.

కట్టు పొంగలి
కావలసినవి: బియ్యం – అర కప్పు / పెసరపప్పు – అర కప్పు / నీళ్లు – 3 కప్పులు / ఉప్పు – తగినంత / అల్లం తురుము – 1 టీ స్పూన్‌ / నెయ్యి – 3 లేదా 4 టేబుల్‌ స్పూన్లు / జీలకర్ర – 1 టీ స్పూన్‌ / ఇంగువ – చిటికెడు / కరివేపాకు – 10 లేదా 12 / పచ్చిమిర్చి – 2(పొడవుగా కట్‌ చేసుకోవాలి) / జీడిపప్పు –10 లేదా 12 / మిరియాలు– 10 (కొద్దిగా దంచి)
తయారీ:  ముందుగా పెసరపప్పుని దోరగా వేయించాలి. తర్వాత ఆ పెసరపప్పులో శుభ్రం చేసిన బియ్యం, నీళ్లు, ఉప్పు, అల్లం పేస్ట్‌ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిన మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ మరింత మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఒక పాన్‌ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని వేడికాగానే... జీలకర్ర , కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, ఇంగువ, మిరియాల పొడి వేసుకుని బాగా వేయించాలి. వెంటనే ఆ మిశ్రమాన్ని బియ్యం–పెసరపప్పు మిశ్రమంపైన వేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది.


పాల తాలికలు
కావలసినవి: బియ్యప్పిండి – అర కప్పు / నెయ్యి – 1 టీ స్పూన్‌ / ఉప్పు – చిటికెడు / పాలు – రెండు కప్పులు / కొబ్బరి తురుము – పావు కప్పు / ఏలకుల పొడి – అర టీ స్పూన్‌/ బెల్లం – పావు కప్పు+ 1 టేబుల్‌ స్పూన్‌ / నీళ్లు – అర కప్పు
తయారీ:  ముందుగా పావు కప్పు నీళ్లు వేడి చేసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ బెల్లం వేసుకుని పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు వేసుకుని బెల్లం పాకం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని నెయ్యి ఉపయోగిస్తూ తాలికలు రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాలు వేడి చేసుకుని... తాలికలు విరిగిపోకుండా మెల్లగా గరిటెతో ముందుకు వెనక్కి తిప్పుతూ.. పాలు బాగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసుకుని కలుపుకుని కాసేపు ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో పావు కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు తీసుకుని స్టవ్‌పైన పాకం తయారు చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన పాల తాలికల్లో వేడి వేడి బెల్లం పాకం కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ జోడించి సర్వ్‌ చేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.

దిబ్బరొట్టె
కావలసినవి: బియ్యం – 1 కప్పు / మిన్నప్పప్పు – అర కప్పు / బేకింగ్‌ సోడా – పావు టీ స్పూన్‌ / పచ్చిమిర్చి తరుగు – 1 టీ స్పూన్‌ / జీలకర్ర – పావు టీ స్పూన్‌ / నూనె – 1 టేబుల్‌ స్పూన్‌ / ఉల్లిపాయ తరుగు – 3 టీ స్పూన్లు / ఉప్పు – తగినంతకరివేపాకు – ఒకటి లేదా రెండు రెమ్మలు 
తయారీ:  ముందుగా బియ్యం, మిన్నప్పప్పు నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తగినంత ఉప్పు, బేకింగ్‌ సోడా కూడా వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసుకుని పిండిని దళసరిగా రొట్టె వేసుకుని, ఆ పాత్రకు సరిపడా మూత పెట్టి, దానిపైన నిప్పులు వేసుకోవాలి. దానివల్ల రెండు వైపులా దోరగా వేగుతుంది. అయితే నిప్పులు వేసుకుని అవకాశం లేనివాళ్లు ఆ పాత్రకు మూత పెట్టుకుని, ఆ దిబ్బరొట్టె అడుగున బాగా వేగిన తర్వాత జాగ్రత్తగా తిరగేసి మరోవైపు కూడా వేయించుకోవాలి.

చక్కెర పొంగలి
కావలసినవి: బియ్యం – అర కప్పు / పెసరపప్పు – పావు కప్పునీళ్లు – తగినంత / బెల్లం – ముప్పావు కప్పు / జీడిపప్పు – 10 లేదా 15నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు+రెండు టీ స్పూన్లు / కిస్మిస్‌ – 2 టీ స్పూన్లు
తయారీ:  ముందుగా బియ్యం, పెసరపప్పు శుభ్రం చేసుకుని కుక్కర్‌లో వేసుకోవాలి. అందులో రెండున్నర కప్పులు వేసుకుని నాలుగు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కప్పు నీళ్లు, ముప్పావు కప్పు బెల్లం వేసుకుని బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడకట్టి ఉడికిన పప్పుఅన్నంలో వేసుకుని మరో రెండు నిమిషాలు గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఇప్పుడు రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి... కొద్దిగా నీళ్లు వేసుకుని మరోసారి ఉడికించుకోవాలి. చివరిగా నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

చింతపండు పులిహోర
కావలసినవి: అన్నం – 5 లేదా 6 కప్పులు/ చింతపండు – ఒక కప్పు / నూనె – 3 లేదా 4 టేబుల్‌ స్పూన్లు
ఎండు మిర్చి, పచ్చిమిర్చి – 3 చొప్పున (ముక్కలు చేసుకోవాలి) / వేరుశనగలు – అర కప్పు / మినప్పప్పు – 1 టేబుల్‌ స్పూన్‌ / శనగప్పప్పు – 1 టేబుల్‌ స్పూన్‌ / కరివేపాకు – 2 రెమ్మలు/ ఆవాలు – 1 టీ స్పూన్‌/ పసుపు – అర టీ స్పూన్‌
ఇంగువ – చిటికెడు / ఉప్పు – తగినంత
తయారీ:  ముందుగా చింతపండు శుభ్రం చేసుకుని మంచినీళ్లలో నానబెట్టి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో వేరుశనగలు, మినప్పప్పు, శనగప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి–ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ... దోరగా వేగిన తర్వాత నానబెట్టిన చింతపండు గుజ్జు అందులో వేసుకుని ఉడకనివ్వాలి. ఆ మిశ్రమం దగ్గర పడగానే ఉప్పు కూడా వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం కుతకుతలాడుతున్నప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక పెద్ద బౌల్‌లో అన్నం, చింతపండు మిశ్రమాన్ని వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. 

పునుగులు
కావలసినవి: దోసె పిండి – 1 కప్పు / బియ్యప్పిండి – 3 టేబుల్‌ స్పూన్లు / పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌ / ఉల్లిపాయ ముక్కలు – 3 టీ స్పూన్లు / అల్లం తురుము – పావు టీ స్పూన్‌ / కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు / జీలకర్ర – అర టీ స్పూన్‌ / ఉప్పు – తగినంత / నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ:  ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బియ్యప్పిండి, దోసె పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కొత్తిమీర తురుము, జీలకర్ర, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే... కొద్ది కొద్దిగా ఆ మిశ్రమాన్ని వేసుకుని డీప్‌ ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు కొబ్బరి చట్నీలో నంజుకుని తింటే భలే టేస్టీగా ఉంటాయి.

రవ్వ పాయసం
కావలసినవి: నెయ్యి – 1 టేబుల్‌ స్పూన్‌ / కిస్మిస్‌ – 1 టీ స్పూన్‌జీడిపప్పు – 2 టీ స్పూన్లు / బియ్యం రవ్వ – 3 టేబుల్‌ స్పూన్లుపాలు – 2 కప్పులు / పంచదార – పావు కప్పు / ఏలకుల పొడి – పావు టీ స్పూన్‌
తయారీ:  ముందుగా నేతిలో కిస్మిస్, జీడిపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నేతిలోనే బియ్యం రవ్వ వేసుకుని, గరిటెతో తిప్పుతూ దోరగా వేయించి అందులో పాలు, పంచదార వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కాస్త చిక్కపడిన తర్వాత ఏలకుల పొడి, వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

ఉండ్రాళ్లు
కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు / నీళ్లు – ఒకటిన్నర కప్పులు / నువ్వుల నూనె – రెండున్నర టీ స్పూన్లు / నూనె – రెండు టీ స్పూన్లు / ఆవాలు – 1 టీ స్పూన్‌ / మినప్పప్పు – 1 టీ స్పూన్‌ / కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు / ఎండుమిర్చి – 2 / పచ్చిమిర్చి –2
ఉప్పు – తగినంత
తయారీ:  ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాత్రలో నీళ్లు, రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె, ఉప్పు వేసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు అందులో బియ్యప్పిండి వేస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అడుగంటకుండా తిప్పుతూ నీళ్లు మొత్తం ఆవిరి కాగానే స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని  ఐదు లేదా ఏడు నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో నూనె వేసుకుని వేడికాగానే మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. చివరగా కొబ్బరి తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉండ్రాళ్లపైన ఈ మిశ్రమాన్ని వేసి సర్వ్‌ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి.

చలిమిడి
కావలసినవి: బియ్యప్పిండి –  1 కప్పు (బియ్యం నానబెట్టుకుని అప్పటికప్పుడు మిక్సీలో పిండి చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది) / బెల్లం – అర కప్పు / కొబ్బరి కోరు – పావు కప్పు / నెయ్యి – 1 టీ స్పూన్‌
తయారీ:  ముందుగా బెల్లం మిక్సీలో వేసుకుని పౌడర్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో బియ్యప్పిండి, బెల్లం, కొబ్బరి కోరు, నెయ్యి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా సిద్ధం చేసుకుంటే సర్వ్‌ చేసుకునేందుకు, తినేందుకు అందంగానూ సులభంగానూ ఉంటాయి.


మినపగారెలు
కావలసినవి: మినప్పప్పు – 250 గ్రాములు / అల్లం– 2 అంగుళాల ముక్క / పచ్చిమిరపకాయలు – 6 / కరివేపాకు– ఒక రెమ్మ/ ఇంగువ – అర టీస్పూన్‌/ ఉప్పు– తగినంత / నెయ్యి– ఒక టీస్పూన్‌ / నూనె– వేపుడుకు తగినంత
తయారీ:  మినప్పప్పును గంటసేపు నానబెట్టి, మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. గారెల కోసం రుబ్బుకొనే పిండి కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరిగిపెట్టుకోవాలి. వీటితో పాటు కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నెయ్యి పిండిలో కలుపుకోవాలి.  ఇప్పుడు స్టౌ వెలిగించి, మూకుడులో నూనె మరిగించుకోవాలి. పిండిని వత్తుకుని, మధ్యలో రంధ్రం చేసి, వేయించుకోవాలి. గారెలు బాగా వేగి రంగు మారిన తర్వాత మూకుడులోంచి తీసి, వేరే పాత్రలోకి తీసుకోవాలి. వేడి వేడి గారెలు కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.


చంద్రకాంతాలు
కావలసినవి: పెసరపప్పు– ఒక కప్పు / పంచదార– ఒక కప్పు / పచ్చి కొబ్బరి – ఒక చెక్క (తురుముకోవాలి) / జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్‌ స్పూన్‌  / ఏలకుల పొడి – ఒక టీ స్పూన్‌ / పచ్చకర్పూరం– చిటికెడు
తయారీ:  పెసరపప్పును గంటసేపు నానబెట్టుకోవాలి. నీరు ఒంపేసిన తర్వాత మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి తురుము, పంచదార ఈ పిండిలో కలుపుకోవాలి. దళసరి పాత్రను స్టౌ మీద పెట్టి, అది వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాత్రలో వేసుకుని, అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. హల్వాలా మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో జీడిపప్పు, పచ్చకర్పూరం, ఏలకుల పొడి వేసుకోవాలి. ఒక పీట లేదా చెక్క బల్ల మీద తెల్లని దళసరి వస్త్రాన్ని తడిపి పరుచుకోవాలి. దాని మీద ఈ మిశ్రమాన్ని మందపాటి బిళ్లలుగా వత్తుకుని పేర్చుకోవాలి. ఇప్పుడు వీటిని స్టౌ మీద మూకుడు పెట్టి, అందులో నెయ్యివేసి మరిగించాలి. వీటిని నేతిలో వేయించుకోవాలి. బంగారు రంగులోకి రాగానే తీసేయాలి. వేడివేడిగా తిన్నా, బాగా చల్లారిన తర్వాత తిన్నా చంద్రకాంతాలు చాలా రుచిగా ఉంటాయి. 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లిప్ లాక్  సినిమా కాదు: విజయ్‌ దేవరకొండ

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'